ఇ‌స్రో మహాద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం.. షార్‌లో వందో మిషన్‌  ‌విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ‌ధవన్‌ అం‌తరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికపై నుంచి జనవరి 29 వ తేదీ ఉదయం 6:23 గంటలకు ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌15 ‌రాకెట్‌ ‌ప్రయోగం  ఘన విజయం సాధించింది. 27 గంటల 30నిమిషాల కౌంట్‌డౌన్‌ ‌ముగియగానే రెండోతరం నావిగేషన్‌ ఉపగ్రహం ఎన్‌వీఎస్‌-02 (‌నావిక్‌-02)‌ను తీసుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన రాకెట్‌.. ‌మూడు దశలను నిరాటంకంగా పూర్తిచేసుకుని 19.12 నిమిషాల్లోనే దానిని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. మిషన్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నుంచి రాకెట్‌ ‌గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌వి.నారాయణన్‌.. ‌జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌15 ‌రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఇదే మొదటి ప్రయోగం. శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో ఉన్న 1,250 కిలోల ఇంధనాన్ని దశలవారీగా మండిస్తూ, భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి దాన్ని ప్రవేశపెడుతారు.

ఎన్‌వీఎస్‌-02.. ఇ‌స్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. ఇది కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహాల్లో రెండోది. దీరి బరువు 2250 కిలోలు. 10 ఏళ్ల పాటు పనిచేసేలా ఈ ఉప గ్రహాన్ని ఇస్రో రూపొందించింది. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌, ‌సేవలు, వ్యవసాయంలో సాంకేతికత, మొబైల్‌ ‌లోకేషన్‌ ఆధారిత సేవలకు ఉపయోగపడుతుంది. దేశీయ నావిగేషన్‌ ‌వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికే అందుబాటులో ఉండగా… దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్‌ ‌సిరీస్‌ ‌కొత్త ఉపగ్రహాలు దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్‌-‌బ్యాండ్‌, ‌కె-బ్యాండ్‌, ‌కేయూ-బ్యాండ్‌ ‌లాంటి ఉపకరణాలను అమర్చారు. రెండోతరం నావిగేషన్‌ ‌సిరీస్‌ ఉపగ్రహాలైన నావిక్‌-01, ‌నావిక్‌-02‌లో ఎల్‌-1, ఎల్‌-5, ఎస్‌-‌బ్యాండ్‌ ‌సిగ్నల్‌ ‌వ్యవస్థను అమర్చారు. ఎల్‌-1‌లో ప్రజలకు ఉపయోపడే సివిలియన్‌ ‌ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ ఉం‌టుంది. భూ, జల, వాయుమార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత కచ్చితత్వంతో, 50 నానో సెకన్ల రియల్‌ ‌టైమ్‌తో చూపించడం ఈ కొత్తతరం ఉపగ్రహాల ప్రత్యేకత. భారతదేశ సరిహద్దుల ఆవల 1,500 కిలోమీటర్ల పరిధి వరకూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇక సమయం, స్థానాన్ని అత్యంత కచ్చితంగా తెలిపే రుబీడియం అణు గడియారాన్ని నావిక్‌-02‌లో అమర్చారు.

నాలుగు విఫలం.. 13 సఫలం

జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇస్రో ఇప్పటి వరకు 17 ప్రయోగాలు చేసింది. అందులో 13 విజయవంతం కాగా, కేవలం నాలుగు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. 2025 జనవరి 29న నిర్వహిం చిన జీఎస్‌ఎల్వీ ఎఫ్‌15 ఈ ‌సిరీస్‌లో 17వ ప్రయోగం. ఇది వందో ప్రయోగం కావడంతో శాస్త్ర వేత్తలు కొంత ఒత్తిడికిలోనయ్యారు. ఎందుకంటే 2010 ఏప్రిల్‌ 15‌న స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ‌దశతో చేసిన జీఎస్‌ఎల్వీ 23 ప్రయోగం విఫలమైంది. అదే సంవత్సరం డిసెంబర్‌ 25‌న జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-6 ‌ప్రయోగంలో రష్యన్‌ ‌క్రయోజనిక్‌ ‌దశతో చేసినా విఫలమైంది. ఈ రాకెట్‌ ‌నింగివైపునకు వెళ్లేటప్పుడు క్రయోజనిక్‌ ‌దశ కింది భాగంలో ఉన్న స్టడ్‌ ‌విరిగిపోవడంతో మిషన్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నుంచే బ్లాస్ట్ ‌చేశారు. తర్వాత 2014 వరకూ జీఎస్‌ఎల్వీ ప్రయోగాల జోలికి ఇస్రో వెళ్లలేదు. క్రయోజనిక్‌ ఇం‌ధనం లిక్విడ్‌ ఆక్సిడైజర్‌, ‌లిక్విడ్‌ ‌హైడ్రోజన్‌ ‌కలిపి మైనస్‌ 220 ‌డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే సంక్లిష్టమైన క్రయోజనిక్‌ ‌టెక్నాలజీని అందుకోవడానికి తొలి నాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నేడు సగర్వంగా నిలబడింది.

2 నెలల్లో నిసార్‌ ‌ప్రయోగం

నావిక్‌-02 ‌ప్రయోగం విజయానంతరం షార్‌లోని మీడియా సెంటర్‌లో సహచర శాస్త్రవేత్తలతో కలిసి నారాయణన్‌ ‌మీడియాతో మాట్లాడుతూ,నావిక్‌-02 ‌పదేళ్లపాటు సేవలంది స్తుందని వివరించారు. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్‌ ఉపగ్రహాన్ని మరో రెండు నెలల్లో జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌16 ‌రాకెట్‌ ‌ద్వారా ప్రయోగిస్తామని నారాయణన్‌ ‌వెల్లడించారు. కాగా, శ్రీహరికోట నుంచి వందో ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తాయి.

100 ప్రయోగాల పరిణామక్రమం

వంద మిషన్ల మైలురాయిని చేరుకోవడానికి ఇస్రోకు దాదాపు ఐదు దశాబ్దాలు (46 ఏళ్లు) పట్టింది. 1979లో షార్‌లో తొలి ప్రయోగాన్ని చేపట్టి నప్పుడు ఇస్రో వద్ద ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు. రాకెట్‌ ‌టెక్నాలజీ కోసం రష్యా వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ఇస్రో వంద మిషన్లు పూర్తిచేసుకుంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. అత్యాధునిక టెక్నాలజీని ఇస్రో అందిపుచ్చుకుంది. సొంతంగా రాకెట్లు, ఇంజన్లు నిర్మించుకుంటోంది. ఈ క్రమంలో భారతీయజనతాపార్టీ అధ్యరంలో ఎన్డీఏ కూ•మి అధికారానికి వచ్చినప్పటి (2014) నుంచి సాంకేతిక అభివృద్ధికి ప్రాధాన్యతను పెంచింది. ఇస్రోకు ఏటా బడ్జెట్‌ను పెంచింది. దీంతో అప్పటి నుంచి ఇస్రో దూకుడు పెంచింది. కేవలం బడ్జెట్‌ ‌పెంచుకోవడం వరకే పరిమితం కాకుండా, అతి తక్కువ ఖర్చుతో, స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్లు, రాకెట్ల తయారీ చేపట్టింది. ఒకప్పుడు క్రయోజనిక్‌ ఇం‌జిన్లను రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇస్రో, ఇప్పుడు వాటిని స్వయంగా తయారుచేసుకుంది.ఇలా ఖర్చులు తగ్గించుకుని, ఎక్కువ సక్సెస్‌ ‌రేటు సాధించడం వల్ల స్పేస్‌ ‌మార్కెట్లో చిన్న చిన్న దేశాలకు ఆశాదీపంలా కనిపిస్తోంది.

అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాల కన్నా తక్కువ ధరకే విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతోంది. అంతరిక్ష రంగంలో నిపుణులైన మానవ వనరుల లభ్యత కూడా ఇస్రో విజయపరంపరకు దోహదం చేస్తోంది.

ఇస్రో సాధిస్తున్న ఒక్కో విజయం మరో భారీ విజయానికి బాటలు వేస్తోంది. చంద్రయాన్‌, ‌మంగళయాన్‌, ఆదిత్య-ఎల్‌1 ‌వంటి మిషన్లు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో వీనస్‌ ఆర్బిట్‌ ‌మిషన్‌, ‌గగనయాన్‌, ‌భారత అంతరిక్ష స్టేషన్‌, ‌చంద్రుడి మీదకు మనుషుల్ని పంపడం వంటి లక్ష్యాలు సాధించేందుకు వడివడిగా అడుగులేస్తోంది.

ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో మరో వంద ప్రయోగాలు నిర్వహించి 200 మార్కు అందుకోగలమని ఇస్రో చైర్మన్‌ ‌నారాయణన్‌ ‌విశ్వాసం వ్యక్తం చేశారు. సైకిల్‌, ఎడ్లబండిపై రాకెట్‌ ‌విడి భాగాలను తరలించిన కాలం నుంచి.. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను డాకింగ్‌ ‌చేసే స్థాయికి ఇస్రో ఎదిగిందన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌, ‌రోవర్‌ను దింపి చరిత్ర సృష్టించిన ఇస్రో.. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్‌1 ‌మిషన్‌ను కూడా చేపట్టింది. త్వరలోనే చంద్రుడిపైకి మన వ్యోమగామిని పంపే ప్రయత్నాలు చేస్తోంది.

షార్‌లో మూడో లాంచింగ్‌ ‌ప్యాడ్‌

‌శ్రీహరికోటను రాకెట్‌ ‌కేంద్రంగా గుర్తించిన మొదటి రోజుల్లో ఇక్కడ సౌండింగ్‌ ‌రాకెట్లు ప్రయోగించేవారు. ఆ తర్వాత చిన్నపాటి ఎల్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వీ రాకెట్లు ప్రయోగించారు. షార్‌లో ఫస్ట్ ‌లాంచ్‌ ‌ప్యాడ్‌ ‌నిర్మించిన తర్వాత 1995 నుంచి 2005 వరకూ ఎన్నో ప్రయోగాలు చేశారు.ఆ తర్వాత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రెండో లాంచ్‌ ‌ప్యాడ్‌ ‌తయారు ఏర్పాటు చేశారు. ఇక్కడే మూడో లాంచ్‌ ‌ప్యాడ్‌ ఏర్పాటుకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇక్కడి నుంచి న్యూ జనరేషన్‌ ‌లాంచింగ్‌ ‌వెహికల్స్‌ను ప్రయోగించాలని యోచిస్తున్నారు.

భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న గగనయాన్‌, ‌భారత్‌ అం‌తరిక్ష కేంద్రం వంటి ప్రయోగాలకు ఇదే కీలకం కానుంది. ఈ న్యూ జనరేషన్‌ ‌లాంచింగ్‌ ‌వెహికిల్‌తో 20 నుంచి 25 టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. షార్‌తో పాటుగా తమిళనాడులోని కులశేఖర పట్నంలో కూడా మరో రాకెట్‌ ‌లాంచింగ్‌ ‌ప్యాడ్‌ ‌నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇస్రో షార్‌లో చేపట్టిన ఈ వందో ప్రయోగం విజయవంతమైతే.. తదుపరి ప్రయోగాలకు ఇది మరింత ఉపయోగకారిగా ఉంటుంది. అంటే, మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల వంటి కొత్త శకానికి ఇస్రో ఈ వందో ప్రయోగంతో తొలి అడుగు వేసినట్లు అవుతుంది.

‌ముఖ్యమైన ప్రయోగాలు

2014 నుండి నుంచి తాజా ప్రయోగం (2025) వరకు ఇస్రో అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది.

2014 మంగళయాన్‌ : 2014‌లో, ఇస్రో మంగళయాన్‌ను విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలో ప్రవేశపెట్టింది, దీని ద్వారా భారత్‌ అం‌గారక గ్రహాన్ని చేరిన తొలి ఆసియా దేశంగా నిలిచింది.

2017 పీఎస్‌ఎల్‌- ‌సి37 ద్వారా 104 ఉపగ్రహాల ప్రయోగం: 2017 ఫిబ్రవరిలో, ఇస్రో ఒకే రాకెట్‌ ‌ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది, ఇది ప్రపంచ రికార్డు.

2019 చంద్రయాన్‌-2: 2019‌లో, ఇస్రో చంద్రయాన్‌-2 ‌మిషన్‌ను ప్రారంభించింది, ఇది చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌, ‌రోవర్‌ను పంపే ప్రయత్నం. ల్యాండర్‌ ‌సాఫల్యం పొందకపోయినా, ఆర్బిటర్‌ ‌విజయవంతంగా పనిచేస్తోంది.

2020 – నూతన అంతరిక్ష విధానం: 2020లో, భారత ప్రభుత్వం ప్రైవేట్‌ ‌రంగానికి అంతరిక్ష కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కల్పించింది, ఇది ఇస్రోకు ప్రైవేట్‌ ‌సంస్థలతో సహకరించేందుకు దారితీసింది.

2023 – చంద్రయాన్‌-3: 2023‌లో, ఇస్రో చంద్రయాన్‌-3 ‌మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించింది, ఇది చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ‌ల్యాండింగ్‌ ‌సాధించింది.

ఆదిత్య-ఎల్‌ 1: 2023‌లో, ఇస్రో సూర్యుని అధ్యయనం కోసం ఆదిత్య-1 మిషన్‌ను ప్రారం భించింది, ఇది సూర్యుని బయటి వలయాలను పరిశీలించేందుకు రూపొందించారు.

2025 గగనయాన్‌: 2025‌లో, ఇస్రో గగనయాన్‌ ‌మిషన్‌ను ప్రారంభిం చేందుకు సిద్ధమవుతోంది, ఇది భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం. ఈ విజయాలు, ఇస్రో సాంకేతిక నైపుణ్యాన్ని, భారత ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబిం బిస్తున్నాయి.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE