భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో అతివేగంగా దూసుకుపోవడం మనం గమనిస్తున్నాం. గత దశాబ్ది కాలంగా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తీరు, ఆర్థిక సంస్కరణలకు ఊతం అందిస్తున్న విధానం ప్రశంసనీయం. పరివర్తన దిశగా జరుగుతున్న ప్రయత్నం భారత్‌ను సమృద్ధ, సబల సమర్థ ఆర్థికశక్తిగా, ప్రపంచ నేతగా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన సాధారణ బడ్జెట్‌ అన్ని రంగాల వారిని, ముఖ్యంగా పేదలు, యువకులు వ్యవసాయదారులు, మహిళలను మెప్పించేదిగా ఉంది. దేశాభివృద్ధి గతికి అంతరాయం లేకుండా ప్రజల సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది.

మధ్యతరగతికి ఊరట

ఆదాయపు పన్ను మినహాయింపు 12.75 లక్షల రూపాయలకు పెంచడం కోటిపైగా ఉన్న మధ్య తరగతి ఆశావహులకు ఊరటనిచ్చే చర్య. దీని ఉద్దేశం వారికి అదనపు కొనుగోలు శక్తిని అందించడం కావచ్చు. పర్యవసానంగా వస్తువులకు గిరాకీ పెరగడం, ఉత్పాదక రంగాలకు ఊతాన్నివ్వడం, తద్వారా భారత అభివృద్ధి గతిని త్వరితం చేయడం లక్ష్యం. అయితే కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వం ఏ విధంగా సమకూర్చుకుంటుందో వేచి చూడాలి.

వ్యవసాయదారులకు ప్రోత్సాహకాలు

2047సరికి మన దేశ ఆర్థిక నిర్భరత మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు పప్పుదినుసులు, ఆహారధాన్యాలు, చిరుధాన్యాలు అందజేయాలనే కృత సంకల్పం వ్యక్తమయింది. ‘గ్రామీణాభివృద్ధి-అవసరాలను తట్టుకునే సామర్థ్య యోజన’ (Rural Prosperity and resilience) అమలులోకి రాబోతున్నది. 7.7 కోట్ల వ్యవసాయదారులు, మత్స్యకారులు వంటి గ్రామీణ ప్రాంతవాసులకు ‘కిసాన్‌ క్రెడిట్‌ కార్డు’ ద్వారా స్వల్పకాలీన రుణాలు` రూ.3 నుండి 5 లక్షలు అందుబాటు లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుండి వలసలను ఆపడానికి అనేక ఉద్యోగావకాశాలు, పథకాలు ప్రకటించడం విశేషం. ఆరు పథకాల ప్రకటనల ద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచి గాడిలో పెట్టడమే దీని పరమావధిగా చెప్పవచ్చు.

డిజిటల్‌ వ్యవస్థ – అభివృద్ధి యంత్రం

ఈ బడ్జెట్‌లో కేంద్ర బిందువు డిజిటల్‌ వ్యవస్థను బలోపేతం చేయడంగా కన్పిస్తోంది. అందువలనే కృత్రిమ మేధ (Artificial Intelligence), యంత్ర అధ్యయనం (Machine learnings) అతిలోతైన సాంకేతిక పరిజ్ఞానాల (Deep Technology) కోసం కేటాయించిన అధిక నిధులు, పెట్టుబడులు వికాస గమనాన్ని త్వరితం చేయడమే ఉద్దేశంగా గోచరిస్తోంది. దీనికోసం 10 వేల కొత్త ఫెలోషిప్‌లు (fellowships) సాంకేతిక స్థాయిని పెంచేందుకు కావాల్సిన పరిశోధనలు నిర్వహించేందుకు ఐఐటి / ఐఐఎస్‌సిలకు కేటాయించారు. వికసిత భారత్‌ కోసం, ఒక ప్రబల ప్రపంచ ఆర్థికశక్తిగా అవతరించడం కోసం కృత్రిమ మేధస్సు ఉపయోగం అనివార్య సాధనంగా గుర్తించారని చెప్పవచ్చు.

నైపుణ్యాల వృద్ధికి పెద్దపీట

భవిష్యత్తు అవసరాలకు, ఉద్యోగాల కల్పన, నిపుణులను, మానవ వనరులను ప్రపంచానికి, భారతదేశానికి అందజేయడం; ప్రధానంగా కౌశల్యాల వికాసం కోసం అన్ని రంగాల్లో చర్యలు ద్యోతకమవు తున్నాయి. ఐటిఐల సంఖ్య పెంచడం, 50 వేల అటల్‌ టింకరింగ్‌ లేబ్‌లను (Atl) రాబోయే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొల్పాలనే ఆలోచన అభినందనీయం. విద్యాలయాల్లో నైపుణ్య వికాసం (Skilling while Schooling) అనేది జాతీయ విద్యావిధానం. 2020 నుంచి ప్రముఖంగా ప్రస్తావించుకుంటున్న ఈ అంశం కోసం ఈ బడ్జెట్‌లో దానికనుగుణంగా వృత్తి విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. విద్యకు సాంకేతికతను జోడిరచడం ద్వారా ఉద్యోగావ కాశాలను పెంచడం, ఆర్థిక స్వయంసమృద్ధిని సాధించడం లక్ష్యంగా యోజన సాగింది. దీనివలన సాంకేతిక సామర్థ్యంతో యువకులకు శిక్షణ ఇవ్వడం, వారు తమ సృజనశీలతనుపయోగించి కొత్త పద్ధతుల ద్వారా ఆలోచనలకు, సామర్థ్యానికి ప్రోత్సాహం పొందే అవకాశం రావడం విశేషం.

కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం

కొత్త పరిశ్రమలకు అంకురార్పణ చేయడం కోసం ఈ బడ్జెట్‌లో కేటాయింపులు, పారిశ్రామికాభి వృద్ధి గతిని పెంచేదిగా, పరిశ్రమల వ్యవస్థాపక పరిస్థితులను పూర్తిగా మార్చేదిగా ఉంది. మారుతున్న అంతర్జాతీయ అవసరాలకనుగుణంగా, తమను సశక్తులుగా సవాళ్లను అధిగమించి పనిచేసేవారుగా భారత యువశక్తి తయారవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఏర్పరచిన నిధి, పన్ను రాయితీలు, పరిశ్రమలకు రుణ హామీ పథకాలు పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తిని, ఉత్పాదకతను ఉద్యోగవకాశాలను తప్పక మెరుగుపరుస్తాయి. ఆత్మనిర్భర భారత్‌ దిశగా ప్రయాణాన్ని మరింత సుగమం చేయనుంది.

భారతీయ భాషలకు ప్రాచుర్యం

‘భారతీయ భాషా పుస్తక పథకం’ ప్రవేశపెట్టడం ద్వారా వందలాది భారతీయ భాషలకు ప్రాధాన్యం పెంచి, జీవం పోసింది ఈ బడ్జెట్‌.

పాఠశాల – ఉన్నత విద్య పుస్తకాలన్నింటినీ భారతీయ భాషల్లో అందించడానికి డిజిటల్‌ పుస్తకాల వేదిక (Digital platform) ప్రారంభాన్ని ప్రకటించారు. అలాగే మరుగున పడుతున్న భారతీయ భాషలకు ప్రాధాన్యాన్ని పెంచడం కూడా ఇక్కడ గమనార్హం. వివిధ విద్యా సంస్థలు, మ్యూజియంలు, ప్రాచీన గ్రంథాలయాలు, వివిధ వక్తుల వద్దనున్న కోటికి పైగా ప్రాచీన రాత ప్రతుల వారసత్వ సంపద వృద్ధి కోసం, సర్వేక్షణ, దస్తావేజుల తయారీ, వాటిని సంరక్షించడం కోసం ‘జ్ఞానభారతం మిషన్‌’ ప్రారంభించడం స్వాగతించ దగ్గ పరిణామం. ఇది కూడా జాతీయ విధానంలో పేర్కొన్న ‘బహు భాషావాదాన్ని’ (Multilingualism) అమలు చేసే దిశగా ఉంది.

ఎగుమతులకు ఊతం

అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్ధం చేసేందుకు ‘భారత్‌ ట్రేడ్‌ నెట్‌’ (Bharat Trade net) పేరుతో ఒక ఏకీకృత డిజిటల్‌ వేదిక నిర్మాణం జరుగుతుంది. అలాగే అంతర్జాతీయ సామర్థ్యం కల్గిన కేంద్రాల పెంపు కోసం వివిధ రాష్ట్రాలకు మార్గదర్శ కాలు జారీ చేసేందుకు ‘గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్స్‌’ స్థాపనకు కూడా ప్రతిపాదన ఉంది. దానికోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపకల్పన (National frame work) యోజన కూడా విశేషమైనదే. వాయు మార్గ రవాణా పెంచేందుకు ప్రత్యేక గిడ్డంగులు ఏర్పాటు చేయడం, హస్తకళా ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం అభినందనీయం.

పర్యాటక రంగానికి ప్రేరకాలు

ఏటా పెరుగుతున్న దేశ విదేశ పర్యాటకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, 50 పర్యాటక కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. గత సంవత్సరం రెండు కోట్లకు పైగా విదేశీ పర్యాటకులు సందర్శించారు. ఈ సంఖ్యను పెంచడానికి, ఉపాధి కల్పనతో పాటు విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు ప్రణాళికను రచించారు. దీనికోసం యువకులకు ప్రత్యేక శిక్షణ, ముద్రా రుణాలను ఈ రంగానికి అందజేయడం, ఇ`విసా సౌకర్యాలను (e-visa) క్రమబద్ధం చేయడం, వారి కృషిని గుర్తిస్తూ రాష్ట్రాలకు పారితోషికాలు, ప్రోత్సాహకాలు నిర్ణయించడం గమనార్హం.

మొత్తం మీద ఈ బడ్జెట్‌ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉందనడంలో సందేహంలేదు. ఎంత చేసినా మెరుగుపర్చడానికి కావాల్సిన అంశాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే అందరి విజ్ఞప్తులను పరిగణనలోనికి తీసుకుని రూపొందించిన బడ్జెట్‌లా ఉంది. అభివృద్ధికి, సామాజిక న్యాయానికి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ తాత్కాలిక ప్రయోజనాలకు లొంగిపోకుండా, దేశ భవిష్యత్తుకు దీర్ఘకాలిక లక్ష్యాలకనుగుణంగా రచించినదిగా స్పష్టమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కతీతంగా ప్రపంచ స్థాయిలో భారతీయ పతాకం ఎగరవేయాలనే తపన కన్పి స్తోంది. ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు ఎగుమతులు, వినియోగంపై ప్రధానంగా దృష్టిపెట్టడం వలన ఈ బడ్జెట్‌ అనేక రకాలుగా లాభదాయక ఫలితాలను ఇవ్వవచ్చుననడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఎంతటి గొప్ప యోజనయినా, దాని విజయం అమలు పైననే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ అందరు లబ్ధిదారుల (Stake Holders) భాగస్వామ్యంతో ఉద్దేశించిన లక్ష్యాలను తప్పక చేరగలమనే ఆశ ఉంది. అభివృద్ధి ఫలాలనందరికీ అందజేయడంలో మనందరి పాత్ర కూడా ఉందనే సత్యాన్ని గ్రహించాలి.

– దూసి రామకృష్ణ, గుడిలోవ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE