దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రపంచంలోని అగశ్రేణి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం ప్రదర్శించాయి. మన దేశం నుంచి వెళ్లిన రాష్ట్రాలు అద్భుతమైన విజయం సాధించాయి. సమష్టిగా సుమారు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో మహారాష్ట్ర ఏకంగా రూ.15.70 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణ రూ.1.78 లక్షల పెట్టుబడుల కోసం అవగాహన కుదుర్చుకోగా, ఆంధప్రదేశ్‌ ‌బ్రాండ్‌ ‌ప్రమోషన్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ సదస్సులో భారత్‌ ‌ప్రదర్శన చాలా అద్భుతమన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌. ‌ప్రధాని మోదీ నేతృత్వంలో సాధిస్తున్న ప్రగతిని దావోస్‌ ‌వేదికగా చాటి చెప్పారు.

స్విట్జర్లాండ్‌లోని చిన్న పట్టణం దావోస్‌. ‌ప్రతి ఏటా ప్రపంచ రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, సామాజికవేత్తలు ఇక్కడికి వస్తారు. వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరమ్‌ ఏటా జనవరి చివరి వారంలో నిర్వహించే సమావేశాల్లో వేర్వేరు ప్రభుత్వాల అధినేతలు పాల్గొని పెట్టుబడిదారుల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంటారు. ఈసారి జనవరి 20 నుంచి 24 వరకు కొలాబ్రేషన్‌ ‌ఫర్‌ ‌ది ఇంటిలిజెన్స్ ఏజ్‌ అనే థీమ్‌తో వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరమ్‌ 55‌వ వార్షిక సమావేశాలు జరిగాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌, ‌జర్మన్‌ ‌ఛాన్సలర్‌ ఒలాఫ్‌ ‌స్కోల్జ్, ‌వర్చువల్‌గా ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 60మందికి పైగా అగశ్రేణి రాజకీయ నాయకులు సదస్సుకు తరలి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది ప్రముఖులు సమావేశాల్లో పాల్గొన్నారు. 2025లో ప్రపంచం ఎదుర్కోబోయే ఆర్థిక సవాళ్ల కోసం అవసరమైన సూత్రాలు, విధానాలు, భాగస్వామ్యాలను రూపొందించడానికి, నమ్మకాన్ని పునర్నిర్మించడానికి కలిసి పని చేయడం దావోస్‌ ‌ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ ‌లక్ష్యం అని పేర్కొన్నారు నిర్వాహకులు. భారత్‌ ‌నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఐదుగురు కేంద్రమంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఆం‌ధప్రదేశ్‌ ‌సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్‌, ‌సీఆర్‌ ‌పాటిల్‌, ‌రామ్‌మోహన్‌ ‌నాయుడు, చిరాగ్‌ ‌పాశ్వాన్‌, ‌జయంత్‌ ‌చౌదరి, ఏపీ మంత్రి నారా లోకేష్‌, ‌తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, 100 మందికి పైగా భారతీయ సంస్థల సీఈఓలు ఉన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, ఆం‌ధప్రదేశ్‌, ‌కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాలు దావోస్‌కు వచ్చాయి.

మన తెలుగు రాష్ట్రాలు దావోస్‌లో సందడి చేశాయి. చంద్రబాబు ‘‘బ్రాండ్‌ ఏపీ’’, రేవంత్‌ ‌రెడ్డి ‘‘రైజింగ్‌ ‌తెలంగాణ’’లతో మెరిపించారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వరుసగా సమావేశాలు, చర్చలు, వ్యక్తిగత భేటీలు జరిగాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు, సీఈవోలు, ముఖ్య అధికారులు, నాయకు లతో అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్‌ ‌సమావేశమయ్యారు. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న సానుకూలతను వివరించారు.

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

దావోస్‌లో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా, ఈసారి నాలుగు రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రంలో 49,500కి పైగా ఉద్యోగావ కాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న 20 కంపెనీల్లో సన్‌ ‌పెట్రో కెమికల్స్, అమెజాన్‌ ‌వెబ్‌ ‌సర్వీసెస్‌, ‌కంట్రోల్‌ ఎస్‌, ‌జేఎస్‌డబ్ల్యూ, స్కైరూట్‌ ఏరో స్పేస్‌, ‌మేఘా ఇంజినీరింగ్‌, ‌హెచ్‌సీఎల్‌, ‌విప్రో, ఇన్ఫోసిస్‌, ‌యునిలీవర్‌, ‌టిల్మాన్‌ ‌గ్లోబల్‌ ‌హోల్డింగ్స్, ఉర్సా క్లస్టర్స్, ‌బ్లాక్‌ ‌స్టోన్‌, అక్షత్‌ ‌గ్రీన్‌ ‌టెక్‌, ఎక్లాట్‌ ‌హెల్త్ ‌సొల్యూషన్స్, ‌సుహానా మసాలా, అజిలిటి, సిఫీ టెక్నాలజిస్‌, ‌ఫీనిక్స్, ‌రాంకీ గ్రూప్‌ ఉన్నాయి.

దావోస్‌ ‌సమ్మిట్‌లో హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ ‌సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం, యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ, ఆర్‌ఆర్‌ఆర్‌ ‌నిర్మాణం, మెట్రో విస్తరణ ప్రణాళికలు ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్‌ 2050 ‌విజన్‌’ ‌పెట్టుబడి దారులను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహ రించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతోపాటు ఇటీవల ప్రకటించిన క్లీన్‌ అం‌డ్‌ ‌గ్రీన్‌ ‌పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి నట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. అన్ని రంగాలకు అనుకూల వాతావరణమున్న హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

ఆంధప్రదేశ్‌ ‌బ్రాండ్‌ ‌ప్రచారానికి ప్రాధాన్యత

పెట్టుబడుల వేటకు దావోస్‌ ‌వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఏపీ బ్రాండ్‌ ‌ప్రపంచానికి తెలిసేలా ప్రయత్నాలు చేశారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అవకాశాలను వారికి వివరించారు. కొత్త పారిశ్రామిక విధానాల్లోని సౌలభ్యాలను ప్రస్తావించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలు.. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాల గురించి ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఆంధప్రదేశ్‌కు వచ్చి ఇక్కడి అనుకూల పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

మహారాష్ట్రకు పెట్టుబడుల వెల్లువ

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 15.70 లక్షల కోట్ల విలువైన 61 అవగాహన ఒప్పందాల కోసం సంతకం చేసింది . మొత్తం పెట్టుబడిలో 98% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌, ‌ఫడ్నవీస్‌

‌దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్‌ ‌డైలాగ్‌ ‌సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఎనర్జీ, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్-ఏఐ, ‌రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం, వాటిపై రాష్ట్రాల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై వారంతా చర్చించారు.

ఈసారి కర్ణాటక గైర్హాజరు

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రతి ఏటా వెళ్లే రాష్ట్రాల్లో కర్ణాటక ముందుంటుంది. అంతర్జాతీయ కార్పొరేట్‌ ‌సంస్థలకు నెలవైన కర్ణాటక ప్రతి ఏటా కనీసం రూ.50 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులను సాధించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఈసారి కర్ణాటక దావోస్‌ ‌సదస్సుకు వెళ్లక పోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే దావోస్‌ ఆర్థిక సదస్సు కంటే తమకు ఫిబ్రవరి 11న ప్రారంభించే ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశమే కీలకమని ఆ రాష్ట్ర వాణిజ్య శాఖ స్పష్టం చేసింది.

‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE