‘‘నేను పూర్వజన్మలో కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా రాజుపాలెం దగ్గర ఉన్న అయ్యవారిపల్లె గ్రామంలో శ్రీ గజ్జెల వెంకట్రామయ్య గారి కుటుంబానికి చెందిన ఒక యాదవుణ్ణి అని 15.03.1966 నాడు అదే గ్రామంలో నాకు కలిగిన ఒక ఆత్మ ప్రబోధం వలన తెలుసుకున్నాను. ఆ జన్మలో నేను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని, బుడ్డా వెంగళరెడ్డి గారిని చూసి వుంటాను. లేకపోతే ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి తీరంలో పుట్టిన నేను ఈ కుందేరు తీరంలోని ఈ ఇద్దరు మహాత్ముల గురించి మొట్టమొదటిసారిగా ఎలా చెప్పగలిగాను? నేను ఈ జన్మలో కాటమరాజు కథల గురించి అపూర్వమైన పరిశోధనలు చేయడం కూడా పూర్వజన్మల సంస్కారం వల్లనే అని భావిస్తున్నాను’’.
‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు యుద్ధ వీరుడు, బుడ్డా వెంగళరెడ్డి గారు దానవీరుడు. ఒకరు రేనాటి సూర్యుడు, మరొకరు రేనాటి చంద్రుడు. ఈ రేనాటి సూర్యచంద్రుల గురించి 1965-66లో నేను చేసిన పరిశోధన, సేకరించిన సమాచారాన్ని కలిపి ఈ గ్రంథరూపంలో ఇవ్వడమైనది.’’
ఇవి ఆ ఇద్దరు చరిత్ర పురుషుల సమకాలికుడు ఎవరో రాశారని అనుకుంటే పొరపాటు. తెలుగువారి వీరగాథల మీద రాసిన పరిశోధకుని అంతరంగమిది. ఆయన పేరే ఆచార్య తంగిరాల వేంకటసుబ్బారావు. తన ‘రేనాటి సూర్యచంద్రులు’ పరిశోధనాత్మక గ్రంథం ముందు మాటలు ఇవి. చరిత్ర మేధస్సుకు సంబంధించినది. సాహిత్యం దానికి ఛాయ. చరిత్ర ఆత్మ సాహిత్యంలోనే సాక్షాత్కరిస్తుంది. జానపద వీరగాథలు చదివితే ఈ సంగతి బాగా అర్ధమవు తుంది. డాక్టర్ తంగిరాల సాహితీ సేద్యం ఆ పంథాలో సాగిన ప్రత్యేక స్రవంతి.
ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు (మార్చి 30,1935-జనవరి 25, 2025) గొప్ప పరిశోధ కుడు. జానపద సాహిత్యంపై మక్కువతో పల్లె జనం పాటల్లో నిలిచిపోయిన ధీరోదాత్తుల జీవిత చరిత్రలను సేకరించేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు తాలూకా కాకుల ఇల్లిందలపర్రు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేశాక ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య జి.ఎన్.రెడ్డి పర్యవేక్షణలో ‘‘తెలుగు వీరగాథా కవిత్వం’’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నారు. ఆ పరిశోధన కోసం సుమారు 1000 జానపద వీరగాథలను సేకరించారు.
డాక్టరేట్ పట్టా తీసుకున్నాక 1969లో బెంగళూర్ యూనివర్శిటీలో కన్నడ శాఖలో తెలుగు ఉపన్యాసకునిగా సేవలందించారు. అదే యూని వర్శిటీలో తెలుగు శాఖను ఏర్పాటు చేయాలన్న తపనతో నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావుకి లేఖ రాయగా ఆయన స్పందించి రూ. 3 లక్షలు మంజూరు చేశారు. అలా 1974లో బెంగళూర్ యూనివర్శిటీలో తెలుగు శాఖ మొదలయింది.1992లో అదే విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధిపతిగా ఆచార్య తంగిరాల పదవీ విరమణ చేశారు.
ఉద్యోగ విరమణానంతరం ఏప్రిల్ 11, 1994లో శ్రీకృష్ణదేవరాయ రస సమాఖ్య అనే సాహితీ సంస్థను స్థాపించి ప్రతినెల ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు ప్రాచీన సాహిత్యం గురించి, ఆధునిక సాహిత్యం గురించి, జానపద సాహిత్యం గురించి ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పించి తెలుగుభాషా వికాసానికి ఎనలేని సేవ చేశారు.
జానపద సాహిత్యాన్ని అన్వేషిస్తూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణాలోని అనేక పల్లెల్లో కాలినడకన తిరిగి అనేక తాళపత్ర గ్రంథాలను సేకరించారు. ఆయన సేకరించిన వాటిలో పల్నాటి వీరగాథలు 25, కాటమరాజు కథలు 32 ఉన్నాయి. వీటిపై 1975లో మొదటి ప్రపంచ తెలుగు సభల సందర్భంగా ఆంధప్రదేశ్ సంగీత నాటక అకాడమీ మోనోగ్రాఫ్‌గా ప్రచురించింది. ఆంధప్రదేశ్ సాహిత్య అకాడమీ కాటమరాజు కథలను రెండు సంపుటాలుగా ముద్రించింది.
‘రేనాటి సూర్యచంద్రులు’లో ఉయ్యలవాడ నరసింహారెడ్డిది వీరగాధ (విప్లవకాలం). బుడ్డా వెంగళరెడ్డి కరువుకాలంలో ప్రజలకు తిండిపెట్టి కాపాడి ప్రాణ భిక్ష పెట్టాడు. డా. తంగిరాల సృజనాత్మక రచనల్లో ‘హంసపదిక’ ప్రణయ కావ్యం. వనదేవత బుర్రకథ, గుండె పూచిన గులాబీ ఇతర రచనలు.
తంగిరాల ఉమ్మడి ఆంధ్రరాష్ట్రం నలుమూలలా తిరిగి వివిధ జానపద కళారూపాలను సేకరించారు. చాలా ప్రదేశాల్లో కళాకారులు పాడుతూ ఉంటే వాటిని తాను అక్షరబద్ధం చేసి వర్గీకరించారు. వీటిల్లో జంగం కథలు, బుర్ర కథలు, గొల్ల సుద్దులు, జముకుల కథ, తందాన తానా పాటలు, బతకమ్మ పాటలు, కోలాటం పాటలు, స్త్రీల పాటలు మొదలైనవి ఉన్నాయి. 1905లో నందిరాజు చలపతిరావు రచించిన స్త్రీల పాటలను సమగ్ర సంపుటిగా 120 సంవత్సరాల తరువాత, అంటే అక్టోబరు 2024లో ప్రచురించారు. తంగిరాల సాహిత్య సేవకు గుర్తింపుగా అజో-విభో కందాళం ఫౌండేషన్ ప్రతిభామూర్తి పురస్కారాన్ని ప్రకటించింది.
‘అమృతం కురిసిన రాత్రి’ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌కు ప్రియశిష్యుడు తంగిరాల. డిగ్రీ పూర్తి అయ్యాక ఆరు సంవత్సరాలు తపాలా శాఖలో పని చేశారు. ఆయన కోరిక మేరకే ‘‘మైడియర్ సుబ్బారావు కనిపించడం మానేశావు’’ అంటూ తిలక్ తపాలా బంట్రోతు ఇతివృత్తంగా చాలా చక్కని కవిత రాశారు. గురువుగారి మీద గౌరవంతో తంగిరాల ‘రస గంగాధర తిలకం’ పేరుతో కవితలు రాశారు.
తంగిరాల గొప్ప జాతీయవాది. నరసింహరెడ్డి గారి స్వాతంత్య్ర పోరాటాన్ని శంకించే కొందరు పెద్దలకు సమాధానం ఇలా చెప్పారు.
‘బ్రిటిష్ కాలంలో జరిగిన ప్రతీ తిరుగుబాటులోనూ స్వాతంత్య్రేచ్ఛ ఉన్నదన్న సత్యాన్ని మరచి పోకూడదు. ప్రతీ విప్లవకారుడుకీ ఆనాడు వేలాదిగా ప్రజల అండదండలున్న విషయాన్ని కూడా మనం విస్మరించకూడదు. నరసింహారెడ్డి వెనుక 9000 మంది సైనికులు ప్రాణాలకు తెగించి ఎలా నిలబడినారు? మన భారతీయులకు భారతీయ చరిత్రకారులు రాసిన చరిత్ర లేదు. వలస చరిత్ర కారులు రాసిన చరిత్ర మాత్రమే ఉంది. దానినే మనం నమ్ముతున్నాం. సమస్త చరిత్రను కార్ల్‌మార్కస్ సిద్ధాంతం కళ్లద్దాలతోనే చూస్తారు. వారికి అందరూ దోపిడీదారులు, బూర్జువాలుగానే కనిపిస్తారు. అది వాళ్లు ధరించిన కళ్లద్దాల లోపం’ అన్నారు తంగిరాల.
నరసింహారెడ్డి సైన్యంలో సమాజంలో వెనుకబడిన వర్గాలు గిరిజనులు వడ్డేవాళ్లు, యానాదులు, బోయలు, చెంచులు, పట్ర కులంవారు అగ్రకులాలవారు కూడా చేరారు. దీనిని బట్టి నరసింహారెడ్డి పలుకుబడిని అంచనా వేయవచ్చును. వీరందరిపైన పరిశోధనలు జరగాలని తంగిరాల అభిప్రాయపడేవారు.
బుడ్డా వెంగళరెడ్డి రేనాటి చంద్రుడు. ఆయన దాతుృత్వం గురించి
‘‘శతేషు జాయతే శూర సహస్రేష పండిత
వక్తా శత సహస్రేసు దాతా భవతి నానవా’’ అంటారు. అంటే కొన్ని వందల మందిలో ఒక శూరుడు ఉంటాడు. కొన్నివేల మందిలో ఒక పండితుడు ఉంటాడు, కొన్ని లక్షల మందిలో ఒక వక్త ఉంటాడు, కాని కొన్ని లక్షలమందిలో ఒక దాత ఉంటాడో ఉండడో చెప్పలేం. బుడ్డా వెంగళరెడ్డి కొన్ని లక్షల మందిలో అపురూపంగా కనబడే మహాదాత అన్నారు తంగిరాల.
‘‘రాజు మరణించే – నొక తార రాలిపోయే ..
కవియు మరణించే – ఒక తార గగన మెక్కే..
రాజు జీవించేరాతి విగ్రహములందు..
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు’’ – జాషువ
సంప్రదించిన గ్రంథాలు:
1. రేనాటి సూర్యచంద్రులు, తగిరాల వెంకట సుబ్బారావు
2. Brief History of Madanapalli F.A. Coleridge (P-23)
3. A Manual of the Kurnool District by Narahari Gopala Krishna Seetty
-డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు