కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేగం పెంచేలా ఉంది. ఈ బడ్జెట్ అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా ఉంది. కిసాన్ క్రెడిట్‌కార్డులపై ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు రుణాలపై ఇస్తున్న వడ్డీ రాయితీని రూ. 5 లక్షల రుణాల వరకు పెంచడం వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేస్తుంది. ధన, ధాన్య కృషి యోజనతో రాయలసీమ జిల్లాలకు ప్రయోజనం కలగనుంది. ఎంఎస్‌ఎంఈకి ఊతమిస్తూ ఎస్సీ, ఎస్టీలకు రూ.2 కోట్ల దాకా రుణం ఇవ్వాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో తోలు పరిశ్రమకు, బొమ్మల తయారీదారులకు మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం కింద రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల కేటాయింపులను రూ. లక్ష కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు పెంచారు. ఇందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు వస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం కల్పించే జల్‌జీవన్ మిషన్ కాలపరిమితిని 2028 వరకు పొడిగించడం రాష్ట్రానికి మేలు చేస్తుంది. అమరావతికి రూ.15 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టడంతో పాటు, హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు ఇప్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత వస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను రాష్ట్రం పెద్దఎత్తున ఉపయోగించుకోవడానికి వీలుంది. రాష్ట్రానికి మారిటైం ఫండ్, షిప్ బిల్డింగ్ ఫండ్ కేటాయిం చారు. దుగరాజపట్నం దగ్గర ఏర్పాటు చేయనున్న షిప్పింగ్ బిల్డింగ్ యూనిట్‌కు ఈ నిధి దక్కనుంది. పోలవరానికి రూ.5,936 కోట్లు కేటాయించారు. ఇది రూ.12 వేల కోట్లతోనే అయిపోదు. ప్రతి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచుకుంటూ నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని అన్నారు.
విభజన హామీల అమలుకు నిధులు
రాష్ట్ర విభజన హామీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్‌లో కేంద్రం మాట నిలబెట్టుకుంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేటాయింపులు చేసింది. విశాఖ ఉక్కుకి కూడా నిధులు సమకూర్చింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చేందుకు, పోలవరాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించింది. అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.15 వేల కోట్లు, రానున్న సంవత్సరాల్లో మరిన్ని నిధులు సమకూరుస్తామని వెల్లడిరచింది. విదేశీ సాయం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులను సంప్రదించా మని, ఈ రెండు సంస్థలతో లీగల్ ఒప్పందాలపై డిసెంబరు 20, 26 తేదీల్లో సంతకాలు కూడా జరిగాయని వివరించింది. సవరించిన అంచనాల ప్రకారం.. పోలవరం తొలి దశ పూర్తవడానికి రూ.30,436. 95 కోట్ల వ్యయమవుతుందని, ఇందులో ఇప్పటికే రీయింబర్స్ చేసిన మొత్తం పోగా`రూ.12,157.36 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపింది. దీనిలో ఈ ఏడాది రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరులో ప్రధాన డ్యాం పనులు, కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించి కొత్త ఆయకట్టు అభివృద్ధికి, ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణకు వీలు కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
పోలవరానికి అదనపు నిధులు
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,936 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులకన్నా రూ.424 కోట్లు అదనం. ఈ నిధుల్ని అడ్వాన్స్‌గానే తెచ్చుకోవచ్చు. నిధులకు ఇబ్బంది తొలగడంతో ఇక పోలవరం ప్రాజెక్టు పనుల్ని షెడ్యూల్ ప్రకారం పరుగులు పెట్టించొచ్చు. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు గాడిన పడిరది.కేంద్రం తాజా డీపీఆర్‌ను ఆమోదించి మరో రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించి, అడ్వాన్సుగా నిధులు ఇవ్వడంతో పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వరుసగా బడ్జెట్లో కేటాయింపులు చూపుతోంది. అడ్వాన్సు నిధులూ ఇస్తోంది. ఇక 2024-25 బడ్జెట్‌లో రూ.5,512 కోట్లు కేటాయించగా,అందులో ఇంత వరకు ఇచ్చిన నిధులు సుమారు రూ.2,807 (అడ్వాన్సు నిధులు కలిపి). ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నిధులు రూ.2,700 కోట్లు. అవీ ఇస్తే ఈ ఆర్థిక సంవత్స రంలో ఇచ్చినన్ని నిధులు ఎప్పుడూ ఇవ్వనట్లే.
విశాఖ స్టీల్‌కు అమల్లోకి ప్యాకేజీ
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా పెంచింది. 2024-25 బడ్జెట్‌లో తొలుత కేవలం రూ.620 కోట్లు కేటాయించిన ఉక్కుశాఖ తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఆ మొత్తాన్ని రూ. 8,622 కోట్లకు పెంచింది. అదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్స రానికి రూ.3,205 కోట్లు కేటాయించింది. దీని ప్రకారం ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో స్టీల్ ప్లాంటుకు రూ.11,917 కోట్లు ఇచ్చినట్లయింది. ఇందులో రూ.11,418 కోట్లు బడ్జెట్ సపోర్ట్ రూపంలో, రూ.499 కోట్లు అంతర్గత బడ్జెటరీ వనరుల ద్వారా సమకూరుస్తారు. ఇది ఇటీవల ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ కంటే ఎక్కువ. ఈ ప్లాంటుకు 2023-24లో కేటాయించిన రూ.636,46 కోట్లను పూర్తిగా ఖర్చు చేసింది. ప్లాంటుకు ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాలను కేంద్ర ఆర్థికశాఖ ఈక్విటీ షేర్లుగా పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అమల్లోకి వచ్చినట్లయింది.
జల్ జీవన్ మిషన్ కొనసాగింపు
గ్రామాల్లో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించడం రాష్ట్రానికి కలిసొచ్చే అంశం. బోర్ల నుంచి కాకుండా సమీప జలాశయాల నుంచి నీరందించేలా రూ.70 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన పనులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రం ఆమోదానికి పంపింది. పథకం గడువు పొడిగింపుతో వీటిని సాధించుకునే అవకాశం వచ్చింది. జలజీవన్ మిషన్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. కేంద్రం రూ.10,978 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తే ఐదేళ్లలో రూ.4,235 కోట్లే వినియోగించుకుంది. రాష్ట్ర వాటా నిధులు సరిగా కేటాయించకపోగా, కేంద్ర నిధులనూ ఇతర అవసరాలకు వాడేసుకుంది. దీంతో రాష్ట్రంలో 4.78 లక్షలకు పైగా ఇళ్లకు కుళాయిల ద్వారా 2024 నాటికి తాగునీటి సౌకర్యం కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. ఇచ్చిన కొద్దిపాటి కుళాయిల ద్వారా నీరు సరిగా సరఫరా చేయలేకపోయింది.
35,491 కోట్ల ప్రత్యేక గ్రాంటు
2024 డిసెంబరు 24 నాటికి రాష్ట్రానికి రూ.3,950.31 కోట్ల మేరకు మూలధన వ్యయాన్ని ఆమోదించినట్లు కేంద్రం తెలిపింది. ప్రత్యేక సాయం కింద రూ.3,685.31 కోట్లు విడుదల చేసింది. 2015 జూన్ నుంచి గత డిసెంబరు వరకూ విభజన చట్టం కింద రాష్ట్రానికి రూ.35,491.57 కోట్ల ప్రత్యేక గ్రాంటు మంజూరు చేశారు.
– పూర్వోదయ ప్రాజెక్టు క్రింద విజన్ పత్రాలను రూపొందించాలని ఏపీ, ఒడిశా, బిహార్ రాష్ట్రాలను కోరినట్లు కేంద్రం తెలిపింది. స్థూల ప్రణాళికలకు అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
– విభజన చట్టంలో భాగంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతా లకు ఇప్పటికే రూ.1,750 కోట్లు విడుదల చేయగా మరో రూ.350 కోట్లు ఇవ్వాల్సి ఉందని, యూసీల కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
– విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. 2024`25లో రూ.150 కోట్ల కేటాయించి అంచనా సవరణ నాటికి దానిని రూ.285 కోట్లకు పెంచింది. 2025`26 ఆర్థిక సంవత్సరానికి రూ.730 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ కంటే 386 శాతం సవరించిన అంచనాల కంటే ఇది 156 శాతం ఎక్కువ.
– రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ), సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన వర్సిటీకి నిధులు కేటాయించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద మంగళగిరి ఎయిమ్స్‌కు కూడా నిధులు మంజూరు చేశారు.
పన్నుల్లో వాటా రూ.57,566 కోట్లు
2025%-26లో ఏపీకి మొత్తం పన్నుల్లో 4.067 శాతం.. అంటే రూ.57,566.31 కోట్లు లభిస్తుందని కేంద్ర బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నారు. ఇందులో కార్పొరేషన టాక్స్ రూపంలో రూ.16,074.48 కోట్లు, ఆదాయ పన్ను రూపంలో రూ.21,448.05 కోట్లు, కేంద్ర జీఎస్టీ 16,759.03 కోట్లు, కస్టమ్స్ సుంకం రూ.2,649.66 కోట్లు, ఎక్సైజ్ సుంకం రూపంలో రూ. 550.47 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.1.66 కోట్లు లభిస్తాయని తెలిపారు.
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్