భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

చుట్టూ గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది. ఎంతో మంది సైనికులు ఆశీనులై ఉండగా.. అమర వీరుల పరాక్రమాలకు గుర్తుగా ఇచ్చే ‘మహావీర చక్ర, పరమ వీర చక్ర’ అవార్డుల ప్రదానం జరుగుతోంది. అవార్డ్ ‌స్వీకరించడానికి భారతిని వేదిక పైకి పిలవగానే వేదిక ఎదురుగా ఆశీనులైనవారు, వేదికపై ఆశీనులై ఉన్న ఆఫీసర్స్ అం‌తా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు.

లేత రంగు చీరకట్టుతో నుదుట స్టిక్కర్‌ ‌బొట్టుతో నిండా ఇరవై ఆరేళ్లు కూడా నిండని యువతి కుర్చీ లోంచి లేచి హుందాగా, గర్వంగా చిరునవ్వుతో నడుచుకుంటూ వేదిక పైకి వెళ్తుంటే.. అమరవీరుల త్యాగాలను పొగుడుతూ, అవార్డ్ ‌ప్రదాన కార్యక్రమాన్ని చూడటానికి ఆమె పుట్టింట్లో టీవీ ముందు తల్లిదండ్రులతో పాటు, దూరపు బంధువు దమయంతి కూడా కూర్చుని ఉంది.

ఆమె మెల్లగా గొంతు సవరించుకుని, భారతి తల్లి లీలావతితో.. ‘దీనికి భర్త పోయాడన్న స్పృహ అసలుందా..? ఏమీ జరగనట్టే.. నవ్వుతూ పోతోంది. మొగుడుపోయి కొన్నాళ్లు కూడా కాలేదు. ఉత్తప్పుడు కాకపోయినా, ఇలాంటి చోటైనా కాస్త బాధ పడాలి కదా! లేకుంటే జనం ఏమనుకుంటారు? దీనికి మొగుడంటే ప్రేమ లేదనో! లెక్క లేదనో అనుకోరా..?’ అంది.

ఆవిడ మాటలకు లీలావతి వస్తున్న కన్నీటిని అదిమి పెట్టుకోలేక కళ్లు మూసుకుంది. అయినా సరే పొంగి పొరలే ప్రవాహాన్ని ఆపేందుకు కట్టిన ఆనకట్ట లాకులలోంచి వరద నీరు చిమ్మినట్టు, మూసిన ఆమె కనురెప్పల చివర్నించి కన్నీటి చుక్కలు టపటపా రాలి పడుతుంటే చూసిన దమయంతికది చాలనిపించింది.. ఆమె అహం చల్లార్చుకోటానికి..

‘‘ఎవరు మాత్రం ఊహించగలం వదినా ఇలా జరుగుతుందని..’’ అని అంది లీలావతి.

‘‘నేను ముందే చెప్పానుగా.. ఈ పెళ్లి వద్దు.. జరగరానిది జరిగితే బాధ పడేది మీరేనని! భారతి జీవితం మోడువారి పోవాలని రాసి పెట్టి ఉండబట్టే, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు మీకు వచ్చాయి. పోనీ అయిందేదో అయింది జరగబోయేదాని గురించి ఆలోచించాలి కదా! ఏదో పెద్ద మనసు చేసుకుని ‘మన బంధువు ఒకాయన రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, మన భారతినిచ్చి చేద్దామ’ని నేను అనగానే, అది నన్ను కొట్టినంత పని చేయబోయింది. అయినా మీరాపలేదు. మీ ఖర్మ ఎవరేం చెయ్య గలరు?’’ తన మాట విననందుకు ఇలా జరిగింది చూడు.. అన్నట్టు అంది దమయంతి. నిజమే.. ఆమె భారతి నిశ్చితార్థ జరిగే రోజున ఈ పెళ్లి వద్దనే చెప్పింది.

భారతి మంచి కోసం కాకపోయినా.. వంక పెట్టడానికి నోటి దురదతో దమయంతి అన్న మాటలు గుర్తుకొచ్చాయి లీలావతికి.

‘‘ఏంటీ.. మీ కూతురికి ఆ ఆర్మీ సంబంధం చేస్తున్నారా?వాళ్లు మా తమ్ముడి కూతుర్ని కూడా అడిగారు. కానీ మేమే ఒప్పుకోలేదు. రేపెప్పుడైనా యుద్ధం వస్తేనో.. జరగరానిది జరిగితేనో.. పిల్లలపై ప్రేమున్నవాళ్లెవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? పోనీ కట్న కానుకలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా.. అంటే అదీ కాదాయె.. కావల్సినంత ఉందిగా.. ఇలాంటి సంబంధాలను డబ్బు లేనోళ్లో.. పెళ్లిళ్లు కుదరకపోతేనో.. ఏదొక వంక ఉంటేనో చెయ్యాలి కానీ.. ఏది ఏమైనా మీ పిల్లకు మీరు అన్యాయం చేస్తున్నారు’’ చేతులు చిత్రంగా తిప్పేసుకుంటూ, కింది పెదిమ మాటిమాటికి విరుస్తూ అంది దమయంతి

‘‘మేము కూడా ఆ విధంగా భయపడ్డ మాట నిజమే కానీ మా భారతి.. పెళ్లి చూపులప్పుడు అతని ఫ్యామిలీని చూసి, వాళ్లందరితోనూ మాట్లాడిన తర్వాత ‘చేసుకుంటే ఈ పెళ్లే చేసుకుంటాను, బతికితే అలాంటి కుటుంబంతోనే బతకాలి, చస్తే అంత గొప్పింటి కోడలిగానే చావాలి’ అంది. ఇక భయపడడానికేమీ లేదని..మేమూ ఒప్పుకున్నాము’’ అంది లీలావతి.

‘‘సరే.. మీ పిల్లా మీ ఇష్టం.. దాని జీవితాన్ని కాపాడుకున్నా, కడతేర్చుకున్నా.. మీ చేతుల్తోనేగా.. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? మీ ఏడుపు మీరేడవండి.. మా తమ్ముడు కాబట్టి నేను చెప్పినట్టూ విని బిడ్డని గోతిలో పడకుండా కాపాడుకున్నాడు’ తన మాట లెక్క చెయ్యనందుకు అక్కసుగా అంది దమయంతి.

అప్పుడే అక్కడికి వచ్చి ఆమె మాటలు విన్న భారతి అన్న సుభాష్‌.. ‘‘అత్తయ్యా.. మేము పిలవగానే నిశ్చితార్థానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.. మీరు ఇలాంటి అశుభాలు మాట్లాడకుండా.. భోంచేసి వెళితే మరీమరీ కృతజ్ఞతలు..’’ అంటూ కోపంగా రెండు చేతులూ జోడిస్తే.. అతనిని వారించింది లీలావతి.

అన్నీ గుర్తు తెచ్చుకున్న లీలావతి పైట చెంగు నోటికడ్డం పెట్టుకుని లేచి లోనికి వెళ్లబోయి, అల్లుడు పోయినప్పుడు తను కూతుర్ని పట్టుకుని ఏడుస్తుంటే, కూతురు భారతి అన్న మాట గుర్త్తుకొచ్చి, మళ్లా మర బొమ్మలా సోఫాలో కూర్చుండి పోయింది. ‘అమ్మా.. స్వరాజ్‌ ‌పోయినందుకు బాధ ఉంది కానీ అంతకన్నా ఎక్కువ గర్వంగా ఉంది. ప్రతి వాళ్ల దగ్గరా ‘నా కూతురి బతుకు అన్యాయమైపోయింది’ అంటూ కన్నీళ్లు కార్చి, అతని వీర మరణాన్ని అవమాన పరిస్తే… నేను చచ్చినంత ఒట్టే’ అన్న కూతురి మాటలు మననం చేసుకుని టీవీ వైపు చూస్తూ..

దమయంతి ఇంకేదో మాట్లాడబోతుంటే.. ‘ఉష్‌..’ అం‌టూ తన రెండు పెదవులపైనా చూపుడు వేలు పెట్టి చూపించింది.

‘‘భలే మనుషులే మీరు.. ఈ కొంపలో చావు కూడా పండుగే అనుకుంటా.. చచ్చినాడి పేరు మీద ఏవో బహుమానాలిస్తుంటే..అది సంతోషంగా తీసు కోవడమూ.. మీరు చంకలు గుద్దుకుంటూ సినిమా చూస్తున్నట్టు చూడడం విడ్డూరంగా ఉంది’’ అంటూ.. అందరి వంకా కొరకొరా చూసి, ఇక తాను చూడాలనుకున్న దుఃఖం ఆ ఇంట్లో కనిపించదులే అనుకుంటూ సోఫాలోంచి లేచి వెళ్లబోయి టీవీ వైపు చూసి ఆగింది.

అవార్డ్ ‌ప్రదానం జరిగాక, సైనిక వందనం స్వీకరించిన భారతిని మీడియావాళ్లు ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్లతో భారతి అంటున్న మాటలు వింటూ మళ్లీ కూర్చుండిపోయింది.

‘ఇంత చిన్న వయస్సులో భర్తను పోగొట్టుకున్నారు కదా.. ఒంటరివారైనందుకు మీకు బాధ లేదా? మీ ముఖంలో విషాద ఛాయలు కనిపించడం లేదు.. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నారు’ అని ఓ జర్నలిస్ట్ ‌ప్రశ్నకు భారతి నోరు విప్పింది.

అతి స్పష్టంగా శ్రావ్యంగా ఉన్న ఆమె గొంతు నుండి వెలువడే మాటలు వింటూ.. అక్కడ వేదిక వద్దనున్న వారు కూడా బొమ్మల్లా చెవులప్పగించి కన్నార్పకుండా చూస్తుంటే.. ఆమె వాగ్ధాటి సాగిపోతోంది.

‘స్వరాజ్‌ అమరులయ్యారనే మాట వినగానే నా ప్రాణాన్ని వదిలేయాలన్నంత బాధ కలిగిన మాట వాస్తవం, కానీ ఆయన దేశ సరిహద్దులలో కావలికి వెళుతూ.. ఒక విషయం చెప్పారు.

‘ఇప్పటికీ భారతీయులందరికి గుండె దడ పుట్టిస్తున్న పందొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన కార్గిల్‌ ‌యుద్ధంలో విజయం సాధించాక తోటి సైనికుని కాపాడబోతూ ఓ పాకిస్తాన్‌ ‌సైనికుడు వెనుక నుండి పేల్చిన తుపాకీ గుండుకు వీర మరణం పొందిన కెఫ్టెన్‌ ‌విక్రమ్‌ ‌బాత్రా గారి నేతృత్వంలో పదమూడవ బెటాలియన్లో మా నాన్న కూడా పని చేశారు.

ఆ యుద్ధంలో మా నాన్న వీర మరణం పొందకముందే, మేజర్‌ ‌పద్మ పాణీగారు వారి నాన్నగార్కి రాసినట్టుగానే మా నాన్న కూడా అమ్మకు ఒక ఉత్తరం రాశారు.. ‘దేశం కోసం నేను పోతే ఇంట్లో ఎవరైనా కన్నీరు పెట్టారంటే నా ఆత్మ శాంతించదు. ధైర్యంగా బతుకుతూ, నా కొడుకుకు ప్రాణం కంటే దేశం గొప్పదనే వాస్తవం అర్థ్ధమయ్యేలా పెంచు’ అని, మా అమ్మ నన్నాలాగే పెంచింది. నువ్వూ మా అమ్మ నుండి అలాంటి విషయాలు నేర్చుకుని,నన్నర్థంచేసుకో’ అని నా నుండి వీడ్కోలు తీసుకునేటప్పుడు మాట తీసుకున్నారు.

అందుకే నా స్వరాజ్‌ ఆత్మశాంతికై నా కంట నీరు రానీయ లేదు. అయినా.. ఒక మామూలు మనిషి మరణిస్తే.. ఏడవాలి. ఎందుకంటే..ఆ మనిషి మరి కనిపించడని, ఆ గొంతు వినిపించదని. కానీ నా భర్త స్వరాజ్‌ ‌లాంటి వీర సైనికుడు మరణించడు. తాను కాపాడిన భూమి భారతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో, ఆయన రూపు మనసంతా నింపుకున్న నా ప్రతి ఆలోచనలలో ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు. భౌతికంగా ఆ రూపు కనిపించక పోవచ్చు.. కానీ ఈ దేశ ప్రజలందరి గుండెలలో ఆయన బొమ్మ ముద్రించుకునే ఉంటుంది.

భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే చొరబాటు దారుల నుండి మన భూమిని కాపాడటానికి రాత్రనకా పగలనకా, ఎముకలు కొరికే చలిలో, సరైన నిద్రా హారాలు కూడా లేకుండా పహారా కాస్తూ, శత్రుమూకలతో పోరాడి చిందించిన ఆయన రక్తం భారతమాత పాదాలను అభిషేకించిన తీరు, భవిష్యత్తులో ప్రతి తల్లీ, పెరిగే తన పిల్లలకు మార్గ దర్శకంగా ఈ యుద్ధవీరుని కథ వినిపిస్తూనే ఉంటుంది. విద్యార్ధులు పాఠ్య పుస్తకాలలో చదువుకుని ఉత్తేజితులౌతారు.

ఆయనతో నేను పంచుకున్న జీవితం రెండు నెలలు మాత్రమే. కానీ ఎన్ని జన్మలైనా ఆయన భార్యగానే జన్మించాలని, ఆయన మార్గంలోనే నడవాలని ఆశ పడుతున్నాను. ‘చిన్న వయస్సు కదా.. మరో పెళ్లి చేసుకుని సుఖంగా సంసార జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉండు’ అని నా బంధువు లంతా సలహా ఇచ్చారు.

అసలైన ఆనందం అంటే ఎందరికి తెలుసు? ఒకే గదిలో ఒకే మంచంపై ఒక్కటిగా ఉంటూ, ఎవరికి వారు వేరు వేరు ఆలోచనలతో ఉండి, ఎవరి కలలు వారు కనడం కాదు.

విడివిడిగా వేరు వేరు లోకాలలో ఉన్నా గాని ఒకే ఆలోచనతో గడపడం.. ఒకే కల కనడం.. అదీ దేశ భద్రత కావడం అసలైన ఆనందకరమైన విషయం. నా అత్తింటి నుండి నేను తెలుసుకున్న గొప్ప విషయం ఇది.

ప్రతి మనిషి ఎప్పటికైనా ఈ లోకాన్ని వదిలి పోవాల్సిందే.. కానీ చాలా మంది చిన్న చిన్న అపార్థాలతోనో.. చిన్న చిన్న సమస్యలతోనో ఆత్మ హత్యలు చేసుకుంటూ విలువైన జీవితాన్ని వృథాగా ముగిస్తున్నారు. కానీ దేశ రక్షణ ఒక్కటే అసలైన సమస్యగా ప్రతి భారతీయుడు భావించాలి. దేశ ప్రజల క్షేమం కోసం పరాయి దేశపు దురాక్రమణ దారులను, వారికి సహాయపడే ఉగ్రవాదులను అణిచి వేసే పోరాటంలో ధైర్యంగా మృత్యువుని ఆహ్వానించడం అన్నది గొప్ప విషయం.

తన మనవడితో కలసి నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన మా అత్తగారి అత్తగారు తొంభై ఏళ్ల లక్ష్మీబాయమ్మ గారు తమ కుటుంబం గురించి నాకు విడమరచి ఇలా చెప్పారు.

‘స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీ గార్కి నిధి సమకూర్చటం కోసం తన ఒంటి మీద ఉన్న కంటె, గాజులు, కడియాలు ఇచ్చేసిన మా అత్తగారైన సుబ్బరాజమ్మ గారు.. నన్ను పిలచి, ‘లక్ష్మీ! దేశ స్వాతంత్య్ర నిధి కోసం నాకు చేతనైన సాయం చేశాను.. మరి నీ వంతుగా దేశం కోసం నువ్వేమిస్తావు’ అని అడిగారు. వెంటనే నేను నా పుట్టింటి నుంచి తెచ్చిన నగలతో పాటు, నా చేతి కున్న నిశ్చితార్థపు ఉంగరం కూడా ఇచ్చేసి, ‘అత్తమ్మా మీరొప్పుకుంటే బారిష్టర్‌ ‌చదవడానికి లండన్‌ ‌వెళ్లిన మీ అబ్బాయిని కూడా ఇచ్చేస్తాను.. పిలిపించండి’ అన్నాను. అప్పుడు నా వయస్సు పదిహేనేళ్లు.

ఆ విధంగా దేశ స్వాతంత్య్రం కోసం నా బంగా రంతో పాటు, బంగారం లాంటి నా భర్తనిచ్చేశాను. బ్రిటీష్‌ ‌వారి తుపాకులకు ఎదురొడ్డి నిలబడిన ఆయన విశాల హృదయానికి జోహారులర్పించాను. ఆ తరువాత వచ్చిన స్వాతంత్య్రం అనుభవించడానికి నా కుటుంబానికీ అర్హత ఉందని భావించాను. అయితే సంతానం లేని నేను ఈ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడ గలిగే ఓ వారసుడిని తయారు చెయ్యడం కోసం నా నలభై ఏళ్ల వయస్సులో ఓ పిల్లాడ్ని దత్తత తీసుకుని సైన్యంలో చేర్పించాను.

దేశ భద్రత కోసం నా కోడలు ఆనంది తన భర్తని యుద్ధానికి ధైర్యంగా పంపించడమే కాకుండా, కార్గిల్‌లో భర్త వీరమరణం చూసి కూడా తన బిడ్డ స్వరాజ్‌ను ఆనందంగా సైన్యంలోకి పంపించిన గొప్ప వీర వనిత’ అని చెప్పి, చివరిగా నన్నొక ప్రశ్న అడిగారు.

‘మరి ఈ దేశం కోసం నువ్వేమి చెయ్యగలవు? నువ్వేమి ఇవ్వగలవు?’ అని. ముందు నాకేం చెప్పాలో తెలియలేదు.

నా చిన్నప్పుడు బడిలో మా మాష్టారు మరియన్‌ ‌గారు ఓ విద్యార్ధి ‘దేశాన్నెందుకు ప్రేమించాలి? దేశం మనకేమిచ్చింది?’ అని అడిగిన ప్రశ్నకు జవాబుగా ‘దేశం నువు బతకడానికి చోటిచ్చింది, భారతీయుడనని చెప్పుకోవడానికి అర్హతనిచ్చింది. ఇంకేమివ్వాలి?’ అని చెప్పిన మాట గుర్తు కొచ్చి, నేనామెకు సమాధానంగా

‘అమ్మమ్మా.. నేను నీ మనవడి బాటలో నడుస్తాను.. నా వృత్తి ఉపాధ్యాయిని కాబట్టి, నా విద్యార్ధులకు దేశ భక్తి పాఠాలుగా చెప్పి, ప్రతి ఒక్కరు ఇంజనీర్లుగానో.. డాక్టర్లుగానో, లాయర్లుగానో ఉండాలని కలలు కనడమే కాదు, మన భారతమాత రక్షణ కోసం మీలో కొందరైనా.. వీర జవాన్లుగా కావాలనే ఆశయంతో ఉండాలని నూరి పోస్తాను. అంతే కాదు అమ్మమ్మా! మీకు వాగ్దానం చేస్తున్నాను.. నా బిడ్డలను కూడా దేశం కోసమే కంటాను’ అని చెప్పాను. వెంటనే ఆమె నా నుదట ముద్దు పెట్టి ఆశీర్వదించారు.

నా కుటుంబంలో మా అందరి నుదుటా.. మా ఆడ బిడ్డతో సహా స్టిక్కర్‌ ‌బొట్లే ఉంటాయి. మేము మా కుంకుమను భారతమాత పాదపూజకు అర్పించేశాం. అయితే.. ఆరోజు నా కుంకుమార్పణ జరిగిన రోజు నేను భయపడ్డాను. ‘ఒంటరిగా ఎలా బ్రతకాలా..’ అని మాత్రం కాదు, పెళ్లిచూపుల నాడు అమ్మమ్మ లక్ష్మీబాయమ్మ గార్కి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోకుండానే స్వరాజ్‌ ‌వెళ్లిపోయినందుకు.

కానీ.. ఈ మధ్యే తెలిసింది. నా కడుపున స్వరాజ్‌ ‌రూపం ఊపిరి పోసుకుంటున్న సంతోషకర మైన నిజం. పుట్టే నా బిడ్డ ఆడైనా, మగైనా దేశ భక్తే ఊపిరిగా, దేశ భద్రతే లక్ష్యంగా బ్రతికేలా తీర్చి దిద్ది, దేశానికి ఇస్తానని.. భారతి అనే నేను మరోసారి అందరి ముందూ వాగ్దానం చేస్తున్నాను’’ అంటూ అపురూపంగా చేత్తో తన గర్భాన్ని తాకి, అదే చేత్తో సెల్యూట్‌ ‌చేస్తున్న భారతిని టీవీలో చూస్తున్న దమయంతి చేతులు కూడా అప్రయత్నంగా నమస్కరించాయి.

– ‌దుద్దుంపూడి అనసూయ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE