ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు అనేక కోణాల నుంచి ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అది చిన్న రాష్ట్రం. కానీ దేశ రాజధాని. అయినా ముఖ్యమంత్రికీ, అసెంబ్లీకీ కూడా మిగిలిన అసెంబ్లీలూ, ముఖ్యమంత్రులకూ ఉండేటంత అధికారాలూ లేవు. అయినా అక్కడ వచ్చిన ఫలితాలు రాజకీయ విశ్లేషకులనూ, దేశ ప్రజలనూ విశేషంగా ఆకర్షించాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ వంటి ప్రతికూల శక్తిని ఓడిరచడం ఎంత అవసరమో సరైన సమయంలో ఓటర్లు నిర్ణయం తీసుకున్నందుకు ఆ ఎన్నికల ఫలితాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. మొదటిసారి అవతలివారు మోసపోవచ్చు. రెండోసారి ఇవతలి వారు మోసం చేయవచ్చు. మూడోసారి ఎవరూ ఎవరినీ మోసం చేయలేరు. ఆమ్‌ ఆద్మీ పార్టీ, దాని కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ జమిలిగా ఓటమి పాలు గావడం నిజంగా చరిత్ర. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు ‘ఆప్‌’ద నుంచి ఢిల్లీ ప్రజలు బయటపడ్డారు. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు 8వ తేదీన వెలువడినాయి. బీజేపీ 48 స్థానాలు, ఆప్‌ 22 స్థానాలు గెలిచాయి. మూడిరట రెండువంతుల మెజారిటీతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. దీనితో ప్రస్తుతం బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల సంఖ్య 21కి పెరిగింది.

‘ఢిల్లీలో తనను ఓడిరచాలంటే నరేంద్ర మోదీ మరొక జన్మ ఎత్తవలసిందే, ఈ జన్మలో మాత్రం సాధ్యం కాదు’(2023) అంటూ గతంలో కేజ్రీవాల్‌ వేసిన వెర్రి రంకెలతో కూడిన వీడియో తాజా ఫలితాల తరువాత ఒక్కసారిగా దేశం మీదకు వచ్చింది. ఢిల్లీకి తానే శాశ్వత సుల్తాన్‌నీ అంటూ అసెంబ్లీలో అదే కేజ్రీవాల్‌ గొంతు చించుకున్న నాటి మరొక వీడియో కూడా ఇప్పుడు దేశ ప్రజల దృష్టికి వచ్చింది. కేవలం ఎనిమిది స్థానాలు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎలా కుట్ర చేయగలదు? ఈ మాత్రం దేశ ప్రజలు ఆలోచించకుండా, తాను ఏది మాట్లాడినా చప్పట్లు కొడతారని కేజ్రీ భావించాడు. అది తప్పని రుజువైంది. అసలు అలాంటి మాటలు ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినవారి నోటి నుంచి రావు. బీజేపీ, మోదీలకి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా సాగుతున్న కుట్రలో కిరాయి పుచ్చుకుని భారత్‌లో ఆడుతున్న స్వయం ప్రకటిత మేధావుల నోటి నుంచి మాత్రమే వస్తాయి. అంతర్జాతీయ కుట్రదారుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన వాళ్ల గొంతు నుంచి మాత్రమే వెలువడతాయి. కేజ్రీవాల్‌ ముమ్మాటికీ అదే. అవినీతికి వ్యతిరేక ఉద్యమంతో ప్రజాజీవనంలోకి వచ్చిన వాడు చివరికి అవినీతి కేసులతోనే జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ వీడియో చూసిన నెటిజన్‌ల స్పందన అద్భుతం. ‘కేజ్రీ! ఈ జీవితంలో ఇక నీవు జైలు నుంచి బయటకు రాగలవా?’ అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ ముఖ్య మంత్రి మనీశ్‌ సిసోదియా కూడా మట్టి కరిచారు. ఆప్‌ ప్రముఖులు సౌరభ్‌ భరద్వాజ్‌, సతేంద్ర జైన్‌ కూడా ఓడిపోయారు. కేజ్రీవాల్‌ కుర్చీలో కూర్చోకుండా వేరే కుర్చీ వేయించుకుని కూర్చుని పాలించినందుకు కాబోలు ఆతిశీ మార్లినా కనాకష్టంగా నెగ్గారు. తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆప్‌కి చేయూతనిచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు దేశంలో అంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రే ఉండడని వ్యాఖ్యా నిస్తున్నది. అందుకే ఆయన దారుణంగా ఓడిపోయాడని కూడా ఆ పార్టీ విశ్లేషిస్తున్నది. అవినీతి ముఖ్యమంత్రుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు కనీసం ఉండదు. అందుకే ఒక్క సీటు కూడా ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్‌కు విదల్చలేదు. మొత్తం 70 స్థానాలకు పోటీచేసిన కాంగ్రెస్‌ 60 చోట్ల ధరావత్తు కోల్పోయింది. షీలా దీక్షిత్‌ నాయకత్వంలో మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పరిస్థితి ఇవాళ ఇది. అటు ఆప్‌, ఇటు కాంగ్రెస్‌ రెండిరటివి స్వయంకృతాలే.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌, శీష్‌ మహల్‌ ప్రధానంగా ఆప్‌ ఓటమికి దోహదం చేశాయి. ప్రభుత్వ భవనం శీష్‌ మహల్‌ను రూ. 33.66 కోట్లతో మరమ్మతు చేయించి అందులో దిగాడు కేజ్రీవాల్‌. ఒక ఎమ్మెల్యేకి లేదా ముఖ్యమంత్రికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు చాలు అని చెప్పిన కేజ్రీవాల్‌ శీష్‌ మహల్‌లో నివసించడం పెద్ద వివాదానికే దారి తీసింది. 6,ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌లోని ఈ బంగ్లాలో భవిష్యత్తులో ఏ బీజేపీ ముఖ్య మంత్రి నివసించరని ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచదేవ్‌ ప్రకటించడం ఆరోగ్యకర పరిణామం. కేజ్రీవాల్‌ను నేల కరిపించిన శీష్‌మహల్‌ ప్రస్తుతం ప్రజాపనుల శాఖ అధీనంలో ఉంది. కేజ్రీవాల్‌ వారసురాలు ఆతీశీ వద్ద నుంచి ఈ భవంతిని స్వాధీనం చేసుకున్న తరువాత లోపల చేయించిన మరమ్మతులపై పీడబ్ల్యుడీ శాఖ ఆడిట్‌ నిర్వహిం చింది. ఈ ఆడిట్‌లోనే అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత కేజ్రీవాల్‌ బండారం బయటపడిరది. ఆ ఖర్చులు, దుబారా చూసి దేశం నివ్వెరపోయింది. దీనినే బీజేపీ ఎన్నికల ప్రచారంలో విరివిగా ఉపయోగించుకుంది. కాంగ్రెస్‌ కూడా సమయాను కూలంగా కేజ్రీవాల్‌ను అవినీతిపరునిగా చూపించింది. శీష్‌ మహల్‌ నమూనాలను తయారు చేయించి, వాటిని వ్యాన్‌ల మీద ఉంచి ఢిల్లీ అంతటా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తిప్పింది. ఈ వ్యూహం కమలం పార్టీకి బాగా ఉపయోగ పడిరది. ఒకప్పుడు వీఐపీ సంస్కృతిని ఎడాపెడా విమర్శించిన కేజ్రీ అసలు రంగును ఢిల్లీ ఓటర్లు సరిగా గ్రహించడానికి కూడా ఇది ఉపయోగపడిరది. 2013లో మొదటిసారి రామ్‌లీలా మైదానంలో ప్రజలందరి సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్‌ తరువాత ఒక దురహంకారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఉత్సవాన్ని తిలకించడానికి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం వెళ్లారంటే కేజ్రీవాల్‌కు ఉన్న ఆకర్షణను అంచనా వేయవచ్చు. కానీ అతడు దగా చేశాడు. ఆ విషయం ఇప్పుడు ప్రతి పౌరుడు అంగీకరిస్తున్నాడు. విపక్షాలే కాదు, మిత్రపక్షాలు కూడా మౌనంగానే అయినా అంగీకరిస్తున్నాయి. పైగా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన షీలా దీక్షిత్‌ను ఓడిరచి మరీ ముఖ్యమంత్రి కావడం అదనపు ఆకర్షణగా మారింది.

