తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నాయి. ప్రజలనే కాదు అధికారులనూ ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నాయి. సర్కారు తీసుకునే నిర్ణయాలపై పూర్తిస్థాయిలో సమీక్షించి, మంచి చెడులు అంచనా వేసుకొని, అనుకూల, ప్రతికూల పరిస్థితులను బేరీజు వేసుకొని, అమలులోకి తీసుకురావాల్సి ఉండగా అలా జరగడం లేదు. ప్రజలకు హామీ ఇచ్చామనో, బహిరంగంగా ప్రకటించామనో, ఆదరా బాదరాగా నిర్ణయాలు అమలు చేయడం, ఆ తర్వాత విమర్శలపాలు కావడం సర్వసాధారణ మవుతోంది. అమలు చేయడంలో తలెత్తుతున్న లోపాలు, సాంకేతిక సమస్యలపైనా విపక్షాలు విమర్శించిన తర్వాత సమీక్షించు కుంటున్న పరిస్థితి ఉందన్న చర్చ నడుస్తోంది. సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకొస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే స్థాయికి వచ్చేసరికి పలు లోపాలు, అంతరాయాలు, సమస్యలు తలెత్తిన తర్వాత, అప్పటికి గానీ సరిదిద్దుకోలేకపోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనపై పట్టు కోల్పోతోందా?  అన్న చర్చ కూడా నడుస్తోంది.  ఈ పరిణామాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి.


తెలంగాణలో దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ చేయని ఘనత తాము చేస్తున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్భాటంగా రైతు రుణమాఫీ గురించి ప్రకటించుకుంది. అయితే, ఆ పథకం గురించి చాలా రోజుల పాటు కసరత్తు చేశారు. చివరకు అమలులోకి తీసుకొచ్చారు. అయితే, తీరా ఆ పథకం అమలు మొదలు పెట్టాక సాంకేతిక సమస్యల గురించి, ఇతర సమస్యల గురించి తెలిసింది. అప్పటికే విపక్షాలకు ఈ అంశం ఓ అస్త్రమై కూర్చుంది. విపక్షాలు ముప్పేట దాడి మొదలు పెట్టాక ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు, అమలు చేస్తున్న దశలు, అందులో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తీరిగ్గా వివరణ ఇచ్చుకున్నారు మంత్రులు. సంక్షేమ పథకం ప్రజలకు ముఖ్యంగా రైతులకు లాభసాటిదే అయినా ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసి అమలులోకి తెచ్చినా చిన్న నెగెటివ్‌ పబ్లిసిటీ సర్కారును ఆవరించింది. లోపాలను బట్టబయలు చేసింది.

ఇప్పుడు తాజాగా రేషన్‌ కార్డులకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయం కూడా బూమరాంగ్‌ అయ్యింది. రేషన్‌ కార్డుల లొల్లి మళ్లీ మొదటికొచ్చిందన్న వాదనను తెరపైకి తీసుకొచ్చింది. రైతు రుణమాఫీ మాదిరిగానే రేషన్‌ కార్డుల అంశం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉంది. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇచ్చిన రేషన్‌కార్డులు, అప్పుడు చేసుకున్న మార్పులు, చేర్పులు మాత్రమే దాదాపు పదకొండు సంవత్సరాలు అమలులో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్క రేషన్‌ కార్డు కూడా మంజూరు చేయలేదు. ఎలాంటి మార్పులు, చేర్పులు కూడా రేషన్‌ కార్డుల్లో చేయలేదు. కానీ, ప్రజలను మాత్రం ఎప్పటికప్పుడు ఆశల పల్లకి ఎక్కించింది. చోద్యం చూసింది. ప్రజలు ఎంతగా తాపత్రయపడినా, ఎంతగా మొర పెట్టుకున్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం కొత్త రేషన్‌ కార్డులను అస్సలు మంజూరు చేయడానికి పూనుకోలేదు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం అభినందించదగినదే అయినా దానిని అమలు చేసే ప్రక్రియలోనే ఇంకా లోటుపాట్లు బట్టబయలవు తున్నాయి. ప్రజలను మరోసారి ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహణ తీరుపై ప్రజల్లో సందేహాలను లేవనెత్తుతున్నాయి.

రేషన్‌ కార్డులతో పాటు ఇతర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు, లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించింది. ప్రజల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులను తీసుకుంది. వాటిని వడ పోసింది. కంప్యూటర్లలో డేటాను నిక్షిప్తం చేసింది. దీంతో, ఇక రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని అంతా అనుకున్నారు. అంతేకాదు ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వలేని వాళ్లకు నిరంతర ప్రక్రియగా మీసేవా కేంద్రాల్లో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలను అమలులోకి కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఫలితంగా మీసేవా కేంద్రాల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణ పోర్టల్‌ ఓపెన్‌ అయ్యింది. దీంతో, జనం రాష్ట్రవ్యాప్తంగా మీసేవా కేంద్రాలకు క్యూలు కట్టారు. కానీ, కొద్ది గంటల్లోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మీసేవా కేంద్రాల్లో ఇచ్చే దరఖాస్తులు పరిగణనలోకి తీసుకునేది లేదని, ప్రజాపాలన దరఖాస్తులనే ప్రాతిపదికగా తీసుకుంటా మని రివర్స్‌ ప్రకటన చేసింది.

రేషన్‌ కార్డుల కోసం కొత్త దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తాజాగా వెల్లడిరచారు. ఆన్‌లైన్‌ ద్వారా చేసే దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగు తోందని, అందుకే కొత్త రేషన్‌కార్డులకు మాన్యువల్‌గానే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. అధికారులు నిర్వహించే వార్డు సభల్లో అప్లై చేసుకోలేని వారు ప్రభుత్వ కార్యాలయాల్లో, రేషనింగ్‌ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. కానీ దరఖాస్తు చేసుకోని వాళ్ల కోసం మళ్లీ వార్డు సభలు ఎప్పుడు నిర్వహిస్తారో అధికారులు క్లారిటీ ఇవ్వక పోవడంతో దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది.

కొత్త రేషన్‌ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు మీసేవ కమిషనర్‌కు పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. రేషన్‌ కార్డుల డేటాబేస్‌ను మీసేవకు అనుసంధానం చేయాలని ఎన్‌ఐసీని పౌరసరఫరాల శాఖ కోరింది. కొత్త రేషన్‌ కార్డులతో పాటు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ప్రజల నుంచి చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇటీవలే వెల్లడిరచారు. గతంలో ప్రజాపాలన సదస్సులతో పాటుగా ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో భారీగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్‌ ప్రజాభవన్‌తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులు వస్తున్నాయి. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని తద్వారా డుప్లికేట్‌ లేకుండా అర్హులకు రేషన్‌ కార్డులు అందేందుకు వీలుంటుందని పౌరసరఫరాల శాఖ ఆదేశించింది.

ఈ ఆదేశానికి లోబడి మీసేవలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు ఫిబ్రవరి 7వ తేదీన ప్రకటించారు. దీంతో, ఒక్కసారిగా ప్రజలు మీసేవా కేంద్రాలకు ఆ మరుసటిరోజు అంటే 8వ తేదీ శనివారం క్యూ కట్టారు. ఎన్నో ఆశలతో వారు తమ దగ్గర ఉన్న అన్ని రకాల ఐడీ కార్డులు, ఫొటోలూ తీసుకొని మీ సేవా కేంద్రాలకు వెళ్తే తొలి రోజే ప్రజలకు షాక్‌ తగిలింది. మీసేవా కేంద్రాల్లో కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించిన వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. మీసేవా సిబ్బంది ఎంతలా ప్రయత్నించినా, ఎన్నిసార్లు రీఫ్రెష్‌ కొట్టినా, బ్రౌజర్‌లో క్యాచీ తీసేసి ట్రై చేసినా ఓపెన్‌ కాలేదు. కానీ అప్పటికే ఆ ఆప్షన్‌ తొలగించారని తెలియడంతో జనమంతా నిరాశకు గురయ్యారు. దాంతో వచ్చిన దరఖాస్తుదారులందరూ ఉసూరుమంటూ తిరిగి ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం సడెన్‌గా జారీ చేసిన ఆదేశాలే అని తెలుస్తోంది. వాస్తవానికి మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోమని ప్రభుత్వమే చెప్పింది. మరుసటిరోజు ప్రజలు మీసేవా కేంద్రాలకు వెళ్లారు. కానీ ప్రభుత్వం అదేరోజు మళ్లీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి కింది అధికారులకు వచ్చాయి. కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులను మీసేవా కేంద్రాల నుంచి తీసుకోవద్దు అనేది ఆ ఆదేశాల సారాంశం అని తెలిసింది.

దీనిపై స్పందించిన పౌరసరఫరాల శాఖ అధికారులు సాంకేతిక కారణాల వల్ల కొత్త దరఖాస్తులను తీసుకోలేదని ఆ తర్వాత ప్రకటించారు. అయితే, మార్పులు, చేర్పులు ఉంటే మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ప్రకటించారు. అయితే, కొత్త అప్లికేషన్ల కోసం వార్డు సభలు పెట్టేవరకు ఆగాలని, ఇప్పటికే కొందరు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణిలోనూ దరఖాస్తు చేసుకున్నారని, వాటిని కూడా పరిగనలోకి తీసుకుంటామంటున్నారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లక్షల మంది ఎదురుచూస్తుండగా ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయ లోపం, తప్పుడు ప్రకటనలతో జనం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు ఇలా ఎందుకు చేశారంటే ఇప్పటికే చాలా మంది ప్రజా పాలన, ప్రజావాణిలో దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వివరాల్ని కంప్యూటర్లలో ఫీడ్‌ చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాత కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించాలని అధికారులు భావి స్తున్నారు. తద్వారా రిపీట్‌ అప్లికేషన్స్‌ రాకుండా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిసింది. ఐతే అధికారులు ఇష్టమొచ్చినట్లు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లవుతోందనే వాదన ఉంది.

మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం నడుస్తోంది. నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. పోలింగ్‌ కోసం కసరత్తు నడుస్తోంది. అయితే సాధారణంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు గ్యాప్‌ వస్తుంది. కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులకు, జారీకి బ్రేక్‌ పడిరదన్న ప్రచారం జరిగింది. ఎన్నికల సంఘం ఈ ప్రచారాన్ని ఖండిరచింది. రేషన్‌కార్డుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది. పైగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కొత్త రేషన్‌ కార్డుల జారీకి తామేమీ బ్రేక్‌ వేయడం లేదని ఎన్నికల సంఘం స్పష్టంగా ప్రకటించింది. అంటే దరఖాస్తులు చేసుకోవ డానికి ఇప్పుడేమీ అడ్డంకులు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించ ట్లేదన్నమాదిరిగా తయారయ్యింది. ఎందుకంటే దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారో, ఎప్పుడు కొత్త రేషన్‌ కార్డుల లబ్దిదారులను ఎంపిక చేస్తారో, ఎప్పుడు కొత్త కార్డుల జారీ ప్రారంభిస్తారో తెలియడం లేదు.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE