పద్మ అవార్డుల ప్రకటన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ కొందరు, విమర్శిస్తూ కొందరు మాట్లాడటం ఎప్పటి నుంచో ఉన్నదే! కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన విమర్శలతో పోల్చితే… ఇప్పుటి విమర్శలు చాలా తక్కువ. మట్టిలోని మాణిక్యాలను వెతికి, వారి ప్రతిభకు గుర్తింపుగా పద్మ అవార్డులను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుండటంతో వాటికి ఎంపికైన వారిని ఎవరూ విమర్శించలేని పరిస్థితి నెలకొంది. తాము ఆశించిన వారికి రాలేదనే అక్కసు, ఆశించిన స్థాయిలో తమ రాష్ట్రానికి అవార్డులు దక్కలేదనే బాధను వెళ్లగక్కడం మినహా వేరే విమర్శలు రావడం లేదు. ఈసారి మాత్రం పద్మ అవార్డుల ప్రకటన తర్వాత ఆసక్తికరమైన సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి.
ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరఫున నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది బాలకృష్ణ అభిమానులకు ఆనందాన్ని కలిగించే వార్త. ఎందుకంటే…ఆయన గత ఏడాది(2024)తో నట స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. 1974లో ‘తాతమ్మ కల’ సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టి అప్రతిహతంగా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ తరహాలో ఇలా సుదీర్ఘకాలం అగ్రస్థానంలో నటుడిగా కొనసాగిన నటవారసులు మరొకరు లేరు. అలానే రాజకీయంగానూ హిందూపురం శాసనసభ నియోజవర్గం నుంచి వరుసగా మూడోసారి గెలిచి రికార్డ్ సృష్టించారు. ఇలాంటి సమయంలో బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఇదే సమయంలో రెండు రకాలుగా కొందరు బాలకృష్ణ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా కనిపించింది.
తెలుగునాట చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సీనియర్ హీరోలుగా ఉన్నారు. ఇందులో చిరంజీవి ఇటు సినిమాల్లోనే కాకుండా అటు రాజకీయాలలోకి వెళ్లారు. అక్కడ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ దక్కకపోవడంతో యూ టర్న్ తీసుకుని తిరిగి నటన మీద దృష్టి పెట్టారు. ఆయనకు పద్మభూషణ్‌తో పాటు పద్మవిభూషణ్ వచ్చింది. ఆయనకు సమకాలీనుడు, రాజకీయంగానూ తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు కూడా పద్మభూషణ్ కాకుండా పద్మవిభూషణ్ వచ్చి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇది బాలకృష్ణ అభిమానుల మనోగతం కాగా, నందమూరి అభి మానులు బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, మహానటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు భారతరత్న ప్రకటిస్తారని ఆశించిన సమయంలో ఆయన తనయుడికి పద్మభూషణ్‌తో కేంద్రం చేతులు దులుపుకుందని కినుక వహించారు. బాలకృష్ణ తన పురస్కారాన్ని గౌరవంగా తిరస్కరించి ఉంటే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్న బాలకృష్ణ, తండ్రి సాకుతో అవార్డును తిరస్కరించే సాహసం ఎలా చేస్తారంటూ మరికొందరు సమాధాన పడ్డారు. బహుశా దీనికి సమాధానంగానే కావచ్చు… బాలకృష్ణ ఇటీవల ‘అవార్డులు తనకు కొత్తగా వన్నె తెచ్చిపెట్టవని, అవార్డులకే తాను వన్నె’ అనే భావనతో కొన్ని చోట్ల ప్రకటనలు చేశారు. తన తండ్రికి భారతరత్న ఇచ్చి ఉంటే మరింతగా సంతోషించేవాడినని, ఆ దిశగా ఆలోచన చేయాల్సిందిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికీ బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడాన్ని వైరివర్గం కూడా విమర్శలకు ఉపయోగించుకుంది. సోషల్ మీడియాపై ఎవరికీ అదుపులేకపోవడంతో ఎవరికి తోచిన విధంగా దారుణమైన విమర్శలకు ఒడిగడుతున్నారు. భారతరత్న ఎన్టీఆర్ కాలిగోటితో సమానం అంటూ గతంలో బాలకృష్ణ అన్న మాటలను, సినిమా హీరోయిన్ల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. అందుకే బాలకృష్ణ ‘నవ్వే వాళ్లునవ్వనీ, ఏడ్చే వాళ్లు ఏడవనీ’ అంటూ తన సినిమాలోని పాటనే ఉదహరిస్తూ…. వీటన్నింటికీ అతీతంగా తన పని తాను చేసుకు పోతానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే… పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాపోయారు. ఆయన పంపిన పేర్లను కేంద్రం పరిశీలించలేదని అన్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ గద్దర్‌కు ఇవ్వకపోవడం ఆయనకు మనస్తాపాన్ని కలిగించినట్టుగా చెప్పారు. బహుశా గద్దర్‌కు ఇవ్వకపోవడం కంటే… మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడం రేవంత్‌కు నచ్చి ఉండకపోవచ్చు. ఇదే సమయంలో గద్దర్ పేరును సిఫార్స్ చేయడమే కరెక్ట్ కాదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వేలాదిమంది యువకులను తప్పుదోవ పట్టించి, దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సహకరించిన గద్దర్‌కు బరాబర్ పద్మ అవార్డు ఇవ్వబోమని తెగేసి చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రతి విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే జనవరి 31న గద్దర్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా జరిపింది. ఇప్పటికే గద్దర్ కుమార్తె వెన్నెలకు ప్రభుత్వ పదవిని కట్టబెట్టిన రేవంత్ రెడ్డి, రాబోయే కొద్ది నెలల్లో పట్టుదల కోసమైనా గద్దర్ సినిమా అవార్డులను నిర్వహించే ఆస్కారం లేకపోలేదు. గద్దర్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేసినా… తాము నెత్తిన పెట్టుకుని తీరతామని రేవంత్ చెప్పాలనుకుంటున్నారు. నిజంగా గద్దర్ మీద అభిమానంతోనే రేవంత్ ఇలా చేస్తున్నారా? లేక దీని వెనుక రాజకీయ ఎత్తుగడలు, కుల సమీకరణాలు ఉన్నాయా? అనేది విజ్ఞులు అర్థం చేసుకోగలరు!
అరుణ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్