సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం. బెనారస్‌లోని హిందూ యూనివర్సిటీ. ‘వసంతపంచమి’ శుభసందర్భంలో తొలిగా పుస్తక ఆవిష్కరణ. భారత పర్వ మహోత్సవం, జానపద సంగీతరంగ విస్తృతికి నియమితమైన నిపుణుల సంఘంలో కీలక స్థానం. వీటన్నింటినీ మించి-అయోధ్యలో రామజన్మభూమి మందిర ఆరంభ వేడుకల సందర్భాన, విగ్రహ ఆవిష్కరణ తరుణాన రామనామ సంకీర్తన భాగ్యం. ఈ అన్నింటా మారుమోగిన పేరు ‘మాలిని.’ భారతీయ సంస్కృతీ సమ్మాన్ విజేత, ‘నారీ గౌరవ’ బిరుదు స్వీకర్త, రమారమి దశాబ్దం క్రితమే ‘పద్మశ్రీ’ గ్రహీత. లోకగీత్ (జానపద సంగీతం)కు తాను పెట్టిన ముద్దుపేరు ‘జీవధార.’ ఈ ఫిబ్రవరి 11న పుట్టినరోజు చేసుకుంటున్న గానరాణి.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నోజ్ ప్రాంతానికి చెందిన మాలినికి తొలి నుంచే ధారణశక్తి అధికంగా ఉంది, నానాటికీ పెరుగుతూ వచ్చింది. లఖ్‌నవూలోని విశ్వవిద్యాలయ చదువులతో అది మరింత పరిణతి చెందింది తను చదివింది భత్‌ఖండే వర్సిటీలో. సంస్కృతికి, సంగీతానికి పెద్దపీట వేసే విద్యాసంస్థ. ప్రత్యేకించి గీత పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో పీజీ చేసి, స్వర్ణపతకం సొంతం చేసుకున్నారు. వందలాది జానపద కథలు, అదే సంఖ్యలో కవితలు కలిగి అతి ప్రాచుర్యం పొందిన భోజ్‌పురి భాషతో ఆమెకు ప్రగాఢ బాంధవ్యం.
సంగీతంతోపాటు చరిత్రపైనా అమిత ఆసక్తి. అందుకే ఆ అంశాలన్నీ లక్నో విశ్వవిద్యాలయంలో చదివారు. అందులోనూ మరో బంగారు పతకంసాధించారు. శాస్త్రీయ సంగీత రంగంలో అగ్రేసరురాలైన గిరిజాదేవిని ఆమె గురుదేవిగా సంభావిస్తారు. లలిత సంగీతంలో తనదైన ముద్రవేసిన ప్రవీణ. ప్రాచీన, ఆధునికతల మేళవింపు పక్రియ వైఖరి ఎంత పరమోన్నతం అంటే ‘పద్మవిభూషణ్’ అందుకునేంత. అటువంటి మేటి సన్నిధి చదువుకున్నారు మాలిని.
ఏ సంగీతమైనా గురుప్రభావంతో రాణిస్తుందనేది ఆమె నిశ్చితాభి ప్రాయం. ఎప్పుడు కచేరి చేసినా గురుప్రార్థన విధిగా ఉంటుంది. ఆ ప్రస్తావనతోనే ప్రతీ సంగీత ప్రసంగమూ కొనసాగుతుంది. ‘గురు’ పదానికి విశేష అర్థాన్ని ఒక సందర్భంలో విశదీకరించారామె.
గురువు అంటే కేవలం ఉపదేశం చేయడం కోసం కాదు, మార్గనిర్దేశం చేసేవారే గురుపదానికి అర్హులు. ప్రముఖంగా సంగీత రంగంలో గురుస్థానం అనంతం. శాస్త్ర అభ్యాసం చేయాలన్నా, నేర్చుకున్న విద్యను పదిమందికీ బోధించాలన్నా, బోధన సమయాన శిష్యులకు కలిగే సందేహాలను తీర్చి పరిపూర్ణులుగా తీర్చిదిద్దాలన్నా అవన్నీ గురూత్తములకే సుసాధ్యాలు. ఆ రీత్యా తన గురుదేవి తనను అన్ని విధాలా తీర్చిదిద్దారని ఎన్నోసార్లు చెప్పేవారు మాలినీ అవస్థి. అవస్థీ అనేది భర్త పేరులోనిది. ఆయన యూపీ ప్రభుత్వంలో అత్యున్నత హోదాలో పనిచేసినవారు. పూర్తిపేరు అవనీష్‌కుమార్ అవస్థి. విలక్షణతను కోరుకునే ఆ దంపతులు తమ పిల్లలకు పేర్లు పెట్టడంలో కూడా అదే విశిష్టత కనబరిచారు. తనయ అనన్య, తనయుడు అద్వితీయ.
కుటుంబం, నిరంతర అధ్యయనం – ఇవే తనకు సర్వదా స్ఫూర్తిదాయకా లంటారు మాలిని. ప్రోత్సహించే భర్త, ఉత్సాహాన్ని పంచుకునే పిల్లలు తన గాన ప్రస్థానానికి కరదీపికల వంటివారని చెప్తుంటారు.
పుట్టినింటి నేపథ్యాన్ని పరిశీలిస్తే… వైద్యుల కుటుంబం ఆమెది. తండ్రి నిరంతరమూ వైద్యసేవ కొనసాగుతున్నా, శాస్త్రీయ సంగీతాన్ని ఎంతగానో ఇష్టపడేవారు. తల్లి విశేషించి లలిత గీతికలను అభిమానిస్తుండేవారు. నాటి, నేటి మాదిరిగా ప్రాచీన, అర్వాచీన మిశ్రిత వికాసం మాలికలో వెల్లివిరిసిందంటే అదంతా తల్లిదండ్రుల నుంచి లభించిన వర సంపదే.
అలాగే మెట్టినింటికి సంబంధించి – అత్యున్నత అధికార హోదాలో ఉన్నప్పటికీ భర్త ఆలోచనలన్నీ సంగీతంవైపే.కళకు కావాల్సింది ఉత్సాహ వాతావరణమే అని నమ్మి ఆచరించినవారు కాబట్టే, మాలినీ అవస్థి సంగీత జైత్రయాత్ర నిరవధికంగా కొనసాగడం సులభ సాధ్యమైంది.
మరో విశేషం ఏమిటంటే – తండ్రి, భర్త ఉద్యోగబదిలీల రీత్యా పలు ప్రాంతాలను చూసే అవకాశం ఆమెకు లభించడం. అందువల్ల ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడి స్థానికతను నిశితంగా పరిశీలించడం, అనువైన విధంగా సంగీత బాణీలు సమకూర్చడం అలవాటుగా మారింది.
సంగీత కచేరీల పరంగా ఆమెకు కొన్ని దృఢ అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని అనుసరించే గానపయనం అంతా..
– స్వరం దైవదత్తం. ఎంత పవిత్రంగా వినియోగిస్తే అంత ఉన్నతంగా, ఉత్తమంగా సమాజానికి ఉపకరిస్తుంది.
-అభ్యాసం, సాధన లేకుండా ఏ కళా రాణించలేదు. ప్రముఖంగా సంగీతం అనేది ఒకచోట ఆగేది కాదు. అదొక నిరంతర చైతన్య స్రవంతి. అలాంటి ప్రవాహ వేగం నిరంతరాయం కొనసాగాలంటే కళాకారులు నిత్యశిక్షణ సాగించాల్సిందే. ప్రయోగాలు చేయాలన్నా, వాటి ఫలితాలను కళాభిమానులకు పంచాలన్నా సంగీత రంగంలోని వారు తప్పనిసరిగా సాధన చేస్తుండవలసిందే. – గొంతెత్తి పాడటమన్నది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆ గానంలో సంగీత తాత్వికత విరిస్తేనే, శ్రోతల హృదయాలను తాకినట్లవుతుంది. ఈ సౌలభ్యం జానపద గీతికలకు ఎంతో కొంత సమీపంగా ఉంటుంది కాబట్టే, భోజ్‌పురిని ఇంతగా ఆరాధిస్తున్నాను.. అంటుంటారు విదుషీమణి మాలిని.
ఎంత బాగా పాడతారో అంత చక్కగా మాట్లాడతారు. ఏ అంశం గురించిన విశ్లేషణ అయినా దీటుగా సాగిస్తారు. ప్రాంతీయత ఆధారంగా వర్థిల్లే గీతాలను అన్ని విధాలా ప్రచారానికి తెస్తుంటారామె.
సంస్కృతి, సంస్కృతం. ఈ రెండింటి స్థావరంగా సంపూర్ణానంద విశ్వ విద్యాలయాన్ని శ్ల్లాఘిస్తుంటారు. అక్కడి నుంచే మాలిని గౌరవ డీలిట్ పురస్కారాన్ని స్వీకరించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భారత అధ్యయన కేంద్రం ఏర్పాటైనపుడు ఆ మహోత్సవాల నిర్వహణ వ్యవస్థకు ఆమె కీలకవ్యక్తిగా, శక్తిగా వ్యవహరించారు.
అయిదేళ్ల కిందట కరోనా దేశమంతటినీ ఉక్కిరిబిక్కిరి చేసినపుడు… ఆలంబన, భరోసా కోసం పరితపించిన మనసులు ఎన్నెన్నో. వ్యాధిని నిరోధించాలన్నా, నివారించాలన్నా పరిపూర్తిగా కావలసింది బాధితుల మనో నిబ్బరం. ఆ ధైర్యాన్ని, దిటవుతనాన్ని పెంపొందించడానికి ఆమె సంగీత మంత్రం ప్రయోగించారు. ఒకే ఒక పాటతో ఎంతోమందిలో అంతర్గత విశ్వాసాన్ని పెంచగలిగారు.
కష్టం వచ్చింది, నష్టం విరుచుకుపడింది
నీకు దిక్కుతోచకుండా చేసింది.
జీవితాన్నే దుర్భరంగా మార్చేస్తానంటోంది!
భయపడతావా, కుంగి కృశిస్తావా
‘ఏమిటీ పరిస్థితి’ అంటూ విలపిస్తూనే ఉంటావా?
జీవితం చాలా పెద్దది నేస్తమా!
నువ్వు భయపడేంత చిన్నదేమీ కాదు.
జీవితం ఎంతో విలువైనది మిత్రమా!
నువ్వు భయపడేంత స్థితి ఏదీ అందులో లేదు!
వ్యాధులొస్తాయి, బాధలు చుట్టుముట్టేస్తాయి
దారీ తెన్నూ కనిపించకుండా చేస్తుంటాయి
అంత మాత్రానికే వణుకుతావా, విధి బలీయం అంటావా?
లొంగిపోతావా, కుంగుబాటుతో అణగారుతావా?
నిన్ను నువ్వు తెలుసుకో, భయమే శత్రువని గ్రహించుకో.
వ్యాధికి మందులుంటాయేకానీ-
అధైర్యానికి ఏ ఔషధమూ ఎక్కడా ఉండదని గమనించుకో.
నీకు నువ్వే వైద్యం; మనోధైర్యమే అన్నిటికీ పరిష్కారం!
– ఈ భావం నిండిన గీతం అంతటా విస్తరించి, సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్రమోదీ దృష్టిని ఆకట్టుకుంది. ఆ రచనను చూసిన ఆయన ‘వెన్ను తట్టిన గీతిక. ఇదే కదా ఆశాదీపిక.’ అని రీట్వీట్ చేయడం, జాతిలో ఎంతో కొంత సుధీరత నింపగలిగింది ఆ సమయంలో.
శాస్త్రాలు, కళలు సమాజ హితానికి ఉపకరించినప్పుడు ప్రశంసలూ అనుసరిస్తాయి. మాలినిని యూపీ ప్రభుత్వం ‘యశోభారతి’ అంది. సంగీత నాటక అకాడమీ అవార్డులు ప్రకటించింది. మారిషస్ ప్రభుత్వమైతే విశ్వరంగ భాషా సమ్మాన్‌తో గౌరవించింది. వీటికి తోడు మరెన్నో పురస్మృతుల వరస.
‘జానపదాన్ని కాపాడుకుందాం’ ఇదే మాలిని నినాదం ఎప్పటికీ.
‘నాది ఎంతకీ ఆగని ప్రయాణం. ఆరాటమో, పోరాటమో మాటల్లో చెప్పలేను. రెండున్నర దశాబ్దాలనాడే నా అంతరంగాన్ని వేదికమీద ప్రథమంగా విపులీకరించాను. శాస్త్రీయమా, జానపదమా అని విడిగా మాట్లాడకండని అందరినీ కోరుకుంటున్నా ఇప్పటికీ. రెండూ కీలకమే.
ఏ విధానమైనా జనం నుంచి రావాల్సిందే కదా! జానపదాలు అనేవి ఏదో ఒక భాషకో, ప్రాంతానికో చెందినంత మాత్రాన అవి అక్కడే ఉండిపోవాలని లేదుగా. విస్తరించాలి. వ్యాప్తి చెందాలి. ఏ ప్రాంతీయ భాష అయినా గళరూపాన, వాద్య విధాన ప్రజలందరికీ చెందాలి, అందాలి. ఆ కారణంగానే భోజ్‌పురికి సముచిత స్థానం కలగాలన్నదే నా అభిమతం. యువతరం ఆధునికతను కోరుతోంది. సంప్రదాయాన్ని గౌరవిస్తోంది. వారి గౌరవాన్ని, అభిమానాన్ని కలకాలం నిలపగలిగే ప్రయత్నాలే నావన్నీ. ఇందులో భాగంగానే జానపద సంగీత సంస్థను స్థాపించాను. ఇందులో నా కచేరీ ఏదీ ఉండదు.
కేవలం సూత్రధారినే! పాత్రధారులంతా జానపద కళాకారులే! అదేవిధంగా పిల్లల పాఠ్యాంశంలో ఒకటిగా జానపదమూ ఉండాలని నా కోరిక. నెరవేర్చాలని అనుకోవడం పాలకుల బాధ్యత.’ ఏ సంప్రదాయ గీతికను పాడితే ఆ వేషధారణలోనే కనిపించడం మాలినీ అవస్థి మరో ప్రత్యేకత. పాటలు రాయడం, పాడటం, నటించి మెప్పించడంలోనే ఆమెకు ఆనందం. ‘నాది చరిత్రాత్మక సంగీతం’ అన్నారంటే అర్థం – చరిత్రను సంగీతాన్ని సమరసంగా మేళవించడమే!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్