హిందువులు శబరిమాత జయంతిని కొన్ని ప్రాంతాలలోనే అయినా భక్తశ్రద్ధలతో జరుపుకుంటారు. జాతికి ఆదర్శపురుషుడు శ్రీరామచంద్రుడి ఎడల ఉన్న నిరుపమానమైన భక్తికి నిదర్శనంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. శ్రీరాముడి భక్తకోటిలో శబరిమాత ఒకరు. ఫాల్గుణమాసం, కృష్ణపక్ష సప్తమికి (ఉత్తరాది చాంద్రమానం ప్రకారం) ఆ మహాభక్తురాలి జయంతిని జరుపుతారు. గుజరాత్, మహారాష్ట్ర, కొన్ని దక్షిణ భారత ప్రాంతాలలో అమంత చాంద్రమానం ప్రకారం మాఘమాసంలోనే నిర్వహిస్తారు. ఇలాంటి చిన్న చిన్న తేడాలు ఉన్నా చాలాచోట్ల శబరి జయంతిని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న శబరి మాత జయంతి వచ్చింది.
గిరిజన స్త్రీ శబరికి రాముడి పట్ల ఉన్న అచంచలమైన భక్తిని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి వేడుకను నిర్వహిస్తారు. తన రాకకోసం చిరకాలం ఓపికగా వేచి ఉన్న శబరి గురించి విని చివరికి రాముడు ఆమె కుటీరానికి వెళతాడు. రామాయణ కావ్యంలో ఇదొక అద్భుత ఘట్టం. అత్యంత హృద్యం. ఆమె అడవి పళ్ల రుచి మొదట తాను చూసి, తరువాత తన ఆరాధ్యదైవానికి సమర్పిస్తుంది. ఆ మహనీయుడు ఆ ఎంగిలి పళ్లనే ఆనందంగా స్వీకరిస్తాడు. ఇదొక పరిపూర్ణ భక్తి. దీనిని గుర్తు చేసుకోవడమే ఈ పండుగ ఉద్దేశం.
శబరి జయంతికి హిందువులు ఉపవాసాలు చేస్తారు. రాముడిని, శబరి మాతను పూజిస్తారు. రామాయణంలోని శబరి ఘట్టాలను పఠిస్తారు. ఆలయాలలోనే కాదు, ఇళ్లలో కూడా రాముడు, శబరిల భజన గీతాలను ఆలపిస్తారు. ఈ సందర్భంగా పేదసాదలకు అన్న ప్రసాద వితరణ, ఆలయాలను సందర్శించడం కూడా సంప్రదాయంగా వస్తున్నది.