రూ. 50.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ బడ్జెట్‌ సమర్పించారు.  2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యంగా ఆర్ధికవ్యవస్థలో ‘సామాజిక న్యాయం’, ‘సమ్మిళితాభివృద్ది’ దిశగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది. ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో, నెమ్మదించిన ఆర్థికవ్యవస్థలో పునరుత్తేజం తేవటానికి అనేక ప్రతిపాదనలు బడ్జెట్‌లో కనిపిస్తాయి. భారత ఆర్థికవ్యవస్థను ప్రపంచ ఆర్థికవ్యవస్థల స్థాయికి చేర్చడానికి సమ్మిళిత సమగ్రాభివృద్ధిపై బడ్జెట్‌ దృష్టి పెట్టింది. ప్రధానంగా నాలుగు వర్గాల`పేదలు, మహిళలు, అన్నదాతలు, యువత`సంక్షేమంపై ఇది దృష్టి కేంద్రీకరించింది. వీరు పురోగమిస్తేనే దేశం పురోగమిస్తోంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న ఆర్థికవ్యవస్థ 10 ఏళ్లలో 5వ స్థానానికి చేరుకునేందుకు కృషి జరిగిందని నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు.

సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలూ, వనరులూ అందాయనీ, వనరుల కేటాయింపు కంటే ఎక్కువగా ఫలితాల సాధనపై దృష్టి పెట్టడం వల్లన ఈ 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుండి విముక్తి లభించిందనీ విత్తమంత్రి చెప్పారు.

రక్షణ రంగానికి సముచిత కేటాయింపులు, రైతులకు 6 పథకాలు, దీర్ఘకాలిక వ్యాధులకు వినియోగించే కొన్ని ఔషధాలపై సుంకాల మినహా యింపు, కొత్తగా 75 వేల మెడికల్‌ సీట్లు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్స్‌, విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగం, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు, వృద్ధులకు వచ్చే బాంక్‌ వడ్డీపై పన్ను మినహాయింపు, బ్యాటరీల ప్రోత్సాహం వంటి కీలక ప్రతిపాదనలు బడ్జెట్‌లో చేశారు. జీడీపీలో4.4 శాతానికి ఆర్థిక లోటు పరిమితం అవుతుందని అంచనా వేశారు.

సాంకేతిక విజ్ఞాన ఆధారిత ఆర్థికవ్యవస్థను నిర్మించడమే బడ్జెట్‌ లక్ష్యమని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రజా భాగస్వామ్యం (జన్‌ భాగిదారి) సబ్‌ కా సాత్‌ సబ్‌ కా ప్రయాస్‌ (అందరితో కలిసి అందరి కృషి) సబ్‌ కా వికాస్‌ (అందరి వికాసం) అవసరాన్ని గుర్తించారు. పౌరులకు విస్తృత అవకాశాలు కల్పించడం, మెరుగైన ఉపాధి అవకాశాలు, వృద్ధిరేటు పెరుగుదల స్థిరమైన సూక్ష్మ ఆర్థికవ్యవస్థ బలోపేతం ద్వారా బడ్జెట్‌ లక్ష్యాల సాధనకు కేటాయింపులు చేశారు.

దీర్ఘకాలిక లక్ష్యాలైన ఆర్థిక సంఘటితత్త్వం ఉపాధి కల్పన వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు వీలుగా డిమాండును పెంచేందుకు భిన్నమైన నిర్ణయాలు ప్రకటించారు.

ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే చర్యలు

బడ్జెట్‌ను స్థూలంగా పరిశీలిస్తే అంతర్జాతీయ పరిణామాలను తట్టుకొని మన ఆర్థికవ్యవస్థ నిలబడేలా, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా ప్రతిపాదనలు చేసింది. ఇంకా, నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా, గ్రామీణ వ్యవసాయదారులకు మేలు చేస్తూ గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టికి, స్వావలంబనకు దోహదపడే ప్రతిపాదనలు కూడా చేసింది. ఉన్నంతలో ఈ బడ్జెట్‌ వ్యవసాయరంగానికి భరోసానిచ్చిందనే చెప్పాలి. గత 4ఏళ్లలో కనిష్ఠ స్థాయికి స్థూల దేశీయోత్త్పత్తి (జీడీపీ) 6.4 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మందగించాయి. దీనికి తోడు భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రజల వినియోగస్థాయి పడిపోవడం, నిరుద్యోగిత వీటికి అదనం. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణత వల్ల మన ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటుపై ప్రభావం పడిరది. జీడీపీ అంచనా కుదించి నందున ఆర్థికవృద్ధిని ప్రభావితం చేసే విధానాలకు ఈ బడ్జెట్‌ ప్రాధాన్యమిచ్చింది.

వినియోగరంగానికి పెద్దపీట

మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగాల కల్పన, వ్యాపార సౌలభ్యత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆర్థికవ్యవస్థను పునరుజ్జీవింప చేస్తుందని పన్నుల సంస్కరణలు, ప్రోత్సాహకాలు ఆర్థిక అభివృద్ధికి కీలకంగా ఉన్నందున వాటిలో సంస్కరణలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. జీడీపీ పెరగాలంటే ప్రజల వినియోగం పెరగాలి. ప్రజల వినియోగం పెరగాలంటే చేతుల్లో డబ్బు ఉండాలి. గత ఏడాది పట్టణ ప్రాంత వినియోగం తగ్గడం వల్ల దాని ప్రభావం జీడీపీపై పడిరది. పట్టణ ప్రాంత వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చర్యలు చేపట్టింది.

జనరంజక పథకాలు లేవు

బడ్జెట్‌లో జనరంజక నిర్ణయాలు పథకాలు ప్రకటించలేదు. ద్రవ్యలోటు తగ్గింపునకు ప్రాధాన్య మిచ్చారు. మౌలిక వసతుల కల్పనకు 2024లో రూ. 11.11 లక్షల కోట్లు కేటాయించగా, 2025-2026 బడ్జెట్‌లో రూ.10.18 కోట్లు మాత్రమే కేటాయిం చారు. దాదాపు రూ.93 వేల కోట్లు ఖర్చు కాలేదు. లోకసభ ఎన్నికల వల్ల ఆ నిధులు మిగిలిపోయాయి.

వృద్ధి-ఉపాధి కల్పన

సమ్మిళిత వృద్ధే లక్ష్యంగా ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యం ఇచ్చారు. గృహ నిర్మాణం, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. బడ్జెట్‌లో మహిళలు యువత స్వయంసహాయ బృందాల మహిళల సాధికారత సాధనకు కేటాయింపులు ఉన్నాయి. పరిశోధనలకు అవిష్క్రరణలకు అధిక నిధులు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆర్థికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

విద్య వైద్య రంగాలకు పెద్ధపీట

వైద్య, విద్యా రంగాలలో నెలకొన్న సమస్యలను నివారించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. వైద్యానికి చెందిన మందుల పరికరాలు, ఔషధ పరిశ్రమకు ఇస్తున్న పన్ను మినహాయింపు పరిశోధనను ప్రోత్సహించడం, నానో యూరియా విజయవంతం కావడం వల్ల నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సాహిస్తారు.

 ఆరోగ్యం

మాతా శిశు సంరక్షణ కోసం ఉన్న పథకాలను ఒక సమీకృత కార్యక్రమం కిందికి తీసుకురావడం, మెరుగైన పోషకాహార పంపిణీ, ఆశా వర్కర్స్‌, అంగన్‌ వాడీ కార్యకర్తలు, సహాయకులను ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్య బీమా కల్పన చర్యలు, జనాభాలో సగభాగం మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఆర్థిక సాధికారతకు ఉపకరిస్తుంది. దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో డేకేర్‌ క్యాన్సర్‌ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదన అభినందనీయం.

విద్యారంగం

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రపంచంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలంటే, విద్య, వైద్యరంగాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలంటే ఆ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. జాతీయ విద్యా విధానం (చీజుూ) 2020 ప్రకారం దేశ జీడీపీలో కనీసం 6% కేటాయించాలి. కానీ దశాబ్దకాలంగా 4.1 శాతం మాత్రమే కేటాయింపులు జరిగాయి. క్షేత్ర స్థాయిలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్‌లో రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలు ఏర్పాటుకు ప్రతిపాదించడం హర్షణీయం. వచ్చే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ మాధ్యమిక, ప్రాథమిక పాఠశాలలకు బ్రాడ్‌ బాండ్‌ కనెక్షన్‌ ఇచ్చి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి చేరువ చేయాలని కూడా ప్రతిపాదించారు.

ఐఐటీ, ఐఐఎస్‌ అభ్యసించే విద్యార్థులకు జ్ఞాన భారత మిషన్‌ ఏర్పాటు ద్వారా రూ.10వేల కోట్ల ఉపకార వేతనాలు ఇవ్వడం వల్ల ఉన్నత విద్యను ప్రోత్సహించే చర్యగా పేర్కొనవచ్చు.

వ్యవసాయం- అనుబంధ రంగాలు

వ్యవసాయరంగం సహకార రంగానికి ప్రాధా న్యత ఇచ్చారు. వ్యవసాయ ఆధారిత ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి వ్యవసాయ అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు పెరిగాయి. చేపల ఉత్పత్తి, పాల ఉత్పాదకత, ఆహార శుద్ధి పరిశ్రమలు, వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసే ప్రైవేట్‌, పబ్లిక్‌ పెట్టుబడుల ఆహ్వానం, నూనె గింజల ఉత్పత్తి` ఉత్పాదకత పెంచడం, వంటనూనెల్లో ఆత్మ నిర్బరత సాధనకు వ్యూహాల రూప కల్పన వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సోయా, సన్‌ ఫ్లవర్‌ పంటలను ప్రోత్సహించే చర్యలు ఉన్నాయి.

వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించడానికి పప్పుధాన్యాల పంటలపై ప్రత్యేక దృష్టి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి కోసం ప్రత్యేక బోర్డ్‌ ఏర్పాటు, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చర్యలు వ్యవసాయరంగ అభివృద్ధికి దోహదపడతాయి. రైతాంగం ఉపయోగించే వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించి రాయితీలు ఇస్తే రైతాంగానికి మరింత మేలు చేకూరుతుంది.

జీన్‌ బ్యాంకుల ఏర్పాటు

బ్యాంకుల ఏర్పాటు ద్వారా విత్తనాల కొరతను అధిగమించడం, ఆహార సమస్యను పరిష్కరించడం, ఆహార భద్రతకు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ఉత్పత్తి చేయడం, వాతావరణ పరిస్థితులను తట్టుకొనే సస్యరక్షణ చర్యలు, పప్పు ధాన్యాల దిగుబడులు పెంచటానికి రూ. 1000 కోట్లతో ప్రణాళికలు చేపడతారు.

పంటల బీమా మార్కెటింగ్‌

అధిక దిగుబడులు ఇచ్చే ఆధునిక సాగు పద్ధతుల వినియోగం, మార్కెట్‌ అనుసంధానం, పంటల బీమా, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులు వంటి పథకాలతో పాడి రైతులను ఆదుకునే చర్యలు వారికి లాభం చేకూరుస్తాయి.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా అందించే రుణ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. దీనివల్ల రైతుల రుణభారం తగ్గుతుంది. ప్రధానమంత్రి ధన్‌ ధాన్య కృషి యోజనను దేశంలో 100 వెనుకబడిన జిల్లాల్లో అమలు చేస్తారు. కొత్త పథకం కింద దేశంలో 1.7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతారు. కౌలుదారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ ద్వారా రుణ సౌకర్యం కల్పించనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు దీనివల్ల 7.7 కోట్ల మంది కౌలు రైతులు లబ్ధి పొందుతారు. 11.8 కోట్ల మందికి పీఎం సమ్మాన్‌ యోజన కింద ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారు. దీనితో 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. గ్రామీణ ప్రాంతాలలో ఔత్సాహిక యువతను వ్యవసాయ స్టార్టప్‌ల వైపు మొగ్గు చూపేటట్టు చేయడానికి సహకార వ్యవసాయాభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తారు. దీనితో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి.

నూతన సాంకేతిక నైపుణ్యంతో కూడిన సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమలు చేయడం, వ్యవసాయాధారిత పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపన, కిసాన్‌ డ్రోన్స్‌ ఏర్పాటు, రైతులకు ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో డిజిటల్‌ హై టెక్‌ సేవలను అందించడం, సస్యరక్షణ పిచికారి సేవలు, భూదస్త్రాల డిజిటలీకరణ, ఆధునీకరణ, స్పెషల్‌ డేటా అభివృద్ధి చేయడం, భారతదేశంలో జియో మిషన్‌ ప్రారంభించడం వంటి ప్రతిపాదనలు గ్రామీణ వ్యవసాయ ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే చర్యలు. అయితే బిందు సేద్యం ఆపరేషన్‌ గ్రీన్‌ పథకం కోసం కేటాయించిన నిధులు నిరాశాజనకంగానే ఉన్నాయి. పంటలకు సాగునీటి పొదుపు ‘సూక్ష్మ సేద్యం పథకానికి బిందు తుంపర్ల పరికరాలపై రైతులకు రాయితీలు లేవు. ఎరువుల సబ్సిడీపై కోత విధించారు.

ఆహారపంటలకు పంట శుద్ధి నిల్వ సదుపాయాలకు ఆశించిన మేరకు ప్రోత్సాహం ఇవ్వలేదు. ఇప్పటి వరకు 19 పంటలనే గుర్తించారు. జాతీయ ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్‌ (ఈనామ్‌)1000 కొత్త మార్కెట్లను ఆన్‌లైన్‌ వేదికలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు లేకపోవడం వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు లభించని స్థితి రైతాంగాన్ని నిరాశకు గురిచేయవచ్చు.

 యువత సాధికారిత – సాంఘిక సంక్షేమం

ఇది అన్ని రంగాలలో అర్హులకు అవకాశాల కల్పన, ఉద్యోగాల కల్పన, నైపుణ్యం మెరుగుపరిచే దిశగా అడుగులు వేసిన బడ్జెట్‌ అని చెప్పవచ్చు. యువతలో ఉన్న సామార్ధ్యాన్ని వెలికితీయడం కోసం మేక్‌ ఫర్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌ తయారీకి అవసరమైన నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయడం, గ్లొబల్‌ నిపుణుల భాగస్వామ్యంతో 5 నేషనల్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాల ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో ప్రతిభా పాటవాల వికాసానికి బడ్జెట్‌ చేయూతనిస్తుంది.

రైల్వేలకు…

మౌలిక సదుపాయాల కల్పన, రైల్వేల అభివృద్ధికి రూ. 2.65 లక్షల కోట్లతో కొత్త రైల్వేల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, సరుకు, ప్రయాణికుల రవాణా సౌకర్యాలను చేపట్టి, మెరుగుపరుస్తారు. మెట్రో, నమోభారత్‌ రైళ్లను పెద్ద నగరాలకు విస్తరించడం, వందే భారత్‌ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా స్థాయిని పెంచడం వల్ల ప్రయాణికులకు మంచి సేవలు అందుబాటులోకి వస్తాయి.

రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం ప్రకారం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం అందిస్తారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపరిచేదే. పీఎం ఆవాస యోజనకు రూ. 80వేల కోట్లు కేటయించడం ఆర్థికవ్యవస్థలో ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తుంది. బడ్జెట్‌ సుస్థిర సమ్మిళిత అభివృద్ధికి స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణం సృష్టించి శీఘ్రతర ఆర్థికాభివృద్ధితో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత ఉపాధి ఆదాయ సృష్టికి దోహద పడుతుంది.

పెట్రోల్‌, డీజిల్‌ వల్ల వెలువడే కాలుష్య కట్టడే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు చోదక శక్తిగా విద్యుత్తును ఎన్నుకుంది. ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీని విస్తృత పరిచింది. భారత రవాణా వ్యవస్థను ఎలక్ట్రానిక్‌ ఆధారిత వ్యవస్థగా మార్చడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే విద్యుత్తు ఉత్పత్తిలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించ డానికి ప్రత్యామ్నాయ సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తులపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదు.

రాష్ట్రాల భాగస్వామ్యంతో గ్రామీణ సమృద్ధి పురోగమన కార్యక్రమం ద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను నివారిస్తారు. దారిద్య్ర రహిత భారతాన్ని సృష్టించడానికి గ్రామాలను నిర్మించేందుకు ఆర్థికమంత్రి ప్రకటించిన గ్రామీణాభివృద్ధి పథకం ఆ లక్ష్యం సాధిస్తుంది. ప్రధానమంత్రి గ్రామ్‌ యోజన పథకానికి రూ.19 వేల కోట్ల కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ పథకానికి రూ. 54,832 కోట్లు కేటాయిం చారు. వాస్తవంగా ఖర్చు చేసింది 32, 426.33 కోట్లు మాత్రమే.

సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు

దేశీయ ఉత్పత్తి రంగాల్లో 38 శాతం ఉత్పత్తి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచే వస్తుంది. విదేశీ ఎగుమతుల్లో వీటి వాటా గణనీయం. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి వీటికి ఉన్న రుణ పరిమితి రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్లకు పెంచారు. తాజా బడ్జెట్‌లో స్టార్టప్‌లకు ఉన్న రుణ పరిమితి రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్లకు పెంచారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం ప్రకటించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు కలుగు తాయి. ఆర్థికవ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత పెరిగి ఆదాయాల సృష్టి జరిగి కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు పెరిగి ఆభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఈ బడ్జెట్‌లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వాటి వ్యాపారాన్ని కొనసాగించడానికి ఉన్న నిబంధనలను సరళీకరించడం ద్వారా ఈ రంగానికి మంచి ప్రోత్సాహాలు అందించారు. ఈ రంగం అభివృద్ధి చెందితే మధ్యతరగతి ప్రజలకి లాభాలు చేకూరుస్తుంది. వృద్ధి ఫలాలు అసంఘటి తరంగాలకు అందించే ఏర్పాటు బడ్జెట్‌లో చోటు చేసుకుంది. వృద్ధి వ్యూహం తీరు మారింది

స్టార్టప్‌ పరిశోధనలు ఆవిష్కరణలు పెంచేందుకు వీలుగా పబ్లిక్‌ ప్రైవేట్‌ రంగాన్ని ప్రోత్సహించాలని బడ్జెట్‌లో నిర్ణయం తీసుకొని 50 యేళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అందించేందుకు రూ. లక్ష కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయడం వల్ల పరిశోధన అభివృధ్ది వేగవంతమై ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

దీర్ఘకాలిక దృష్టితో రూపొందించిన బడ్జెట్‌ గుణాత్మక మార్పులతో భారత్‌ 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్య సాధన దిశగా శీఘ్రతర వృద్దితో అభివృధ్ది చెందిన దేశంగా ఎదిగి అన్ని రంగాలలో గణనీయ మైన అభివృద్ధి సాధించి ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతుందని ఆశిద్దాం.


*             2025-26 బడ్జెట్‌ పేదలు యువత రైతులు మహిళలు పురోభివృద్ధి లక్ష్యంగా మధ్యతరగతి వర్గాలకు వరాలు అందించింది.

*            వికసిత భారత్‌ దిశగా సంస్కరణలు కొనసాగిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేసింది.

*            వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో వృధి, అభివృధి వ్యూహాలతో స్థూల ఆర్థికవ్యవస్థ మెరుగుపరిచే దిశగా ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధికి లెంకపెట్టిన బడ్జెట్‌గా చెప్పవచ్చు.

*            స్థానిక సంస్థలకు నష్టం కలుగకుండా కస్టమ్స్‌ సుంకాల హేతుబద్ధీకరణకు బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది.

*           లెదర్‌ ఫుట్‌వేర్‌ పరిశ్రమలో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఈ బడ్జెట్‌ ద్వారా వచ్చింది.

*            జాతీయ ఫుడ్‌ టెక్నాలజీ సంస్థ ద్వారా ఆహార శుద్ది పరిశ్రమలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు ఉన్నాయి. యువత ఉద్యోగ కల్పన కేంద్రంగా ఎదుగుతారు.

*            జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.84 వేల కోట్ల కేటాయింపు సరిపోదన్న అభిప్రాయం ఉంది.

*            నదుల అనుసంధానం కోసం బడ్జెట్‌లో రూ.3500 కోట్లు కేటాయించారు. అందుకే నదుల అనుసందానం జాప్యం తప్పకపోవచ్చు.

*           జలజీవన్‌ మిషన్‌ 2028 వరకు పొడిగించడం గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరుతాయి.

*            వచ్చే 3 ఏళ్లలో దేశంలోని అన్ని జిల్లాల్లో డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు ఏర్పాటు క్యాన్సర్‌ రోగులకు ఈ సెంటర్లు సంజీవనిగా మారనున్నాయి.

*            అన్నదాత సంరక్షణ యోజన రైతు ఉత్పత్తి సంఘాలకు వడ్డీ రాయితీలను నిధులు భారీగా పెంచారు.

*            లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ నగరాలను గ్రోత్‌ హబ్‌లుగా మారడానికి సహాయపడతాయి.

*            ఉదాన్‌ పథకం మరో పదేళ్లు పొడిగించడంతో చిన్న మధ్య తరహా నగరాలకు విమాన రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

*            దేశంలో 120 కొత్త ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనివల్ల 4 కోట్ల ప్రయాణికులు లబ్ధి పొందుతారు.

*          సీనియర్‌ సిటిజన్స్‌ టిడిఎస్‌ ఊరట కల్పించారు. బీమా రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పీిఎం జనారోగ్య యోజన ద్వారా ఆరోగ్య బీమా వర్తింపు ప్రజల ఆర్థిక ప్రగతికి సోపానాలుగా చెప్పవచ్చు.


మహిళా శిశు సంక్షేమం

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌లో 2024`25 ఆర్థిక సంవత్సరం రూ. 23,182.98 కోట్లు ఇవ్వగా, 2025`2026 బడ్జెట్‌లో రూ.26,889.69 కోట్లు కేటాయించారు. సక్షమ్‌ అంగన్‌వాడి పోషణ్‌ 2.0 కింద అత్యధికంగా రూ. 21,960 ఖర్చు చేస్తారు. పౌష్టికార లోపాన్ని అధిగమించి చిన్నారుల సంరక్షణ బలోపేతం చేసేందుకు నిధులు వినియోగిస్తారు.

పిల్లలకు పౌష్టికాహారం

8 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి, కోటి మంది గర్భిణులకు, బాలింతలకు 20 లక్షల మంది కిశోరప్రాయ బాలికలకు ఈ పథకం కింద ప్రయోజనం లభిస్తుంది. పోషకాహార పరంగా వెనుకబడిన ప్రాంతాల్లో  సహాయ పడుతుంది. ప్రధానమంత్రి జన జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌ కింద రూ.120 కోట్లు కార్పస్‌ నిధిగా కేటాయించారు.

మిషన్‌ వాత్సల్య

వాత్సల్య మిషన్‌కు రూ. 1500 కోట్లు కేటాయించారు. అనాథ పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించి వీరికి కుటుంబ ఆధారిత రక్షణ కల్పించడం,  దత్తతను ప్రోత్సహించడం ఇందులో ఉన్నాయి.

మహిళా సాధికారిత-మిషన్‌ శక్తి

మిషన్‌ శక్తి కింద మహిళా సాధికారిక సాధనకు రూ. 3,150 కోట్లకు కేటాయింపులు పెంచారు. వన్‌ స్టాప్‌ కేంద్రాలు, నారి అదాలత్‌లు, మహిళా సహాయ వాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ. 628 కోట్లు కేటాయించారు. నిర్భయ నిధికి రూ. 30 కోట్లు కేటాయించి మహిళల హక్కులకు భద్రతకు భరోసా ఇవ్వడం హర్షణీయం.

దేశంలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు రుణ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా దేశంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలు వ్యాపారవేత్తలుగా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. రూ. 2 కోట్ల చొప్పున రుణాలను మంజూరు చేస్తారు. వీరి వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వమే ఆర్థికంగా భరోసానిస్తుంది.

– నేదునూరి కనకయ్య
అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం, కరీంనగర్‌, 9440245771

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE