దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మహాత్మా గాంధీ హరిద్వార్‌ ‌కుంభమేళాలో రాజకీయ అరంగేట్రం చేశారు. 1915లో శాంతినికేతన్‌లో కొద్దిసేపు గడిపిన తర్వాత అదే ఆయన మొదటి కీలక ప్రజా ప్రదర్శన. దీర్ఘకాలం రచించిన పటిష్ట ప్రణాళికతో నిర్వహించే ఇతర కార్యక్రమాలతో పోలిస్తే, కుంభమేళా ప్రత్యేకంగా నిలుస్తుంది. చాలా కార్యక్రమాల మాదిరిగా దీనిని క్రమబద్ధీక రించడం సాధ్యం కాదు. అయినా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిరాఘాటంగా జరుగుతుంది.

కుంభమేళా 12 సంవత్సరాల కాలచక్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి జ్యోతిష స్థానాలను బట్టి ప్రత్యేకమైన అమరిక ద్వారా ఈ మహోత్సవానికి మార్గనిర్దేశం చేస్తారు. పురాణాల లోని అమృత మథన జ్ఞాపకాలను రేకెత్తించే ఈ గొప్ప సంఘటన నాలుగు పవిత్ర ప్రదేశాలలో తిరుగు తుంది: అవి- గంగ ఒడ్డున హరిద్వార్‌, ‌శిప్రా తీరం ఉజ్జయిని, గోదావరి పుట్టుక స్థానం నాసిక్‌, ‌గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం ప్రయాగ్‌రాజ్‌.

‌ప్రపంచవ్యాప్తంగా ఉన్న సన్యాసుల, హిందువుల పవిత్ర సమాజం కుంభమేళా తాత్వికతతో అనేక కోణాల నుంచి ముడిపడి ఉంది. ఇది లోతైన చారిత్రక, సాంస్కృతిక, నాగరికత, సామాజిక, రాజకీయ ప్రాముఖ్యం కలిగి ఉంది. మతపరమైన, ఆధ్యాత్మిక కోణాలు విస్తృతంగా గుర్తించినప్పటికీ, దీనికి ఇంకొన్ని సహజంగా చేకూరిన కీలక అంశాలు ఉన్నాయి. ఇవి అరుదుగా చర్చకు వస్తాయి. 2025 జనవరి-ఫిబ్రవరిలో మహా కుంభ్‌ ‌ఘనంగా మొదలయింది. కాబట్టి, ఈ పవిత్ర సంగమం గురించి అంతగా చర్చకు రాని అంశాలను, ముఖ్యంగా దాని చారిత్రక, రాజకీయ ఔచిత్యాన్ని లోతుగా పరిశీలిం చడం మరింత ప్రయోజనం కలిగిస్తుంది.

చరిత్రలో కుంభమేళా

కాలానుగుణమైన నాగరికతకు సంబంధించి కుంభమేళా మూలాలను పురాతన కాలం నాటివిగా గుర్తించారు. మౌర్య, గుప్తుల కాలంలో దాని తొలి చారిత్రక జాడలు కనుగొన్నారు. ఆ జాడలు దాదాపు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్నాయి. కాలక్రమేణా, మహా కుంభమేళా మధ్యయుగ యుగంలో ఒక గొప్ప ఘట్టంగా పరిణామం చెందింది, రాజపోషణ, సాంస్కృతిక సంప్రదాయాల అభివృద్ధితో సుసంపన్న మైంది. ముఖ్యంగా దక్షిణాదిలో, చోళ, విజయనగర రాజవంశాలు ఈ పవిత్ర సంగమాన్ని విస్తరించి, మద్దతుగా నిలిచాయి.

వలసరాజ్యాల యుగం కుంభమేళాకు కొత్త కోణాన్ని తెచ్చింది, యూరోపియన్‌ ‌పరిశీలకులు దాని గొప్పతనాన్ని నమోదు చేసి, ప్రత్యేకమైన చారిత్రక దృక్పథాలను అందించారు. తీర్థయాత్ర స్థాయి, వైవిధ్యంతో ఆకర్షితులైన బ్రిటిష్‌ ‌వారు, మహా కుంభ మేళా పరిణామంపై అమూల్యమైన అంతర్దృష్టులను అందించే వివరణాత్మక వ్యాఖ్యలను అందించారు. వారిలో బ్రిటిష్‌ ఉద్యోగి జేమ్స్ ‌ప్రిన్సెప్‌ ఒకరు. 19వ శతాబ్దంలో జరిగిన సంఘటనను నిశితంగా వివరిం చాడు. అక్కడ పాటించే ఆచారాలు, నిర్వహించే సమ్మేళనాలను, సంగమాన్ని నిర్వచించిన సంక్లిష్టమైన సామాజిక-మత గతిశీలతను స్పష్టంగా వివరించాడు.

కుంభమేళాతో సన్నిహిత సంబంధం ఉన్నది ప్రయాగ్వాల్‌ ‌సమాజం. ఇది 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను నిర్మించడంలో, దానిని కొనసా గించడంలో గణనీయమైన పాత్ర పోషించిందని వలసరాజ్యాల పురావస్తు శాఖ పత్రాలు వెల్లడిస్తు న్నాయి. క్రైస్తవ మిషనరీలకు వలస ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని, హిందూ యాత్రికులను ‘‘అజ్ఞాన సహ-మతస్థులు’’గా వారు ఈసడించడాన్ని ప్రయాగ్వాల్‌లు తీక్షణంగా వ్యతిరేకించారు. హిందూ యాత్రికులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి జరిగిన దూకుడు ప్రయత్నాలకు వ్యతిరేకంగా కూడా వారు ప్రచారం చేశారు. తిరుగుబాటు సమయంలో, కల్నల్‌ ‌నీల్‌ ‌ప్రత్యేకంగా కుంభమేళా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని, ప్రయాగ్వాల్‌లు నివసించే ప్రాంతంపై కాల్పులు జరిపాడు. దీనిని చరిత్రకారుడు మాక్లీన్‌ ‘‘అలహాబాద్‌ ‌లోని క్రూరమైన శాంతి’’గా అభివర్ణించాడు.

1857 ఘటనకు సంబంధించిన ప్రణాళికలు మేళా వేళ చర్చించారని చారిత్రక రికార్డులు సూచిస్తు న్నాయి. రాణి లక్ష్మీబాయి ప్రయాగలోని ఒక ప్రయాగ్వాల్‌తో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు సమయంలో కొత్వాలి సమీపంలోని ఒక చర్చిలోని పెద్ద ఇత్తడి గంటను ప్రయాగ్వాల్‌ ‌పగలగొట్టడం ఒక ముఖ్య ఘటన. దీనితోనే అతడిని తరువాత బ్రిటిష్‌ ‌వారు ఉరితీశారు. తరువాత చాలా మంది ప్రయాగ్వాల్‌లను స్వాతంత్య్ర సమర యోధులుగా గుర్తించారు. వారి పేర్లు అధికారిక రికార్డులలో చేర్చారు కూడా. అంతేకాకుండా, ప్రయాగ్‌లోని మాఘ్‌, ‌కుంభమేళాల వద్ద ఉన్న విస్తారమైన సమాజాలు బ్రిటిష్‌ అధికారులను నిరంతరం కలవరపెట్టేవి. ఎందుకంటే ఈ సమావే శాలు సామూహిక తిరుగుబాటును ప్రేరేపించేవి.

నియంత్రణను తిరిగి పొందిన తర్వాత, బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ప్రయాగ్వాల్‌లను తీవ్ర హింసకు గురిచేసింది. కొంతమందిని ఉరితీయగా, తగినన్ని ఆధారాలు లేకపోవడంతో, మరికొందరిని నిరంతరం వేధించారు. గంగా-యమున సంగమం సమీపంలోని కుంభమేళా భూములలో ఎక్కువ భాగాన్ని జప్తు చేసి ప్రభుత్వ కంటోన్మెంట్లలో చేర్చారు. తిరుగుబాటు తర్వాతి సంవత్సరాల్లో, ప్రయాగ్వాల్‌లు, కుంభమేళా యాత్రికులు ప్రతిఘటనను, వారు ఎదుర్కొన్న జాత్యహంకారపూరిత అన్యాయాలను సూచించే జెండాలను మోసుకెళ్లారు. బ్రిటిష్‌ ‌మీడియా నివేదికలు తదుపరి కుంభమేళాలలో ఈ యాత్రికుల సమావేశా లనే శత్రుత్వంతో పోల్చాయి. వారిది ‘అవిశ్వాసం’గా పరిగణించాయి. పాల్గొనేవారిలో కనిపించిన శాశ్వత ప్రతిఘటన స్ఫూర్తిని ప్రధానంగా వర్ణించాయి.

1857 సంగ్రామ నిర్వహణ గురించి మహర్షి దయానంద సరస్వతి జీవిత చరిత్రలు వాటిలో ఆయన కీలక పాత్రను స్పష్టంగా వివరిస్తాయి. 1855లో జరిగిన హరిద్వార్‌ ‌కుంభమేళా నేపథ్యంలో ముఖ్యమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పిండిదాస్‌ ‌జ్ఞాని రాసిన ‘‘1857కే స్వాతంత్య్ర సంగ్రామ్‌ ‌మే స్వరాజ్య ప్రవర్తక్‌ ‌మహర్షి దయానంద సరస్వతి కా క్రియాత్మక యోగదాన్‌’’ అనే రచన, కుంభమేళా సమయంలో దయానంద తిరుగుబాటు నాయకులను ఎలా కలిశారు? వారితో తిరుగుబాటుకు ఎలా ప్రణా ళికలు రచించారో వివరణాత్మకంగా అందిస్తుంది. ఈ కారణంగా, 1857 స్వాతంత్య్ర సమరానికి ప్రధాన రూపశిల్పిగా మహర్షి దయానంద సరస్వతిని భావిస్తారు.

కుంభమేళాతో ముడిపడి ఉన్న మరో ముఖ్యమైన, పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోని సంఘటన భారత దేశంలో మహాత్మా గాంధీ రాజకీయ అరంగేట్రం. జనవరి 1915లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేశారు. శాంతినికేతన్‌ను సందర్శించిన తర్వాత ప్రజా బాహుళ్యంతో కలసి గాంధీ కనిపించిన మొదటి కార్యక్రమం హరిద్వార్‌ ‌కుంభమేళా. తన ఆత్మకథలో హరిద్వార్‌ ‌కుంభమేళాలో తన అనుభవాలను వివరించడానికి గాంధీజీ ఒక అధ్యాయాన్ని కేటాయిం చారు.

దక్షిణాఫ్రికాలో ఆయన చేసిన పని భారతదేశం అంతటా సాధారణ ప్రజలపై చూపిన తీవ్ర ప్రభావాన్ని ఆయన ఇక్కడే మొదటిసారి గ్రహించారు. ‘‘నా పని ఎక్కువ సేపు గుడారంలో కూర్చుని, నన్ను చూసేందుకు వచ్చిన అనేక మంది యాత్రికులను కలుసుకుని మతపరమైన, ఇతర చర్చలు జరపడం. ఇది నాకు నా స్వంతం అని చెప్పుకోగలిగే ఒక్క నిమిషం కూడా మిగిల్చలేదు. ఈ దర్శనార్థులు స్నానపు ఘాట్‌ ‌వరకు కూడా నన్ను అనుసరించారు. నేను భోజనం చేస్తున్నప్పుడు నన్ను ఒంటరిగా వదిలి పెట్టలేదు. అందువల్ల దక్షిణాఫ్రికాలో నా వినయ పూర్వకమైన సేవలు మొత్తం భారతదేశం అంతటా ఎంత లోతైన ముద్ర వేశాయో హరిద్వార్‌లోనే నేను గ్రహించాను’’ అని గాంధీజీ ‘‘ది స్టోరీ ఆఫ్‌ ‌మై ఎక్స్‌పెరిమెంట్స్ ‌విత్‌ ‌ట్రూత్‌’’‌లో రాశారు.

ఆసక్తికరంగా, గాంధీజీ హరిద్వార్‌ ‌పర్యటన, ఆయన స్వాతంత్య్రోద్యమ ప్రవేశంతో పాటు కుంభమేళాలో జరిగిన మరో చారిత్రాత్మక సంఘటన- అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు. ఏప్రిల్‌ 1915‌న హరిద్వార్‌ ‌కుంభమేళా సందర్భంగా జరిగిన సర్వదేశక్‌ (అఖిల భారత) హిందూ సభ ప్రారంభ సమావేశంలో గాంధీ, స్వామి శ్రద్ధానంద్‌, ‌పండిట్‌ ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవీయ ఇతరులతో కలిసి పాల్గొన్నారు.

అదేవిధంగా, 1906లో ప్రయాగ్‌ ‌కుంభమేళాలో సనాతన ధర్మ సభ సమావేశమై, పండిట్‌ ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవీయ నాయకత్వంలో బనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించడం గమనార్హం.

ప్రజలను ఉద్యుక్తులను చేయడంలో కుంభమేళాకు ఉన్న లోతైన ప్రభావాన్ని గాంధీజీ గుర్తించారు. 1918లో ప్రయాగ్‌ ‌కుంభమేళాకు హాజరయ్యారు. ప్రాంతీయ రాష్ట్ర పురావస్తు శాఖ భద్రపరిచిన రికార్డులను బట్టి బ్రిటిష్‌ అధికారులు తమ నిఘా నివేదికలలో ఈ కార్యక్రమంలో ఆయన ఉనికిని నమోదు చేశాయి. తన పర్యటన సందర్భంగా, గాంధీజీ అసంఖ్యాకంగా వ్యక్తులతో పాల్గొన్నారు, సంగమ సంప్రదాయాలను ఆచరించారు.

తరువాత సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో, ఫిబ్రవరి 10, 1921న ఫైజాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో, గాంధీ తన కుంభమేళా సందర్శన గురించి ఆలోచించారు. తాను మొదట్లో అయోధ్య యాత్రకు ప్రణాళిక వేసినప్పటికీ, ప్రయాగ్‌ ‌మేళాకు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించు కుందని ఆయన వివరించారు. భారతదేశంలో బ్రిటిష్‌ ‌పాలనను సవాలు చేయడంలో సహాయ నిరాకరణ ఉద్యమం కీలకమైనందున ప్రసంగంలో కుంభమేళా గురించి ఆయన ప్రస్తావించిన సందర్భాలు అంత ప్రమాదకరమైనవి కావు.

1947 వరకు భారతదేశ స్వాతంత్య్ర ఉద్య మంలో కుంభమేళా ఒక ముఖ్యమైన ఉత్ప్రేరకంగా కొనసాగింది. హిందూత్వ విప్లవకారుల సమావేశ స్థలంగా అవి పని చేశాయి. ఫిబ్రవరి 2, 1920 నాటి డైరెక్టర్‌ ఆఫ్‌ ‌సెంట్రల్‌ ఇం‌టెలిజెన్స్ ‌నుండి బ్రిటిష్‌ ‌కాలం నాటి ఒక సమాచారం ఈ కీలక అంశాన్ని ప్రధానంగా వెలుగులోకి తెచ్చింది. అలహాబాద్‌ ‌మ్యూజియంలోని ఒక పురావస్తు పత్రాల ప్రదర్శనలో ఉంచిన ఈ పత్రం, స్వాతంత్య్ర పోరాటానికి మేళా చేసిన సాయం గురించి కీలక సహకారాన్ని స్పష్టంగా వెల్లడించింది. 1918లో కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆమోదించిన ఒక స్మారక చిహ్నం గురించి ఇది మాట్లాడుతుంది, ‘‘ఈ స్మారక చిహ్నం కాంగ్రెస్‌, ‌లీగ్‌ ‌రాజకీయ సంస్కరణల పథకానికి మద్దతు ఇచ్చింది.ఈ డిమాండ్ల• చేసింది:

గ్రామాల్లో రూ.500 వరకు సివిల్‌ ‌కేసులు, అన్ని నాన్‌-‌కాగ్నిజబుల్‌ ‌క్రిమినల్‌ ‌కేసులను పరిష్కరించ డానికి పంచాయతీలను వెంటనే ఏర్పాటు చేయాలి. పూర్తి బదిలీ చేయగల, వారసత్వ హక్కులతో శాశ్వత పరిష్కారం ప్రవేశపెట్టాలి. ఆదాయం, అద్దెను పెంచడం ఇంపీరియల్‌ ‌కౌన్సిల్‌ అమలుకు లోబడి ఉంటుంది. జమీందార్ల ప్రత్యేక హక్కును తగ్గించడం, అద్దె చెల్లించనందుకు బహిష్కరణ చట్టాన్ని సవరించడం’’ అని ఫిబ్రవరి 17, 1918 నాటి రహస్య లేఖ పేర్కొంది.

‘‘1918లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా 300 మంది ప్రతినిధులు, 2,000 మంది సందర్శకుల సమావేశం ద్వారా ఈ స్మారక చిహ్నాన్ని స్వాగతించారు. దీనిని రైతులు ఎక్కువగా సందర్శిస్తారు. ఈ సమావేశం మధ్య పరగణాలు (నేటి ఉత్తరప్రదేశ్‌) ‌రైతు సంఘం స్థాపనపై కూడా ఒక అంగీకారానికి వచ్చింది. ఇది ఇతర లక్ష్యాలతో పాటు, జమీందార్లు, కౌలుదారుల మధ్య పెరుగుతున్న వైరుధ్యాన్ని అరికట్టడానికి; పాలకులు పాలితుల మధ్య పరస్పర విశ్వాసం స్నేహాన్ని మరింతగా పెంపొం దించడానికి ప్రతిపాదించింది.’’

‘‘…ఈ సంస్థకు మద్దతుగా, నిధుల కోసం విజ్ఞాపనలు చేశారు. డబ్బు వసూలు చేశారు. ఈ పని కలకత్తాలో జరిగిందని ఆ పత్రాలు చెబుతు న్నాయి. ‘‘జూన్‌ 1919‌లో మదన్‌ ‌మోహన్‌ ‌మాలవీయ చేసిన అటువంటి విజ్ఞప్తిలో, పంజాబ్‌, ‌యునైటెడ్‌ ‌ప్రావిన్స్‌లు, బిహార్‌, ఒరిస్సాలోని వివిధ గ్రామాలు, తహసీల్‌లలో అసోసియేషన్‌కు 450 శాఖలు 3,500 మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. 1919 అంతా, యునైటెడ్‌ ‌ప్రావిన్స్‌ల లోని అనేక జిల్లాల సమావేశాలు జరిగాయి. నిర్వాహకుల స్ఫూర్తిని వివరించడానికి ఈ నివేదికలను ఉదహరించవచ్చు ’’ అని సారాంశం జోడించింది.

స్వతంత్ర భారత్‌లో

స్వాతంత్య్రం తర్వాత కూడా, కుంభమేళా హిందూత్వ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న పవిత్ర సంగమంగా దాని ప్రాముఖ్యం నిలుపుకుంది. 1964లో, హరిద్వార్‌ ‌కుంభమేళాలోనే విశ్వ హిందూ పరిషత్‌ ఆవిర్భవించింది.

భారతదేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని రూపొందించడంలో కుంభమేళాలది కీలక పాత్ర. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి దాని ప్రతిస్పందన చాలా గొప్పది. ఇది స్వాతంత్య్రానంతర భారత రాజకీయాలను ప్రభావితం చేయడంలో ఇది కీలక పరిణామం. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు జరిగిన 1977 ప్రయాగ్‌ ‌కుంభ్‌ ‌రాజకీయ దృశ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. ఈ సమావేశం కాంగ్రెస్‌ ‌పాలనకు వ్యతిరేకంగా మద్దతును సమర్థవంతంగా పెంచింది. అత్యవసర పరిస్థితి నాటి అణచివేత రోజులకు ముగింపు పలికింది. సాధు సమాజ్‌ ‌స్పష్టమైన మద్దతుతో బలోపేతం అయిన 1977 కుంభ్‌లో జేపీ ఉద్యమం గణనీయమైన ఎన్నికల ఊపును సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ధర్మ సంసద్‌ (‌మత పార్లమెంట్‌) ‌వివిధ సాధు సమ్మేళనాలు ఇందిరా గాంధీని భారత్‌కు శత్రువుగా బహిరంగంగా ప్రకటించాయి. హిందీ మాట్లాడే భూభాగం అంతటా జనతా పార్టీ మద్దతును స్థిరపరిచాయి.

కుంభమేళాను విస్తృతంగా డాక్యుమెంట్‌ ‌చేసిన ప్రఖ్యాత జర్నలిస్ట్ ‌మార్క్ ‌టుల్లీ, 1989 కుంభమేళాను రామ జన్మభూమి ఉద్యమానికి ఒక నిర్ణయాత్మక క్షణంగా హైలైట్‌ ‌చేశారు. తన అనుభవాన్ని ప్రతిబింబిస్తూ, టుల్లీ ఇలా రాశాడు: ‘‘నేను ఇంత ప్రశాంతమైన జనసమూహంలో ఎప్పుడూ లేను. అక్కడ ఎటువంటి ఉన్మాదం లేదు, కేవలం విశ్వాసం, ప్రశాంతమైన నిశ్చయం చేయవలసినది చేసుకోవడం మాత్రమే ఉంది.’’

కుంభమేళా భారత్‌పై తన ప్రత్యేక ప్రభావాన్ని చూపుతూనే ఉంది, దాని సామాజిక-రాజకీయ, సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని లోతైన శాశ్వత మార్గాల్లో నిర్వచిస్తుంది. మతపరమైన సమాజం కంటే, ఇది భారతదేశ చారిత్రక, సాంస్కృతిక రాజకీయ పథాన్ని నిరంతరం రూపొందించిన నాగరికత దృగ్విషయం. ప్రయాగ్‌రాజ్‌ ‌మరొక మహా కుంభమేళాను స్వాగతిస్తున్నప్పుడు, ఈ కాలాతీత సంప్రదాయం స్థితిస్థాపకత, విశ్వాసం సాంస్కృతిక కొనసాగింపునకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది దేశ గతంపై దాని శాశ్వత ప్రభావాన్ని, ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో దాని నిరంతర పాత్రను బలమైన జ్ఞాపకంగా నిలుపుతుంది.

– జె.నందకుమార్‌ ‌ప్రజా ప్రవాహ జాతీయ కన్వీనర్‌

అను: బీఎస్‌ ‌శర్మ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE