76వ గణతంత్ర దినోత్సవానికి దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ జనవరి 26 ఆదివారం ప్రధాన వేదికగా అవతరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వేడుకకు ముఖ్య అతిథి అయిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో అనాదిగా వస్తున్న సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, విదేశీ రాయబారులు, వివిధ రంగాల ప్రముఖులతో కూడిన వేలాది మంది సమక్షంలో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము సైన్యం నుంచి 105 మి.మీ.ల లైట్ ఫీల్డ్ గన్స్‌తో గౌరవ వందన స్వీకరించారు. ఆ తర్వాత కనులపండువగా జరిగిన శకటాల ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈసారి కవాతుకు స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. గణతంత్ర దినోత్సవ కవాతు చరిత్రలో తొలిసారి అన్నట్టుగా 100 మంది మహిళలు సంప్రదాయ సంగీత వాయిద్యాలతో కవాతుకు నాంది పలికారు.300 మంది కళాకారులతో కూడిన బృందం సారే జహాసే అచ్చా గీతాన్ని ఆలపించింది.
భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు కవాతు జరుగుతున్న కర్తవ్యపథ్‌పై పూల వర్షం కురిపించాయి. ఇండోనేసియా జాతీయ సాయుధ బలగానికి చెందిన 300 మందికి పైగా సభ్యులు కవాతులో పాల్గొన్నారు. భారత్ అమ్ముల పొదిలోని ట్యాంక్`టీ90, బీఎంపీ`2 శరత్, బ్రహ్మోస్, నాగ క్షిపణులు, అగ్నిబాణ్, పినాక రాకెట్ లాంఛర్లు, ఆకాశ్, చేతక్, బజరంగ్, ఐరావత్ పేరిట ఆయుధాలు దేశ శక్తి, సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. స్వశక్త్ ఔర్ సురక్షిత్ భారత్ ఇతివృత్తంగా త్రివిధ దళాలు ఉమ్మడిగా ప్రదర్శించిన శకటం అత్యంత ఆసక్తిదాయకంగా ముందుకు సాగింది. దేశం నలుమూలాల నుంచి వచ్చిన 5,000 మంది కళాకారులు 11 నిముషాల పాటు సాగిన జయతి జయ మహాభారతం అనే పాటకు కళాప్రదర్శన ఇచ్చారు. డెవిల్స్ డౌన్, ట్యాంక్‌టాప్, బుల్లెట్ సెల్యూట్, డబుల్ జిమ్మీ పేరిట మోటార్ సైకిళ్లపై డేర్‌డెవిల్స్ సాహసోపేతమైన విన్యాసాలు చేశారు. ఏఎన్`31, రాఫెల్, డోర్నియర్ 228, సుఖోయ్`30, సీ`17, జాగ్వార్, సీ`295, సీ`190 విమానాలు, ఎంఐ`హెలికాప్టర్లను కలుపుకొని ఏడు హెలికాప్టర్లు, 22 ఫైటర్ జెట్‌లు, 11 రవాణా విమానాలు గగనతలంలో చేసిన విన్యాసాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చరాల్లో ముంచెత్తాయి. శకటాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 31 శకటాలు రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు తొమ్మిది కి.మీ.ల మేర మార్గంలో కవాతు సాగించాయి. వేర్వేరు రాష్ట్రాల నుంచి మహిళా సాధికారతను ప్రతిబింబించే 26 శకటాలు కవాతులో పాల్గొన్నాయి. కేంద్రీయ రిజర్వు పోలీసు బలగం నుంచి 148 మంది మహిళలు, అలాగే భారతీయ వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలెట్లు కవాతుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భద్రతకు సంబంధించి 70 వేల మంది పోలీసులు, 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలతో పాటుగా 2,500కు పైగా సీసీటీవీ కెమెరాలు, రూఫ్‌టాప్ సైపర్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్‌లను రంగంలోకి దించారు.
ప్రధాని రాజస్థానీ తలపాగా
కవాతుకు మునుపు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ దగ్గర్లో జాతీయ యుద్ధస్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించారు. ఎరుపు, పసుపు రంగుల్లో రాజస్థానీ శైలిలో తయారు చేసిన తలపాగాను ధరించిన ప్రధాని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని పదవిని చేపట్టిన నాటి నుంచి ప్రతి యేటా గణతంత్ర దినం, స్వాతంత్య్ర దినం వేడుకలను పురస్కరించుకొని దేశంలో వేర్వేరు ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయలను ప్రతిబింబించే తలపాగాలను ధరించడాన్ని నరేంద్ర మోదీ ఒక ఆనవాయితీగా చేసుకున్నారు.