రవి అస్తమించని రాజ్యపాలనకు చరమగీతం పాడుతూ ది.14/15 ఆగష్టు 1947న అర్ధరాత్రి మన భారతదేశం స్వాతంత్య్ర ప్రభాత శంఖాన్ని పూరించింది. స్వాతంత్రం వచ్చిన నూతనోత్సాహంతో దేశం నలుమూలలున్న మేధావులెందరో మేధోమధనం చేసి స్వతంత్ర భారతానికి రాజ్యాంగమనే అమృత కలశాన్ని అందించారు. జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి రాగా, దేశ అత్యున్నత న్యాయ పీఠంగా జనవరి 28, 1950న ‘‘సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా’’ ఆవిర్భవించింది. రాజ్యాంగం, భావి భారతానికి మహాభారతంగా నిలిచి నవ సమాజ నిర్మాణానికి నాంది పలికింది. మన రాజ్యాంగంలో స్వతంత్ర భారత పరిపాలనా విధి, ఆర్ధిక, సామాజిక వ్యవహార శైలి, సమాజ భద్రత, న్యాయ సంరక్షణ మొదలగు అంశాలెన్నో సవివరంగా పొందుపరిచారు. రాజ్యాంగం వేసిన బాటలో స్వతంత్ర భారత నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతూ వస్తోంది. ప్రజాస్వామ్య భారతదేశ విధి నిర్వహణ, రాజ్యాంగ నిబద్ధతల పరిధిలో సాగుతోందా అనే సమీక్ష చేసే అధికారం, విశిష్ట బాధ్యత న్యాయస్థానాలదైంది.
జనోద్ధరణ పక్కకి పెట్టి స్వీయోద్ధరణకే ముందడుగు వేసే నియంతల అధికారానికి బలైన ఎందరో ప్రజలు తమ దేశాన్ని విడిచి నిర్వాసితులుగా, శరణార్థులుగా వలస పోతున్నారు. అటువంటి దీన స్థితి మన ప్రజానీకానికి రాకుండా భారతదేశానికి రక్షణా కవచంలా నిలిచింది మన రాజ్యాంగం. కాలమాన పరిస్థితులబట్టి చట్ట సవరణ, నూతన చట్టాల రూపకల్పన చేస్తూ వస్తున్నారు మన దేశ నాయకులు. సవరించిన చట్టాలు కానీ నూతనంగా పరిచితమైన చట్టాలు కానీ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినా లేక అడ్డుగోడలా నిలిచినా, ప్రజలకు రక్షణ కలిపిస్తూ వారి హక్కులను సంరక్షిస్తున్న ధర్మస్థానం, సుప్రీం కోర్ట్.
రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ప్రభుత్వాలు సవరించలేవని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, కేశవానంద భారతి తీర్పుతో శాసించడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులకు శాశ్వత రక్షణ లభించింది. గడిచిన 75 సంవత్సరాలలో, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తన నిష్పక్షపాత శైలిలో ఎన్నెన్నో తీర్పులిచ్చి భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు భారతీయుల మాన సమ్మాన సంరక్షణకు పెద్దపీట వేసింది. దేశంలోని న్యాయస్థానాలు, సందర్భాను సారంగా, చట్టాలను ప్రభుత్వ ఉత్తరువులను, ప్రభుత్వ శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించి మన రాజ్యాంగ పరిధిలో, రాజ్యాంగ ప్రమాణ-నిబంధనల అనుగుణంగా ఆ చట్టాలను శాసనాలను ఉత్తరువులను నియంత్రిస్తూ వస్తున్నాయి. ఎందరో ఆశలకు ఆయువు పోసి మరెందరో అశ్రువులని తుడిచి తల్లయింది మన దేశ న్యాయ వ్యవస్థ.
భారతదేశంలో ‘‘రామ జన్మభూమి’’ చాలా సున్నితమైన అంశం. అలాంటి సున్నితమైనా అంశాన్ని నిష్పక్షపాతంగా విశిష్టమైన నేర్పు నైపుణ్యంతో వ్యవహరించి తీర్పునిచ్చింది సుప్రీంకోర్ట్. రామ జన్మభూమి తీర్పు మన భారతదేశ న్యాయచరిత్రలో మైలురాయి. ఇరు మతాల ప్రజల మనోభావాలను కించపరచకుండా, ఇరు పక్షాల వాదనలను సమతు ల్యంగా పరిశీలించి ధర్మనిబద్ధతతో వెలువరించిన తీర్పు ‘రామజన్మభూమి’.
అలహాబాద్ న్యాయస్థానం సెప్టెంబరు 30, 2010న వెలువరించిన తీర్పుని విచారించవల్సినదిగా సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించడంతో రామ జన్మభూమి వివాద పరిష్కార బాధ్యత సుప్రీం కోర్ట్‌ది అయింది. వాస్తవానికి రామజన్మభూమి వివాదం కీలకాంశం భూ వివాదమే అయినప్పటికీ ఎందరో ప్రజల మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు ఆ అంశాన్ని పద్మవ్యూహంలా అల్లుకున్నాయి. ఈ వ్యూహాన్ని ఛేదించడంలో సుప్రీం కోర్ట్ సఫలీకృతమైంది. ప్రజల భావావేశాల వలన దాదాపు దశాబ్దం పాటు పన్నుకుని సుప్రీం కొర్టుపైన తీవ్రమైన ఒత్తిడి కలుగచేసింది. ఎలాంటి భావావేశాల ఒత్తిడికి తొణకకుండా లౌకిక అస్థిత్వాన్ని అఖండంగా నిలిపి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది సుప్రీం కోర్ట్.
తీర్పు ప్రభావం
ఎన్నడూ లేని విధంగా భగవంతుడు సైతం తన ఇల్లు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదు. రాజ్యాంగానికి లౌకికత్వం (Secularism) అనేది మూలస్తంభం. మతపరమైన భావాలకి అతీతంగా అందరికి సమన్యాయం అందించడమే రాజ్యాంగం ద్వారా మన న్యాయవ్యవస్థకు సంక్రమించిన అత్యు న్నత బాధ్యత. ఇటువంటి మతపరమైన వివాదాలను పరిష్కరించడంలో లౌకికవాదం(Secularism), చట్టపరమైన పాలన (Rule of Law) ప్రాముఖ్యతను కూడా తీర్పు ప్రముఖంగా ప్రస్తావించింది. రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్ట్ తీర్పు, సంక్లిష్టమైన సున్నితమైన మతపరమైన విషయాలలో న్యాయపరమైన జోక్యానికి ఒక ఉదాహరణగా నిలిచింది. భారతదేశం వంటి వైవిధ్యమైన బహుళత్వ సమాజంలో సంభాషణ (Dialogue) సయోధ్య (Reconciliation) అవసరాన్ని సుప్రీం కోర్ట్ తన తీర్పులో ప్రస్ఫుటంగా తెలియ జేసింది.
సుప్రీంకోర్ట్ తీర్పు వివాదానికి చట్టపరమైన పరిష్కారాన్ని తీసుకువచ్చినప్పటికీ, అది శాశ్వత సామాజిక సమరసత్వంగా మారేలా చూసుకోవడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మిగిలిపోయింది. మతపరమైన వైరాన్ని, దూరాన్ని తగ్గిస్తూ, వివిధ వర్గాల మధ్య ఐక్యత అవగాహన స్ఫూర్తిని పెంపొందించ డానికి నిరంతర ప్రయత్నాలు అవసరమని గుర్తించాలి.
ఈ వివాద పరిష్కారంలో చట్టపరమైన సూత్రాలను అనుసరించి, పాల్గొన్న అన్ని పార్టీలలోనూ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమర్యాదలను వికసింప చేస్తూ, పరిష్కారం వైపు నడిపించి భారతజాతి రామ మందిర నిర్మాణ వాంఛను పునరుద్ధరించింది సుప్రీంకోర్ట్. ‘‘రామజన్మభూమి’’ వివాదం రేపటి తరాలకు ఒక మార్గదర్శకంగా వెలుగొందుతుంది. దేశం ప్రగతిపథంలో పరుగులు తీస్తున్నప్పుడు ఇటువంటి సంక్లిష్టమైన సమస్యలు అడ్డంకులుగా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అటువంటి పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలని, భావాలని పరిగణిస్తూనే నిష్పాక్షికమైన తీర్పులు వెలువరించడానికి ఈ రామజన్మభూమి తీర్పు దిక్సూచిగా ఉంటుంది.. భిన్నత్వంలో ఏకత్వం అనే మన దేశ నానుడిని అనుసరించి భిన్న అభిప్రాయాలు, వాదనలు కోకొల్లలుగా కమ్మేసినా, న్యాయాన్ని ధర్మాన్ని ఒకే తాటి పైన నిలుపుతూ నిర్వివాదానికి తావులేని తీర్పుగా, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో న్యాయ చరిత్రకే ఘాన కీర్తిని గడిరచిపెట్టింది.
ధర్మ పరిరక్షణకు, న్యాయ స్థాపనకు, దుష్ట శిక్షణ – శిష్ట రక్షణకు న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ సంసిద్ధమై ఉంటుంది. దేశ శాంతిభద్రతల నిర్వహణలో సంరక్షణలో ప్రభుత్వం వాహనమైతే, మన న్యాయ వ్యవస్థ ఇంధనం వంటిది. చట్టం, న్యాయం, ధర్మం అనే మూల స్తంభాలపై నిర్మించిన మన న్యాయవ్యవస్థ నిష్పాక్షికత, న్యాయబద్ధత, మనస్సాక్షి అనే మూడు కళ్లతో దేశాన్ని నిరంతరం కనిపెట్టుకుని ఉంటూ మన మువ్వన్నెల ధ్వజం, ప్రపంచ దేశాల మధ్య దిగ్విజయంగా రెపరెపలాడేలా చేస్తోంది. తప్పటడు గులు సరిదిద్దే తండ్రిలా, అక్షరబద్ధం సరిచేసే గురువులా సుప్రీమ్‌కోర్ట్ దిద్దుబాటు చేస్తూ ఎందరి ఆశలకో జీవాన్నిచ్చింది.
రామ జన్మభూమి వివాద చారిత్రక నేపధ్యం
1529 సంవత్సరంలో బాబ్రీ మసీదును మొదటి మొగల్ పాలకుడు బాబర్ పాలనలో అతడి కమాండర్ మీర్ బాకి నిర్మించాడు. 1885వ సంవత్సరంలో మసీదును ఆనుకుని మందిరాన్ని నిర్మించడానికి అనుమతి కోసం మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో మొదటి వ్యాజ్యాన్ని వెయ్యగా కోర్ట్ తిరస్కరించింది. ఆ తరువాత ఫైజాబాద్ కోర్ట్‌లో బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ మందిరం కట్టడానికి మహంత్ రఘుబీర్ దాస్ అనుమతి కోరినా అదే కోర్ట్ తిరస్కరించింది. డిసెంబర్ 1949లో రాములవారి విగ్రహం బాబ్రీ మసీదులో ప్రత్యక్షమవడంతో, సర్కారువారు దాన్ని వివాదాస్పద ప్రదేశంగా పరిగణించి మూసివేశారు. 1950లో ఆలయ పూజాకాంక్షులు గోపాల్ సిమ్లా విహారద్, పరమహంస రామచంద్రదాస్‌లు రెండు వ్యాజ్యాలు వేసి ఆ నిర్దేశిత వివాదాస్పద ప్రాంతంలో పూజ చెయ్యడానికి అనుమతి కోరగా కోర్ట్ వారు మసీదు బయట ప్రాకారంలో పూజ చెయ్యడానికి అనుమతిస్తూ లోపల ప్రాకారానికి మాత్రం ప్రవేశాన్ని నిషేధించారు. మసీదు స్థలాన్ని స్వాధీనాన్ని కోరుతూ 1959లో నిర్మోహి అఖాడా ముడవ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. 1961లో ఉత్తరప్రదేశ్ సున్ని వక్ఫ్ బోర్డు కూడా మసీదు స్థలాన్ని స్వాధీనం చేయాలనీ, రామ విగ్రహాన్ని తొలగించాలనీ కోరుతూ నాల్గవ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. 1984లో విశ్వహిందూ పరిషత్, ఎల్‌కే అడ్వాణీ నాయకత్వాన రామజన్మభూమి విముక్తికి యాత్ర ప్రారంభమైంది. ఫిబ్రవరి1,1986 మసీదు లోపలి ప్రాకారం బంధనాలను తొలగించ మని యూసీ పాండే అనే వ్యక్తి వేసిన వ్యాజ్యంలోని అంశాలను పరిగణిస్తూ ఫైజాబాద్ సెషన్స్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నిరసిస్తూ ముస్లింలు Babri Mosque Action Committee (BARC)ను స్థాపించారు. నవంబర్ 9,1989 రామ జన్మభూమి స్థలం (బాబ్రీ మసీదు) వద్ద విశ్వ హిందూ పరిషతు రామ మందిరానికై శంకుస్థాపన చేసింది. తరువాత అలహాబాద్ హైకోర్ట్‌లో రామ్‌లల్లా విరాజ మాన్ పేరుతో ఇంకొక వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
సెప్టెంబర్ 25,1990న ఎల్‌కే అడ్వాణీ సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు. డిసెంబర్ 6,1992 బాబ్రీ మసీదును ప్రజలు తొలగించారు. డిసెంబర్ 16, 1992 బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణాలు, పర్యవసానంగా జరిగిన అల్లర్లపై నిజ నిర్ధారణకు ప్రభుత్వం లిబ్రహాన్ కమిషన్‌ను నియమించింది. జనవరి 7,1993 కేంద్ర ప్రభుత్వం అయోధ్య లోని నిర్దిష్ట ప్రదేశాలను స్వాధీన పరచుకుంటూ ఉత్తర్వులు జారీచేసి అయోధ్య చట్టం (యాక్ట్) 1993 తీసుకువచ్చింది. 1994లో ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్ట్‌లో సవాలు చెయ్యగా, రాజ్యాంగబద్ధమని తీర్పునిచ్చింది (ఇస్మాయిల్ ఫారుఖి తీర్పు).
ఏప్రిల్ 2002 అలహాబాద్ హైకోర్ట్ (లక్నో విభాగం) ‘‘రామజన్మభూమి’’ భూ వివాదం విచారణ ప్రారంభించింది. మార్చి – ఆగష్టు 2003లో అలహాబాద్ హైకోర్ట్ ఆదేశానుసారం భారత పురావస్తు శాఖ నిర్దిష్ట ‘రామ జన్మభూమి’ స్థలంలో తవ్వకాలు జరపగా పదవ శతాబ్దం నాటి హిందూ దేవాలయం బయటపడిరది. ఆ తరువాత ఆ నివేదికను మసీదు అనుకూలురు తప్పుపట్టారు. సెప్టెంబర్ 30, 2010 అలహాబాద్ హైకోర్ట్ ఉత్కంఠకు తెర దించుతూ ‘‘వివాదాస్పద స్థలాన్ని’’ 3 భాగాలుగా విభజించింది. 1/3వ భాగం (అంతర్ ప్రాకారం) రామ్‌లల్లా విరాజమాన్‌కు, 1/3వ భాగం (బయటి ప్రాకారం) సున్ని వక్ఫ్ బోర్డుకు, 1 /3వ భాగం (రామ్ చబుత్ర, సీతా రసోయి దగ్గర స్థలం) నిర్మోహి అఖాడాకు దఖలు చేస్తూ తీర్పునిచ్చింది.
మే 2011 సుప్రీమ్ కోర్ట్ కక్షిదారులు వ్యాజ్యంలో 1/3వ వాటాను అడగకుండా హైకోర్ట్ రామ జన్మ భూమిని 3 భాగాలుగా విభజించడం తప్పని అలహాబాద్ కోర్ట్ తీర్పుని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 8, 2018న రామ జన్మభూమి వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తూ సుప్రీమ్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్9, 2019 న దేశం ఎదురు చూస్తున్న రామ జన్మభూమి తీర్పుని భారత సుప్రీమ్ కోర్ట్ వెలువ రించింది. మసీదు ప్రాంతం (2.77-ఎకరాలు) మొత్తం రామ్‌లల్లా విరాజమాన్‌కి చెందుతుందని చెప్పింది. అలాగే అయోధ్యలో సున్ని వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాలు ఇవ్వవలసిందిగా తీర్పులో పేర్కొన్నది. జనవరి 22, 2024న బాలరాముడి ప్రతిష్ఠతో భారత దేశంలో రామరాజ్య పునర్‌వైభవానికి బీజం పడిరది.
వెంకట రఘువంశీ దశిక
Advocate on Record
Supreme Court of India