విదేశాలకు చెందిన పత్రికలు కనీవినీ ఎరుగని రీతిలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై, ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీపైనా విషం కక్కుతున్నాయి. ప్రత్యక్షంగా మోదీ మీద అన్నట్టుగా అవి తప్పుడు వార్తలు, కథనాలు ప్రచురిస్తున్నప్పటికీ పరోక్షంగా అవి భారతదేశం మీదే దుష్ప్రచారం సాగిస్తున్నాయన్నది కాదనలేని విషయం. స్వదేశీ పత్రికల్లో అధిక భాగం కూడా ఈ విదేశీ పత్రికల ధోరణినే అనుసరిస్తున్నాయని బీజేపీ భావిస్తోంది.

ప్రధాని నరేంద్రమోదీ నిజానికి గత దశాబ్ద కాలంగా పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలే నెరపుతున్నారు. ఆయన రెండు దఫాల అధికార కాలంలో ఏనాడూ పాశ్చాత్య దేశాలతో వైరానికి గానీ, వైషమ్యాలకు గానీ దిగలేదు. కానీ, ఆయా దేశాల పత్రికలు మాత్రం మొదటి నుంచి మోదీని ఒక శత్రువుగానే చూస్తున్నాయి. వీలు దొరికినప్పుడల్లా నియంత అనో, మతోన్మాది అనో, సంప్రదాయవాది అనో ఆయనను అభివర్ణిస్తూనే ఉన్నాయి. ఆయనను విమర్శించకుండా పాశ్చాత్య పత్రికల్లో వార్త రాని రోజు ఉండడం లేదు. ఆయన గురించి ఆయనకే తెలియని అనేక విషయాలను వ్యాసాల రూపంలో, సంపాదకీయాల రూపంలో రాస్తుంటాయి.

సాధారణంగా నరేంద్ర మోదీ గానీ, ఆయన ప్రభుత్వం గానీ ఈ విమర్శలకు, ఆరోపణలకు స్పందించడం లేదు. దేశీయ పత్రికల్లో తనకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా వార్తలు, వార్తా కథనాలు వచ్చినా ఏ మాత్రం పట్టించుకోని మోదీ పాశ్చాత్య పత్రికలను పట్టించుకుంటారంటే అది నమ్మలేని విషయం. తన పని తాను చేసుకుపోయే ఆయనకు పత్రికల స్పందన కంటే ప్రజల స్పందనే ముఖ్యం. తన నాయకత్వం, ఆధిపత్యంపై ఆయనకు అపారమైన నమ్మకం ఉంది. అయితే, పాశ్చాత్య దేశాల పత్రికలు మొదటి నుంచి పరోక్షంగా ప్రతిపక్షాల పాత్రను పోషిస్తున్నాయనే విషయం ఆయనకు తెలుసు. అమెరికా, ఐరోపా, చైనాలతో పాటు, టర్కీ, పాకిస్తాన్‌లు అడపాదడపా ఆయన మీద దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి.

అంతర్జాతీయంగా 54 ప్రధాన పత్రికలు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు విదేశాంగ శాఖ గుర్తించింది. దేశం బీజేపీ హయాంలో అభివృద్ధి చెందినా, కాంగ్రెస్‌ ‌లేదా మరేదైనా పార్టీ హయాంలో అభివృద్ధి చెందినా ఈ పత్రికలు సహించవు. బురద చల్లడమే వాటి లక్ష్యంగా ఉంటుంది. రాజీవ్‌ ‌గాంధీకి అత్యంత సన్నిహితుడు, ఆయన సలహాదారు శామ్‌ ‌పిట్రోడా లండన్‌, ‌న్యూయార్క్ ‌నగరాల్లో పర్యటిస్తూ పాశ్చాత్య మీడియాను రెచ్చగొడుతుంటారు. వారికి కావలసిన సమాచారం అందజేస్తుంటారు. పాశ్చాత్య పత్రికల్లో మోదీ వ్యతిరేక వార్తలు రావడానికి ఇతోధికంగా కృషి చేస్తుంటారు.

ఈ మధ్య పిట్రోడా అమెరికా, బ్రిటన్‌, ఆ‌స్ట్రేలియా, జర్మనీ, కెనడా తదితర దేశాల్లో మోదీకి వ్యతిరేకంగా వచ్చిన 50కి పైగా వార్తలన్నిటినీ గుదిగుచ్చి, ఒకే వార్తగా మార్చి లండన్‌ ‌పత్రికల్లో పునఃప్రచురించారు కూడా. ఆ పత్రికల్లో పడిన వార్తలను ఢిల్లీ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, సోషల్‌ ‌మీడియాలో మళ్లీ పోస్టు చేశారు. ఆ వార్తలన్నీ మోదీ మీద విషం కక్కడానికి, దేశంలోని ప్రజా స్వామిక సంస్థలను దుయ్యబట్టడానికి ఉపయోగ పడేవే. ది న్యూయార్క్ ‌టైమ్స్, ‌ది గార్డియన్‌, ‌ది ఎకనామిస్ట్, ‌ఫైనాన్షియల్‌ ‌టైమ్స్, ‌లాస్‌ ఏం‌జిల్స్ ‌టైమ్స్, ‌రాయిటర్స్, ‌లా మాండ్‌, ‌టైమ్‌, ‌బ్లూంబర్గ్ ‌తదితర పత్రికలు అవసరం ఉన్నా లేకపోయినా, మోదీకి వ్యతిరేకంగా మొదటి పేజీలో లేదా పతాక శీర్షికలో ఏదో ఒక వార్త రాస్తుంటాయి. భారతదేశం ఆర్థిక, టెక్నాలజీ, ఆరోగ్యం, విద్య, వైద్య రంగాల్లో సాగిస్తున్న ప్రగతిని ఈ పత్రికలు ఏనాడూ పట్టించు కున్న పాపాన పోలేదు. ప్రతి చిన్న విషయంలోనూ లోపాలు వెతకడమే ఇవి పనిగా పెట్టుకున్నాయి.

ప్రధాన సూత్రధారులెవరు?

విచిత్రమేమిటంటే, ఈ పత్రికలన్నీ దాదాపు ఒకే రకమైన వార్తలను, ఒకే కోణంలోని వార్తలను ప్రచు రిస్తుంటాయి. వీటికి ఎవరో ఇటువంటి సమాచారం అందిస్తున్నారనే అభిప్రాయం పాఠకులకు తప్పకుండా కలుగుతుంది. మోదీ గురించి రాస్తున్న వ్యతిరేక వార్తలన్నీ ఓటర్లను ప్రభావితం చేయడానికేనన్నది సుస్పష్టం. పిట్రోడాకు సన్నిహితమైన విదేశీ పత్రికలన్నీ మోదీని ఎన్నికల్లో దెబ్బ తీయడానికి, ఆయనను తిరిగి అధికారంలోకి రాకుండా చేయడానికి సంఘటితంగా కృషి చేశాయి. పిట్రోడా ఈ మధ్య 50 విదేశీ పత్రికల పతాక శీర్షికలను గుదిగుచ్చి ఒక వార్తగా ప్రచురించినప్పుడు కొద్ది క్షణాల్లోనే దానికి సుమారు అయిదు లక్షల వీక్షణలు వచ్చాయి. కాంగ్రెస్‌ అనుకూలవాదులంతా ఈ వార్తను మెచ్చుకుంటూ లైక్‌లు కొట్టగా, పాశ్చాత్య మీడియా వాదనలను కొట్టిపారేస్తూ లేదా విమర్శిస్తూ అనేక సంస్థలు, ప్రముఖుల నుంచి వ్యాఖ్యలు, విమర్శలు బయటికి వచ్చాయి.

ఈ వార్తలను చదివినప్పుడు మోదీని, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాజ్యాంగ సంస్థలను దుర్బాషలాడడమే కాకుండా, అంతర్లీనంగా ఈ పత్రికలు దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని కించ పరచడం, బలహీనపరచడం కూడా ధ్యేయంగా పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. ఈ పత్రికల విదేశీ విలేఖరులే కాదు, వాటికి భారత్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న విలేఖరులు కూడా తమ యాజమాన్యాల ఆదేశాల మేరకు హద్దులు మీరి మోదీని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల వార్తలు రాయడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని, తమకు వీసా మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆస్ట్రేలియన్‌ ‌బ్రాడ్‌ ‌కాస్టింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌దక్షిణాసియా విభాగం అధికారి అవనీ దియాస్‌ ‌భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే, ఈ ఆరోపణలు కేవలం దురుద్దేశంతో కూడుకున్నవని భారత ప్రభుత్వం ఖండించింది. ఆ తర్వాత ఓ 30 మంది విదేశీ విలేఖరులు ఒక సంయుక్త ప్రకటన జారీ చేస్తూ, ‘విదేశీ విలేఖరులకు వీసాలు, వార్తల సేకరణకు అనుమతులు ఒక పట్టాన మంజూరు కావడం లేదు. భారతదేశ విదేశీ పౌరులనే గుర్తింపును కూడా ఇవ్వడం లేదు. అవనీ దియాస్‌ ‌కేసుకు ఇందుకు ఒక సరైన ఉదాహరణ. భారతదేశ ప్రజాస్వామ్య విలువలకు తగ్గట్టుగా ఇక్కడ పత్రికా రచనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉంటాయని ఆశించాం’ అని వ్యాఖ్యానించారు.

వ్యతిరేకతకు కారణం?

వివాదాస్పద వార్తలు రాసినందుకు అంతకు ముందు భారతదేశం ఫ్రాన్స్ ‌జర్నలిస్టు వెనీసా డఫ్నాక్‌కు వీసా తిరస్కరించింది. నిరాధారమైన, వక్రీకరించిన వార్తలు రాస్తున్న పత్రికా రచయితల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. దేశంలోని అనేక పత్రికలు మోదీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నప్పటికీ సాధారణంగా వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. అయితే, విదేశీ పత్రికలు దురుద్దేశపూరితంగా మోదీ ప్రభుత్వంపై వార్తలు రాయడాన్ని మాత్రం ప్రభుత్వం సహించలేక పోతోంది. భారతదేశంలో జరిగే ఎన్నికల పట్ల విదేశీ పత్రికలు మితిమీరిన, హద్దులు దాటిన ఆసక్తిని ప్రదర్శించడం కూడా భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకోవడం కిందకే వస్తుంది. ఒకప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై అమెరికా పత్రికలు ఈ విధంగానే దుష్ప్రచారం చేశాయి. ఆమె వాటిని లెక్క చేయలేదు. అటల్‌ ‌బిహారి వాజ్‌పేయి హయాంలో భారతదేశం అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల పత్రికలు భారతదేశాన్ని శాంతి పాలిట విలన్‌గా అభివర్ణిస్తూ వార్తలు రాశాయి. పేదరిక నిర్మూలన మీద ఖర్చు చేయాల్సిన నిధులను భారత్‌ అణ్వస్త్ర పరీక్షల మీద ఖర్చు చేస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించాయి.

భారతదేశం జి.డి.పి.లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించి పోతున్నట్టు విదేశీ పత్రికలు రాస్తున్నాయి. ఈ పత్రికల్లో వేటి ప్రాధాన్యాలు వాటికి ఉన్నాయి. తమ దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడం కూడా ఇందులో భాగమే. చైనా, రష్యా సహా అనేక దేశాల్లో వాటికి మనుగడే లేకపోయినప్పటికీ అవి ఆ దేశాలకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రాయవు. ‘ఈ పత్రికలు మొదటే ఒక నిర్ణయానికి వస్తాయి. ఆ తర్వాత వార్తలు రాయడం ప్రారంభిస్తాయి’ అని బీజేపీ సీనియర్‌ ‌నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

విచిత్రమేమిటంటే, అమెరికా పత్రికల పట్ల ఎంతో అభిమానంగా వ్యవహరించే విదేశాంగ మంత్రి ఎస్‌. ‌జైశంకర్‌ను సైతం ఆ దేశ పత్రికలు విడిచిపెట్టలేదు. ‘ఈ విదేశీ పత్రికల దగ్గర సరైన సమాచారం లేనందువల్ల మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారనుకుంటే పొరపాటే. ఎన్నికల్లో ఈ పత్రికలు కూడా రాజకీయ పాత్రలు పోషించాలని ఆరాటపడుతున్నాయి’’ అని జైశంకర్‌ ‌వ్యాఖ్యా నించారు.

మితిమీరిన దుష్ప్రచారం

ఈ విదేశీ పత్రికల్లో ఎక్కువ భాగం కనీస మాత్రపు విషయ పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వం గురించి రాస్తున్నాయని వాటి వార్తలు చదివిన వారెవరికైనా అర్థమైపోతుంది. వాటి లక్ష్యం భారత దేశం, నరేంద్ర మోదీ. ఒక చాయ్‌ ‌వాలా దేశ ప్రధాని కావడాన్ని, అంతర్జాతీయంగా ప్రాబల్యం సంపాదించు కోవడాన్ని విదేశీ పత్రికలు జీర్ణించుకోలేక పోతున్నాయని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉండగా విదేశీ పత్రికలు ఈ విధంగానే ఆయన మీద అవాకులు చవాకులు రాసేవి. ఫలితంగా అమెరికా ప్రభుత్వం ఆయనకు వీసా తిరస్కరించింది. అప్పటి నుంచి ఆయనకు మీడియా పట్ల తీవ్ర వైముఖ్యం ఏర్పడింది. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా విలేఖరులు సమావేశాన్ని ఏర్పాటు చేయక పోవడానికి కూడా ఇదే కారణం.

విదేశీ పర్యటనల్లో కూడా ఆయన తమ వెంట విలేఖరులను తీసుకు వెళ్లడం లేదు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ నాయకుడైనా మీడియా పట్ల సాదరంగా వ్యవహరిస్తారు. అయితే, దేశ, విదేశీ పత్రికలు తన గురించి ఎంత దుష్ప్రచారం సాగిస్తే అంత మంచిదనే భావనలో మోదీ ఉన్నట్టు కనిపిస్తోంది. విదేశీ పత్రికలు నమ్మదగిన వార్తలను రాయకపోవడమే కాదు, ఒక్క అక్షరం కూడా ముద్రించడానికి పనికి రాని వార్తలను రాస్తున్నా మోదీ పట్టించుకునే ఉద్దేశంలో లేరు.

జి.రాజశుక

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE