కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చరిత్ర సృష్టించారు. వరసగా ఎనిమిదిమార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 1న 2025-2026 వార్షిక బడ్జెట్‌ పార్లమెంట్‌’కు సమర్పించి ఈ కొత్త రికార్డు నమోదు చేశారు. మరోవంక, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచి, మధ్య తరగతి, వేతనజీవుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి, మరో మకుటాన్ని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవచించిన సంక్షేమ మూలమంత్రం, ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’కు ఎత్తు పీట వేస్తూనే, వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని మరింత చేరువ చేసే విధంగా బడ్జెట్‌ రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. బడ్జెట్‌ ప్రసంగం పూర్తి చేసిన సమయంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మంత్రులు ఆమె వద్దకు వచ్చి మరీ అభినందించారు. విపక్ష నాయకులు పడికట్టు పదాలతో కువిమర్శలు చేయడం తప్పించి నిర్మాణాత్మక విమర్శలు చేసే సాహసం చేయలేకపోతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు.. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సైతం, ‘బోల్డ్‌ బడ్జెట్‌ కాకపోయినా, క్లవర్‌ బడ్జట్‌’ అంటూ, నొచ్చకుండా మెచ్చుకున్నారు. ఎవరు ఏమన్నా, నరేంద్ర మోదీ సారథó్యంలో, నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ కొత్త బాటలు తొక్కింది. దీర్ఘకాలిక మౌలిక లక్ష్యాలు, ప్రాధాన్యతలను కొనసాగిస్తూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులతో బడ్జెట్‌ను రూపొందించిన ఆర్థిక మంత్రి అభినందనీయురాలు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్ల బడ్జెట్‌ పరిమాణాన్ని మూడు రెట్లు పెంచి.. మరో రికార్డు సృష్టించింది. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చిట్టచివరి (2014-2015) వార్షిక బడ్జెట్‌ రూ.16 లక్షల కోట్లు కగా, 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ పరిమాణం రూ.50 లక్షల కోట్లు దాటింది.

అదలాఉంచి, బడ్జెట్‌ తయారీలో చేయితిరిగిన నిర్మలమ్మ దాని రూప కల్పనలో తమదైన ముద్ర వేశారు. అందుకే, విశ్లేషకులు, విమర్శకులు ‘బడ్జెట్‌లో ఇది ఉంది, ఇది లేదు’ అని చెప్పేందుకు ఏదీ లేదు అంటున్నారు. వ్యసాయం మొదలు, ప్రధాన మంత్రి ‘అస్పిరేషనల్‌ ఇండియా’గా పేర్కొన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఎఐ) వరకు అన్నిరంగాలకు సముచిత రీతిలో కేటాయింపులు చేయడంతో పాటుగా సంక్షేమ, ఉపాధి, సేవా రంగాలకు, ప్రాధాన్యం ఇచ్చారు. అన్నిటినీ మించి దేశఆర్థిక ప్రగతిలో మధ్య తరగతికి పెద్ద పీట వేశారు.

మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌

సహజంగా బడ్జెట్‌ స్వరూప, స్వభావాలు, ప్రాధాన్యతలను బట్టి ప్రతి బడ్జెట్‌’కు ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ ప్రత్యేకతే, సదరు బడ్జెట్‌’కు మకుటంగా నిలిచి, అలా గుర్తుండి పోతుంది. ఇందిరాగాంధీ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి వైబీ చవాన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను ‘బ్లాక్‌ బడ్జెట్‌’గా పిలుచుకున్నారు. పీవీ నరసింహారావు హయాంలో మన్మోహన్‌సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ‘ఎపోకల్‌ బడ్జెట్‌’గా నామకరణం జరిగింది. కాల గమనంలో యశ్వంత్‌ సిన్హా, చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్లను మిలీనియం బడ్జెట్‌, డ్రీమ్‌ బడ్జెట్‌ అని ముద్దుగా పిలుచుకున్నారు. ఆ క్రమంలో నిర్మలా సీతారామన్‌ 2021లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌‘వన్స్‌ ఇన్‌ ఎ సెంచరీ బడ్జెట్‌’ (శతాబ్ది బడ్జెట్‌)గా పేర్కొంటే, తాజా బడ్జెట్‌’ మధ్యతరగతి మకుటంగా పేరు పొందింది. ఇది నిస్సందేహంగా మధ్య తరగతి ‘ప్రజల’ బడ్జెట్‌ అనడంలో సందేహం లేదు. అందు లోనూ, అద్య పన్ను పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచడం మాములు విషయం కాదు. నిజానికి, మధ్యతరగతి, వేతనజీవులు కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఆదాయ పన్ను భారాన్ని తగ్గించారు. రూ. 7 లక్షలుగా ఉన్న పన్ను పరిమితిని, ఉద్యోగ సంఘాల నాయకులే ఆశ్చర్యపోయేలా ఏకంగా రూ.12.75 లక్షలకు పెంచారు. అంతే కాదు, ప్రతిపాదిత పన్ను రేట్ల ప్రకారం సాధారణ వార్షిక ఆదాయంలో లభించే రూ.12 లక్షల పన్ను రాయితీకి అదనంగా, రూ.75 వేల వరకు ప్రామాణిక తగ్గింపు లభిస్తుంది. దీంతో నెలకు రూ. లక్ష జీతం తీసుకునే మధ్యతరగతి ఉద్యోగులకు, పెద్ద మొత్తాల్లో మిగులుతాయి. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, రూ. 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తికి కొత్త పన్ను విధానంలో రూ.80 వేల మేర, అంటే ప్రస్తుత రేట్ల ప్రకారం చెల్లించాల్సిన పన్నులో నూటికి నూరుశాతం. వార్షిక ఆదాయం రూ.18 లక్షలు ఉన్న వ్యక్తికి రూ. 70 వేలు అంటే ప్రస్తుత రేట్ల ప్రకారం చెల్లించాల్సిన పన్నులో 30 శాతం, వార్షిక ఆదాయం రూ.25 లక్షలు ఉన్న వ్యక్తికి రూ. 1,10,000 అంటే, ప్రస్తుత రేట్ల ప్రకారం చెల్లించాల్సిన పన్నులో 25 శాతం ప్రయోజనం లభిస్తుంది. అంటే, మధ్య తరగతికి మాత్రమే కాదు, ఎగువ మధ్య తరగతికి కూడా ఈ మార్పు మేలు చేస్తుంది.

ఎర్రకుళ్లు విమర్శలు

అయితే, ఎర్రకుళ్లు మేధావులు, మోదీ ఫోబియాతో బాధపడుతున్న రాజకీయ విశ్లేష వక్రీకరులు అంటున్నట్లుగా, ఆరోపిస్తున్నట్లుగా, ఈ నిర్ణయం, నిన్నటి ఢల్లీి ఎన్నికల కోసమో, రేపటి బిహార్‌ ఎన్నికల కోసమో విసిరిన తాయిలం కాదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నట్లుగా, ఈ ఆరోపణ అసత్యం మాత్రమే కాదు, హాస్యాస్పదం. ఒకటి రెండు రాష్ట్రాల్లో, రాజకీయ లబ్ధి, ఎన్నికల్లో గెలుపు కోసం (ఢల్లీి రాష్ట్రం కూడా కాదు కేంద్ర పాలిత ప్రాంతం) దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంటుందా? రాజకీయ ప్రయోజనాల కోసం విదేశీ శక్తులతో చేతులు కలిపే దుష్ట సంస్కృతికి వారసులు, ప్రతినిధులు అలాంటి నిర్ణయం తీసుకుంటారేమో, కానీ, ‘దేశం ముందు… రాజకీయ పక్షం తరువాత’ (నేషన్‌ ఫస్ట్‌, పార్టీ నెక్స్ట్‌) నినాదంతో ముందుకు పోతున్న మోదీ ప్రభుత్వం అలాంటి ఆలోచన కుడా చేయదు. చేయలేదు.

 ఎర్రకుళ్లు మేధావులే ఆరోపిస్తున్నట్లుగా వ్యతిరేక ప్రభావం చూపే నిర్ణయాన్ని,ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా తీసుకుంటుందా? అనే, విచక్షణతో ఆలోచిస్తే, ఈ ఆరోపణలోని డొల్లతనం బయట పడుతుంది. ఆర్థిక మంత్రి వివిధ ఇంటర్వ్యూల్లో వివరించినట్లు, ఈ నిర్ణయం హఠాత్తుగా, ఆషామాషీగా తీసుకున్నది కాదు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే మధ్య తరగతిని సముచిత రీతిలో గౌరవించాలని చేస్తున్న సూచనల పర్యవసానంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. అంతేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పెను మార్పులు దృష్ట్యా కూడా ఆదాయ పన్ను పరిమితిని పెంచడం సముచితం, అవసరమని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

‘లఫ్ఫెర్‌ కర్వ్‌’

అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు, ఎప్పటి నుంచో సరళీకృత పన్ను విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు,1981లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌, ప్రభుత్వ పన్నుల విధానంలో భారీ మార్పులు తెచ్చారు. ప్రభుత్వ పన్నుల భారాన్ని భారీగా తగ్గించారు. ఆ సమయంలో ప్రముఖ ఆర్థికవేత్త, ‘లఫ్ఫెర్‌ కర్వ్‌’ సిద్ధాంత కర్త, ‘ఆర్థర్‌ లఫ్ఫెర్‌’, పన్ను విధానం (టాక్స్‌ పాలసీ) అంటే, ‘కేవలం అంకెలకు సంబంధించినది మాత్రమే కాదు. మానవ ప్రవర్తనతో ముడిపడిన / సంబంధించిన విషయం కూడా’ అన్నారు. అలాగే, ‘పన్నుల కోత ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందనే వాదనను పూర్వపక్షం చేస్తూ, ‘సరైన సమయంలో సరైన పన్ను కోత’ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టదు సరికదా అభివృద్ధి వేగాన్ని పెంచుతుంది’ అన్నారు. ఇక అప్పటి నుంచి, ఆర్థర్‌ లఫ్ఫెర్‌ వాదన ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక విశ్లేషణల్లో ప్రముఖంగా చర్చకు వస్తోంది. మన దేశంలోనూ, ప్రతి సంవత్సరం బడ్జెట్‌ ప్రసంగాలలో, బడ్జెట్‌ చర్చల్లోనూ పన్నుల సంస్కరణల అంశం చర్చకు వస్తూనే వుంది. మరోవంక, పన్ను రాయితీల వలన కొనుగోలుశక్తి పెరగడంతో పాటుగా పొదుపు, పెట్టుబడులు పెరిగి, ఉత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో గత దశాబ్ది కాలంలో పరుగులు తీస్తున్న ప్రగతిని, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులకు భిన్నంగా మన దేశం ముందడుగు వేస్తున్న వాస్తవాన్ని గమనిస్తే, నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌ను కొనసాగింపు బడ్జెట్‌గానే చూడవలసి ఉంటుంది అంటున్నారు. నరేంద్ర మోదీ అన్నట్లుగా, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా సాగుతున్న ప్రస్థానంలో ఈ బడ్జెట్‌ ఒక మైలురాయి… మేలిమలుపు. అందుకే, ఆర్థిక రంగ నిపుణులు నిర్మలమ్మ బడ్జెట్‌ స్వల్ప కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సమతూకంలో మేళవించిన సుస్థిర అభివృద్ధి కరదీపిక’ అంటున్నారు.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE