ఓ ‌మామూలు మనిషి నాగా సాధువు కావడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కుంభమేళా సమయంలో ఆసక్తి కలిగిన వారు నాగ సాధువులుగా మారడానికి దీక్ష చేపడుతుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా వద్ద కూడా అనేకమంది నాగా సాధువులుగా దీక్ష తీసుకొని కనిపించారు. నాగా సాధువులుగా మారడానికి సామాన్యులు చేసుకునే దరఖాస్తులను మూడు స్థాయుల్లో పరిశీలిస్తారు. ఇదే విషయమై నిరంజన్‌ అఖాడా మహంత్‌ ‌రవీంద్ర పూరి మాట్లాడుతూ మొత్తం 13 అఖాడాల్లో ఏడు శైవ అఖాడాలని వాటిలో ఆరు అఖాడాలు నాగా సాధువు దీక్షను అందిస్తాయని తెలిపారు. దరఖాస్తుల ద్వారా ఎంపికైనవారికి నిరంజని, ఆనంద్‌, ‌మహానిర్వాణి, అటల్‌, ‌జునా, ఆవాహన్‌ అఖాడాల్లో నాగా సాధువు దీక్షను సమకూరుస్తారు. అగ్ని అఖాడాలో కేవలం బ్రహ్మచారులు మాత్రమే ఉంటారు. అక్కడ నాగా సాధువు దీక్ష వసతి ఉండదు. మొదటి దశలో 300 నుంచి 400 మంది అపేక్షితులకు నిరంజని అఖాడాలో నాగా సన్యాసులుగా దీక్షను ఒసంగడం జరుగుతుందని మహంత్‌ ‌రవీంద్ర పూరి తెలిపారు. ఆది గురువు శంకరాచార్యులవారు సన్యాసి అఖాడాల్లో నాగ సాధువులను తీర్చిదిద్దే సంప్రదాయానికి నాంది పలికారని జునా అఖాడాకు చెందిన హరిగిరిమహరాజ్‌ ‌చెప్పారు. అయితే జునా అఖాడాలో దరఖాస్తుదారులు నాగా సాధువు దీక్షను చేపట్టడానికి కావలసినంత స్థలం లేదని తెలిపారు. అందుకని వారు పలు దశల్లో నాగా సాధుదీక్షను చేపడతారు. అయినప్పటికీ దీక్ష చేపట్టడానికి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మహానిర్వాణి అఖాడా మహంత్‌ ‌యమునపురి మహారాజ్‌ ‌మాట్లాడుతూ తమ అఖాడాలో 300 నుంచి 350 మందికి దీక్షను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

సనాతన ధర్మం కోసం సర్వం త్యజించాలని ఆకాంక్షించేవారు మాత్రమే నాగా సాధువు కాగలరని అఖాడా పరిషత్‌ అధ్యక్షులు మహంత్‌ ‌రవీంద్ర పూరి తెలిపారు. నమోదు పక్రియ మొదలైందని, చీటీలు జారీ చేశామని, దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయని ఆవాహన్‌ అఖాడాకు చెందిన ఒకానొక మహామండలేశ్వర్‌ ‌చెప్పారు. ఎవరైతే నిర్దేశిత అర్హతలను కలిగి ఉంటారో వారికి మాత్రమే నాగ సాధువు దీక్షను అందిస్తారు. ఈ సన్యాసులు దీనికి సంబంధించిన క్రతువులు అంటే శిరోముండనం, సొంత పిండదానంను గంగా నదీ తీరాన నిర్వహిస్తారని, అనంతరం పారిమార్థిక ప్రపంచంతో తమకెలాంటి సంబంధం లేదని వారు ప్రకటిస్తారని ఆయన తెలిపారు. దీక్ష చేపట్టినవారు మౌని అమావాస్యనాడు అమృత్‌ ‌స్నాన్‌ ‌చేయడంతో నాగ సాధువుగా అవతరించే పక్రియ సంపూర్ణమౌతుంది. అంతకుమునుపు అర్హులైనవారు ఒక ధార్మిక పతాకం నీడన దిగంబరంగా నిలబడి ఉండగా ఆచార్య మహామండలేశ్వర్‌ ‌వారు నాగా సాధువులుగా మారడానికి ఉపకరించే పక్రియను చేపడతారు. అఖాడాకు సంబంధించిన సభాపతి అఖాడా నియమ నిబంధనలను వారికి తెలియపరుస్తారు.  దీక్ష చేపట్టినవారంతా సదరు నియమ నిబంధనలను పాటిస్తామనే ప్రతినబూనుతారు. ఈ పక్రియ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరిని అమృత్‌ ‌స్నాన్‌కు పంపిస్తారు. అయితే దరఖాస్తు చేసుకున్నవారందరూ నాగా సాధువులు కాలేరని, దరఖాస్తులను పరిశీలించేటప్పుడు వారిలో చాలా మంది అనర్హులుగా తేలుతారని మరో అఖాడాకు చెందిన మహంత్‌ ‌తెలిపారు. మూడు దశల్లో జరిగే దరఖాస్తుల పక్రియ ఆరు నెలల క్రితమే మొదలైందని చెప్పారు. అఖాడాకు చెందిన థానపతి అభ్యర్థుల నేపథ్యం, కార్యకలాపాల గురించి ఆరా తీస్తారు. అనంతరం ఆచార్య మహామండలేశ్వర్‌కు ఒక నివేదికను అందిస్తారని తెలిపారు. నివేదికను అందుకున్న అనంతరం మరోసారి పరిశీలించాల్సిందిగా అఖాడాకు చెందిన పంచాలను ఆచార్య మహామండలేశ్వర్‌ ‌కోరుతారు. అభ్యర్థుల సమగ్ర పరిశీలన తర్వాత మాత్రమే వారిని నాగా సాధువులుగా మార్చే పక్రియ మొదలౌతుంది. ప్రస్తుత కుంభమేళాలో 8,000 మంది నాగా సాధు దీక్షను చేపట్టారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE