-హైమా భార్గవ్
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘దేవదేవం భజే, దివ్య ప్రభావం’’… భక్తి రసం జాలువారు తున్న ఎం.ఎస్. అమ్మ పాటను పరవశంగా వింటూ, ‘‘ ఆహా!’’ అన్నాడు జగన్నాథం. తను కూడా అప్రయత్నంగా గొంతు కలిపాడు.
మల్లె మొగ్గల్ని దండగా కడుతున్న మహాలక్ష్మి పాట వింటూ, భర్త వైపు దృష్టి సారించింది. సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఆనందంగా పాడుకుంటున్న జగన్నాథాన్ని చూసి, ఎప్పటిలాగే ఆశ్చర్యపోయింది. ‘శ్రవణానందం’ అనే మాట ఇలాంటప్పుడే అర్థమౌతుంది…అనుకుంది. పూలదండ కట్టాక కాఫీ కలిపేందుకు వంటింటి వైపు నడిచింది.
‘‘శ్రీనివాస మంగాపురం వెళ్దాం. అయిదు గంటలకు బయల్దేరుదాం’’… అన్నాడు జగన్నాథం. ‘‘అలాగే’’.. అంటూ ఆ ప్రయత్నాలు మొదలెట్టింది మహాలక్ష్మి.
* * *
దేవుడి దర్శనం అయ్యాక ఇద్దరూ ఆలయం ఆవరణలోని బల్ల మీద కూర్చున్నారు. చుట్టూ ఉన్న చెట్ల నుంచి చల్లటి గాలి వీస్తోంది. ‘‘ఆలయాలు అలాగే ఉన్నాయి. మిగిలినవన్నీ చాలావరకు మారిపోయాయి. ఆ వేంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా సంప్రదాయానికి, సంప్రదాయ కళలకు ఆదరణ లభిస్తోంది. అదే సంతోషం’’… అన్నాడు జగన్నాథం. మహాలక్ష్మి నిట్టూర్చింది. వృద్ధాప్యం వచ్చేసరికి గతంలో జీవించడం మొదలవుతుందేమో అనుకుంది.
జగన్నాథం స్వర్ణయుగంలాంటి గతంలో విహరించసాగాడు. చదువుకుంటూనే, తరతరాలుగా వస్తున్న వంశ వృత్తి హరికథా గానాన్ని తను నేర్చుకున్నాడు. ‘హరికథలు చెప్పేవారు సాహిత్యంలో, పురాణ గ్రంథ పఠనంలో, సంగీతంలో విశేషమైన కృషి చేయాలి. గాత్రంలో మాధుర్యం ఉండాలి. చిరతలు వాయిస్తూ ఇతర వాద్య కళాకారులతో కలిసి పాడటం అభ్యాసం చేయాలి. వేదిక మీద నిలబడి నప్పుడు భయపడకుండా ఉండాలి. జనరంజకంగా చెప్పగలగాలి. మధ్య మధ్య ఆసక్తికరమైన పిట్ట కథలను హాస్యస్ఫోరకంగా చెప్పగలగాలి. వాటిలో ఔచిత్యం ఉండాలి. గంట సేపు, లేక గంటంబావు సేపు హరికథ చెప్పవలసి వస్తే ప్రారంభం నుండి చివర వరకు అన్ని పదాలు, పద్యాలు, గానం, రాగం, తాళం… అన్నీ గుర్తు పెట్టుకోవాలి. మంచి హరి కథకుడిగా కీర్తి, ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే సాధన తప్ప మరో మార్గం లేదు. కష్ట పడితేనే ఏ కళైనా వచ్చేది’’… అంటూ నాన్న చెప్పడమే కాదు. తన చేత చేయించారు. శ్రీరామనవమి రోజు తను ‘సీతా కళ్యాణం’ హరికథ చెప్పాడు. మొదటిసారి నాన్న అభినందన, ఆశీర్వాదం అందుకున్న ఆ రోజును జీవితంలో మర్చిపోలేడు.
ఒకప్పుడు ఆలయానికి వచ్చిన భక్తులు ఓపికగా హరికథలు వినేవారు. ఇప్పుడు ఎవరికీ ఆసక్తి, సమయం ఉండటం లేదు. తిరుపతిలోని మ్యూజిక్ కాలేజీలో హరికథ విభాగంలో తనకు లెక్చరర్‌గా ఉద్యోగం దొరికింది కాబట్టి తనకు భుక్తి కోసం వెతుక్కునే అవస్థ తప్పింది. ఇప్పుడు టీటీడీ వంటి సంస్థలు, కొన్ని ఆలయాల్లో పర్వదినాల్లో తప్ప హరికథలను ప్రోత్సహించే వారు ఎవరున్నారు? వినేవారూ కొందరే. టీవీ… పత్రికలను, నాటకాలను, సంప్రదాయ కళలను దారుణంగా దెబ్బ తీసింది. నట్టింట బ్రహ్మ రాక్షసిగా మారి అష్టమ వ్యసనంగా తయారైంది. తెలుగు భాష రాజ్యం చేసిన తెలుగు సీమలో ఇప్పుడు తెలుగు భాష అనాథలా అయ్యింది. తెలుగులో మాట్లాడే వారు గణనీయంగా తగ్గిపోతున్నారు. ‘మాకొద్దీతెల్లదొరతనము’ అన్న నేలలో ఎక్కువగా ఆంగ్ల భాష వినబడుతోంది. అదొక గొప్ప విషయంగా అనుకుంటూ తెలుగు వాళ్లే మాతృభాషను చిన్నచూపు చూడటం ఎంత బాధాకరం!తెలుగు రాయడం, చదవడం చాలావరకు తగ్గింది. ఎంత విషాదకరం!.
బతుకు తెరువు చూపలేని హరికథను ఎవరు వృత్తిగా స్వీకరిస్తారు ? తమ కొడుకు వంశీ కృష్ణ ఉద్యోగం వచ్చిందని అమెరికాకు వెళ్తుంటే నిస్సహా యంగా సరే అనడం తప్ప ఏమీ చేయలేక పోయాడు. పదేళ్ల తర్వాత వచ్చేస్తానని వంశీ అన్నాడు. తనకు నమ్మకం లేదు. తమ కూతురు హైదరాబాద్‌లో ఉంది. అదే ఓదార్పు.
మహాలక్ష్మి భర్త వైపు చూసింది. గత వైభవాన్ని తలుచుకుంటూ ఉంటాడని తెలుసు. కనుక మౌనంగా ఉండిపోయింది. పెళ్లయిన తర్వాత తన భర్త రామాలయంలో చెప్పిన ‘సీతారామ కల్యాణం’ … హరికథను విన్నప్పుడు తనకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.
ఎంతో కళగా ఉండే ముఖానికి నుదుటి మీద తీర్చిన ఎర్ర రంగు నామం ఎంతగానో నప్పింది. పట్టు వస్త్రాలు పవిత్రతకు చిహ్నంగా ఉన్నాయి. మెడలో పూలదండ వేసుకుని మధురంగా ఆలపిస్తుంటే విస్మయంతో చూడటం తన వంతైంది.
‘‘సీతాకల్యాణ వైభోగమే’’… అని మధురంగా పాడుతుంటే, ఆ మాధుర్యానికి తన కళ్లు నీటి కొలనులే అయ్యేవి. నిజంగా ‘సీతారాముల కల్యాణం’.. కళ్ల ముందు జరుగుతున్నట్లు ఆ వర్ణన, పాటలు ఉండేవి. ‘గంగావతరణం’ గురించి చెబుతుంటే మాటల తీరులో, పాటల హోరులో గంగానది దివి నుండి భువికి వచ్చినట్లే అనిపించేది. గొప్ప తెలుగు కవుల కవిత్వాన్ని కూడా సందర్భోచితంగా వినిపించేవారు. హాస్య వచనాలతో శ్రోతల మనసులకు గిలిగింతలు పెట్టేవారు. ఓ అద్భుత ప్రపంచాన్ని కనుల ముందు ఆవిష్కరించే వారు. ‘మోహినీ భస్మాసుర’ హరికథ చెప్పేటపుడు భస్మాసురుడు శివుడి తలమీద చెయ్యి పెట్టబోతుంటే, శివుడు అతనికి అందకుండా వేగంగా వెళ్తుంటే భస్మాసురుడు ‘‘ఆగవయ్య ఆగవయ్య శివ శివా!’’ అంటూ శివుడి వెంటబడ తాడు. ఆ మాటలు చిరు హాస్యంతో ఉండేవి. ఇలా ఒకటా రెండా ! ఎన్నో మాటలు! పాటలు!. తను ప్రేమగా ‘‘చాలా బాగా పాడారు’’…. అంటే నవ్వేసి, ‘‘భార్య మెచ్చుకుంటే ప్రపంచాన్ని జయించినట్లే’’… అనేవారు. ఇంత మంచి స్నేహితుడితో జీవితాన్ని పంచుకోవడం తన అదృష్టం. ‘‘ఇంతకాలం ఈ వృత్తిలో మునిగిపోయి, ఇప్పుడు ఖాళీగా ఉండవలసిన పరిస్థితులు ఎదురయ్యే సరికి పాపం ఏమీ తోచడం లేదు’’… సానుభూతితో భర్త వైపు చూసింది మహాలక్ష్మి.
‘‘ఇక వెళ్దామా’’ ?అంటున్న భర్తతో ‘‘వెళ్దాం’’…. అంటూ అతన్ని అనుసరించింది మహాలక్ష్మి.
* * *
ఆదివారం రాత్రి అమెరికా నుండి కొడుకు వీడియో కాల్ చేస్తే జగన్నాథం, మహాలక్ష్మి అతనితో మాట్లాడసాగారు.
‘‘విశేషాలేంటి నాన్నా?’’… అన్నాడు వంశీ కృష్ణ.
‘‘ఏముంటాయిరా? అంతా మామూలే. రొటీన్’’… అన్నాడు.
‘‘అబ్బా ! అందరం రొటీన్ గా బతుకుతాం. అది కాదు. ఏమైనా కబుర్లు చెప్పు. అమ్మ చూడు. ఎన్ని కబుర్లు చెబుతుందో’’ అన్నాడు వంశీ చిరు కోపంతో.
‘‘చూడు నాన్నా ! నేను స్టేజ్ మీద మాత్రమే హరికథలు చెప్పగలను. ఫోన్ లో అంతగా మాట్లాడను. కానీ మీ అమ్మ ఫోన్‌లో హరికథలు బాగా చెబుతుంది. అదీ సంగతి’’… అన్నాడు జగన్నాథం .
వంశీ పెద్దగా నవ్వాడు. మహాలక్ష్మికి నవ్వొచ్చినా, కోపంగా భర్త వైపు చూసింది. జగన్నాథం భయాన్ని నటించి ‘‘లక్షమ్మా ! అలా కౌశికుడిలా చూడకు. తాటాకు లాంటి వాడిని. మాడి మసై పోగలను’’… అన్నాడు. మహాలక్ష్మి నవ్వేసింది.
‘‘నాన్నా! ఈ పదేళ్లలో మేము ఇండియాకు వచ్చామే కానీ, మీరు అమెరికాకు రాలేదు. ఏదో ఒకటి చెబుతుంటారు. ఈ సారి మీరు రావాలి. నీ బర్త్ డే రోజు మీరు మాతో ఉండాలి. మీకు టికెట్స్ బుక్ చేస్తున్నాను. ఏ రోజు చెయ్యాలో చెప్పండి’’… అన్నాడు.
జగన్నాథం కాదనలేక ప్రయాణానికి మంచిరోజు చూసుకుని, వంశీకి చెప్పాడు.
‘‘థాంక్స్ నాన్నా. టికెట్స్ బుక్ చేసి మీకు చెబుతాను’’… అన్నాడు వంశీ. కొడుకుతో కాసేపు మాట్లాడింది మహాలక్ష్మి.
* * *
న్యూయార్క్‌లోని ఆ చిన్న అపార్ట్‌మెంట్ జగన్నాథానికి, మహాలక్ష్మికి పూర్తిగా నచ్చలేదు. పైకి ఆ మాట అంటే కొడుకు బాధ పడతాడని చెప్పలేదు. వాళ్లు వెళ్లిన రోజే వంశీ చెప్పాడు. అమెరికాలో ఫ్లోరింగ్ చెక్కతో చేస్తారని, బాత్‌రూమ్‌లో ఇండియాలో లాగా కాళ్లు కడుక్కునే వీలు లేదని, కాళ్లు కడుక్కోవాలంటే బాత్ టబ్‌లోకి దిగి, కడుక్కోవాలని, వేరే మార్గం లేదని….
‘‘అంటే ప్రతిసారిబాత్ టబ్‌లోకి దిగాల్సిందేనా?’’ దిగులుగా అడిగింది మహాలక్ష్మి.
‘‘అవునమ్మా. ఇది చెక్క ఫ్లోరింగ్ కదా. తడి తగల కూడదు’’… అన్నాడు వంశీ.
బాత్రూమ్‌లోకి వెళ్లిన ప్రతిసారి కాళ్లు కడుక్కునే అలవాటున్న జగన్నాథం, మహాలక్ష్మి బాత్ టబ్‌లోకి దిగి, మళ్లీ బైటి కొచ్చి అలసి పోయారు. ‘‘ఏం పిచ్చి ఫ్లోరింగో ఏమిటో ! కాళ్లు కడుక్కునే వీల్లేకుండా’’… అంటూ మనసులోనే విసుక్కుంది.
శని, ఆది వారాలు అమెరికాలోని టూరిస్ట్ ప్రదేశాలు చూసేటప్పుడు, మనవడితో, మనవరాలితో కబుర్లు చెప్పేటప్పుడు బాగున్నా, నెల రోజులకే జగన్నాథానికి, మహాలక్ష్మికి భారత దేశంలో ఉన్న సుఖం ఇంకెక్కడా లేదని అనిపించింది.
‘‘చాలా మంది తెలుగు వాళ్లు అమెరికాలో ఇళ్లు కట్టుకుంటున్నారు కదా. మీరు కూడా కట్టు కుంటారా?’’ అని అడిగింది మహాలక్ష్మి.
‘‘అమెరికాలో స్థిర పడితే ఇల్లు కట్టుకోవచ్చు. మేము ఇండియాకు వచ్చేస్తాము కదా. అందుకే కట్టుకోలేదు.’’… అన్నాడు వంశీ.
ఆ మాటలకు జగన్నాథం, మహాలక్ష్మి కుదుట బడ్డారు. చక్కటి తెలుగు మాట్లాడుతున్న మనవలను చూస్తుంటే సంతోషంగా ఉన్నా, మన సంస్కృతికి దూరంగా పెరుగుతున్నారనే బాధ జగన్నాథంలో ఎక్కువైంది.
‘‘అన్నిటికీ అనవసరంగా బాధ పడకండి. మన దేశంలో పెరిగే పిల్లలు కూడా అమెరికన్స్‌లా ఉన్నారు. సంప్రదాయం, సంస్కృతి పోతున్నాయి. ఇవన్నీ ఆలోచించకండి’’… ఓదార్పుగా అంది మహాలక్ష్మి.
* * *
తండ్రి జన్మదినం శనివారం రావడంతో అమ్మా, నాన్నలను, భార్యా పిల్లలను వేంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లాడు వంశీకృష్ణ. ఆ రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉండటం వల్ల ఆ ఊళ్లోనే ఆ రాత్రి బస చేయాలని అనుకున్నారు.
* * *
కాస్త ముందుగా వచ్చి, కుటుంబ సభ్యులను ఆడిటోరియంలో మొదటి వరసలో కూర్చోబెట్టి, స్నేహితులతో మాట్లాడసాగాడు వంశీ. ఆడిటోరియం జనంతో నిండి పోయింది. ముందుగా చిన్న పిల్లల కూచిపూడి నాట్యం ఓ అరగంట సేపు జరిగింది. ‘‘ఇప్పుడు ‘శ్రీనివాస కల్యాణం’ హరికథా కార్యక్రమం జరుగుతుంది… అన్న అనౌన్స్‌మెంట్ వినబడింది.
జగన్నాథం, మహాలక్ష్మి కుతూహలంతో, ఆసక్తితో చూడసాగారు.
పట్టు వస్త్రాలతో, నుదుట ఎర్రటి నామంతో, మెడలో దండతో, చేతిలో చిరతలతో గణపతి ప్రార్థనతో హరికథను మొదలు పెట్టాడు భాగవతార్. మధురమైన కంఠస్వరంతో, గానంతో, ఛలోక్తులతో తిరుమల శ్రీనివాసుని మహాత్మ్యాన్ని చెబుతుంటే, ఆ కథ అందరినీ అలరిస్తోంది.
జగన్నాథం, మహాలక్ష్మి ఒకరి నొకరు చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, ఆనందం…‘‘మన వంశీయే కదా’’… నమ్మలేనట్లు అన్నాడు జగన్నాథ•ం. ‘‘అవును మనవాడే’’… అంది మహాలక్ష్మి. ‘‘తాతయ్యా! నాన్న’’… అంటున్నారు మనవలు.
‘‘శ్రీనివాసుడి మీద పద్మావతీ దేవి చెలికత్తెలు రాళ్లు విసిరారు. అప్పుడు పట పట పటమని రాళ్ల వర్షము పడెను మేని పైన’’… ఒకటికి రెండు సార్లు పాడిన ఆ చరణాలకు తగిన వయోలిన్ సహకారాన్ని అందించాడు… వాద్యకారుడు.
తన పైన మల్లెల వాన కురిసినట్లు పరవశించాడు జగన్నాథం. తన కొడుకు, తన రక్తం, తన సంప్రదాయాన్ని మరచిపోకుండా… జగన్నాథం కళ్లలో ఆనంద జలధి తరంగాలను, గంగావతరణాన్ని చూసింది మహాలక్ష్మి. సంప్రదాయం జీవనదే’’…. అనుకుంది. ప్రవాసాంధ్రులకు సంస్కృతి మీద ఉన్న గౌరవానికి ముచ్చట పడింది.
‘‘నాన్నగారి జన్మదినం ఈ రోజు. ఆయనకు ఏ కానుక ఇవ్వాలో, ఎలా సంతోష పెట్టాలో నాకు అర్థం కాలేదు. హరికథ నాన్నగారికి ఆరో ప్రాణం. అందుకే హరికథను ఆయన ముందు ప్రదర్శించాను. ఈ రోజు నేను చెప్పిన హరికథ నాన్నగారు ఒకప్పుడు చెప్పిందే. దాన్నే అనుసరించాను. కాలానికి తగ్గట్లు స్వల్పంగా మార్చాను’’… సంతోషంగా చెప్పాడు వంశీ.
‘‘ప్రముఖ హరికథా కళాకారులు జగన్నాథం గారిని ఈనాడు సన్మానించు కోగలగడం మన అదృష్టం. వారిని వేదిక మీదకురావలసిందిగా కోరుతున్నాము…’’ సాంస్కృతిక సంస్థ కార్యదర్శి సవినయంగా నమస్కరిస్తూ జగన్నాథం గారిని ఆహ్వానించాడు.
ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య జగన్నాథం వేదిక వైపు… కాదు వెన్నెల వెలుగు వైపు నడిచాడు.
వచ్చేవారం కథ..
వినిపించే రాగాలు
– కె.కె. భాగ్యశ్రీ