ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అం‌తర్జాతీయ మాతృభాషాదినోత్సవానికి ఇది రజతోత్సవం. ప్రపంచంలోని స్థానిక, దేశీయ భాషల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఫిబ్రవరి 21, 2000 నుంచి ఈ దినోత్సవాన్ని అమలు చేస్తోంది. నేటి బాంగ్లాదేశ్‌, ‌నాటి తూర్పు పాకిస్తాన్‌వాసులు బెంగాలీని (బంగ్లాను) తమ మాతృభాషగా గుర్తించాలని చేసిన విన్నపాన్ని ఆ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దాంతో ఫిబ్రవరి 21,1952న ఢాకాలో నిరసన ప్రదర్శన నిర్వహించిన విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఆ ప్రభుత్వం కాల్పులకు తెగబడింది. ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అమరుల స్మృతిగా మాతృభాషా దినోత్సవం ప్రకటించా లని ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి బాంగ్లాదేశ్‌ ‌వినతులను కొనసాగిస్తూనే వచ్చింది. నవంబర్‌ 17,1999‌న పారిస్‌లో జరిగిన యునెస్కో సాధారణ సమావేశంలో మరోసారి ప్రతిపాదించింది. యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది, 2000వ సంవత్సరం నుంచి అమలు చేస్తోంది.

‌ప్రపంచవ్యాప్తంగా భాషా వైవిధ్యాన్ని కాపా డ•డం, స్థానిక భాషలు, సంస్కృతుల పరిరక్షణ,వాటికి ప్రోత్సాహం, మాతృభాషలో విద్యాభివృద్ధికి చర్యలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. అది ఏ మేరకు నెరవేరుతోందనే అంశాన్ని విహంగ వీక్షణంగా విశ్లేషించుకుంటే… ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని, అదే శాస్త్రీయ విధానమని అనేక సంఘాలు (కమిషన్‌లు) చేసిన సూచనలు అమలుపై ఆత్మవిమర్శలు అవసరం. ప్రతి నాగరిక జాతికి మాతృభాష ఉంది. ఆ భాషా జాతులు పరస్పర ఆధారితాలు. జాతి ఉన్నతికి భాష కారణమైతే, భాషకు జాతి వల్ల గుర్తింపు లభిస్తుంది. తెలియని విషయాలను అవగతం చేసేది విద్య. అదీ మాతృభాషలో ఉండడం శాస్త్రీయత. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మాతృభాషను నిర్లక్ష్యం చేయడం జీవ విధ్వంసం కిందికే వస్తుందని భాషావేత్తలు అంటారు. విద్యా విధానంలో మాతృభాషకు అవకాశం లేనప్పుడు సంబంధిత భాషతో పాటు ఆ జాతి సంస్కృతి కూడా అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. ‘మాతృభాష అమ్మ పాల వంటిది. శైశవ దశలో అమ్మపాలలాంటి పుష్టికరమైన ఆహారం లేనట్లే, అభిప్రాయ వ్యక్తీకరణకు మాతృ భాషకు మించిన సాధనం లేదు. ఇతర భాషల్లో ప్రవేశం ఉన్నప్పటికీ, సొంత భాషల్లో మాదిరిగా సంపూర్ణ భావవ్యక్తీకరణ సాధ్యం కాదు’ లాంటివి విశ్లేషణలకు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.

ఒక పరభాషను నేర్చుకోవడానికీ, ప్రాథమిక విద్య దశలోనే దానిని మాతృభాష స్థానంలో బోధనా మాధ్యమంగా ప్రవేశ పెట్టడానికి తేడా ఉంది. జపాన్‌, ‌జర్మనీ, చైనా, కొరియా, కొన్ని ఐరోపా దేశాల్లో బోధన, పాలనా వ్యవహారాలు మాతృభాషలలోనే నిర్వహిస్తూ, ఏదో ఒక విదేశీ భాషను ఒక అంశం (సబ్జెక్టు)గా బోధిస్తారు. అక్కడ సొంతభాష వినియోగం వల్ల ప్రగతికి ప్రతిబంధకాలు ఏర్పడినట్లు దాఖలాలు లేవు. మనదేశంలో, అందునా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలుగు రాష్ట్రాలలో అందుకు భిన్నమైన పరిస్థితి. అక్షరాభ్యాసం నుంచే ఆంగ్లంలో బోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతిని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. ప్రాథమిక విద్య మాతృభాష మాధ్యమంలో సాగాలన్న నూతన విద్యా విధానం నిబంధన చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అసలు అలాంటి ఒక విధానం, నిబంధన ఉందన్న విషయమే తెలియనట్టుగా ఉంది.

విద్య, పాలన, న్యాయస్థానాలు, సమాచార రంగం తదితర అన్ని వ్యవస్థల్లోనూ మాతృభాష వ్యవహార భాషగా ఉండటం సమాజాభివృద్ధికి, భాషా వికాసానికి ఉపకరి స్తుంది. ఇటీవలి కాలంలో న్యాయ స్థానాలు మాతృభాషల్లో తీర్పులు వెలువరించడం శుభ•పరిణామం.

మరోవంక ప్రపంచీకరణ ప్రభావం అమ్మ భాష ఉనికికి అశనిపాతమవుతోంది. ముఖ్యంగా అది తెలుగు భాషా సంస్కృతుల పట్ల తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉద్యోగ, ఉపాధులకు ఆంగ్ల భాషే శరణ్యమన్న భ్రమలో, మానసిక స్థితిలోకి అత్యధికులు వెళుతున్నారు. ఆర్థికాంశాలు, చాలీచాలని సంపాదన లాంటి అంశాలతో నిమిత్తం లేకుండా పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో, కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల్లో చదివించాలన్న ఆరాటం కన్నవారిని పరుగులు తీయిస్తోంది. సంపన్న, ఎగువ మధ్య తరగతుల పిల్లలు ఆంగ్ల మాధ్యమ ప్రైవేటు బడులలో చదువుతుంటే, సగటు (దిగువ) కుటుంబాలు, పేదలు చిన్నారులు తెలుగు మాధ్యమంలోనే ఎందుకు చదవాలనే ప్రశ్న ఇటీవలి కాలంలో ఎదురవు తోంది. అన్ని రకాల విద్యా సంస్థలలో ప్రాథమిక విద్యా మాధ్యమంగా మాతృభాష ఉంటే ఈ ప్రశ్నకు ఆస్కారమే ఉండదు. అదీగాక, తెలుగు మాధ్యమంలో, వీధి బడులలో చదివిన వారిలో నాటి, నేటి తరంలోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత హోదాలు, పదవులు పొందారు, పొందు తున్నారనే అంశం పట్టకపోవడం శోచనీయం.

ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు/అభ్యర్థులు తాము కోరుకుంటే స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు యూజీసీ ఆమోదం తెలిపింది. కానీ ఆంగ్లంపై మోజు కొద్దీ విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఆ అంశాలను సరిగా ఉపయోగించు కోవడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. తరగతి గదులలో తెలుగు మాట్లాడిన చిన్నారులను దండించిన ఉదాహరణలు ఉన్నాయి. మా పిల్లలకు తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం రాదు’ సగర్వంగా చెప్పుకొనే వారికీ కొదవలేదు ఈ పరిస్థితులలో మాతృభాష అస్తిత్వంపై సందేహాలు కలగడం సహజం.

ప్రపంచంలోని ఆరువేల భాషల్లో ఇప్పటికే మూడువేలు ‘మృతు’ లైనట్లు, మరికొన్ని భాషలు ఆ బాటలోనే ఉన్నాయని యునెస్కో పేర్కొంది. తెలుగుభాష కూడా ప్రమాదపు అంచున ఉందని హెచ్చరించింది. పరభాషా పలుకుల ప్రభావంతో తల్లి భాషలో సంభాషించడం, చదవడం, రాయడం పక్రియలు తీసికట్టుగా మారితే నాగరిక భాషలుగా చలామణిలో ఉన్నవీ కాలక్రమంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. యునెస్కో ప్రకారం, ఒక భాషా సమాజంలోని జనసంఖ్యలో ఆ భాషా వ్యవహార్తల, చదువరులు, రాసేవారి సంఖ్య 30 శాతానికి తక్కువగా ఉంటే దానిని మృతభాషగా పరిగణిస్తారు. తెలుగుభాషనే తీసుకుంటే ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని సరిపుచ్చుకుంటున్నా యునెస్కో హెచ్చరిక కొట్టివేయవలసింది కాదు. ఒకప్పుడు తెలుగు భాష జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో, అంతర్జా తీయంగా 15వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం జాతీయంగా 4వ స్థానంలో ఉంది. రెండో స్థానంలో బెంగాలీ, మూడోస్థానంలో మరాఠా• భాషలునట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. భాషా పరిరక్షణ కోసం రెండున్నర దశాబ్దాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నా, యువతరంలో, పిల్లల్లో తెలుగు భాషా వ్యవహారం తగ్గడం భాషావేత్తలు, భాషాభిమానులు, మేధావులలో ఆందోళన కలిగిస్తోంది.

మాతృభాష పరిరక్షణ/ఉద్ధరణ అంటే స్వభాషను ప్రేమించి, పరభాషలను గౌరవిస్తూ, వీలైతే వాటినీ అభ్యసించాలన్న భావమే తప్ప… వాటిని రద్దు చేయాలనో, బహిష్కరించాలనో కాదు. మాతృభాషను ప్రోత్సహించినంత మాత్రాన ఇతర భాషలను కించపరచాలనో, విజ్ఞానాభివృద్ధిని అడ్డగించాలనో కూడా కాదు. అన్ని భాషలు విజ్ఞాన సముపార్జిత కారకాలు. ఆంగ్లం ఒకప్పడు సామాజిక హోదా, మోజు అయితే వర్తమానంలో ‘అనుసంధాన’ భాషగా అవసరం అనడం నిర్వివాదాంశం. రాష్ట్రే తర, దేశేతర వ్యవహారాల్లో అనుసంధాన భాషలు అని వార్యం. మాతృభాష(ల)కు ఇబ్బంది కలగనంత వరకు ఆంగ్లం సహా ఇతర భాషలను ఆదరించవచ్చు. మాతృభాష అస్థిత్వం ప్రశ్నార్థకం కారాదని, వృత్తి, ఉపాధి అవకాశాల కోసం ఆంగ్లం తదితర భాషలను అభ్యసించినా తల్లి భాషను తక్కువ చేసి చూడడం సరికాదన్నది భాషాభిమానుల, భాషావేత్తల, భాషా వాదుల నిశ్చితాభిప్రాయం. పైగా మాతృభాషపై పట్టు ఉన్న వారికి అన్యభాషలేవైనా సులువుగా అబ్బుతా యని భాషాశాస్త్రం నిరూపించింది. ‘మాతృభాష మాధ్యమలో బోధన అన్నం పెట్టదు. ఆంగ్లమే సర్వరోగ నివారిణి’ అనే భ్రమను వీడి అమ్మభాష అమలును కోరే దినోత్సవం కాకుండా, అమ్మభాషను అమలు చేశాం అంటూ వేడుకలులు జరుపుకునే తరుణం రావాలి. కదా? అందుకే అనే భ్రమ నుంచి అందరూ బయటపడాలి.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

 సీనియర్‌ ‌జర్నలిస్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE