మహా కుంభమేళాలో విషాదం వెనుక కుట్రను పాలకపక్షం పసిగట్టిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఫిబ్రవరి 3న లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషాదంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత దుర్ఘటనకు బాధ్యులెవరో బైటపడుతుందని, అంతటి ఘాతుకానికి పాల్పడినవారు సిగ్గుతో తలదించు కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 35 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళా వద్ద పవిత్ర స్నానమాచరించారని చెప్పారు. కుంభమేళా లేదా సనాతన ధర్మం అన్న మాట విన్న ప్రతిసారీ విపక్షాలు డీలాపడిపోతుంటాయని ఆయన ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం పట్ల జరిగే ఎలాంటి అవమానాన్ని భారత్ సహించదని స్పష్టం చేశారు.
జనవరి 29న తెల్లవారుజామున ప్రయాగరాజ్ కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొలి స్నానం అఖాడాలకు చెందిన సాధువులు చేస్తారు. ఆ క్రమంలో వారు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం కేటాయించారు. అయితే పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న భక్తజనంలో కొందరు బారికేడ్లపై నుంచి దూకి ఆ మార్గం ద్వారా వెళ్లి స్నానాలు ఆచరించేందుకు తొందరపడ్డారు. దీంతో బారికేడ్లు విరిగిపడటంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. కొందరు కిందపడిపోగా వారిపై నుంచి మరికొందరు భక్తులు తొక్కుకుంటూ వెళ్లారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. ప్రధాని నరేంద్రమోదీ తక్షణం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు యూపీ సీఎం ప్రకటించారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జస్టిస్ హర్షకుమార్, మాజీ డీజీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీకే సింగ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని సీఎం చెప్పారు.
– జాగృతి డెస్క్