రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సజావుగా సాగడానికి రైలు పట్టాల్లా సమాంతరంగా వెళ్లాల్సిన రెండు ముఖ్యమైన విభాగాలు తలోదారిలో పయనిస్తున్నాయి. దీంతో, ప్రభుత్వ పాలన గాడి తప్పే పరిస్థితులు పొంచి ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు వర్సెస్ అధికారులు మాదిరిగా పరిస్థితి తయారయ్యింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలోని మూలస్తంభాల్లో ప్రధానమైన రెండు రాజ్యాంగ బద్ధమైన సర్వీసుల్లో ఉన్నవాళ్ల మధ్య సమన్వయం కుదరడం లేదట. చట్టాలు చేయాల్సిన, ప్రభుత్వ పాలన సాగించాల్సిన శాసనవ్యవస్థ,దానికి అవసరమైన వివరాలు అందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిన అధికార వ్యవస్థ మధ్య అంతరం నెలకొంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఈ విషయం బాహాటంగా చెప్పడం అందరినీ విస్మయ పరచింది. ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోందన్న చర్చను లేవనెత్తింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. అధికారుల్లో కొందరు సీరియస్‌గా పని చేయడం లేదని, వాళ్ల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదని గత కొంతకాలంగా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యా నిస్తున్నారు. వాళ్లసలు మాటే వినడం లేదని ప్రకటి స్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అధికారులను ఓ సమీక్షలో సుతిమెత్తగా మందలించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మరోసారి బహిరంగ వేదికపై నుంచి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మరోసారి అధికారుల పనితీరుపై బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో, ఆ తర్వాత ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి రచించిన పుస్తకావిష్కరణ సభలోనూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అయితే, సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా.. బహిరంగంగా వెళ్ల్లగక్కినా అధికారులు మాత్రం స్పందించడం లేదట. ఇక్కడా, అక్కడా అని కాదు.. రాష్ట్ర సచివాలయంలోని చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుకొని కలెక్టర్ల దాకా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందంటున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ.. అధికారులు మారడం లేదని మంత్రులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారంటే.. లేదంటే ఏదైనా ఆదేశించారంటే.. ఆ అంశాన్ని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పిన పనులను సైతం అధికారులు చేయడం లేదని మంత్రులు కూడా అంగీకరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. గత బీఆర్‌ఎస్ సర్కారుకు భిన్నంగా కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలోని హాస్టళ్లలో మెస్ ఛార్జీలు భారీగా పెంచారు. అయితే, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కాస్త ప్రచారం కూడా అవసరం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. హాస్టళ్లలో పనితీరుపై సమీక్ష చేసిన సమయంలో కలెక్టర్లు, ఎస్పీలకు పలు సూచనలు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాస్టళ్లలో రాత్రిపూట నిద్ర చేయాలని, అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసు కోవాలని.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశిం చారు. కానీ, ఆయన సూచనలను దాదాపు ఎవరూ పాటించలేదు. ఒకరిద్దరు మినహా అసలెవరూ ఈ ఆదేశాలను సీరియస్‌గా తీసుకోలేదు. గాలికొదిలేశారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ, వాళ్ల నుంచి ఏ మాత్రం ప్రతిస్పందన లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఈ క్రమంలోనే, మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన ‘కర్మయోగి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తూ, అధికారుల పనితీరును మరోసారి తప్పుపట్టారు. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు మంచీ చెడులపై సలహాలు ఇచ్చే విధంగా ఉండాలని, రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పొప్పులను ఎత్తి చూపాలని అన్నారు. కానీ, నేటి అధికారుల్లో ఈ వైఖరి కరువైందని, ఒక తప్పు చేయమంటే.. మూడు తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నానని వ్యాఖ్యానించారు. సమాజానికి ఇది మంచిది కాదన్నారు.
‘ప్రస్తుత అధికారుల వ్యవహారశైలి పట్ల నేను ఏమాత్రం సంతోషంగా లేను. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం మానేశారు. ఏసీ అనేది జబ్బేమోననిపిస్తోంది. అధికారులు ప్రజల వద్దకు వెళ్లినప్పుడే ప్రజా సమస్యలు అర్థమవుతాయి. ఆఫీసుల్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదు’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభమైన తన రాజకీయ పయనంలో చాలావరకు ప్రతిపక్షంలోనే ఉన్నానని, అప్పట్లో జిల్లా కలెక్టర్లు మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ఆయా గ్రామాల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారని తెలిపారు. ఇప్పటికీ తాను ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు.. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గురించి అక్కడి ప్రజలు గుర్తు చేస్తుంటారని చెప్పారు. దీనినిబట్టి నాటి అధికారులు ప్రజలతో ఎలా ఉన్నారో, ఎలాంటి ముద్ర వేసుకున్నారో నేటి అధికారులు తెలుసుకోవాలని సూచించారు.
గతంలో అధికారులు. రాజకీయ నాయకులు ఏదైనా విషయాన్ని ప్రస్తావించినప్పుడు అందులోని లోటుపాట్లను, దాని వల్ల వచ్చే నష్టాన్ని చెప్పేవారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చట్టవిరుద్ధంగా వెళితే భవిష్యత్తులో తలెత్తే సమస్యను వివరించేవారని, నాయకులను అప్రమత్తం చేస్తూ.. జరగబోయే పరిణామాలను గుర్తుచేసే వారని అన్నారు. కానీ, ఈ రోజుల్లో అలా చెప్పడం తగ్గిపోయిందన్నారు. దీనికి కారణమేంటో తనకు తెలియదని, కానీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌ను సంతోష పెట్టాలనో లేక తనకు తాను సంతోషపడాలనో.. రాజకీయ నాయకులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ అమలు చేస్తున్నట్లు అనుకుంటున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ, వారి చదువు, అనుభవం వేర్వేరు కావచ్చునని, ఏమీ చదువుకోని వారికి విద్యాశాఖను కూడా ఇవ్వవచ్చని, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్‌కు, వారి చదువుకు ఏమాత్రం సంబంధం ఉండదని పేర్కొన్నారు. అందుకే తమకు అవగాహన కల్పించడానికి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారులు అవసరమవుతారని తెలిపారు. వారు ఏ ఫైలు వచ్చినా.. అందులోని తప్పొప్పులను తమకు వివరిం చాలని అన్నారు. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని అంటూ, తాము అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులను వెతికి పట్టుకొని మరీ పోస్టింగ్‌లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా తాము విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటామని కానీ, వాటిని అమలు చేసి విజయవంతం చేసే బాధ్యత అధికారులపైనే ఉంటుందన్నారు.
అధికారుల వైఖరిలో కూడా మార్పు రావాలని, ప్రతిది వ్యతిరేక కోణంలో కాకుండా, సానుకూల దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. నేటితరం అధికారులకు సీనియర్ ఐఏఎస్‌ల ద్వారా వారి అనుభవాలను, వాళ్లు ఎదుర్కొన్న సమస్యలపై శిక్షణ కార్యక్రమం ఇప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈ వేదిక నుంచి ఆదేశిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికా రులకు ఉండాలని, అలాంటివారే ప్రజల మనసులో నిలిచిపోతారని చెప్పారు. ఆ దిశగా రాష్ట్రంలోని అధికారులు దృష్టి సారించాలని తాను కోరుకుంటు న్నానని ముఖ్యమంత్రి చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలను తరచూ మాజీ అధికారులతో సదస్సుల ద్వారా కలుసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. గోపాల కృష్ణనాయుడు తన ఆరు దశాబ్దాల అనుభవాన్ని గ్రంథ రూపంలో నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్ అనిసివిల్ సర్వెంట్లందరికీ ఈ పుస్తకం దిక్సూచిగా ఉంటుందని భావిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి అన్నారు. దేన్నయినా కొనవచ్చునని, అనుభవాన్ని మాత్రం కొనలేమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శంకరన్, మన్మోహన్ సింగ్, శేషన్‌లను గుర్తుకుతెచ్చుకోవాలని సీఎం సూచించారు. నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్ కాగా, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన వ్యక్తి శేషన్ అని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్‌సింగ్ అని కొనియాడారు. అలాంటి సివిల్ సర్వెంట్ల అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.
కొంతమంది సివిల్ సర్వేంట్స్ శిక్షణలో ఉన్నప్పుడే స్టేషన్‌లలో డ్రెస్‌తో కూర్చొని సివిల్ పంచాయతీలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎప్పుడైనా నాయకులకంటే అధికారులనే ఎక్కువగా నమ్ముతారని పేర్కొన్నారు. నాయకులు ఇప్పుడు ఉంటారు, పోతారు, కానీ, అధికారులు మాత్రం ప్రభుత్వాలు మారినా వారే ఉంటారనీ, అందుకే వారిపై ఎక్కువ నమ్మకం కలుగుతుందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సూచించారు.
అసలు రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో అధికారులకు క్లాస్ తీసుకోవలసిన అవసరం రావడమంటేనే బాధాకరమంటున్నారు విశ్లేషకులు. అధికారులు కూడా ప్రభుత్వ పెద్దలకు సహకరించాల్సి ఉంటుం దంటున్నారు. రాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎక్కడో కొంత గ్యాప్ ఉందన్నది వాళ్ల అభిప్రాయం. ప్రధాన కార్యదర్శి నుంచి కార్యదర్శులు, కలెక్టర్లుకు కొంత గ్యాప్ ఉందని ప్రభుత్వ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. మరోవైపు.. సివిల్ సర్వెంట్లు ఫీల్డ్‌లో ఉండకుండా కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు రోజురోజుకీ పెరుగు తున్నాయి.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన పద్ధతిలోనే ఇప్పటికీ కొంతమంది అధికారులు కొత్త ప్రభుత్వం వచ్చి 14 నెలలు కావస్తున్నా అదే పద్ధతిలో పనిచేస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. తమ శాఖకు సంబంధించిన సెక్రటరీలు కూడా వెంటనే స్పందించడం లేదని ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పాలన పరంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దానిని అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం అధికారుల పైనే ఉంటుంది. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా దాంట్లో అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్, ఐపీ•ఎస్ అధికారుల పనితీరు ఏ మాత్రం బాగోలేదని విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగానే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే, ఇక్కడే మరో విషయం కూడా సెక్రెటేరియట్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం మారినప్పటి నుంచీ అధికారులను ప్రభుత్వ పెద్దలు అంతగా నమ్మడం లేదన్న విషయం చర్చనీయాంశ మవుతోంది. తమకు నచ్చిన వాళ్లకు ఆయా విభాగాలకు బదిలీలు చేసి పనులు చేయించుకోవడం, తమ విధాన నిర్ణయాలు సక్రమంగా అమలు చేయించడం వంటివి చేయాల్సి ఉండగా.. అధికారుల సలహాలు ఏ మాత్రం వినడం లేదని, వాళ్లతో ప్రభుత్వ నిర్ణయాలపై స్వేచ్ఛగా మాట్లాడటం లేదని, చర్చించడం లేదని అంటున్నారు. అధికారుల మీద ప్రభుత్వ పెద్దలకే నమ్మకం లేకపోతే.. వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. సామర్థ్యం ఉన్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు ఇస్తూ.. అంచనాలు మరోలా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుందని కూడా చర్చించుకుంటున్నారు. మరి రాష్ట్రంలో శాసన, అధికార వ్యవస్థల మధ్య నెలకొన్న అగాధాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.
సుజాత గోపగోని,
సీనియర్ జర్నలిస్ట్