‘‘మా ముందుకు వచ్చే కేసుల్లో అంత తేలిగ్గా పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అలాంటిదే అయోధ్య విషయంలో జరిగింది. ఆ కేసు మూడు నెలల పాటు నా ముందు ఉంది. దేవుడి ఎదుట కూర్చున్నాను. పరిష్కారం చూపించమని వేడుకున్నాను. అలా క్రమం తప్పకుండా పరమాత్మను ప్రార్థిస్తుండేవాడిని. నా మాట నమ్మండి.. మీకు దేవుడి పట్ల నమ్మకం ఉంటే ఆయన ఎప్పుడూ కూడా ఒక దారి చూపిస్తాడు..’’

అయోధ్యపై చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సభ్యుల్లో ఒకానొక న్యాయ మూర్తి, ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానానికి 50వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ అన్న మాటలివి. ఈ ఏడాది జనవరి 28నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత సర్వోన్నత న్యాయస్థానం ఇంతటి సుదీర్ఘ కాలపు ప్రస్థానంలో అయోధ్య తోపాటుగా మైలు రాళ్లని అనదగిన తీర్పులను వెలువ రించింది. వాటిలో కొన్ని తీర్పులు ఇలా ఉన్నాయి.

అయోధ్య తీర్పు

అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం మీద యాజమాన్య హక్కు ఎవరిది? అన్న సమస్యపై సుప్రీం కోర్టు నవంబర్‌ 9, 2019న చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. 130 ఏళ్ల న్యాయపోరాటాన్ని సుఖాంతం చేసింది. 1045 పేజీల ఈ తీర్పును ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించింది. సున్నీ వక్ఫ్‌ బోర్డు, హిందూ సంస్థలు నిర్మోహి అఖాడా, రామలల్లా విరాజమాన్‌ అనే మూడు పక్షాల మధ్య స్థల వివాదంగానే సుప్రీంకోర్టు తీసుకుని తీర్పు చెప్పింది. ఇది రామ్‌లల్లాకే చెందుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోబ్డె, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఆ భూఖండాన్ని మూడు ముక్కలు చేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు (2010) సమస్యను పరిష్కరించేది కాదని అభిప్రాయపడిరది. ఆ తీర్పు మీదే 14 అప్పీళ్లు దాఖలైనాయి. అయోధ్య హిందువులదని చెప్పడానికే ఎక్కువ ఆధారాలు ఉన్నాయని కూడా ధర్మాసనం తేల్చింది. మసీదు నిర్మించుకోవడానికి ఐదెకరాల స్థలాన్ని అయోధ్యలోనే ఇవ్వాలని కూడా సూచించింది. 40 రోజుల పాటు ఏకబిగిన విచారించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇందుకు పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంది. శతాబ్దాలుగా హిందువులు ఆ స్థలంలో పూజాదికాలు చేసు కుంటున్న వాస్తవాన్ని మన్నించింది. ఇది స్థిరాస్థికి సంబంధించిన వివాదంగానే పరిగణిస్తూ విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా కాకుండా సాక్ష్యాల ప్రాతిపదికన కేసును పరిష్కరిస్తున్నట్టు పేర్కొన్నది. ఈ కేసులో రామలల్లా తరఫున మనకాలంలో న్యాయశాస్త్ర పితామహులుగా చెప్పదగిన పరాశరన్‌ వాదించారు. 92 ఏళ్ల వయసులోను ఈ అసమాన న్యాయపోరాటానికి వారే నాయకత్వం వహించారు. 40 రోజులు వాదనలు సాగితే పరాశరన్‌ నిలబడే రాముడి వ్యాజ్యాన్ని వాదించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగొయ్‌ కూర్చుని వాదించమని కోరినా పరాశరన్‌ వృత్తి ధర్మాన్ని మనసా వాచా పాటించారు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తరఫున వాదిస్తున్న రాజీవ్‌ ధావన్‌ అసహనంతో కొన్నిసార్లు పుస్తకాలు విసిరేసినా పరాశరన్‌ ఏనాడూ సహనం కోల్పోలేదు. తీర్పు వెలువడిన తరువాత ధావన్‌ను ఆలింగనం చేసుకున్నారు కూడా. తరువాత పద్మ విభూషణ్‌ గ్రహిత పరాశరన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌ నుంచి అందుకున్న కానుక ఒక శ్రీరాముడి ప్రతిమ.

కేశవానంద భారతి కేసు

ఆధ్యాత్మిక గురువు, కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలో ఎడనీర్‌ మఠాధిపతి  కేశవానంద భారతి కేరళ ప్రభుత్వం ఆశ్రమాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ క్రమంలో పార్లమెంట్‌ రాజ్యాంగా నికి చేసిన 24, 25, 29వ సవరణల చెల్లుబాటును ఆయన సవాల్‌ చేశారు. పైన తెలిపిన సవరణలు పౌరుల ప్రాథమిక హక్కులతో పాటుగా న్యాయవ్యవస్థ అధికారాలకు భంగం కలిగిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలోనే తొలిసారి అన్నట్టుగా 1972, అక్టోబర్‌ 31న పిటిషన్‌పై 13 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. అలా ప్రారంభమైన విచారణ 1973, మార్చి 24 వరకు సాగింది.

68 రోజుల సుదీర్ఘ విచారణలో రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలు, రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని హక్కు పార్లమెంట్‌కు ఉన్నదీ లేనిదీ అనే అంశంపై  తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఎట్టకేలకు రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి సుప్రీంకోర్టే సంరక్షణదారు అనే చరిత్రాత్మక తీర్పును విస్తృత ధర్మాసనం వెలువరించింది. పార్లమెంట్‌కు రాజ్యాంగా నికి సవరణలు చేసే అధికారం ఉంది కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక హక్కులను మార్చే అధికారం దానికి లేదని తేల్చింది. వాటి సంరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుదేనని స్పష్టం చేసింది.

షాబానో కేసు

1978, ఏప్రిల్‌ మాసంలో 65 ఏళ్ల ముస్లిం మహిళ షాబానో బేగం తనకు విడాకులిచ్చిన మహమ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ నుంచి భరణం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో 1973నాటి  సెక్షన్‌ 123 ప్రకారం తనకు, తన ఐదుగురు పిల్లలకు భరణం ఇవ్వాలని కోరారు. అహ్మద్‌ ఖాన్‌ అప్పీల్‌పై జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ జరిపింది. ముస్లిం మహిళలకు భరణం చెల్లించాల్సిందేనని బెంచ్‌ పేర్కొంది. ఇద్దత్‌ (విడాకుల తీసుకున్న తర్వాత 3 నెలల కాలం) ముగిసిన తర్వాత కూడా ముస్లిం భర్త భరణం చెల్లించాల్సిందేనని పేర్కొంది. భరణం అనేది దాతృత్వం కొద్దీ ఇచ్చేది కాదని, అది హక్కు అని బెంచ్‌ తీర్పు ఇచ్చింది.

ఎస్‌ఆర్‌ బొమ్మై కేసు

జనతాదళ్‌ హయాంలో ఆగస్టు 1988 నుంచి ఏప్రిల్‌ 1989 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్‌ఆర్‌ బొమ్మైకు 1989, ఏప్రిల్‌ 21న ఊహించని పరిణామం ఎదురైంది. బొమ్మై సర్కారుకు తగిన మెజారిటీ లేదని పేర్కొంటూ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 356 ప్రయోగించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసింది. కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించింది. తన మద్దతుకు సంబంధించి జనతాదళ్‌ శాసనసభా పక్షం ఆమోదం తెలిపిన తీర్మానం కాపీని నాటి సీఎం బొమ్మై అప్పటి గవర్నర్‌ పి.వెంకటసుబ్బయ్యకు సమర్పించినా అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వలేదు. తీర్మాన కాపీని తిరస్కరిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలన్న గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బొమ్మై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ కుల్‌ దీప్‌సింగ్‌ నేతృత్వంలోని బెంచ్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. మార్చి 11, 1994న సుప్రీంకోర్టు బెంచ్‌ చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమని బెంచ్‌ తన తీర్పులో పేర్కొంది. గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం కల్పించాలని తెలిపింది. గవర్నర్‌ రాజ్యాంగంలోని 356 అధికరణం కింద ప్రభుత్వాన్ని రద్దు చేయడం నిరంకుశత్వమని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించు కోవడానికి అసలైన వేదిక కేవలం శాసనసభ మాత్రమేనని పేర్కొంది. ఇందులో గవర్నర్‌ స్వంత అభిప్రాయానికి ఏ మాత్రం తావు లేదని బెంచ్‌ తీర్పులో తేల్చి చెప్పింది.

ఇలాంటివి ఇంకా ఎన్నో!

About Author

By editor

Twitter
YOUTUBE