అనేకానేక చర్చలు, సంప్రతింపులు, సలహాల స్వీకరణ తరువాత, వాయిదాలు పడిన తరువాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జనవరి 27 నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ, ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ప్రారంభించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి రావడం ఇంకొన్ని రాష్ట్రాలలో కూడా రావడానికి మొదటిమెట్టుగా కనిపిస్తున్నది. ఉమ్మడి పౌరస్మృతి వేరే ఏ మత విశ్వాసానికి వ్యతిరేకం కాదని, మహిళా సాధికారతకు తొలి మెట్టు అని ముఖ్యమంత్రి ధామి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, రాష్ట్రంలో అందరినీ సమదృష్టితోనే చూస్తామని కూడా చెప్పారు. తాము మొదటిసారిగా ఉమ్మడి పౌరస్మృతిని అమలులోకి తెచ్చి చరిత్ర సృష్టించామని మిగిలిన రాష్ట్రాలు కూడా దీనిని అనుసరిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఉత్తరాఖండ్ నిర్ణయం మీద అప్పుడే సణుగుడు ఆరంభమైంది. షరియాను కాదనే ఏ చట్టాన్నీ తాము గౌరవించబోమని కొందరు ముస్లిం ప్రముఖులు అప్పుడే వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.అయితే ఉమ్మడి పౌరస్మృతి నిర్ణయం రాత్రికి రాత్రికి తీసుకుని అమలు చేస్తున్నది కాదని, 2.5 లక్షల మంది పౌరుల సలహా సంప్రతింపులు ఇందులో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. బహు భార్యాత్వం, బహు భర్తృత్వం, హలాల్, ఇద్దత్,తలాక్ వంటి విపరిణామాలకు అడ్డుకట్ట వేయడానికే ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే ఆస్తిహక్కులో స్త్రీపురుషులకు సమాన అవకాశాలు ఇస్తుందని చెప్పారు. మొదటి నుంచి అనుకున్నట్టే ఆదివాసులను దీని నుంచి మినహాయించినట్టు కూడా చెప్పారు.
మీకు తెలుసో తెలియదో, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఉమ్మడి పౌరస్మృతి ఇప్పటికే అమలులో ఉన్నదని తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహా కుంభమేళా సందర్భంగా ఒక న్యూస్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. మీ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి ఎప్పటి నుంచి అమలులోకి రాబోతున్నదని విలేకరి అడిగిన ప్రశ్నకు యోగి ఆ విధంగా స్పందించారు.
కాగా మరొక బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాం అంతా సిద్ధం చేసుకున్నప్పటికి కేంద్రం చేయబోయే ఉమ్మడి పౌరస్మృతిచట్టం కోసం ఎదురు చూస్తున్నది. ఒక వేళ కేంద్రం ఆ చట్టం తీసుకువస్తే రాష్ట్రాలు తెచ్చే చట్టాలన్నీ వాటికవే రద్దయిపోతాయి. ఉత్తరాఖండ్ ఇవాళ ఉమ్మడి పౌరస్మృతి తెచ్చిందని, రేపు దేశమంతా ఇలాంటి అమలు అవుతుందని, అప్పుడు అస్సాం కూడా తీసుకు వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు.