ప్రయాగరాజ్ కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్న దృష్ట్యా అక్కడ వాహనాల రాకపోకలు సజావుగా జరగడం కోసం, భక్తులకు నిత్యావసర సేవలు సమకూర్చడానికని 16,000 మంది స్వయంసేవకులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ` ఆర్‌ఎస్‌ఎస్ రంగంలోకి దించింది. ఈ స్వయం సేవకులు పోలీసులతో సమన్వయం చేసుకొని కీలకమైన ప్రాంతాల్లో వాహనాలను, పాదచారులను నియంత్రించడానికి తోడు భక్తులకు సాయపడు తున్నారు. దీనికి సంబంధించిన సన్నాహకాలు కొద్ది వారాల క్రితమే మొదలయ్యాయి. ఇందులో భాగంగా స్వయంసేవకులు వాహనాల రాకపోకల నియంత్రణకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందారు. ఇదే కాకుండా పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, ఇతర నిత్యవసర సేవలు అందించడంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు నిమగ్నమై ఉన్నారు.
యాత్రీకులకు బస ఏర్పాట్లు
కుంభమేళా అధికార యంత్రాంగం ఆర్‌ఎస్‌ఎస్, అలహాబాద్ విశ్వవిద్యాలయం సమన్వయంతో ప్రయాగరాజ్‌లో చిక్కుకుపోయిన యాత్రీకులు బస చేయడానికని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది. బస కావాల్సిన యాత్రీకులు విశ్వవిద్యాలయం ఒకటవ నంబరు గేట్ వద్దకు చేరుకొని, అక్కడే ఉన్న స్వయంసేవకుల సాయం తీసుకోవచ్చు.
ఆహార పొట్లాల పంపిణీ
స్వయంసేవకులు పలు చోట్ల ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఓ వైపు సెక్టార్ 9లో కైలాష్ ద్వార్, సెక్టార్ 7లో సూర్య ద్వార్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రిస్తూనే మరోవైపు బేలా కచ్చర్, ఫఫమువా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ నగర్‌లో యాత్రీకులకు ఆహార పంపిణీ చేస్తున్నారు. దారాగంజ్‌లోని రజ్జూ భయ్యా నగర్, సుబేదార్ గంజ్‌లో అవసరమైనవారికి ఆహార పొట్లాలు, టీ, బిస్కెట్లు అందిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు కేవలం ప్రయాగరాజ్‌లో మాత్రమే కాకుండా సమీప జిల్లాలైన ప్రతాప్‌గఢ్, సుల్తాన్‌పూర్, వారణాసి, మీర్జాపూర్‌లో యాత్రీకులకు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇలా అధికార యంత్రాంగం, పోలీసులు, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుల సమష్టి కార్యాచరణతో కుంభమేళాకు వస్తున్న కోట్లాది భక్తులు ఓ భద్రమైన యాత్రానుభవాన్ని మూటగట్టుకొని స్వస్థలాలకు క్షేమంగా తిరుగుముఖం పడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.