తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ; కుప్పాంబిక, రంగాజమ్మ; కోడూరి లీలావతి, సారస్వత, కళారంగాల మహిళామణులు. భాష, సంస్కృతి, సృజన రీతులతో తమదైన ముద్రను కనబరచిన వనితాలోక సుప్రసిద్ధులు. వారి ప్రతిభా వారసత్వాన్ని సొంతం చేసుకున్న ప్రభామూర్తులకు పురస్కార ప్రదానోత్సవం భాగ్యనగరం వేదికగా ఏర్పాటైంది. తెలుగునాట భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విఖ్యాత సంస్థలు అక్షరయాన్, సీతాన్, అభిజ్ఞ భారత్… ఉమ్మడి నిర్వహణం, జాతీయ సదస్సులో భాగంగా మార్చి తొలివారంలోని ఈ సాహిత్య మహోత్సవ సందర్భం ప్రకాశ వికాసాలమయం. ఇదే నేపథ్యంలో…
తిరుమలేశుని మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఊరిపేరే ఇంటి పేరు. వేంకటాచల మహాత్మ్యం, ద్విపద భాగవతం; వాటితోపాటు అష్టాంగ యోగసారం, రాజయోగామృతసారం, వాశిష్ఠ రామాయణం, రమా పరిణయం, శ్రీకృష్ణ మంజరి, శివలీలా విలాసం, నృసింహ విలాసం, ముక్తికాంతా విలాసం ఇలా అనేకానేక రచనలు.
విలక్షణ రీతిన – జలక్రీడా విలాసం; చెంచు నాటకం, రుక్మిణీ నాటకం, గోపీనాటకం, బాలకృష్ణ నాటకం; విష్ణు పారిజాతం; వీటన్నింటితోపాటు తరిగొండ నృసింహ శతకం. తత్వ కీర్తనలైతే అనేకం.
ఆచార్యుల చెంత నేను చదవలేదు
ఛందస్సులో పద్యములనైన నేర్వలేదు
కావ్య నాటకాలంకార శాస్త్రములైన వినగలేదు
పూర్వేతిహాసములను శోధించి చూడలేదు
అయినా… నారసింహ దేవుడు ఆనతిచ్చిన తీరున
నిమిత్త మాత్రమున పలుకుదును – అన్నప్పటికీ వెంగమాంబాది తళుకులొలుకు పలుకు. అధ్యయన సామర్థ్యం, పద్యగ్రహణ ప్రావీణ్యం, శాస్త్ర సూక్ష్మాదుల పరిశీలనం, అపార పరిశోధక దృక్పథం – ఆమెవి.
తనది బాలభాషగా చెప్పినా ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్న భాష. ఆమె వినయశీలత అనితర సాధ్యం. పరమ గంభీర అంశాలను సైతం లలిత పదజాలంతో విపులీకరించారు. యోగతత్వ చింతనతో స్ఫూర్తిప్రదాయకురాలయ్యారు. పరిజ్ఞానాత్మక యోగభక్తి తత్పరతకు అసలైన ప్రతీక ఆమే!
ఒక్క సాహిత్యంతోనే కాదు – సంగీత నిపుణతలోనూ మిన్న. ఆరగింపు, సింగారపు, మంగళహారతి గీత రచనల్లో దిట్ట.
వేంకటేశ, కృష్ణతత్వాల సమరస మేళవింపు మరొక ప్రత్యేకత. ఎంతటి విభిన్న రచనాశైలి అంటే….
‘శ్రీ వేంకటేశ! నా చిత్తంబునందు/ నీ పాదయుగళంబు నిల్వవేకృష్ణ/ నన్నేల తరిగొండ నరహరాకృతిని / బ్రత్యక్షమైనను చాలింపు కృష్ణ’ అనేంతగా.
మరింత విశేష అంశం ఏమిటంటే – ఆ మేలిమి కవయిత్రి తల్లిదండ్రుల పేర్లు మంగమాంబ, కృష్ణయామాత్య. గురుదేవులు సుబ్రహ్మణ్య దీక్షితులు.
భర్త పేరు వేంకటాచలప్ప. వెంగమాంబ తిరుమల ప్రాంతంలోని తుంబుర కోన దగ్గర యోగాభ్యాసం నిర్వర్తించారు. భక్తి, వేదాంతాలే శ్వాసగా జీవనయానం సాగించారు.
పురాణ అధ్యయనంలో తనకు తానే సాటి. పద్మావతీ శ్రీనివాసుల కల్యాణ శోభను ‘వేంకటాచల మహాత్మ్యం’లో దీటుగా అభివర్ణించారు. ద్విపద రచనలతో అసాధారణ శక్తియుక్తులను ప్రత్యక్షం చేశారు.
ఎన్నెన్నో తేట తెలుగు పదాల గుబాళింపు. పాత్రోచిత భాషను వినియోగించి సహజ సుందరత్వాన్ని చాటి చెప్పారు. ఆమెదంతా మధురభక్తి సంప్రదాయ సమాచరణ. యక్షగానాల నిర్మాణ నిర్వహణల్లో అగ్రస్థాయి. తనదంతా దైవప్రేరణగా ప్రకటించారు.
బ్రహ్మోత్సవాల వేళలో తాను హారతి ఇస్తేనే, గీతాన్ని ఆలాపిస్తేనే సేవ. వాడుక క్రమంలో అది ‘ముత్యాల హారతి.’ భక్త పారిజాతం అంటే ఆ అతివే!
భండారు అచ్చమాంబ అనగానే పలు కథలు, వ్యాసాలు మన ముందుకొస్తాయి. స్త్రీ విద్య కోసం ఆమె స్థాపించిన బృందావన సమాజం తలపులోకి వస్తుంది. విలక్షణత ఏమిటంటే – ఆమే ‘స్త్రీ విద్య’ పేరిట రచన చేశారు. వనిత విద్యావంతురాలైతేనే ఇల్లు, కుటుంబం, సమాజం వర్ధిల్లుతాయని విశదపరిచారు. స్త్రీ శక్తిని ఉద్దేశించి – అబలా సచ్ఛరిత్ర రత్నమాల పుస్తకాన్ని వెలయించారు. ఈ గ్రంథ అంశాలే కందుకూరి వీరేశలింగం పత్రికలో వెలువడ్డాయి. ఆయనకు కృతజ్ఞతా పూర్వక వందనాలందించిన ఆమె ‘అల్పబుద్ధి నైన…’ అంటూ తనను తాను అనుకోవడం వినయశీలతకు పతాక. అనల్ప బుద్ధిశాలి అచ్చమాంబ.
ఆ కార్యశీలి స్ఫూర్తితోనే మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మహిళలే పత్రికలు నడిపారు. తెలుగు నేలన ‘మహిళా కళాబోధిని’ కావ్యం రచించారు పులుగుర్తి లక్ష్మీనరసమాంబ.
స్త్రీలలోనే అత్యంత ధైర్యవంతులున్నారు. విద్యా ప్రవీణులనేకులు ఉన్నారు . నిర్వహణ దక్షతలోనూ వారే పేరెన్నికగన్నవారు. ఈ వాస్తవాలనే ఎలుగెత్తి చాటిన అచ్చమాంబ ధీశాలి.
‘సహస్రాధిక సంవత్సరాల నుంచీ ఇప్పటిదాకా’ అంటూ ఇతిహాస కాలానికి నిర్వచనం ఇచ్చారామె. ప్రాచీన మొదలు అర్వాచీన దశవరకు పలువురు ఉత్తమ ముదితల జీవిత కథలను చరిత్రగా వెలువరించారు. నాటి పురాణ స్త్రీ పాత్రలను, ఇతర దేశాలలోని మహిళా నేతల చరితలనూ అక్షర రూపానికి తెచ్చారు. తన రచనలెన్నింటినో ముద్రించిన అలనాటి పత్రిక పేరు ‘హిందూ సుందరి’ సంఘ సంస్కరణ రంగాన ముందు వరసన ఉండేది.
ఆ రోజుల్లోనే భారత స్వాతంత్య్ర ఉద్యమాన కీలకపాత్ర వహించిన ధీరమూర్తులెందరో! వారిలో కోడూరి లీలావతి ఉన్నారు. మహోద్ధ్రతంగా కొనసాగిన సహాయ నిరాకరణ ఉద్యమాన పాల్గొన్నారు. తండ్రి నుంచి పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నారు. సరిసమానంగా కళాభిరుచినీ విస్తరిస్తూ వచ్చారు. కస్తూరిబా జీవిత విశేషాల పుస్తకం ‘కుంకుమ రేఖ’కు పురస్కారం సాధించారు. ఆశాకిరణం అంటూ పిల్లల నవలను అప్పట్లోనే రచించారు. తన రచనలకు ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు. భారత కోకిలగా పేరున్న సరోజినీ నాయుడు జీవిత చరిత్ర గ్రంథం ‘ఇంద్ర ధనుస్సు’కు కూడా అవార్డు స్వీకరించారు.
మరింత విలక్షణత – ‘జయవిపంచి’ పేరుతో లీలావతి రాసిన చారిత్రక నవల. ఉదయరేఖ పత్రికకు సంపాదకురాలిగా ఉండేవారు. కళారంగపరంగా గృహలక్ష్మి బిరుదంతోపాటు స్వర్ణపతకం విజేత. కవయిత్రీమణిగా ఘన సత్కారం పొందారు. వాద్య సంగీత రీత్యా ‘వీణా విశారద’ అయ్యారు. సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, బాలల అకాడమీకి పని చేశారు. రచయిత్రుల సలహామండలి ప్రతినిధిగానూ వ్యవహరించారు.
కవయిత్రిగా ప్రశస్తి సంతరించుకున్న కుప్పాంబిక తన రచనలన్నింటిలోనూ వర్ణనకే అధిక ప్రాధాన్యమిచ్చారు. మొదట్లో తెలుగు రామాయణ కర్తగా ఉన్న కవికి ఆత్మీయ. ఆమె పద్యాలు కొన్ని ఇతరత్రా సంకలన గ్రంథంలో కనిపిస్తున్నాయి. వీరపుత్రిగా, వీరపత్నిగా యశస్సు గడించిన ముదిత. వివరాలను శాసనాలు వెలువరిస్తున్నాయి. రచయిత్రిగా, పాలనారంగ దక్షురాలిగా పటిమను కనబరచిన ధీరోదాత్త.
బుద్ధపురం గ్రామంలో శివాలయాన్ని నిర్మించిన ఘనత కుప్పాంబికకు ఉంది. ఆధ్యాత్మికతకు తోడు సమకాలీన జన జీవన స్థితిగతులను అక్షరీకరించిన జాగృతశీలి. పుట్టినింటికీ మెట్టినింటికీ కీర్తి తెచ్చిన కార్యనిర్వాహకురాలు. సాహిత్య, నిజ జీవితాల్లో సాహసోపేత. మంగమాంబ, వెంకటాద్రి దంపతుల తనయ రంగాజమ్మ. పసుపులేటి నామధేయ. విజయ రాఘవ నాయకుని ఆస్థానాన కవయిత్రి. ‘మన్నారు దాసవిలాసము’ కావ్యకర్త. అనేక యక్షగానాలను అక్షర రూపానికి తెచ్చిన ప్రయోగశీలి. ఆమె రచనల్లో కొన్నింటిని సాహిత్యపరిషత్తు మునుపే ప్రచురించింది.
రామాయణ, భారత, భాగవత సంగ్రహాల పేరిట కావ్యరచనలు చేసిన రంగాజమ్మ విశిష్ట ఇతివృత్తంతో రూపుదిద్దిన మరొక కావ్యం ‘ఉషాపరిణయం’. ఇందులోని కథన చాతురి ఎందరెందరినో ఆకట్టుకుంది.
రచనా వైదుష్యంతో వినుతికెక్కిన ఆమెకు సభాముఖంగా కనకాభిషేకం ఎంతైనా సగర్వ కారకం. అనంతర కాలంలో సైతం రచనలు ఎంత ఘనతర ప్రఖ్యాతి పొందాయో చెప్పనలవి కాదు.
రంగాజమ్మ యక్షగాన రచనలోని భరతవాక్య విన్యాసాన్ని పరిశీలిద్దాం. ‘అని ఇవ్విధంబున రాజగోపాల కరుణాకటాక్ష వీక్షణానుక్షణ ప్రవర్థమాన సార సారసత్వ ధురీణయు, విచిత్రతర పత్రికా శత లిఖిత వాచికార్థావగాహన ప్రవీణీయు, తత్ ప్రతి పత్రికాశత స్వహస్త లేఖన ప్రశః కీర్తియు, రసతరంగిత పద కవిత్వ మహనీయుమతి స్ఫూర్తియు, అతులితాష్ట భాషా కవితా సర్వం కష మనీషా విశేష శారదయును…’ ఈ విధంగా కొనసాగుతుంది ఆ రచనా. చమత్కృతి.
ఇంతటి వైవిధ్యం నిండిన రచనలను, రచయిత్రులను సంభావిస్తూ; ఆ కర్తల సారస్వత వారసత్వాన్ని గుర్తించి గౌరవిస్తూ, సంస్థలు చేపట్టిన పురస్కార పరంపర ఆశాజనక ఫలితాలకు నిండైన ఆసరా. నారీమతల్లుల పాండితీ ప్రకర్షను ఆధునిక తరాల ముందుకు తెస్తూ, వారసత్వ వనితా శక్తిని సత్కరించడమనేది తెలుగు వెలుగులను నలువైపులా ప్రసరింపచేస్తుంది. ప్రధానంగా వందలమంది రచయిత్రులు / కవయిత్రులతో ‘అక్షరయాన్’గా రూపొందిన సంస్థ చేపట్టిన ఈ నూతన నిర్వహణ మాలిక నిస్సంశయంగా ఆశాదీపిక, జనప్రయోజక వేదికది!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్