ఓ చేతిలో స్మార్ట్ ఫోన్, మరో చేతిలో ట్రైపాడ్, మైక్‌లతో అత్యంత చురుగ్గా కుంభమేళాలో కనిపిస్తున్న ఓ యువబాబాతో సెల్ఫీ దిగడానికి, ఆధ్యాత్మికతకు సంబంధించి ఆయన చెప్పే మాటలు వినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ పోటీపడుతున్నారు. ఆయనే డిజిటల్ బాబా. ఆధ్యాత్మిక గురువుగా స్వామి రామ్ శంకర్ దాస్. సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుంటారు. నెటిజన్ల సందేహాలను తీరుస్తుంటారు. డిజిటల్ బాబాకు ఫేస్‌బుక్‌లో దాదాపు 3.5 లక్షలు, యూట్యూబ్‌లో 30 వేలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 14 వేలు, ఎక్స్‌లో 3,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. బాబా అసలు పేరు రామ్ శంకర్ భట్. తన 19వ ఏట గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో బీకామ్ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుండగా ఆధ్యాత్మిక బాట పట్టాలని, సాధువుగా మారాలని ఆయన నిర్ణయించుకున్నారు. 2008లో అయోధ్యలోని లోమేష్ రిషి ఆశ్రమ్‌లో స్వామి శశివచరణ్ దాస్ మహరాజ్ సమక్షంలో సన్యాసదీక్షను పొందారు. అనంతరం స్వామి రామ్‌చరణ్ దాస్‌గా అవతరించారు. గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, బీహార్, హిమాచల్ ప్రదేశ్, తదితర రాష్ట్రాల్లోని అనేక గురుకులాలు, ఆశ్రమాల్లో ఉపనిషత్తులు, శ్రీమద్ రామాయణం, భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఔపోసన పట్టారు. చివరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో సముద్రమట్టానికి 6 వేల అడుగుల ఎత్తున్న బైజ్‌నాథ్‌లో నాగేశ్వర్ మహరాజ్ దేవస్థానాన్ని తన ఆధ్యాత్మిక మార్గానికి గమ్యస్థానంగా ఎంచుకున్నారు. అక్కడే స్థిరపడిపోయారు. సనాతన ధర్మం, ఆధ్యాత్మికత గొప్పదనాన్ని యువతకు తెలియజేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్టు డిజిటల్ బాబా తెలిపారు. అయితే సత్సంగాలకు చాలా కొద్ది మంది యువతీ యువకులు మాత్రమే హాజరవుతుండేవారని చెప్పారు. అయితే యువత ఎక్కువగా సోషల్ మీడియాలో ఉన్నారనే సంగతి తనకు చాలా ఆలస్యంగా తెలిసిందని తెలిపారు. అలా తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా తన ఆధ్యాత్మిక సందేశాలను వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో యువతకు చేరవేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ఎలాంటి సిబ్బంది లేకున్నప్పటికీ వీడియోలను సొంతంగా చేసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఆధ్యాత్మిక మార్గంలో తమను తాము తెలుసుకోవాలని, తద్వారా ఎలాంటి ఆకర్షణలకు లోను కాని స్థితికి చేరుకుంటారని, అలాగే జనన, మరణ చక్రానికి అతీతంగా జీవించ గలుగుతారని డిజిటల్ బాబా తెలిపారు. యువత ధర్మ సంస్కారానికి లోబడి జీవితాన్ని కొనసాగించాలని చెప్పారు.