భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– వి. రాజారామమోహనరావు
రఘునాథం ఎనిమిదో క్లాసు చదువుతుండగా, అకస్మాత్తుగా క్లాస్‌మేట్ బాచీ చచ్చిపోయాడు. క్లాస్ టీచర్, కొంతమంది పిల్లలు ఆ చావు దగ్గరికి వెడుతుంటే, తనూ కూడా వెళ్లాడు రఘునాథం.
బాచీ శవాన్ని రోడ్డుమీద ఉంచి నీళ్లు పొయ్యటం, నీళ్లుపోసినా, వాడిలో కదలిక లేకపోవటం, శవాన్ని పాడెకు కట్టటం, ఇవన్నీ చూసి రఘునాథం కంగారు పడ్డాడు.
ఆ కంగారుతోనే ‘‘చచ్చిపోవటం అంటే ఏమిటి మాస్టారు?’’ అని స్కూల్ టీచర్‌ని అడిగాడు రఘునాథం.
‘‘చచ్చిపోటం అంటే ఇదే. ఇప్పుడు శ్మశానానికి తీసికెళ్లి దహనం చేస్తారు. అంటే మంటల్లో కాల్చేస్తారు. ఆ తర్వాత మనకింక వాళ్లు ఎప్పటికీ కనపడరు. ఎవరేనా సరే.’’
‘‘అంటే అందరూ ఇలాగే చచ్చిపోతారా మాస్టారూ?’’
‘‘అందరూ చచ్చిపోతారు. సాధారణంగా పెద్దవాళ్లై ముసలి వయసొచ్చాక పోతారు.’’
చావంటే ఏమిటో అంతవరకూ తెలియని రఘునాథం పసి ఆలోచనని మాస్టారి మాటలు గట్టిగా పట్టుకున్నాయి. అప్పట్నించీ చావు బెదురు పట్టుకుంది. అది రఘునాథంతోటే ఎదుగుతూ వచ్చింది.
రఘునాథానికి తల్లంటే ప్రాణం. ఆమె చచ్చిపోతే ఎలా అన్న బెంగ. రఘునాథం పెద్దవాడయ్యాడు. పెళ్లయింది. ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వాళ్లు బాగా చదువుకుని, విదేశాల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు.
రఘునాథం పెద్ద స్థాయి ఉద్యోగమే చేశాడు. కేంద్ర ప్రభుత్వంలో మేనేజింగ్ డైరెక్టర్‌గా రిటైర్ అయ్యాడు. పెద్ద మొత్తంలో పెన్షన్ వస్తుంది. సొంత ఇల్లు, సకల వసతులు, ఆస్తులు ఉన్నాయి. పిల్లలూ డబ్బు పంపుతారు. ఆర్థికంగా అదనపు వనరుల సమృద్ధే తప్ప, ఏ లోటూ లేదు.
అయినా రఘునాథం ఏనాడూ తుళ్లుతూ, గెంతుతూ చిలోపొలో అంటూ లేడు. తాపీగా సాగే ప్రవాహంలాగే సాగుతోంది జీవితం.
రఘునాథం తండ్రి రామ్మూర్తిగారు మంచి రచయిత. జీవన రీతి, సహజాతాలు, సుఖదుఃఖాలు, మనోరీతుల గురించి తాత్విక ధోరణిలో, నిత్య జీవితానికి అన్వయించి, మనుషుల్లో ధైర్యాన్ని పెంచే ఎన్నో ఉన్నత రచనలు చేసినాయన.
ఆయన రఘునాథంలోని బెదురుని, చావు భయాన్ని అతని చిన్నతనంలోనే కనిపెట్టారు.
చావు పుట్టుకలు సహజ చర్యలని, అవి ఏ మానవ మాత్రుడి అధీ•నంలో లేవని, అటువంటి వాటి గురించి విచారించి మనసు పాడు చేసుకోకూడదని తరచుగా చెపుతూ వచ్చారు. దాంతో రఘునాథంలో కొంత మార్పు, ధైర్యం వచ్చాయి. అయినా తల్లి చచ్చిపోతుందన్న బెంగ పూర్తిగా తొలగిపోలేదు. తల్లి చచ్చిపోయినట్టు తరచుగా కలలు వచ్చేవి.
రఘునాథం ఏనాడూ ఊహించనిది జరిగింది. రఘునాథం తల్లి బాగానే ఉంది. కానీ, తండ్రి రామూర్తిగారు పోయారు. చాలా దుఃఖపడ్డాడు రఘునాథం. తండ్రి మరణం తనని అంత కుంగ దీస్తుందని ఏనాడూ అనుకోలేదు. తల్లి మీదే తప్ప, తండ్రి పోతాడేమోనన్న ఊహ ఏనాడూ లేదు. అనుకోని అశనిపాతం తీవ్రత.
రామ్మూర్తిగారి జీవితం ఉదాత్తంగా గడిచింది. ఆయన రచనల్ని ఇష్టపడి, గౌరవించిన వాళ్లు ఎందరెందరో. ఎంతో విద్వత్తు ఉన్నవాళ్లు తరచుగా ఆయన దగ్గరకొచ్చి సాహితీ కాలక్షేపంలో ములిగిపోయేవారు. ఆయన చుట్టూ నిత్య కల్యాణం, పచ్చతోరణంలా ఉండేది. అంతటి ఉదాత్తమూర్తి, ఉన్నత వ్యక్తి వెళ్లిపోయాడు. ‘ఇంతేనా… జీవితం ఇదేనా’ అన్న ఉదాశీనత, దిగులు కప్పేశాయి రఘునాథాన్ని.
తండ్రి కర్మకాండ శాస్త్రోక్తంగా, పద్ధతిగా చేశాడు. సంవత్సరీకం అయి పోయింది. ఒక్క యేడాదిలోనే మార్పు స్పష్టంగా తెలిసొచ్చింది రఘునాథానికి.
తండ్రి గురించి అంత తరచుగా తమింటికి తిరిగేవాళ్లు మాయం. తండ్రిని అంతగా కీర్తించిన పొగడ్తలు మాయం. అసలు తండ్రి స్మరణే మాయంలా మారిపోయింది.
సంసారం గడవటానికి, ఇల్లు సాగటానికి ఏ రకం ఇబ్బంది లేకపోవటంతో, రఘునాథం ఆలోచనలు అస్తమానం అటే ఉంటున్నాయి.
ఆ తీరులోనే… ‘కాలం చాలా క్రూరమైంది. అన్నింటిని, మంచితనాన్ని, ఔన్నత్యాన్ని, ఉదాత్తతని మరపులోకి నెట్టేస్తుంది’ అన్న ఆలోచన రఘునాథాన్ని భూతంలా పట్టేసింది.
తండ్రిమీద బెంగ. అంత తొందరగా ఆయన స్మృతి అంతరించి పోకూడదన్న తపన. కనీసం తను ఉన్నంతవరకే నా తండ్రి స్మృతిని సజీవంగా ఉంచాలన్న పట్టుదల కలిగింది.
రామ్మూర్తిగారి రచనలన్నింటినీ ముద్రించే పని మొదలెట్టి, ఆరునెలల్లో పూర్తి చేశాడు. పెద్ద సభగా వాటిని ఆవిష్కరించాడు. రామ్మూర్తిగారి మిత్రుల చిరునామాలు సేకరించి అందరికి పంపాడు.
నిరాశే మిగిలింది. కొద్దిమందే పుస్తకాలు అందాయి అని తెలియచేశారు. ఎవరూ ఒక ఉత్తరం ముక్క రాయలేదు.
రామ్మూర్తి గారి స్మృతిగా కథల పోటీ పెట్టాడు. బహుమతులు ఇచ్చాడు. బహుమతి కథలతో, ఎంపిక చేసిన మరిన్ని కథలు కలిపి సంకలనం అచ్చువేశాడు. నాలుగునాళ్ల హడావిడే తప్ప, దానివల్లా తృప్తి కలగలేదు.
ఏం చేస్తే తండ్రిని పదిమంది గుర్తుంచుకుంటారు అని ఎంతగానో ఆలోచించాడు. ప్రతి సాహిత్య సభకి వెళ్లి రచయితలకి, విమర్శకులకు తండ్రి పుస్తకాలు ఇచ్చి తమ తమ స్పందనను నాలుగు ముక్కలు రాసి పంపమన్నాడు. పుస్తకాలు పుచ్చుకున్నారు గానీ ఎవరూ సరిగా స్పందించలేదు.
చివరికి రామ్మూర్తిగారి దగ్గరి స్నేహితుడు, ఆయన సహ రచయిత రావుగారిని కలిసి తన గోడంతా చెప్పాడు రఘునాథం. ‘‘నాన్న అంత గుర్తుంచుకోదగిన వ్యక్తి కాదా? మంచి రచయితేగా?’’ అనడిగాడు.
అంతా విన్న రావుగారు ‘‘రామ్మూర్తి నిస్సందేహంగా గొప్ప రచయిత. ప్రాచుర్యం కోసం, బహుమతుల కోసం వెంపర్లాడని నిఖార్సయిన వ్యక్తి తన స్మృతి పది కాలాలు ఉండాలి. తన రచనలు ప్రజాహితం కూర్చే శాశ్వత విలువలు ఉన్నవి’ అన్నారు.
‘‘మరి ఏమిటి చెయ్యటం?’’ అనడిగాడు రఘునాథం.
‘‘తెలుగునాట సాహిత్య వాతావరణం చాలా నిరుత్సాహంగా ఉంది రఘునాథం! పత్రికలన్నీ మూతపడ్డాయి. నాలుగైదు పత్రికలే అతి కష్టంమీద, అదీ అంకితభావం వల్ల నడుస్తున్నాయి. పుస్తక ప్రచురణా సంస్థలూ అంతే. పుస్తకాలు చదివేవాళ్లు లేకపోలేదు. చదివి, తమ వరకూ తాము మౌనంగా ఉండిపోతున్నారు. అంత నిశ్శబ్దంగా తయారైంది పరిస్థితి. మేం విరివిగా రాసిన రోజుల్లో ఒక్కో రచన మీద ఎంతో చర్చ ఎన్నాళ్లో జరిగేది. మంచి రచన అంటే అంత ఆసక్తి ఉండేది.
ఈ మారిన పరిస్థితుల్లో ఏం చెయ్యాలో నేనూ ఆలోచిస్తా. తప్పనిసరిగా ఏదోటి చేద్దాం’’ అన్నారు రావు.
ళి ళి ళి
నాలుగు నెలల తర్వాత, రామ్మూర్తిగారి జయంతి సభ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పేరు పేరునా వెతికి వెతికి ఆహ్వానాలు పంపారు. ప్రముఖుల్ని అతిథులుగా, వక్తలుగా పిలిచారు. సభలో పెద్ద స్థాయి సాహిత్య పోటీ ప్రకటన ఉంటుందని తెలియజేశారు.
అంతేకాదు జనాన్ని ఆకర్షించే అన్ని పద్ధతులూ అవలంబించారు.
సభకి జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. రామ్మూర్తిగారి పుస్తకాలన్నీ అమ్మకానికి పెట్టారు. ఊరికే ఇస్తే విలువ ఉండటం లేదని, నామమాత్రంగా ఒక్కో పుస్తకం ఇరవై రూపాయిలన్నారు.
రామ్మూర్తిగారి గురించి, ఆయన రచనల గురించి నలుగురు వక్తలు విపులంగా మాట్లాడాక రావుగారు మైకు ముందుకొచ్చారు.
‘రామ్మూర్తి నాకు దగ్గరి స్నేహితుడు. వాడి గురించి మాట్లాట్టం అంటే నా గురించి నేను మాట్లాడుకున్నట్టే. అందుకని వేరే ఓ ముఖ్యమైన విషయం చెపుతాను. ఈనాడు తెలుగులో సాహిత్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంచుమించు వార, పక్ష, మాసపత్రికలు మూతపడ్డాయి. పుస్తక ప్రచురణ సంస్థలు అంతే. ఈ దౌర్భాగ్యం పొరుగు రాష్ట్రాలైన తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో లేదు.
ప్రాథమిక విద్య తెలుగులో తప్పనిసరి కాకపోవటం, భాషాభివృద్ధి విషయంలో శ్రద్ధ లేకపోవటం లాంటి కారణాలు ఉన్నాయి. తెలుగు, తెలుగు సాహిత్యం అంతరించిపోతుందేమో అన్నంత భయం.కానీ ఇద్దరు తెలుగు మాట్లాడేవారు ఉన్నంతవరకూ తెలుగుభాషా, సాహిత్యం బతికే ఉంటాయి అని నా గట్టి నమ్మకం.
ఇంతటి దారుణ స్థితి ఇలాగే ఉండిపోనక్కర్లేదు. మన ప్రభుత్వాలు తలుచుకుంటే, పరిస్థితి పూర్వవైభవ స్థితికి చిటికేసినట్టు మారిపోతుంది. ప్రాథమిక బోధన తెలుగులో చెయ్యటం, వసూలు చేస్తున్న గ్రంథాలయ పన్ను, కోట్ల రూపాయలు గ్రంథాలయాలకే ఖర్చు చెయ్యటం, చేస్తే చాలు.
గ్రంథాలయాలన్నీ బాగుపడితే, తెలుగు సాహిత్య పుస్తకాలు వేలప్రతులు అమ్ముడవుతాయి. రచయితలకి, ప్రచురణ సంస్థలకి కొత్త ఊపిరొస్తుంది.
సరే ఇవన్నీ సామాజిక స్థాయి పనులు. వ్యక్తిగత స్థాయిలో ఇక్కడ ఒక వ్యక్తి నానా హైరానా పడుతున్నాడు. ఆరాడపడుతున్నాడు…అతను రామ్మూర్తి కొడుకు రఘునాథం.
రఘునాథం చెప్పేది వినండి. అతని మమతని, తపనని అర్థం చేసుకోండి. కొంచం సమయం వెచ్చించి మీ చేయూతనివ్వండి అని ముగించారు.చివరగా రఘునాథం మాట్లాడాడు.
‘నేను రచయితని, సాహితీకారుణ్ణి కాదు. ఓ కొడుకుని మాత్రమే మా నాన్న మంచి రచయిత అని నమ్మకం ఉంది. ఆయన స్మృతి పది కాలాలు పచ్చగా ఉండాలి. అది నా స్వార్థమేమో. కానీ ఆయన రచనలు మేలు చేసేవే అన్న విశ్వాసం పూర్తిగా ఉంది. దానికి మీ సహకారం కావాలి.
నాన్నగారి పుస్తకాలన్నీ అచ్చువేసి ఊరికే ఇచ్చి చదివి చెప్పమన్నాను. నిరాశే మిగిలింది. ప్రస్తుత స్థితిగతులు చూసి అందుకే ఈ పోటీ పెడుతున్నాను. ఇతి ఒక ఎరలాంటిదే. వల లాంటిదే. అయినా తప్పనిసరై సాహసిస్తున్నా.
నాన్నగారి ఏ రచన మీదేనా విమర్శ రాసి పంపండి. మొదటి బహుమతి రెండు లక్షలు, రెండో బహుమతి లక్ష. మూడో బహుమతి యాభె •వేలు. ఇవి కాక ఇంకా బహుమతులున్నాయి. పోటీ సంపూర్ణ వివరాలు కరపత్రాల్లో, ప్రకటనలో ఉన్నాయి. ఇప్పటికేనా దయతో స్పందించి, నా కోరిక తీర్చమని వేడుకుంటున్నారు అన్నాడు ఆ దీనస్థితికి కళ్లమ్మట నీళ్లు కారుతుండగా రఘునాథం.
వారసత్వంగా వచ్చిన ఆస్తి, వ్యాపారాలని వారసులు కాపాడుకున్నట్టు, సాహిత్యాన్ని కాపాడాల్సిన కాలం వచ్చింది.