భారత రాజ్యాంగంలో పార్ట్-3 లోని 12 నుంచి 35 అధికరణాల వరకు పౌర హక్కులను పొందుపరచారు. భారత పౌరులు ప్రశాంతయుత జీవితాన్ని గడిపేందుకు ఇవి హామీ ఇస్తాయి. ఈ హక్కులనే ‘ప్రాథమిక హక్కులు’ అని వ్యవహరిస్తారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు హైకోర్టులు, సుప్రీంకోర్టు, కలుగజేసుకొని, ఈ హక్కులను అమలు పరచాలని రాజ్యాంగంలోని 32, 226 అధికరణల కింద రిట్లు జారీచేసి అధికార యంత్రాంగాన్ని ఆదేశించ వచ్చు. 32వ అధికరణ కింద సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరై, కో వారంటో రిట్ల ద్వారా ప్రాథమిక హక్కులు అమలు జరిగేలా చూడవచ్చు. ఇక హైకోర్టులు 226వ అధికరణం కింద సంక్రమించిన విశేషాధికారాలతో ఈ ప్రాథమిక హక్కులు సక్రమంగా అమలయ్యేందుకు ఆదేశాలు జారీచేయవచ్చు. ఇక్కడ 32వ అధికరణం, రాజ్యాంగ సమస్య పరిష్కారానికి (ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు) ఒక ప్రాథమిక హక్కు కాగా, 226 అధికరణం మాత్రం హైకోర్టులకు విశేషాధికారాలు కల్పిస్తుంది తప్ప, ప్రాథమిక హక్కు కాదు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగని సందర్భాల్లో కూడా హైకోర్టులు ఈ అధికరణం కింద ఆదేశాలు జారీ చేయవచ్చు.
సమానత్వపు హక్కు (14-18 అధికరణలు), స్వేచ్ఛ హక్కు (19-22 అధికరణలు), దోపిడీని నిరోధించే హక్కు (23-24 అధికరణలు), మతస్వేచ్ఛ హక్కు (25-28 అధికరణలు), సాంస్కృతిక, విద్యాపరమైన హక్కులు (29`30 అధికరణలు), రాజ్యాంగ పరిష్కారాల హక్కు (32-35 అధికరణలు) అనేవి ప్రాథమిక హక్కులు. పౌరులకు, సమాజహితా నికి ఈ ఆరు ప్రాథమిక హక్కులు అవసరం. వీటిని కోర్టుల ద్వారా అమలుపరచే వీలును రాజ్యాంగం కల్పించింది. అయితే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి జనతా ప్రభుత్వం తొలగించగా, 2009లో 6-14 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారు.
ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973)కేసులో, ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించవచ్చునని పేర్కొంటూ, అటువంటి సవరణ రాజ్యాంగ మూల నిర్మాణానికి భంగకరంగా ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక రాజ్యాంగంలోని 33వ అధికరణం కొన్ని వర్గాల వారికి ప్రాథమిక హక్కులను పరిమితం చేస్తూ శాసనం చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు కల్పిస్తోంది.
ప్రాథమిక హక్కులకు సవరణలు
చాలా సందర్భాల్లో ప్రాథమిక హక్కులకు సవరణలు జరిగాయి. ముఖ్యంగా పేదరికం, ఆర్థిక అభద్రతను తొలగించేందుకు పనిహక్కు, నిరుద్యోగులకు, వృద్ధులకు భృతి చెల్లింపు హక్కు వంటివి అవసరమని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడం వీటి సవరణకు ప్రధాన కారణం. అయితే వీటిని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. ఇక స్వేచ్ఛ హక్కుకు పరిమితులను విధించే కొన్ని క్లాజ్‌లను పొందుపరచారు. అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు నిర్బంధం, ప్రాథమిక హక్కుల రద్దు వంటి నిబంధనలను కూడా రాజ్యాంగానికి చేర్చారు. ఆంతరంగిక భద్రతా చట్టం(మీసా), భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ), జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) వంటివి ప్రాథమిక హక్కులకు పరిమితులు విధిస్తున్నాయన్న విమర్శలు ఉన్నప్పటికీ, మారుతున్న పరిస్థితులు, పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదం నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ చట్టాలను రూపొందించక తప్పలేదన్న సత్యాన్ని గుర్తించాలి. ముఖ్యంగా అంతర్గత, సీమాంతర ఉగ్రవాదాన్ని, రాజకీయ హింసను సమర్థంగా అరికట్టడానికి ప్రభుత్వానికి ఈ చట్టాలు ఎంతో ఉపయోగపడ్డాయి. కాగా వీటిల్లో ఉపయోగించిన ‘రాజ్యభద్రత’, ‘ప్రజల భద్రత’, ‘నైతికత్వం’ వంటి పదాలు విస్తృత ప్రభావశీలతను కలిగి ఉండటం గమనార్హం. ‘సహేతుక పరిమితులు’, ‘ప్రజల భద్రతా ప్రయోజనం’ వంటి పదబంధాలకు రాజ్యాంగంలో స్పష్టమైన నిర్వచనం లేదు. ఈ అస్పష్టత కారణంగా అనవసర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. శాంతియుతంగా సమావేశాలు జరుపుకుంటున్నప్పటికీ పోలీసులు వాటిని భగ్నం చేసిన సందర్భాలున్నాయి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కదా! అని వాదించవచ్చు.
స్వేచ్ఛ హక్కులో లేని పత్రికా స్వాతంత్య్రం
స్వేచ్ఛ హక్కులో పత్రికా స్వాతంత్య్రాన్ని చేర్చలేదు. కానీ జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేందుకు పత్రికాస్వేచ్ఛ చాలా అవసరం. ఇక ప్రమాదకర పనులు/ప్రదేశాల్లో బాలలను కార్మికులుగా నియామకాన్ని నిరోధించి నప్పటికీ, ఇంటి సహాయ పనుల్లో వారిని నియోగించడం రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధం మాత్రమే కాదు ఉల్లంఘన కూడా. దేశంలో 16.5 మిలియన్ పిల్లలు వివిధ పనుల్లో పాలు పంచుకుంటు న్నారని ఒక అధ్యయనం తెలుపుతోంది. పౌరసత్వం సవరణ చట్టం`2003 ప్రకారం విదేశాల్లో నివసించే భారత పౌరులకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాల కల్పనలో, స్థానిక పౌరులతో సమాన హక్కును కల్పించలేదు. వాక్ స్వాతంత్య్రం, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం కావడం సంఘాలు, యూనియన్ల ఏర్పాటు భారత ‘సార్వ భౌమాధికారానికి’,‘సమగ్రతకు’ భంగం కలిగించేవిగా ఉండకూడదని రాజ్యాంగం పార్ట్`3 లోని 19వ అధికరణం స్పష్టం చేస్తున్నది. ఇక్కడ సార్వ భౌమాధికారం, సమగ్రత అనే పదాలను దేశ ప్రజలకు వర్తించే విధంగా ప్రయోగించారు తప్ప భారత ప్రాదేశికతకు సంబంధించింది కాదు. పార్ట్`1లోని 1వ అధికరణం భారత్‌ను సమైక్య రాష్ట్రాలుగా పేర్కొంది. అంటే ఇక్కడ భూమి కాదు ‘ప్రజలు’ అని అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులను చాలా వేగంగా విచారించి పరిష్కరించాలి. వాస్తవానికి ఈ కేసుల విచారణ ఏళ్లకు ఏళ్లు సాగడం విచారకరం. ఇక ప్రాథమిక హక్కులకు సవరణ అమల్లోకి రావాలంటే లోక్‌సభ, రాజ్యసభల్లో హాజరైన సభ్యుల్లో మూడిరట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. అయితే హాజరైన సభ్యుల సంఖ్య మెజారిటీ సభ్యుల సంఖ్యకు తక్కువ ఉండకూడదు.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన సాధారణంగా మైనారిటీలు, అణగారిన వర్గాల విషయంలో జరుగు తుంటుంది. ప్రభుత్వాలు మతం, తెగల ప్రాతిపదికన వివక్షతో కూడిన చట్టాలను అమల్లోకి తెస్తే వాటిని కొట్టివేసే అధికారం సాధారణంగా కోర్టులకు ఉంది. అంతర్జాతీయంగా మానవహక్కులు, ఒప్పందాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని దేశీయ చట్టాల్లోకి ఎంతవరకు చేర్చవచ్చు అన్న అంశాన్ని న్యాయవ్యవస్థ పరిశీలిస్తుంది. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తులకు ప్రయోజనకరం కాగలదు. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు ప్రాథమిక హక్కుల పరిధిలోకి ప్రవేశించి చట్టాలు చేయకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పరిశీలన చేసి ఎప్పటికప్పుడు నియంత్రించవచ్చు.
కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు
కేశవానంద భారతి (1973) (రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం గురించి స్పష్టమైన రీతిలో సైద్ధాంతీకరించిన కేసు), పుట్టుస్వామి (గోప్యత హక్కు) కేసుల తీర్పులు ప్రాథమిక హక్కులకు సంబంధించి కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. మేనకాగాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1978)లో సుప్రీంకోరు,్ట రాజ్యాంగంలోని 21వ అధికరణ (ప్రాణ,వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ) పరిధిని విస్తరించింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలను కోవడం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. ఎడిఎం జబల్‌పూర్ కేసులో అత్యవసర పరిస్థితిలో ఎలాంటి విచారణ లేకుండా పౌరులను నిర్బంధించడం ప్రభుత్వ హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది. నిజానికి ఈ విధమైన నిర్బంధం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే తీవ్రమైన చర్య. నల్సా (నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ) వర్సెస్ భారత ప్రభుత్వం (2014) కేసులో ట్రాన్స్ జండర్‌ను మూడో జండర్‌గా సుప్రీంకోర్టు పరిగణించడమే కాదు వారికి చట్టపరంగా సమానహక్కులు, రక్షణ కల్పించింది. 2015లో శ్రేయ సింఘల్ కేసులో వాక్ స్వాతంత్య్రపు హక్కును పరిరక్షించింది. ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్`2000లోని 66ఎ సెక్షన్ చెల్లబోదని స్పష్టం చేసింది. 2017లో సైరాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో త్రిపుల్ తలాఖ్ చెప్పడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. విడాకుల విషయంలో ముస్లిం మహిళలకు సమాన హక్కులు ఉండాలని, వారి హక్కుల పరిరక్షణ ముఖ్యమని పేర్కొంది. నవ్‌తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో (2018) స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ, ఇండియన్ పీనల్‌కోడ్‌లోని 377వ సెక్షన్‌ను కొట్టివేసింది. ముఖ్యంగా ఇది గోప్యత, సమానత్వం, గౌరవం అనే అంశాల ప్రాతిపదికన లైంగిక ధోరణులను పరిగణించాలని పేర్కొంది.
న్యాయవ్యవస్థ సంయమనం
చట్టాలపై వ్యాఖ్యానించడం, అమలు పరచడంలో న్యాయవ్యవస్థ చురుగ్గా వ్యవహరించాలని కొందరు వాదిస్తే, సంయమనం అవసరమని మరి కొందరి అభిప్రాయం. ముఖ్యంగా పౌరుల హక్కుల పరిరక్షణ విషయంలో న్యాయవ్యవస్థ చురుగ్గా వ్యవహరించక పోతే బాధితులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చురుకుదన సమర్థకుల వాదన. ఈ విధంగా చేయడం ద్వారా కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల పరిధిలోకి చొరబడినట్లవుతుందని సంయమన సమర్థకుల విశ్లేషణ. అయితే సుప్రీంకోర్టు కేసు సందర్భాన్ని బట్టి చురుకుగా వ్యవహరించడమో, సంయమనం పాటించడమో చేస్తూ వస్తోంది. నిజానికి ఈ ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత పాటించడం న్యాయమూర్తులకు కత్తిమీద సాము వంటిదే. ఎందుకంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్య సూత్రాలు, కేసు పరిస్థితులు అనే మూడు అంశాలను వారు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిం చాల్సిన అవసరం కూడా తప్పనిసరి. ముఖ్యంగా ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే పరస్పర విరుద్ధ హక్కులు లేదా పరిస్థితులను ఎదుర్కొనాల్సి రావచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి హక్కు మరో వ్యక్తి హక్కుకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు విరోధాభాసకు కారణం కావచ్చు.
ఉదాహరణకు వాక్‌స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కులు, శాంతిభద్రతల పరిరక్షణ, విద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ విషయంలో సంఘర్షణాత్మక పరిస్థితికి దారితీస్తాయి. మరి ఇదే సమయంలో గోప్యత హక్కును పాటించే సమయంలో, జాతీయ భద్రత లేదా చట్టం అమలు అంశాలను పరిగణనలోకి తీసుకోకతప్పదు. ఇటువంటి సమయాల్లోనే సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా పరిస్థితిని విశ్లేషించి, నైష్పత్తిక, సహేతుకత సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటూ కీలకంగా వ్యవహ రిస్తుంది. ఇక్కడ సంఘర్షిస్తున్న హక్కులు, ప్రయోజనాలు అనే రెండు అంశాలను పరిశీలించి సమాజ విశాల హితాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు తన పాత్రను పోషిస్తుంది. అయితే ప్రాథమిక హక్కుల సమతుల్యత విషయంలో కోర్టు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు, పరిస్థితులను బట్టి సమాజహితాన్ని బట్టి ఎప్పటికప్పుడు వ్యవహరిస్తుం టుంది. కాగా ప్రాథమిక హక్కుల సమతుల్యత విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలు, దేశంలోని రాజ్యాంగ న్యాయశాస్త్ర మీమాంస అభివృద్ధిపై విశేష ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని కేసుల్లో ప్రాథమిక హక్కుల విస్తృతిని సుప్రీంకోర్టు మరింతగా పెంచడం ఇందుకు ఉదాహరణ.
మొత్తం మీద చెప్పాలంటే భారత పౌరుల హక్కులు, విధులు,స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు తిరుగులేని పరిరక్షకురాలన్నది సుస్పష్టం. అంతేకాదు చట్టాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతకు కూడా సుప్రీంకోర్టు రక్షకురాలిగా ఉంటుంది. ముఖ్యంగా కార్యనిర్వాహకశాఖ తన పరిమితులను అతిక్రమించకుండా చూసేందుకు, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణకు, సామాజిక న్యాయాన్ని కాపాడటంలో సుప్రీంకోర్టు పాత్ర కీలకమైంది.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్