కొన్ని సమయాలలో భారత న్యాయస్థానాలు, ప్రధానంగా సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయాలను శ్లాఘించకుండా ఉండలేం. ఆ అభిప్రాయాలు జాతి మౌలిక స్వరూపానికి చెందినవి కావచ్చు. సామాజిక స్వరూపానికి సంబంధించి కావచ్చు.ప్రధానంగా రాజకీయ పార్టీలు అధికార కాంక్షతో, ఇంకొన్ని అనివార్యంగా సమాజంలోకి ప్రవేశపెడుతున్న వికృత ధోరణులను నిలదీయడంలో, లేదా నివారించడంలో న్యాయస్థానాలు తమదైన పాత్రను పోషిస్తున్నాయి. రాజకీయ పరుగు పందెంలో స్వయంకృతాపరాధంతో చతికిల పడుతున్న పార్టీలు దొడ్డితోవన మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి ఉచితాలను విచక్షణా రహితంగా ప్రకటిస్తున్నాయి. చాలా ప్రాంతీయ పార్టీలు, జాతీయ రాజకీయ పక్షంగా పేరున్న కాంగ్రెస్ కూడా ఉచితాలతో భారతీయ వ్యవస్థ స్వరూప స్వభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నాయి. అవన్నీ అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థకు గుదిబండలా తయారవుతున్నవే. ఈ విషయంలో చాలామంది పౌరులలో ఆవేదన ఉంది. కానీ బయటకు చెప్పుకోవడానికి, ప్రకటించడానికి వీలు లేని విధంగా వీటి చుట్టూ రాజకీయ, సామాజిక వలలను కట్టి ఉంచారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులకు జరుగుతున్న అన్యాయం దారుణమైనది. అది దేశ పురోభివృద్ధికి కాకుండా, ఆ పురోభివృద్ధిని మందగించేటట్టు చేస్తున్న చర్యలే ఉచితాలన్నీ. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 12న భారత అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు దేశంలో ఒక గొప్ప చర్చకు తావిచ్చాయి.
ఉచిత పథకాలు ప్రకటించి పరాన్నజీవులను సృష్టిస్తున్నామా? ఇది సుప్రీంకోర్టు జాతికి వేసిన ప్రశ్న. దీనికి రాజకీయ పార్టీలు దాదాపు అన్నీ సమాధానం ఇవ్వడం అవసరం. లేదా ధోరణి మార్చుకోవడం ఇంకా అవసరం. ఉచిత పథకాల గురించి సుప్రీంకోర్టు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం దాదాపు ఇది మొదటిసారి. దీనితో రాజకీయ పార్టీలు కొన్ని పోటీలు పడి ప్రకటిస్తున్న ఈ ఉచితాల మీద పునరాలోచన ఆరంభం కావాలి. ఎన్నికలు ప్రకటించగానే రాజకీయ పార్టీల నుంచి ఉచిత హామీలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పద్ధతి సరైనది కాదని, ఈ కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడడం లేదని సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే మరి, ఉచితాలతో మనం పరాన్నజీవులను సృష్టిస్తున్నామా? అని కూడా ప్రశ్నించింది.
ఢిల్లీలో ఇళ్లు లేనివారికి ఆశ్రయం కల్పించా లంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన వ్యాజ్యంతో నిజానికి డొంక కదిలిందనే అనాలి. అందుకు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మహారాష్ట్ర ఎన్నిలకు ముందు అక్కడ వినిపించిన ఓ ఉచిత పథకం గురించి ఉదహరించారు. దాని వల్ల ప్రజలు ఉచితాల మీదనే జీవితం గడిపేయాలని అనుకుంటున్నారని, పని చేయడానికే ఇష్టపడడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిజమే, వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. అంతమాత్రాన వాటి నుంచి దూరంగా జరగడానికో, వాయిదా వేయడానికో ప్రయత్నించడం వ్యవస్థకు పెద్ద చేటు.
పని ఉంటే చేయకుండా ఎవరూ ఉండరని, పని లేకే వలసపోతున్నారని ఈ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన ప్రశాంత భూషణ్ వాదనను న్యాయ మూర్తి దాదాపు కొట్టిపారేశారు. మీకు ఒక కోణం మాత్రమే తెలిసినట్టు ఉంది అని చురక వేయవలసి వచ్చింది. తాను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, ఎన్నికలకు ముందు ఉచితాలు ప్రకటిం చడం వల్ల వ్యవసాయ పనులకు మనుషులు దొరకడం లేదని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ జవాబు ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఇంటికే రేషన్ వస్తుంటే అది కూడా ఉచితంగా వస్తుంటే ప్రజలు ఎందుకు పని చేస్తారని ఆయన సూటిగానే ప్రశ్నించారు. నిరాశ్ర యులకు నీడ కల్పించమని కోరడం, ఉచితాలకూ, పనికీ మధ్య సమతౌల్యం గమనించడం అందరికీ అవసరమని చాలా కీలకమైన అంశాన్ని న్యాయమూర్తి జాతి ముందు పెట్టారు. ఉచిత పథకాల తరువాత, ఇంకొన్ని ఇతర పథకాల వల్ల వ్యవసాయ రంగంలో పనిచేయడానికి కూలీలు దొరకని మాట ఒక వాస్తవం. అది న్యాయమూర్తికి మాత్రమే పరిమితమైన సమస్య కూడా కాదు. దేశంలో ఎందరో రైతులకు సంబంధించినది. ఉచిత పథకాలు, ఇతర పథకాల వల్ల ఒక కూలీకి రోజుకు ఆరువందల రూపాయలు వస్తున్నాయి. ఇంతకు మించి ఇస్తే కూలీలు దొరుకు తారు. కానీ అంత కూలి చెల్లించడం సాధారణ రైతుకు సాధ్యమా? ఇక్కడ పని సంస్కృతి విచ్ఛిన్నం అవుతుండడానికీ, పేద రైతు ఎదుర్కొంటున్న సమస్యకీ మధ్య తలెత్తిన ఘర్షణ గురించి చర్చ జరగవలసి ఉంది. ఒక ఉచిత పథకం, మరొక పేద వర్గాన్ని ఇంకాస్త పేదరికంలో నెట్టివేసే పరిణామం అవాంఛ నీయం కాదా! రైతు కూలీగా మారాడు. కూలి వలసదారునిగా మారుతున్నాడు. ఇదే ఆ పరిణామం.
నిరాశ్రయులను ప్రధాన స్రవంతి సమాజంలో భాగం చేసి, దేశాభివృద్ధికి తోడ్పడేలా చేయడానికి బదులు, ఇన్నిన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మనం ఒక పరాన్నజీవుల వర్గాన్ని తయారు చేయడం లేదా? దురదృష్టవశాత్తు ఎన్నికలకు ముందు ప్రకటించిన ఉచితాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడడం లేదు అని సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా వ్యాఖ్యానించింది.
వలసలు, ఉచితాలు, వీరికి ఆశ్రయం కల్పించడం అనే అంశాలు దేశంలో ఒక విచిత్ర వాతావరణాన్ని సృష్టించాయి. ఇది అన్ని వర్గాల సమస్య మాత్రం కాదు. పేదరికం ఉన్నమాట, నిరుద్యోగం ఉన్నమాట అంగీకరిస్తూనే కొన్ని వాస్తవాలను అంగీకరించాలి. ప్రశాంత భూషణ్ వంటి అర్బన్ నక్సల్ దృష్టి వేరు. ఉచిత రేషన్‌కార్డులు అందించడం దేశ పౌరులకు మాత్రమే ఇచ్చే విధానంగా ఉంటే మంచిదే. కానీ అక్రమ వలసదారు లకు కూడా ఈ సౌకర్యం కల్పించడం చాలామంది అర్బన్ నక్సల్స్ ఉద్దేశం. ఇందుకు మతోన్మాద ముస్లిం రాజకీయ పక్షాలు దోహదం చేస్తున్నాయి. ఉదాహరణకు రొహింగ్యాలకు ఆశ్రయం కల్పించడం. వీరిని ఎప్పుడు దేశం నుంచి పంపివేస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించిన సంగతి వీరికి పట్టదు. కొన్ని రాజకీయ పార్టీల ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థను సంక్షోభం వైపు నెడుతుంటే, అర్బన్ నక్సల్స్ దృష్టి కోణం శాంతిభద్రతలకు, అసలు సార్వభౌమాధికారా నికి సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు ప్రత్యేకతను సంతరించు కున్నాయి. ఉచితాలు పొందుతున్న వారిలో అక్రమ వలసదారులు లేరని ఎవరైనా చెప్పగలరా? వీరికి కావలసినవి వాస్తవాలు కావు. ఉదారవాదం ముసుగులో బుజ్జగింపు ధోరణికి ఊతం ఇవ్వడం. సెక్యులరిజం పేరుతో మెజారిటీ మతస్థుల హక్కులకు భంగం కలిగించడం. వ్యవస్థను సంక్షోభంలో ఉంచడమే.
ఇదంతా నిజమో, కాదో ఉచితాలు, వాటి విశ్వరూపం గురించి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యల తరువాత సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పందన గమనించాలి. దేశంలో నెలకొన్ని ఉన్న దారుణ నిరుద్యోగ పరిస్థితులు, అల్ప వేతనాలతో భారత శ్రామికవర్గం ఉనికి కోసం చేస్తున్న జీవన పోరాటాన్ని గమనించడంలో న్యాయమూర్తి విఫల మయ్యారని బృంద తేల్చిపారేశారు. ఆ అభిప్రాయాలను ఉపసంహరించుకోవలసిందని కోరుతూ ఏకంగా న్యాయమూర్తికి ఆమె బహిరంగలేఖ రాశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతున్న ఆయా వర్గాల మీద న్యాయమూర్తి అభిప్రాయాలతో దురభిప్రాయం ఏర్పడుతుందని కూడా ఆమె అన్నారు. ఎలాంటి వేతనం లేని సాధారణ భారతీయ మహిళ రోజుకు ఏడున్నర గంటల వంతున, వారానికి 50 గంటలు పాటు పడుతున్నారని, అలాంటివారికి కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న రుణ బదిలీ పథకం ఒక వెసులుబాటు అని అన్నారు. కాబట్టి దానిని తప్పు పట్టకూడదని ఆమె అభిప్రాయం. నిజానికి ఈ అంశం న్యాయమూర్తి వ్యాఖ్యల పరిధిలోకి వస్తుందా? నేరుగా బదిలీ అవుతున్న ఆ నగదు ఆమె అవసరాలకే ఉపయోగ పడుతున్నదా? ఇలాంటి విషయాలు కూడా కారత్ చర్చించి ఉంటే బాగుండేది. వాస్తవాలను గమనించక పోవడం, లేదా చర్చకు రాకుండా చేయడం గురించే ఇక్కడ ప్రశ్న. కొద్దిగా ఆలస్యమైనా ఒక మంచి అంశాన్ని న్యాయమూర్తి తెర మీదకు తెచ్చారు. పని సంస్కృతి నాశనం కావడానికి ఉచితాలు దోహదం చేస్తుండడమే ఆ అంశం. పేదరికం నిర్మూలన పేరుతో పరాన్నజీవుల వర్గాన్ని సృష్టించుకోవడం గురించి ఆలోచించమన్నారు న్యాయమూర్తి.
– జాగృతి డెస్క్