కేజ్రీవాల్‌ పెద్ద దగా కోరు. 2011-12లలో గాంధేయవాది అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేకోద్యమంతో ఆయన వెలుగులోకి వచ్చాడు. ఇతడు మెగసెసె అవార్డు గ్రహీత. ఆ ఉద్యమంలో ఆశ్చర్యంగా కిరణ్‌ బేడీ వంటి వారు ఉన్నారు. అయితే కేవలం బీజేపీ వ్యతిరేకతతోనే మనుగడ సాగిస్తున్న ప్రశాంత భూషణ్‌ వంటి సుప్రీంకోర్టు న్యాయవాది వంటి వారు కూడా చేరారు. అయితే అనతి కాలం లోనే వారందరినీ కేజ్రీవాల్‌ దూరం పెట్టాడు. ఇలాగే మొదట ఆప్‌ కోసం అహర్నిశలు పని చేసినవారిలో జర్నలిస్ట్‌ అశుతోష్‌ ఒకరు. ఒక లోతైన విశ్లేషణ ఆయన దేశం ముందు ఉంచారు. ‘‘రెండు అంశాలు కేజ్రీవాల్‌ను మట్టి కరిపించాయి. ఒకటి 2022 నాటి ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌. రెండు శీష్‌ మహల్‌. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, ఎవరైనా రెండు పడకగదుల ఇంటిలో ఉండవలసిందే అని చెప్పిన కేజ్రీ, ముఖ్యమంత్రి నివాసం పేరుతో శీష్‌ మహల్‌కు రూ.40 కోట్లతో (ప్రజాపనుల శాఖ ప్రకారం రూ.33.66 కోట్లు) మరమ్మతులు చేయించడం ప్రజలు మెచ్చేది కాదు. రాజకీయాలను మారుస్తానంటూ కేజ్రీ వచ్చారు. కానీ ఆయననే రాజకీయాలు మార్చేశాయి’ ’అన్నారు అశుతోష్‌. వందల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లోనే కేజ్రీ ఐదు మాసాలు జైలులో ఉన్నారు. ఈ స్కామ్‌ మరక ఒక్క కేజ్రీకే పరిమితం కాలేదు.

ఇంతకీ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ గురించి మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినవారు కాంగ్రెస్‌ కార్యకర్త కావడమే విశేషం. ఆప్‌ ప్రభుత్వం రూపొందించిన ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలు జరిగాయని 2022లో నాటి ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చౌధురి అనిల్‌కుమార్‌ ఫిర్యాదు చేయడంతోనే డొంకంతా కదిలింది. దీనినే ఢిల్లీ శాసనసభలో బీజేపీ నేత రామ్‌వీర్‌ సింగ్‌ బిధూరి అందుకుని అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. దీనితోనే విస్తృత ప్రచారం వచ్చింది. తమ పార్టీ అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసిన తరువాత బీజేపీ నాటి ఢిల్లీ శాఖ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా దీని మీద వీధి ప్రదర్శనలు నిర్వహించారు. దీనితోనే మహిళలలో సగం మంది ఆప్‌కు సలాం కొట్టారన్న అభిప్రాయం ఉంది. ఈ వివాదంలో మొదట ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా, తరువాత కేజ్రీవాల్‌ తిహార్‌ జైలుకు వెళ్లారు. వీరి కంటే ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే స్కామ్‌లో జైలుకు వెళ్లారు.


మిల్కీపూర్‌ ప్రతీకారం తీర్చుకున్న కమలం

అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయిందంటూ విపక్షాలు దేశం మీదకు వదిలిన వక్రభాష్యానికి అత్యంత కఠినంగా కమలం పార్టీ జవాబిచ్చింది. అయోధ్య పరిధిలోని మిల్కీపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి (ఉత్తరప్రదేశ్‌) ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలో అక్కడ బీజేపీ అభ్యర్థి 61,000 మెజారిటీతో గెలిచారు. ఇంతకు ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేశ్‌ ప్రసాద్‌, 2024 లోక్‌సభ ఎన్నికలలో ఫైజాబాద్‌ నుంచి గెలిచారు. దీనితో మిల్కీపూర్‌కు ఉప ఎన్నిక అవసరమైంది. ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పశ్వాన్‌ అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆయన మీద పోటీ చేసిన సమాజ్‌వాదీ అభ్యర్థి అజిత్‌ ప్రసాద్‌ను ఓడిరచారు. అజిత్‌ ప్రసాద్‌ అవధేశ్‌ ప్రసాద్‌ కుమారుడే. పోలింగ్‌కు రెండుమూడు రోజుల ముందు అయోధ్యలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగింది. ఉప ఎన్నికలలో గెలుపుకోసం అవధేశ్‌ దీనిని ఉపయోగించుకుందామని చూశారు. ఓ నా దళిత బాలికా! అంటూ విలేకరుల సమావేశంలో అక్షరాలా గుక్క పట్టి ఏడ్చారు. అయినా ఓటర్లు కనికరించలేదు. ఈ గెలుపుతో విపక్షాల నోళ్లకు తాళం పడినట్టే.


ఇంత ఉదారవాద రాజకీయ సిద్ధాంతంతో నిర్మించిన పార్టీగా అందరూ భావించిన ఆప్‌లో, కేజ్రీ వారసురాలు ఆతిశీ ఆయన కుర్చీలో కూడా కూర్చోలేదు. ప్రమాణం చేసినా కూడా కేజ్రీ కుర్చీ అంటే, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు. తన నేత కేజ్రీవాల్‌ పట్ల ఉన్న గౌరవాన్ని ఆ విధంగా ప్రకటించుకోదలిచారు ఆతిశీ. కానీ ఆమె చర్య దేశంలో ఆప్‌ను నవ్వులపాలు చేసింది. ఆప్‌ అంటే ఉన్నత భావాలు కలిగిన పార్టీ కాదని, బానిసత్వ బుద్ధితోనే ఉందని జనానికి నమ్మకం వచ్చింది. ఉద్యమ పార్టీగా అవతరించి, ప్రభుత్వం స్థాపించింది ఆప్‌. కానీ త్వరలోనే ఉద్యమం లక్ష్యాన్ని అది వదిలేసింది అన్నదే దాని మీద ప్రస్తుతం మేధావులకు ఉన్న అభిప్రాయం.

ఉచిత విద్యుత్‌ (200 యూనిట్లు), ఉచిత నీరు (20 కిలో లీటర్లు), ప్రభుత్వ పాఠశాలలకు వైభవం, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పరచడం, ఉచితంగా మందులు… ఇవన్నీ కేజ్రీ కురిపించిన వాగ్దానాలు. ఇది స్వల్ప ఆదాయ వర్గాలను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ఇందులో ఏదీ సక్రమంగా జరగలేదు. మహిళలకి ఉచిత బస్‌ సౌకర్యం కల్పించారు. కానీ అధ్వానంగా మారిన ఢిల్లీ రోడ్లను పట్టించుకోలేదు. పెరుగుతున్న కాలుష్యం గురించి పట్టించుకోలేదు. ఏదైనా కేంద్రం మీదకు తోసెయ్యడమే పని. కేంద్రం అందించే ఆరోగ్య పథకాలను స్వీకరించడానికి ఇతడు నిరాకరించి, తిరిగి మళ్లీ కేంద్రం మీదే విమర్శలు గుప్పించిన ఘనుడు. కరోనా సమయంలో ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్‌ కోసం ఇతడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, లేని అవసరానికి ఆక్సిజన్‌ నిల్వ చేయడం కూడా బయటపడిరది.

ఇంతకీ ఈ ఓటమికి కేజ్రీ రాజకీయ గురువు అన్నా హజారే ఏమన్నారు? ఆయన సరిగానే స్పందించారు. కేజ్రీ పరాజయం స్వయంకృతమని అన్నారాయన. ఆప్‌ నేతలు మద్యం విధానం, అక్రమార్జనలతోనే అపకీర్తి పాలై ఓటమిని కొని తెచ్చుకున్నారని ఆ సామాజిక కార్యకర్త వ్యాఖ్యా నించారు. మద్యం వివాదం కేజ్రీవాల్‌కు మచ్చ తెచ్చిందని ఆయన నిర్ద్వంద్వంగా వెల్లడిరచారు. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని తాను చిరకాలంగా హెచ్చరిస్తున్నా ఆయన పట్టించుకోలేదని ఆయన అన్నారు.

బీజేపీనీ, నరేంద్ర మోదీనీ అధికారం నుంచి దించడం కేజ్రీవాల్‌ ఆశయాలలో ఒకటి. దీని వెనుక పెద్ద ఆశయాలే ఉన్నాయని తరువాత బయటపడిరది. ఖలిస్తానీ ముఠాలలో కొన్నింటికి కేజ్రీ కొమ్ముకాస్తున్న సంగతి ఏనాడో బయటపడిరది. అది ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఇంకా దాని గురించి చర్చ జరగడం లేదు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కేజ్రీవాల్‌ మోగా అనే చోట సిక్కు ఉగ్రవాది గురీందర్‌ సింగ్‌/జస్వీందర్‌ సింగ్‌ ఇంటిలో బస చేశాడని, ఈ అంశం మీద దర్యాప్తు చేయించాలని అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌భీర్‌ సింగ్‌ బాదల్‌ జనవరి 31, 2017న భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి గుర్తు చేసుకోవాలి. గురీందర్‌ సింగ్‌ ఖలిస్తానీ కమాండో ఫోర్స్‌ నాయకుడు. ఒక కరుడగట్టిన ఉగ్రవాది ఇంటిలో తాను ఎందుకు బస చేసినదీ పంజాబీలకు కేజ్రీ వివరణ ఇవ్వాలని కూడా బాదల్‌ అప్పుడు కోరారు కూడా. ఖలిస్తానీ కమాండో ఫోర్స్‌ నాయకుడి ఇంటిలో బస చేయడమే కాదు, కొందరు రాడికల్స్‌తో సమావేశాలు కూడా జరిపాడని, విదేశాలలో ఉన్నవారితో కూడా ఫోన్‌లో మాట్లాడాడని బాదల్‌ ఆరోపించారు. అంతకు ముందు కేజ్రీ బబ్బర్‌ ఖాల్సా సంస్థ సభ్యులను కూడా కలుసుకున్నాడని అందుకు కూడా వివరణ ఇవ్వాలని బాదల్‌ కోరారు.

రైతుల పేరుతో ఢిల్లీలో అల్లర్లకు దిగిన ఖలిస్తానీ శక్తులకు కేజ్రీవాల్‌ మద్దతు కూడా బహిరంగ రహస్యమే. అప్పుడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, టీఎంసీ కూడా ఖలిస్తానీ శక్తులకు మద్దతు ఇచ్చాయి. కానీ వీరందరికంటే ఎక్కువ మద్దతు ఇచ్చిన వాడు కేజ్రీ. ఎందుకంటే ఆయనకు ఆ శక్తులతో ఉన్న బంధం కూడా లోతైనది. 2015 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కోసం పాశ్చాత్య దేశాలలో ఉన్న ఖలిస్తానీ ముఠాలు ఆప్‌కు 16 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చాయని సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు గురు పత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ కొద్దికాలం క్రితమే ఒక వీడియోను వైరల్‌ చేసిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఇతడిని భారత్‌కు రప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లోని రిచ్‌మండ్‌ హిల్‌ మీది గురుద్వారాలో తాను, కేజ్రీవాల్‌ కలసి తీయించుకున్న ఫోటోను కూడా పన్నున్‌ విడుదల చేశారు. డిసెంబర్‌ 7,2014న కేజ్రీవాల్‌ అమెరికా వచ్చాడని పూర్తి వివరాలు కూడా పన్నున్‌ ఇచ్చాడు. అప్పుడే కాంగ్రెస్‌ కూడా కేజ్రీని ఖలిస్తానీ మద్దతుదారుడిగా చిత్రించింది. కేజ్రీ పంజాబ్‌లో ఖలిస్తానీ శక్తులకు మద్దతు ఇస్తూ జాతి వ్యతిరేకతకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ నాయకుడు అజయ్‌ మాకెన్‌ ఆరోపించారు.

2020లో ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఆప్‌ నాయకులు ఉన్నారు. అందులో తాహిర్‌ హుస్సేన్‌ ఒకడు. ఆ పార్టీ కార్పొరేటర్‌. అంకిత్‌ శర్మ అనే ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారిని దారుణంగా చంపిన కేసులో ఇతడు నిందితుడు. తరువాత సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసంలోనే ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలేవాల్‌ మీద భౌతిక దాడి కూడా జరిగింది.

పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌, ఆయన మంత్రివర్గ సహచరుల అవినీతి తాజాగా ఆప్‌ ఓటమికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నా, కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. కేజ్రీ అహంకారమే అతడిని పదవికి దూరం చేసింది. ఢిల్లీలో తిరుగు లేదన్న అహంభావమే అతడిని మట్టికరిపించింది. అధికారం మత్తులో కేజ్రీ కూరుకు పోయాడు. ఎంత బుజ్జగింపు ధోరణికి పాల్పడి తన అధికారానికే ముప్పు తెచ్చుకున్నా, ఈసారి ముస్లింలలో కొందరు బీజేపీకి ఓటేశారని తేలింది. ముస్లింలు అధికంగా ఉండే ఏడు నియోజకవర్గాలలో ఆరు చోట్ల బీజేపీయే విజయం సాధించింది. ధనికులు ఉండే ప్రాంతాలు, గుడిసెవాసులు ఉండే ప్రాంతాలు కూడా బీజేపీకే ఓటేశాయి. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయి. అది గుర్తించాలి.

కేజ్రీవాల్‌ వంటి ప్రమాదకర రాజకీయవేత్త ఢిల్లీని పరిపాలించడం దేశానికే అవమానం. ఇంతటి నేర మనస్తత్త్వం ఉన్నవాడు దేశానికి ప్రధాని కావాలని ఆశించడం మరొక ప్రమాద సంకేతం. వీటిని ఢల్లీి ఓటర్లు గ్రహించడం శుభ పరిణామం. ఉచితాల ఉచ్చులో బిగుసుకుపోతున్న ఎన్నికల వ్యవస్థను బయటకు తీయడం, అందుకు ముల్లును ముల్లుతోనే తీయాలన్న వ్యూహంతోనే ఇంతటి విధ్వంసకారుడిని ప్రజలు ఓడిరచారు. బీజేపీని గెలిపించారు. ఆప్‌ ఓటమి ఖాయమని తేలిని తరువాత సచివాలయానికి తాళాలు వేయవలసిందిగా, ఒక్క ఫైల్‌ కూడా కదలకుండా చూడవలసిందిగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా ఆదేశాలు జారీ చేయడం ఈ పరిస్థితులలో అవసరమే. కేజ్రీవాల్‌ మీద ఉన్న ఆర్థిక నేరాలకు మాత్రమే దర్యాప్తు పరిమితం కాకూడదు. అతడికి ఖలిస్తానీ శక్తులతో ఉన్న సంబంధం కూడా బయటకు రావాలి. ఇందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని భావిద్దాం.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE