ఓం నమఃశివాయ. ప్రపంచమంతా ఇప్పుడు భారతాన్ని చూస్తోంది. ఆనందంతో పరుగులు తీస్తున్న గంగా ప్రవాహ సందోహాన్ని, ఆ జలం పవిత్రతను మాకు కూడా కొంచెం ప్రసాదించమని ఉరకలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా వెళ్తున్న జనసంద్రాన్ని ఆత్మీయంగా పలకరిస్తూ, ఆధ్యాత్మికతతో మనసు ఉప్పొంగేలా, హరహర శంకర, శంభోశంకర అంటూ నినాదాలతో మనసు పరవశించేలా హైందవ శంఖారావం విశ్వం నలుదిక్కులా మారుమోగేలా మహాకుంభమేళా ఉత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.
ప్రయాగ-ఒక భౌగోళికమైన భూభాగం మాత్రమే కాదు. ఆధ్యాత్మికత నిండిన అరుదైన ప్రదేశం. గంగమ్మ తరంగ అంతరంగ నాదం. ప్రణవం నిండిన అలల సడి మనసున వినిపించే ముగ్ధ మనోహర ప్రాంతం. మోహినీ రూప పరమాత్మ పంచిన జ్ఞానామృతధార నుంచి నాలుగు అమృత బిందువులు. భూమిమీద నాలుగు ప్రదేశాలలో పడగా అందులో విశిష్టంగా చెప్పుకునే ప్రదేశం ప్రయాగ.
శివుని జటాజూటం నుంచి జాలువారిన గంగమ్మ, కన్నయ్య లీలలు కనులారా కన్న యము నమ్మ, బ్రహ్మజ్ఞానం ప్రవాహంగా మారిన సరస్వతమ్మ కలిసి త్రివేణీ సంగమంగా అజ్ఞానాంధకార తిమిరా లను దూరం చేసి, పాప ప్రక్షాళన చేసి, జ్ఞానజ్యోతు లను జాగృతం చేసే విశిష్టత కలిగిన ముగురమ్మల మహిమాన్విత సుందర సంగమం త్రివేణీ సంగమం.
భౌతిక సుఖాలను పట్టించుకోకుండా ఎంతటి కష్టమైనా భరిస్తూ తల్లి గంగలో మునకలు వేయాలని, తెలిసీ తెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవాలని, తమ జీవితకాలంలో మరలా పొందలేని మహాద్భు తాన్ని ఈనాడే, ఇప్పుడే పొందాలని, తల్లి ఒడిలోని సుఖాన్ని మరలా గంగమ్మ ఒడిలో అనుభవించాలని, పసిపిల్లలా మారిన మనసుతో కల్మషం లేని హృదయంతో మునకలేయ కదలి వస్తున్నది భారతం.
త్రిమూర్తుల కృపాతరంగాలు త్రివేణీ సంగమంగా మారి కన్నుల పండుగగా జాతి, కుల, వర్ణ భేదాలు మరచి ‘మనమంతా హిందువులం. భగవద్భక్తులం, సనాతన ధర్మరక్షకులం’ అంటూ హిందూ సందోహ బలాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఎన్నో కష్టనష్టాలు, యుద్ధాలు, ఆటుపోట్లు ఎదురైనా భారతమాత భగవద్భక్తులనీ, వేల శివాజీలని, ఝాన్సీరాణీలను జాతికి అందిస్తూనే ఉంటుందని నిరూపిస్తూ, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని హెచ్చరిస్తూ, ధర్మానికి కీడు తలపెడితే భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తాడన్న గీతా వాక్యాన్ని తలపిస్తూ హిందూ జన సంద్రం సంగమ స్నానానికి తరలి వస్తోంది.
సురగంగలో స్నానమాడే దేవీదేవతలు భూగంగలో స్నామాచరించాలని, వైకుంఠంలో ఉండే విష్ణువు తన పాదాల నుంచి ఉద్భవించిన గంగమ్మ అందాలు చూడాలని, కైలాస శివుడు తన శిరసుపై ఉండే గంగమ్మ పొంగులు కనాలని, విష్ణు పాదాలను గంగాజలంతో కడిగిన బ్రహ్మ ఆ పవిత్ర జలంలో మునకేయాలని, వారి దేవేరులతో కలిసి మారు రూపాలలో వచ్చి అమృతస్నానం ఆచరించేది ఆ సంగమంలోనే. తమ తమ జీవితాలని భగవంతుడికే అర్పించి నిద్రహారాలు మరిచి, భౌతిక సుఖాలకు దూరంగా ఉండే సాధు పుంగవులు, విశ్వ కల్యాణం కోసం యజ్ఞయాగాదులు చేసే రుత్వికులు, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం కృషిచేసే దేశభక్తులూ, స్నానమాచరించే ఆ జలంలోనే తాము కూడా మునకలేస్తే చాలని మనసున తలచి బయలుదేరి వెళ్లిన సామాన్యులెందరో! ఎంతో ప్రయాసతో వెళ్లిన వారం దరికీ ప్రయాగ స్వాగతం పలికి సంగమ గంగమ్మ సమంగా దీవించి పంపిస్తుంటే, ‘ఆహా! తల్లికి పిల్లలంతా సమానమే కదా’ అని మనసు ఆనందంతో ఉప్పొంగి, ఆనందబాష్పాలుగా, ఆ గంగ కన్నీటి గంగగా మారి పెల్లుబికి వస్తున్నది.
పూర్వ జన్మ వాసనలో, కర్మఫల ప్రభావమో, ఆధ్యాత్మికతలోని ఆనందమో, వారిని మన వారిగా మారుస్తోంది. వేలమంది విదేశీయులు ఆ సంగమంలో స్నానం చేసి, జైహింద్ అనే నినాదంతో, ఉప్పొంగిన ఆనందంతో, మాటలు రాని మౌన భావాలతో భావ ప్రకటన చేస్తుంటే ‘ఇది కదా నా తల్లి భారతి వైభవం’ అని గర్వించే ఉత్సవం.
మాటలు రాని నాతోనే ఇన్ని పలుకులు పలికించిన ఈ మహాకుంభమేళా నిరాటంకంగా జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ…
హిందూ బంధువులారా, సనాతన ధర్మ రక్షకులారా.
గగనానికి గగనమే సాటి, సంద్రానికి సంద్రమే పోటీ.
మహాకుంభమేళాకి సాటిరాదు మరొకటి.
ఒకరిచ్చే రికార్డు కాదు, అవార్డు కాదు, దీనికి పోటీ మరోటి లేదు.
జైహింద్, జై భారత్.
మాదిరాజు సుష్మ
9866845154