సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి మాఘ బహుళ పంచమి – 17 ఫిబ్రవరి 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
సమాజం చైతన్యవంతం కావడం ఒకటైతే, ఆ చైతన్యం సానుకూల పంథాలో సాగడం మరొకటి. చైతన్యం ఏనాడూ విధ్వంసం కోసం కాదు. దుందుడుకుతనాన్ని పెంచి పోషించడానికి అసలే కాదు. మరింత విజ్ఞతతో, వివేకంతో ముందడుగు వేయడానికి. చీకట్లోంచి వెలుగు వైపు నడవడమే చైతన్యం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సీఎస్ రంగరాజన్ మీద ఫిబ్రవరి 7న జరిగిన భౌతికదాడి చాలా ప్రశ్నలకు తావిస్తున్నది. అది అత్యంత హేయమైనది, గర్హనీయమైది. మతిస్థిమితం తప్పిన కొందరి ఉన్మాద చర్య. మరో ఐదారు వారాలలో వచ్చే ఉగాది లోపులోనే ‘సైన్యాన్ని, ధనాన్ని సమకూర్చా’లట. వాస్తవికంగా చూసినా, కాస్త బుర్రపెట్టి యోచించినా ఇదెంత పిచ్చిమాటో అర్ధమవుతుంది. సైనిక నిర్మాణం వారాలలోనే జరిగిపోవాలా? అందుకు అవసరమైన ధనం ఒక ఆలయం ప్రధాన అర్చకుడు సమకూర్చాలా? ఇదేమి డిమాండ్? పైగా ఇది ‘రామరాజ్యం సేన’ పేరుతో వచ్చిన ఓ ఇరవైమంది పశుప్రాయుల కోరిక.
డాక్టర్ రంగరాజన్ విజ్ఞుడు. తలకు మాసిన ఆ కోరికను వెంటనే నిరాకరించారు. ఫలితమే ఆయన మీద దాడి. ‘రామరాజ్యం సేన’ పేరు పెట్టుకున్న సంస్థ నిజమైనదే అయితే, హిందూ ఆశయం కోసమే మనసా వాచా పని చేస్తున్నదే అయితే ఇలాంటి అకృత్యానికి పాల్పడుతుందా? దీని వెనుక ఇతర శక్తులు ఉన్నాయని నిస్సందేహంగా అనుమానించవచ్చు. ఆ దాడి పోకడే అందుకు నిదర్శనం. అర్చకుల ఇంటిలోకి చొరబడి ఆయన మీద దాడికి పాల్పడ్డారు దుండగులు. ఇది గూండాగిరీ కాక, హిందూధర్మ రక్షణ అవుతుందా? ఆ ఘనకార్యం ధర్మరక్షణలో భాగమని వాళ్లు వెర్రి భ్రమలో ఉంటే ఉండొచ్చు. అంతంత పెద్ద పెద్ద పేర్లు పెడితే పెట్టుకోవచ్చు. దానిని హిందూ సమాజం మాత్రం ఎప్పటికీ నమ్మదు. రంగరాజన్ తండ్రి సౌందర్రాజన్ వయోవృద్ధులు. ఆయన ఎక్కువ సమయం మంచం మీదే ఉండాలి. ఆ తండ్రి ఎదురుగానే తనయుడి మీద దాడి జరిగినట్టు అర్థమవుతున్నది. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినవారు కూడా ఆయనే. సేన నిర్మాణం, అందుకు ధనం డిమాండ్లను రంగరాజన్ నిరాకరించిన తరువాతనే దుండగులు దాడికి తెగబడ్డారని సౌందర్రాజన్ తన ఫిర్యాదులో ఉటంకించారు. పైగా రంగరాజన్ అంతటివారికి పురాణాల మీద, పురాణపురుషుల మీద గూండాలు పరీక్ష కూడా నిర్వహించారు.
హిందూ సమాజానికీ, ఆధ్యాత్మిక తత్త్వానికీ ఆలంబన గుడి. ప్రభుత్వాల చేతులలో సర్వభ్రష్టమవుతున్న ఆ గుడులను రక్షించడానికి సౌందర్రాజన్, రంగరాజన్ చేసిన, చేస్తున్న సేవ నిరుపమానమైనవి. ఆ తండ్రీ తనయులు ఇద్దరూ అటు ఆర్ష వాఙ్మయంలోనే కాదు, ఇటు లౌకిక విద్యలలోను నిష్ణాతులే కూడా. అలాంటి వారు హిందూ సమాజానికి సంపద. మన ధర్మాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్న కొన్ని దురాచారాలను నివారించడానికి తన వంతు కృషి చేస్తున్న సంస్కర్త డాక్టర్ రంగరాజన్. అందులో అంటరానితనం ఒకటి. ఈ దాడి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించినట్టే కనిపిస్తున్నది. దేవాదాయ మంత్రి కొండా సురేఖ రంగరాజన్‌ను పరామర్శించడం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్‌లో పలకరించడం మంచి పరిణామాలే. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. ఈ దాడికి నాయకత్వం వహించిన వీరరాఘవరెడ్డినీ, అతడి అనుచరులు కొందరినీ అరెస్టు చేశారు. ఇతడు తూర్పు గోదావరి నుంచి ఆ మూకతో తరలివచ్చాడు. ఈ బుద్ధి తక్కువ ముఠా తమ ఘన కార్యాన్ని చిత్రించి ఆ వీడియోను వైరల్ చేసింది కూడా.
నిజమే, హిందూ సమాజం మేల్కొంటున్నది. రాముడి పేరుతో వచ్చిన, వస్తున్న చైతన్యమది. అది ద్వేషం నుంచి వచ్చినది కాదు. ఎవరో ప్రేరేపిస్తే రగిలనదీ కాదు. అదంతా ధర్మం మీద భక్తి. రామరాజ్యం సేన పేరుతో దుండగీడుతనం ప్రదర్శించినవాళ్లు నేర్చుకోవలసినది ఆ ఉద్యమం నుంచే. ఇంతకీ ఇదొక చిన్న ముఠా కావచ్చు. అయినా అంత పెద్ద ఆ ఉద్యమం నుంచి పాఠం నేర్వాలి. అయోధ్య ఉద్యమం ఒక్క రోజుతో వచ్చినది కాదు. రాముడిని తిరిగి ఆయన జన్మభూమిలో ప్రతిష్ఠించడానికి హిందూ సమాజం మొత్తం చైతన్యవంతమై కదలడం ఆరంభించినది 1980 దశకంలోనే. 1992లో అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూలింది. దేశంలో ఎన్నో చోట్ల ఘర్షణలు జరిగాయి. కానీ ఒక్కచోట అయినా మరో మసీదు ఏదీ కూలినట్టు ఎవరూ ఆరోపించలేదు. హిందూ సమాజం తనదైన సహనంతో, సంయ మనంతో తమ కలను ఈడేర్చుకుంది. అందుకే రామ జన్మభూమి ఉద్యమానికి అంత విలువ. హిందూ జీవన మౌలిక ధర్మాన్ని అనుసరిస్తూ సాగిన ఉద్యమం అది. కానీ హిందువులు ప్రతిఘటించవలసిన చోట సత్తా కూడా చూపారు. అది సాటి హిందువుల మీద కాదు. నిరంతరం హిందూ ధర్మాన్ని అవమానించే వారి మీద, కక్ష కట్టిన ఉన్మాదశక్తుల మీదే ప్రతాపం చూపారు. హిందూ సమాజానిది ఎప్పుడైనా ధర్మాగ్రహం మాత్రమే. రామ జన్మభూమి ఉద్యమాన్నీ, ఆ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పునీ, ఆలయ నిర్మాణాన్నీ యథేచ్ఛగా విమర్శిం చిన హిందువులు అనేకమంది. వారెవరి మీద హిందూ సమాజం కక్ష కట్టలేదు. కానీ ఇదేమిటి? హిందూ ధర్మరక్షణకు కంకణం కట్టుకున్న వ్యక్తి మీద, రామరాజ్యం సేన పేరుతో దాడి ఏమిటి? రామరాజ్యం అంటే వీళ్లకి అర్థమైంది ఏమిటి? అవాంఛనీయ కోరికలతో సాటి హిందువు మీద, అది కూడా అర్చక స్వామి మీద దాడి చేయడమా? తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. ఇలాంటి అవాంఛనీయ శక్తులు హిందూధర్మం, రామరాజ్యం పేర్లతో అరాచకాలకు పాల్పడితే హిందువు మౌనం వహించడం సరికాదు. వీళ్ల బుర్రలలో నిండిన విషాన్ని తొలగించాలి. వెనుక ఎవరి హస్తం ఉందో వెతకాలి. హిందువులుగా అమ్ముడుపోయి, రామరాజ్యం పేరుతో, సాటి హిందువుల మీద గూండాగిరీ చెలాయించాలని చూసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.