బాంగ్లాదేశ్‌ భుజాల మీద తుపాకీ పెట్టి రొహింగ్యాలను తూటాలుగా చేసుకొని భారత్‌పై కుయుక్తితో దాడి చేయాలని చూస్తోంది పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి సంస్థ` ఐఎస్‌ఐ. ఆ క్రమంలో బాంగ్లాదేశ్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇందుకు తప్పుపట్టాల్సింది బాంగ్లాదేశ్‌లో ముహమ్మద్‌ యూనుస్‌ సర్కారును తప్ప మరెవర్నో కాదు. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉంది అక్కడి పరిస్థితి. దీనికి తోడు దేశ అంతర్గత వ్యవహారాల్లో ఐఎస్‌ఐ జోక్యం ఇలాగే కొనసాగె పక్షంలో భవిష్యత్తులో బాంగ్లాదేశ్‌ను ఆదుకోవడానికి ఏ ఒక్కరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇదే సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా రొహింగ్యాలను దువ్వుతోంది పాకిస్తాన్‌.

రొహింగ్యాలకు సంబంధించి అరకన్‌ రొహింగ్యా విమోచన సైన్యం ` ఏఆర్‌ఎస్‌ఏ, రొహింగ్యా సంఫీుభావ సంస్థ ` ఆర్‌ఎస్‌వో, ఇస్లామీ మహజ్‌, అరకన్‌ జాతీయ రక్షణ బలగం ` ఏఎన్‌డీఎఫ్‌ అనే మూకలతో బాంగ్లాదేశ్‌లో నలుగురు సోదరుల కూటమిని ఐఎస్‌ఐ ఏర్పాటు చేసింది. ఈ కూటమి భద్రతా ఏజెన్సీలకు మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా ఏజెన్సీలకు ఓ పీడకలగా మారే ప్రమాదం ఉంది. అలాంటి కూటమికి రొహింగ్యా సైన్యం అనే పేరు కూడా ఉంది. నాలుగు రొహింగ్యా మూకలు ఒక కూటమిగా ఏర్పడ్డాయనే విషయాన్ని ప్రకటించడం కోసమని బాంగ్లాదేశ్‌లోని కోక్స్‌ బజార్‌ నగరంలో 2024 డిసెంబర్‌ 25న ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రొహింగ్యా శరణార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎస్‌ఐ వెన్నుదన్నుతో వరుస భేటీలు జరిగాయి.

ఐఎస్‌ఐ కొత్త పన్నాగం

బాంగ్లాదేశ్‌ నుంచి షేక్‌ హసీనా నిష్క్రమించిన తర్వాత ఐఎస్‌ఐ చేస్తున్న ఈ దుష్ట పన్నాగాన్ని చాలా దగ్గరుండి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె నిష్క్రమణకు తోడు తనకు బాగా కావాల్సిన వారు పాలనా పగ్గాలు చేపట్టడంతో బంగ్లాదేశ్‌ నుంచి తన కార్యకలాపాలు సాగించడానికి ఇదో అద్భుతమైన అవకాశమని ఐఎస్‌ఐ భావిస్తోంది. ఇప్పటికే అక్కడ జిహాదీ దుష్టశక్తులు తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఇదే అదనుగా నాలుగు రొహింగ్యా మూకలను ఏకం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని సృష్టించడమే లక్ష్యంగా అది పావులు కదుపుతోంది.

ఇప్పటికే ఈశాన్య ప్రాంతంలోకి రొహింగ్యా ముస్లింలు వెల్లువలా వచ్చిపడుతున్న కారణంగా కొత్తగా జట్టు కట్టిన కూటమికి ఆ ప్రాంతంలో అరాచకాలకు ఒడిగట్టడానికి ఎలాంటి అడ్డూ అదుపూ ఉండదనే ధీమాతో ఐఎస్‌ఐ ఉంది. ఇక అక్కడ ఏదైనా ఉగ్రదాడి చేయడమే తరువాయి అన్నట్టుగా అది పన్నాగం పన్నుతోంది. నిన్న మొన్నటి దాకా ఈ నాలుగు రొహింగ్యా మూకలు వేటికవే అన్నట్టుగా అరాచకాలు సాగిస్తుండేవి. అదే ఆ నాలుగింటిని ఏకం చేస్తే అవతల ఏర్పడిన కూటమి మరింత ప్రాణాంతకంగా తయారవుతుందని ఐఎస్‌ఐ భావిస్తోంది. ఏదైతేనేమీ మొత్తానికి రొహింగ్యా మూకలతో నలుగురు సోదరుల కూటమిని ఏర్పాటు చేయడంలో పాకిస్తాన్‌ గూఢచారి ఏజెన్సీ విజయం సాధించినట్టు కనపడుతోంది. అయితే ఇదంతా కూడా ఐఎస్‌ఐ ఒంటి చేత్తో చేసిందనుకుంటే పొరపాటే. బాంగ్లాదేశ్‌ ప్రభుత్వంలోని కొందరు ఈ కూటమిని కట్టడంలో ఐఎస్‌ఐకు చేదోడువాదోడుగా సాయ పడ్డారు. నిజానికి బంగ్లాదేశీయులు సైతం ఈ కూటమికి అండగా నిలబడటంతో వారి లక్ష్యం భారత్‌ తప్ప మరే ఇతర ప్రాంతం కాదని తేటతెల్ల మౌతోంది.

కోక్స్‌ బజార్‌ సమావేశంలో మయన్మార్‌లో కోల్పోయిన భూభాగాన్ని ఎలాగోలా హస్తగతం చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వేలాదిగా రొహింగ్యాలను వెళ్లగొట్టిన అరకన్‌ సైన్యంతో పోరాటం చేసే అంశంపై కూడా సమావేశం దృష్టి పెట్టింది.

బాంగ్లాదేశ్‌కు చెందిన నిఘా బలగాల డైరెక్టరేట్‌ జనరల్‌ – డీజీఎఫ్‌ఐ సైతం ఈ రొహింగ్యా మూకలకు మరీ ముఖ్యంగా ఆర్‌ఎస్‌వోకు కావలసినంత మద్దతు ఇస్తోంది. కేవలం ఏఆర్‌ఎస్‌ఏను దెబ్బ తీయాలనే లక్ష్యంతోనే డీజీఎఫ్‌ఐ అలా చేస్తోంది. అయితే ఐఎస్‌ఐ రంగంలోకి దిగడంతో ఈ రొహింగ్యా మూకలన్నీ కూడా తమ మధ్య ఉన్న గొడవలను పక్కన పెట్టి ఏకం కావాలని నిర్ణయించుకున్నాయి.

ఈ రొహింగ్యా మూకలకు ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వడం కోసమని ఐఎస్‌ఐ లష్కరే తోయిబా, జమాతుల్‌ ముజాహిదీన్‌ బాంగ్లాదేశ్‌ ఉగ్రమూకల నుంచి కొందరు ట్రైనర్లను బరిలోకి దించింది. కొన్నేళ్ల క్రితం రొహింగ్యాల్లో పెద్ద ఎత్తున సంక్షోభం చోటు చేసుకున్నప్పుడు లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ వారికి బాహటంగా మద్దతు తెలిపాడు. తమలో కలిసిపోయి పోరాటం చేయాలని వారికి పిలుపునిచ్చాడు.

ముందుంది అరాచకత్వమే

ముహమ్మద్‌ యూనుస్‌ ప్రభుత్వం పాకిస్తానీయులను బాంగ్లాదేశ్‌లోకి ఆహ్వానించడానికి తహతహలాడి పోతోంది. ఐఎస్‌ఐ అధికారులతో అగ్ర నేతలు ఇటీవల జరిపిన సమావేశం దీనికి నిదర్శనం.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బాంగ్లాదేశ్‌ తాలిబన్ల బాట పడుతుందనే నమ్మకం బలపడుతోంది. దీంతో అది మరింత అణగారిన దేశంగా మారిపోతుంది. బాంగ్లాదేశ్‌ మహిళలకు ఆఫ్ఘనిస్తాన్‌ మహిళలకు పట్టిన గతే పడుతుంది. ఉదాహరణకు 2024 సంవత్సరంలో అచ్చయిన అమర్‌ బంగ్లా బోయి పుస్తకంలోని ఓ అధ్యాయంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇంటి పనులను సమంగా పంచుకోవాలని ఉంది. అదే 2025లో అచ్చయిన అదే పుస్తకంలో అదే అధ్యాయం ఇంటి పనులన్నింటినీ అమ్మాయిలే చేయాలని పేర్కొంది.

ఇప్పటికే పెచ్చరిల్లిన చాదస్తపు ఇస్లాంతో పోరాడటానికి అష్టకష్టాలు పడుతున్న బాంగ్లాదేశ్‌ రొహింగ్యాల రూపంలో మరో తలనొప్పిని తెచ్చిపెట్టుకుంటోంది. కేవలం భారత్‌ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న యూనుస్‌, ఆయన అనుచర గణం అందుకోసమని ఐఎస్‌ఐకు ఎర్ర తివాచీ వేసి మరీ స్వాగతం పలుకుతున్నారు.

బాంగ్లాదేశ్‌కు రానున్న రోజుల్లో ఇస్లాం టెర్రరిస్టులకు తోడు రొహింగ్యాలతో చికాకులు తథ్యమని అనిపిస్తోంది. డిసెంబర్‌ 25న ఐఎస్‌ఐ ఆశీస్సులతో జరిగిన నలుగురు సోదరుల కూటమి సమావేశం రొహింగ్యాలకు ఎలాంటి జంకూ గొంకూలేకుండా బాంగ్లాదేశ్‌ గడ్డ మీద నుంచి ఇష్టానుసారంగా అరాచకాలు చేయడానికి మార్గం సుగమమైందనే ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. బాంగ్లాదేశ్‌ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడు తోంది. అక్కడ శాంతి తిరిగి నెలకొనే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎస్‌ఐ ఆడుతున్న ఆటలు బాంగ్లాదేశ్‌ను నామరూపాల్లేకుండా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

– ఆర్గనైజర్‌ నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE