కేరళలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య – ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర్ దాకా స్వామి ఆనందవనం భారతీ సాగించిన ఆధ్యాత్మిక యాత్ర ఆద్యంతం ఆసక్తికరమైంది. ఆది శంకరాచార్య జన్మించిన గడ్డ నుంచి సనాతన ధర్మాన్ని ఊతంగా చేసుకొని వచ్చిన స్వామి ఆనందవనం భారతికి జనవరి 26న ప్రయాగ్‌రాజ్‌లో మహామండలేశ్వర్ హోదాను జునా అఖాడా అధిపతి స్వామి అవధేషా నంద్ గిరి అప్పగించారు. సాక్షాత్తూ ఆది శంకరా చార్యులవారే ఉత్తర భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం యోధులైన సాధువులకు శిక్షణ కోసమని అఖాడా వ్యవస్థను నెలకొల్పారని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రతిదాన్నీ తాను ఆమోదిస్తున్నట్టు, అన్నింటినీ సమానంగా చూస్తున్నట్టు మహామండ లేశ్వర్‌గా అవతరించిన స్వామి ఆనందవనం తెలిపారు. గతంలో ఇలా ఉండటం తనకు సాధ్య మయ్యేది కాదని అన్నారు. స్వామి ఆనందవనం అసలు పేరు పీ సలీల్. కేరళలోని త్రిశూర్ జిల్లా, చలకుడిలో జన్మించారు. తండ్రి మాధవన్ మదుర్ కోట్స్ కంపెనీలో ఉద్యోగి. తల్లి ఆనందవల్లి టీచర్. త్రిశూర్‌లో శ్రీ కేరళ వర్మ కాలేజీలో డిగ్రీ, పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్ కార్యదర్శిగా, ప్రాంత అధ్యక్షుడుగా, ఆ తర్వాత జిల్లా ఆఫీస్ బేరర్‌గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహ రించారు.
అప్పట్లో తనపై ఉన్న పోలీసు కేసుల నుంచి బైటపడటానికి, ముందస్తు బెయిల్ పొందడానికి కొన్నాళ్లు సొంత ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చిందని స్వామి ఆనందవనం తెలిపారు. దాంతో 2001లో తొలిసారిగా తాను కుంభమేళాను చూడ్డానికి వచ్చినట్టు చెప్పారు. కుంభమేళా తనకు ఓ అనూహ్యమైన అనుభూతిని ప్రసాదించిందని తెలిపారు. ఆరు రోజుల పాటు పవిత్ర గంగానది తీరాన బస చేసినట్టు చెప్పారు. రెండు మూటల గడ్డిని పరుపుగా చేసుకొని రాత్రిపూట దానిపైన నిదురించేవాడినని తెలిపారు.
దోమ కాటు నుంచి తప్పించుకోవడానికి ఆవు పేడతో చేసిన పిడకలను వాడినట్టు చెప్పారు. అయితే ఆ సమయంలో చర్యలు అటు సీపీఎంలో కానీ ఇటు ఎస్‌ఎఫ్‌ఐలో కానీ ఎలాంటి వివాదానికి దారి తీయలేదని తెలిపారు. చదువైపోయిన తర్వాత మలయాళ దినపత్రికలో జర్నలిస్టుగా ఆయన చేరారు. ఆ సమయంలోనే స్వామి ఆనందవనం హరిద్వార్, వారణాసి, రిషీకేష్, హిమాలయాల్లో కొన్ని ప్రాంతాలను తరచుగా సందర్శిస్తుండేవారు. ఆ సమయంలో ఆశ్రమాల్లో బస చేస్తుండేవారు. క్రమంగా ఆధ్యాత్మికంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆధ్యాత్మికం గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకున్న దాని కన్నా మరింత ఎక్కువ తెలుసు కోవాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికతను వివేచనా శక్తి కలిగినదిగా స్వామి ఆనందవనం తెలిపారు. ఎప్పుడైతే మనం విషయా లను సకారణంగా, సహేతుకంగా అర్థం చేసుకోగలుగు తామో దానినే మనం ఆధ్మాత్మికత అని పిలుస్తామని అన్నారు.
సరిచేసి రక్షించేది శస్త్రమౌతుంది. ఆశ్రమంలో పత్రిక కోసం సందీపానంద గిరితో కలిసి పనిచేసినట్టు తెలిపారు. తద్వారా తన ఆధ్యాత్మిక యాత్ర మరింత పురోగతిని సాధించిందని చెప్పారు. ఈ దిశగా తన ప్రయాణాన్ని విరమించుకోవాలంటూ తన పాత కామ్రేడ్ల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ఒత్తిడి రాలేదని తెలిపారు. జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పుడు ఆయన కొంత కాలం గృహస్థాశ్ర మంలో కూడా ఉన్నారు. బాల్యం, కౌమారం, గృహస్థు, వానప్రస్థం ఇలా ఒకరు జీవితంలో ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ సాధువుగా మారవచ్చు. దానికి ఎలాంటి నిషేధం లేదని ఆయన చెప్పారు.
2013 కుంభమేళా సందర్భంగా ఆయన జునా అఖాడాకు చాలా దగ్గరయ్యారు. అప్పుడు ఆయనకు ఓ సాధువు మార్గదర్శనం చేశారు. ఆ సమయంలో తాను కఠోరమైన శిక్షణకు, సాధనలకు గురైనట్టు స్వామి ఆనందవనం తెలిపారు. అందులో భాగంగా హిమాలయ మంచు పర్వతాలపై సుదీర్ఘ కాలం పాటు నిలబడాలని తనను ఆదేశించేవారని చెప్పారు. అలాగే నదీనదాలు, అడవులను దాటుకుంటూ యావత్ భారతదేశంలో తీర్థయాత్ర చేసినట్టు తెలిపారు. 2018లో దాదాపు నాలుగు లక్షల మంది సభ్యులతో కూడిన జునా అఖాడా నుంచి నాగా సాధువు దీక్షను తాను పొందినట్టు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, అందర్నీ తరతమ భేదం లేకుండా సమదృష్టితో చూస్తా మని స్వామి ఆనందవనం చెప్పారు. ఆయన మహా మండలేశ్వర్ హోదాలో కేరళలోని కొట్టరక్కరలో అవధూత ఆశ్రమం నుంచి విధుల నిర్వర్తిస్తారు.