తలచినదే తడవుగా వశమయ్యే భక్తసులభుడు సదాశివుడు. సత్య స్వరూపుడు. వినయమూర్తి. ‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు’ అని శంకర భగవత్పాదులు శివతత్త్నాన్ని ఆవిష్క రించారు. భగవానుడికి భక్తుల పట్ల అంత వినయ విధేయతలు ఉంటే, ఆయన దయాలబ్ధులు దైవం పట్ల మరెంత వినయశీలురు కావాలో.. అన్నది అంతరార్థంగా చెబుతారు. అచంచల భక్తితో శివనామస్మరణచేస్తే.. భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్రపురాణవాక్కు.‘శివశివ శివ యనరాదా… భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నారు.
ముక్కోటి దేవతలలో సనాతనుడు. భక్తవ శకంరుడు. భోళాశంకరుడు. భవరోగాలు నయం చేసే వైద్యుడు. సమస్త చరాచర జగత్తుకు విశ్వ నాథుడు. ‘సర్వం శివమయం జగత్’… అంతా శివస్వరూపమే అన్నారు. శివుడు అందరివాడు. బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలే కాదు… హిరణ్యకశిపు రావణ, బాణాసుర, బ్రహ్మాసుర దానవ శ్రేష్ఠులు, వాలి వంటి వానర ప్రముఖులు, సమస్త రుషులు, ఆదిశంకరాచార్యుల వంటి జగద్గురువులు కన్నప్పలాంటి భక్తులు ఆయనను అర్చించి తరించిన వారే. క్షీరసాగర మథనవేళ లోక సంరక్షణార్థం హాలాహల స్వీకరణతో గరళకంఠుడిగా ప్రశస్థి పొందిన పరమశివుడిని వేదాలు మహాదేవుడు, మహేశుడు, దేవదేవుడు, అశుతోషుడు అని కీర్తించాయి.
పురాణాలే కాదు.. పురాతనమైన వేదాల కంటే ముందునుంచీ భారత ఉపఖండంలో శివారాధన ఉంది. మధ్యప్రదేశ్ లోలని భీమ్ భెట్కా గుహలలోని కుడ్యచిత్రాలను ఆ నాటి శివారాధనకు నిదర్శనంగా చెబుతారు. వేదవాఙ్మయం అయనను రుద్రుడిగా ప్రస్తుతించింది. రుగ్వేదంలో మొదటిసారిగా శివనామం కనిపిస్తుంది. త్రిమూర్తులు సృష్టి స్థితి లయ కారుకులని పురాణాలు చెబుతున్నా, ఆ మూడింటి కారకుడు శివుడేనని శైవ మతం పేర్కొంది.
‘శం నిత్యం సుఖమానందమికారః పురుషః స్మృతః
వకారః శక్తిరమృతం మేలనం శివ ఉచ్యుతే’
శకార, ఇకార, వకారాలు కలయిక శివుడు. ‘శ’ అంటే నిత్యం, సుఖం, ఆనందం. ‘ఇ’కారమంటే పరమ పురుషుడు. ‘వ’కారమంటే అమృతపరమైన శక్తి అని అర్థం. అమృత సమానమైన పరమానంద సుఖాన్ని, దివ్యశక్తిని ప్రసా దించే పురుషుడిని శివుడు అని వ్యవహరిస్తారు. సంసారమనే రోగానికి శివనామం పరమౌషధం.
శివుడే సత్యం, శివం, సుందరం అని వర్ణించారు జ్ఞానులు. ఆయన సత్య స్వరూపుడు, మంగళకారుడు, సుందరరూపుడు,శుభకరుడు,కల్యాణ కారకుడు. ఆయనకు శంకరుడు, శంభుడు, త్రినేత్రుడు,రుద్రుడు, మహేశ్వరుడు, హరుడు, మహాదేవుడు,నటరాజు లాంటి సహస్రాధిక పేర్లున్నా, ‘శివ’ (శివయ్య) అనేది మహిమాన్వితం, భక్తకోటికి అత్యంత ప్రియమైనది. ‘విద్యలు అన్నిటిలో వేదం గొప్పది. వేదాలన్నిటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం, అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మిన్న. దానిని పలుకలేకపోతే అందులోని రెండక్షరాలు ‘శివ’ మరింత గొప్పది’ అని శాస్త్ర వచనం. శివం అనే పదానికి మోక్షం, మంగళం, శుభం, శ్రేయస్సు, భద్రం,, కల్యాణం అనే అర్థాలు ఉన్నాయి.
‘మహాపాతక విచ్ఛింతై శివ ఇత్యక్షరద్వయం
అలం నమస్క్రియా యుక్తోముక్తయే పరికల్పతే’… శివ అనే రెండక్షరాలు మహా పాతకాలను నాశనం చేయగల సామర్థం కలిగినవి. శివ శబ్దానికి ‘నమః’ (నమః అంటే త్యాగం, ప్రణతి, శరణాగతి, సనాతం వంటి అర్థాలు ఉన్నాయి) అని జోడించి ఉచ్చరిస్తే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ‘నమః శివాయ’ ప్రాణ పంచాక్షరీగా రుద్రాధ్యయం అభివర్ణించింది. పంచాక్షరి లోని బీజాక్షరాలను పంచభూతాలకు ప్రతీకలుగా చెబుతారు. మనసు, వాక్కు, కర్మ,బుద్ధి, చైతన్యాలకు ఇవి సంకేతాలు. నాదం, మంత్రం, శుభం, వాక్కు, యజ్ఞాల మేలుకలయిక శివపంచాక్షరీ వైభవం.
‘మాఘకృష్ణ చతుర్దాశ్యామాదిదేవో మహానిశి
శివలింగ త్వయోద్భూతః కోటి సూర్య సమప్రభః
తత్కాలవ్యాపినీ గ్రాహ్యా శివరాతివ్రతేతిథిః’…
మాఘ కృష్ణ చతుర్దశి నాటి నిశిరాత్రి సమయంలో ఆదిదేవుడు శివుడు కోటి సూర్యులతో సమానమైన కాంతితో లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు. ఆ రాత్రి (మహా శివరాత్రి) పరమశివునికి ఎంతో ప్రధానమైన పర్వదినం. ఈ పర్వదినాన్ని శివపురాణం ‘శివధర్మవృద్ధి కాలం’ అని అభివర్ణించింది. శివ నామస్మరణ, మంత్ర జపం, అర్చన,అభిషేకం, సంకీర్తన, ధ్యానం, శివలీలా కథా శ్రవణం, భస్మ రుద్రాక్షధారణ ‘శివధర్మాలు’గా ప్రతీతి. వీటిలో ఏ ఒక్కటి పాటించినా అత్యధిక ఫలితం ప్రాప్తి స్తుందని పూర్వ గాథలు వెల్లడిస్తున్నాయి.
దక్షిణాన రామేశ్వం నుంచి ఉత్తరాన కేదారేశ్వరం, పంచారామాలు, జ్యోతిర్లింగాలు, ఆసేతు హిమాచలం శైవాలయాలు శిమనామ స్మరణతో మార్మోగుతాయి. ధార్మికజాగరణతో భక్తలోకం పునీతమవుతుంది. ఆనాటి రాత్రి ఉపవసించడవల్ల రజోగుణం, జాగరణ వల్ల తమోగుణం, పూజతో సత్వగుణం పెరుగుతాయి. మహాశివరాత్రి నాడు అహోరాత్రాలు ఉపవాసం ఉండి, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, పార్వతీపతిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే శివలోక ప్రాప్తి తథ్యం అంటారు. ‘ఉపవాసం’ అంటే నిరాహారం కాదు. ‘ఉప’ అంటే సమీపం, దగ్గర. ‘వాసం’ అంటే నివసించడం, ఉండడం. అంటే మన మనసును, బుద్ధిని ఈశ్వరుని సమీపంగా ఉంచడం. ఆయనకు అర్పించడం. భగవంతుడిని నిరంతరం మనసులో నిలుపుకోవడమే ‘ఉపవాసం’.
నిత్య, పక్ష, మాస శివరాత్రి అని మూడు పర్వదినాలు ఉన్నా మహాశివరాత్రికి మరింత విశిష్టత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘శివప్రియాతు దుపాసానార్ధా రాత్రి శివరాత్రి’ (శివునికి ప్రియమైన, శివారాధనకు ఉత్కృష్టమైన రాత్రే శివరాత్రి) అని స్కంద పురాణం పేర్కొంటోంది.
‘శివరాత్రి మహోరాత్రం నిరాహారో జితేంద్రియః
అర్చయేద్వా యథాన్యాయం యథాబలమ పంచకః
యత్ఫలం మహాపూజయాం వర్షమేక నిరంతరం
తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చనాత్’…
ఇంద్రియనిగ్రహాన్ని పాటిస్తూ, శివరాత్రి నాడు ఉపవాదదీక్షతో శివలింగాన్ని పూజిస్తే.. పరమేశ్వ రుడిని ఏడాది పాటు పూజించినంత ఫలితం కలుగు తుందని ఆర్యోక్తి.
విష్ణువు అలంకారప్రియడు కాగా శివుడు అభిషేకప్రియుడు. అభిషేకం అంటే శివలింగంపై పాలు, నీళ్లు పోయడం అని సాధారణ భావన. ‘మన మనసును యోగంతో లగ్నం చేయడమే నిజమైన అభిషేకం’ అంటారు పెద్దలు. అంటే సర్వ సమర్పణ అని అర్థం. ‘నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేందుకు యత్నించే దాసాను దాసుడను’ అనే భావనతో తనను తాను అంకితం చేసుకోవడం, శరణాగతి కోరడం. చెంబుడు శుద్ధో దకాన్ని లింగాకృతిపై పోసి, చిడికెడు భస్మాన్ని చల్లే సామాన్యులను, మహన్యాసపూర్వక నమక చమకాదులతో ఏకాదశ రుద్రాభి •షేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించే అసామాన్యులను ఏకరీతిన కరుణిస్తాడని విశ్వాసం. నిజానికి.. జ్ఞానం, విచక్షణతో ఆలోచించడమే ‘అభిషేకం’ అని చెబుతారు. ఆత్మను పరమాత్మతో అనుసంధానించినపుడు ఆత్మప్రక్షాళన జరుగుతుంది.
భక్తజన సులభుడు శివుడు భక్తుల ఉపాసన సౌలభ్యం నిమిత్తం లింగరూపంలో ఆవిర్భవించాడని, ఆ రూపంలో నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడని పురాణవాక్కు. నిరాకారుడైన ఆయన తనకు తాను రూపాన్ని సృష్టించుకొన్నాడు. మరో కథనం ప్రకారం, తమలో ఎవరు అధికులమని బ్రహ్మ,విష్ణువుల మధ్య ఒకసారి వాగ్వాదం చోటుచేసు కొని, వాదన ముదిరి ప్రళయానికి దారితీసింది. ఈశ్వరుడు తేజోమూర్తిగా వారిద్దరి మధ్య ఉద్భవించి జ్ఞానోపదేశం చేశారు.
‘శివేతి చ శివం యస్యవాచిప్రవర్తతే
కోటి జన్మార్జితం పాపం తస్యం నశ్యతి నిశ్చితమ్’..
మంగళప్రదమైన శివనామాన్ని నిత్యం స్మరించే వారి సమస్త పాపాలు హరిస్తాయి. ‘శివలింగాన్ని ఒక్కసారైనా పూజించిన వాడు అనేక కల్పాల వరకూ స్వర్గసుఖాలననుభవిస్తాడు. శివలింగార్చన వల్ల మానవులు పుత్ర, మిత్ర, కళత్ర, శ్రేష్ఠత్వ, జ్ఞానముక్తు లను పొందగలుగుతారు. శివ నామోచ్చరణతో దేహాన్ని త్యజించేవారు అనేక జన్మల పాపాల నుంచి మోక్షం పొందుతారు’ అని శ్రీకృష్ణభగవానుడు శంకరునితో అన్నట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.
పరమేశ్వరుడు భక్తుల హృదయ దీపమై వెలిగే పరంజ్యోతి అని జగద్గురువు ఆదిశంకరులు స్తుతించారు. సర్వం దుఃఖమైన భౌతిక ప్రపంచంలో ముక్తి ఒక్కటే శాశ్వత ఆనందమని; భక్తి, ప్రపత్తి, శరణాగతి అనే మూడు మార్గాలను ప్రతిపాదించారు. శివాశ్రయం ద్వారానే ముక్తి సులభ సాధ్యమంటూ, ముక్తి మార్గానికి భక్తికి మించిన సాధనం లేదని విశ్వసించారు.
సామీప్య, సారూప్య, సాయుజ్యంతో శంకర కరుణకు పాత్రులు కావచ్చని ‘శివానంద లహరి’లో పేర్కొన్నారు. సకల దేవతా పూజా విధానాలను, స్తోత్రాలను లోకానికి అందించిన శంకరభగవ త్పాదులు ‘మానస పూజ’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సర్వం శివమయం అనే ఎరుకే ‘మానస పూజ’. అంతటా అవరించి ఉన్నపూర్ణత్వానికి శివత్త్వం అని పేరు. అది అనంతం. శివస్తోత్రం వేదసారం. శివుడి త్రినేత్రాలను సూర్య చంద్రులు, అగ్నిగావర్ణిస్తారు. ప్రకృతి పురుషులు అభేదమని చెప్పేందుకే శివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. యోగ విద్యను మొదట పార్వతికి బోధించి స్త్రీలకు బ్రహ్మ విద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు. యోగ సంప్రదాయంలో ఆయనను దేవుడిగా కంటే ఆదిగురువుగా అర్చిస్తారు.
లోక శ్రేయస్సుకోసం కష్టాలను ఇష్టంగా భరించడం, ఆనందంగా స్వీకరించడం శంకర తత్వం. క్షీరసాగర మథనవేళ ఆవిర్భవించిన హాలాహలాన్ని గరళంలో నిలపడమే అందుకు ప్రథమోదహరణ.
విషయ వాంఛలను త్యజించి అతి సామాన్య జీవితాన్ని గడిపే మహనీయుడు. ఎంతో శాంతమూర్తో.. అంత ఉగప్రకృతి కలవాడు. ఆయన కోపాగ్ని జ్వాలలు, త్రినేత్ర విశిఖ జ్వలాల్లో లోకాన్నే దహించే శక్తి ఉంది. అయినా దానిని వృథా చేయని భక్తులపాలిట కొంగు బంగారం… కల్పవృక్షం. వేల సంవత్సరాలుగా శివరాత్రిని జరుపుకుంటూ, ఉపవాసాలు చేస్తూ, జాగరణ ఉంటూనే ఉన్నారు. ఆదిదేవుని అర్చిస్తున్న వారిలో ఆయనలా పరోపకార మనస్తత్వం ఎంత? అన్నది విజ్ఞుల ప్రశ్న. పరమ శివుడిని పూజిస్తేనే చాలదని,ఆయన లక్షణాలు స్ఫూర్తిగా సమాజం శక్తిమంతం కావడానికి పాటు పడాలని ఆచార్యులు సందేశమిస్తున్నారు.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్