భారతీయులకు గర్వకారణమైన చాణక్య రాజనీతి సూత్రాలు అన్ని కాలమాన పరిస్థితుల్లో అన్ని రంగాలకూ మార్గదర్శకంగా నిలుస్తాయ నడంలో అతిశయోక్తి లేదు. విదేశాలు, సరిహద్దు దేశాలతో వ్యవహరించా ల్సిన తీరుపై చాణక్య నీతిలో అమూల్యమైన పరిష్కారాలు ఉన్నాయి. శత్రు దేశాలను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో సవివరంగా చెప్పారు. విదేశీ వ్యవహారాల్లో సంధి, విగ్రహ, ఆసన, యాన, సంశ్రయ, ద్వేద్వభావ మొదలైన ఆరు అమూల్యమైన సూత్రాలను అనుసరించాలని చెప్పారు. ఈ ఆరు విధానాలను స్థూలంగా పరిశీలిస్తే మొదటి సంధి ప్రయత్నంగా సున్నితంగా వ్యవహరించాలి. దారిలోకి రాకపోతే మనకున్న శక్తిని చూపిస్తూ బలగాల వినియోగంతో శత్రుపక్షంలో భయం కల్పించి, వాతావరణాన్ని సానుకూలంగా మల్చుకోవాలి. మన పక్కలో బల్లెంలా తయారైన బాంగ్లాదేశ్‌ ‌విషయంలో చాణక్యుడి మార్గం మనకు అనుసరణీయం, మార్గదర్శకం.

దశాబ్దాల తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో బలపడుతూ అభివృద్ధి పథంలో సాగుతున్న వేళ పొరుగు దేశాలు అసూయతో తోక జాడిస్తున్నాయి. నిత్యం మనల్ని చికాకు పర్చాలని చూసే పాకిస్తాన్‌, ‌చైనా దేశాలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కట్టడి చేస్తుంటే, మతపిచ్చి ముదిరిన బాంగ్లాదేశ్‌ ‌పిల్లిమొగ్గలేస్తోంది. పాకిస్తాన్‌ ‌చేతిలో బానిసలుగా ఉన్న బాంగ్లాదేశీయులకు మన దేశ సైనికులు పోరాడి స్వరాజ్య భిక్ష పెడితే, ఇప్పుడు ఆ బాంగ్లాదేశ్‌ ‌రెచ్చిపోతోంది. భారత్‌ ‌లక్ష్యంగా పావులు కదుపుతోంది. పురోగతి సాధిస్తున్న భారత్‌ను చూసి కుళ్లుకుంటున్న పాకిస్తాన్‌ ‌చేతిలో పావుగా మారిన ఆ దేశం, వారి దేశంలో మైనార్టీలైన హిందువులపై దాడులు చేస్తూ భారత్‌తో కయ్యానికి కాలుదువ్వు తోంది. అయినప్పటికీ మన దేశం ఎంతో సహనంతో వ్యవహరిస్తోంది. బాంగ్లాదేశ్‌లో 2024లో జరిగిన రాజకీయ ఉద్యమం ముసుగులో వ్యూహాత్మకంగా హిందువులపై, దేవాలయాలపై దాదులు జరిగాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల సంస్థ ఇటీవల ఒక నివేదికను బహిర్గతం చేసింది.

బాంగ్లాదేశ్‌లో 2024 జులై, ఆగస్టు మాసాల్లో రిజర్వేషన్ల అంశాన్ని ఒక సాకుగా తీసుకొని ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దాంతో అప్పటి ప్రధాని షేక్‌ ‌హసీనా దేశం విడిచివెళ్లాల్సి వచ్చింది. ఆమె భారత దేశానికి శరణార్థిగా వచ్చారు. ఆ దశలో ఉద్యమానికి మతం రంగు పులిమి ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని మైనార్టీలపై దాడులు జరిగాయి. నియంతృత్వంగా పాలించిన షేక్‌ ‌హసీనా పార్టీ అవామీలీగ్‌ ‌మద్దతుదారులపై దాడులు జరిగాయని అప్పుడు ప్రపంచాన్ని నమ్మించాలని చూసినా, ప్రత్యేకంగా ఒక వర్గంపై దాడులు చేయడం వెనుక మత శక్తుల హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. అవామీలీగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమం జరుపుతున్నట్టు రోడ్లపై వచ్చిన వారు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తూ హిందువులతో పాటు బౌద్ధులు, క్రిస్టియన్లు, అహ్మదీయ ముస్లింలపై దాడులు చేశారని ఐరాస నివేదిక వెల్లడించింది.

ఐరాసకు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ ‌ది హైకమిషనర్‌ ‌ఫర్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్ (ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌) ‌నిజనిర్ధారణ కమిటీ బాంగ్లాదేశ్‌లో పర్యటించింది. ఓహెచ్‌సీ హెచ్‌ఆర్‌ ‌హింసాత్మక ఘటనలపై వాస్తవాలను తెలుసుకోవడంలో భాగంగా బాంగ్లాదేశ్‌ ‌తాత్కాలిక సారథి మహ్మద్‌ ‌యూనస్‌ను సంప్రదించింది. ప్రభుత్వాధికారులు తప్పని పరిస్థితుల్లో కమిటీకి సహకరించారు. కమిటీ భద్రతా దళాలు, పోలీసులు, న్యాయవాదులు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, వ్యాపారస్తులు, మత పెద్దలు, బాధితులు ప్రత్యేకించి మహిళలు, పిల్లలతో ప్రత్యక్షంగా మాట్లాడింది. దాడులకు గురైన 34 మంది మైనార్టీ బాధితులను కమిటీ ఇంటర్వ్యూ చేసింది. ఓహెచ్‌సీ హెచ్‌ఆర్‌ 2025, ‌ఫిబ్రవరి 12న అక్కడి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా ఒక నివేదికను విడుదల చేసింది. భయంకరమైన వాస్తవాలను బహిర్గతం చేసింది.

ఉద్యమకారులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంలో వ్యూహాత్మకంగా తొలుత మహిళలను, చిన్నారులను ముందుండి నడిపిం చారు. వారు షేక్‌ ‌హసీనా పదవి నుండి తప్పుకున్నాక తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో విజయోత్సవం పేరుతో అరాచకాలు సృష్టించారు. ఉద్యమంలో మొదటి నుండి ముందున్న మహిళలను, చిన్నారులను ఇబ్బందులకు గురిచేశారు. వారిని ఒక ప్రణాళికతో తప్పుకునేలా చేశారు. ఆ తర్వాత అల్లర్లు ప్రారంభించారు. అవామీలీగ్‌ ‌నేతలపై దాడులు చేశారు. వారి ఆస్తులను దోచుకున్నారు. అవామీ లీగ్‌ ‌సానుభూతి పరులు, మద్దతుదారులనే నెపంతో మైనార్టీలపై దాడులు చేశారు. బాంగ్లాదేశ్‌ ‌నేషనల్‌ ‌పార్టీ (బీఎన్‌పీ), జమాతే ఇస్లామి, విద్యార్థి సంఘాలు, ఇతర గ్రూపులు ఉద్యమం ముసుగులో అల్లర్లు సృష్టించాయని ఓహెచ్‌సీ •హెచ్‌ఆర్‌ ‌విచారణలో వెల్లడైంది. ఈ దాడులు మతాలు, జాతుల పరంగా భిన్న సంస్కృతులతో కూడుకున్న బాంగ్లాదేశ్‌లో మత కలహాలు రేపి, మైనార్టీలను తరిమికొట్టడమే లక్ష్యంగా పాక్‌ ‌ప్రేరణతో జరిగాయి. భారత్‌ ‌సరిహద్దులో బెంగాలీ మాట్లాడే హిందువులతో పాటు ముస్లింలను కూడా వదలకుండా భయభ్రాంతులకు గురిచేశారు. 2024 ఆగస్టు 5, 15 తేదీల మధ్య జెస్సోర్‌, ‌నోకాలి, పాటౌకాలి, నాటోర్‌, ‌దినజ్‌పూర్‌, ‌చాంద్‌పూర్‌, ‌షరియత్‌పూర్‌, ‌రంగ్‌పూర్‌, ‌రాజ్‌షాహి, మీర్పూర్‌, ‌కులానా, బర్గున, బరిసల్‌, ‌రాజ్‌బరి, ఠాకూర్‌గావ్‌, ‌ఫరిద్‌పూర్‌, ‌నేట్రకోమ్‌ ‌ప్రాంతాల్లో మైనార్టీలు లక్ష్యంగా దాడులు జరిగాయని ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌ ‌బృందానికి నేషనల్‌ ‌సెక్యూరిటీ ఇంటెలిజెన్స్-ఎన్‌ఎస్‌ఐ ‌తెలిపింది. ఈ దాడులలో ఇళ్లను, దుకాణాలను దోచుకున్నారు. వాటిని తగులబెట్టారు. మైనార్టీలపై భౌతిక దాడులకు ఒడిగట్టారు. వారిని బెదిరించి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. చిట్‌గావ్‌ ‌హిల్‌‌ట్రాక్స్‌లో అహ్మదీయ ముస్లింలు లక్ష్యంగా దాడులు జరిగాయి. వారికి చెందిన 117 ఇళ్లను నాశనం చేశారు. ఈ దాడుల వెనుక బీఎన్‌పీ మద్దతుదారులున్నారని ఎన్‌ఎస్‌ఐ ‌నివేదించినప్పటికీ ముష్కరులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

హిందువులు లక్ష్యంగా అల్లరి మూకలు దేవాలయాలపైనే కాకుండా చివరికి హిందూ శ్మశానవాటికలపైన కూడా దాడులు చేశారు. వాటిని ఆక్రమించుకున్నారు. ఆ సమయంలో అక్కడి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. మతోన్మాదులు దాడులు చేస్తున్నప్పుడు విద్యుత్‌ ‌సరఫరా ఆపివేశారు. ఘటనా స్థలాలకు రాకుండా పోలీసులను అడ్డుకున్నారు. నగదుతో పాటు నిత్యవసర వస్తువులను అందినకాడికి దోచుకున్నారు. విచక్షణ లేకుండా జరిగిన ఈ దాడులకు భారత సరిహద్దుల గ్రామాల్లోని హిందువులతో పాటు కొందరు బాంగ్గాదేశీయులు కూడా బెదిరిపోయారు. దాదాపు 3 నుండి 4 వేల మంది శరణార్థులుగా భారత్‌లోకి రావాలని ప్రయత్నించారు. అయితే భారత్‌ ‌సరిహద్దు బలంగం – బీఎస్‌ఎఫ్‌ ‌వారిని అడ్డుకుందని ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌ ‌తన నివేదికలో వెల్లడించింది. బుర్‌షర్‌ది, హాటీబంధ్‌, ‌లాల్‌మోనిరత్‌ ‌ప్రాంతాల్లో ప్రముఖ హిందూ దేవాలయాలపై దాడులు జరిగినట్టు స్థానిక మీడియా నిజనిర్ధాణ కమిటీ దృష్టికి తెచ్చింది. దుండగులు బాంగ్లాదేశ్‌లో హిందువులకు అండదండగా ఉంటున్న ఇస్కాన్‌ ‌సంస్థ లక్ష్యంగా మీర్పుర్‌లో ఇస్కాన్‌ ‌దేవాలయంపై, నందిపూర్‌లో కాళీ దేవాలయంపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. బీఎన్‌పీ బరితెగింపుతో హిందువులై ప్రధానోపాధ్యాయు లను, టీచర్లను బెదిరించింది. వారితో బలవంతంగా రాజీనామా చేయించింది. దీంతో మైనార్టీలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి హిందువులు భయపడుతు న్నారని ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌ ‌నివేదించింది. బాంగ్లాదేశ్‌ ‌పోలీసుల 2024, ఆగస్టు 4, 20 తేదీల మధ్య 1,769 దాడులు జరిగాయని పేర్కొంటూ బాంగ్లాదేశ్‌ ‌హిందు, బౌద్ధ, క్రిస్టియన్‌ ‌యూనిటీ కౌన్సిల్‌ ‌నుంచి ఫిర్యాదులు వచ్చాయని 2025, జనవరిలో ఒక నివేదికలో పేర్కొన్నారు. వీటికి సంబంధించి 1,234 ఫిర్యాదులు రాజకీయ నేపథ్యం కలిగినవని, 20 ఫిర్యాదులు మతపర మైనవని, మరో 161 తప్పుడు ఫిర్యాదులని పోలీసుల నివేదికలో ఉన్నట్టు ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌ ‌తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల సంఖ్యే ఇంతుంటే వాస్తవాలు అధికంగా ఉండడం ఖాయం. బాంగ్లా దేశ్‌లో 16 రోజుల వ్యవధిలో హిందువులపై రెండు వేలకుపైగా దాడులు జరిగితే, అందులో 157 కుటుంబాలు, 69కు పైగా దేవాలయాలు ఉన్నాయని ఇతర నివేదికలు గతంలోనే చెప్పాయి. అంటే బాంగ్లాదేశ్‌ ‌పోలీసుల ఘటనలను తక్కువగా చూపిస్తూ తయారు చేసిన నివేదికలను ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌ ‌ముందుంచిందని తెలుస్తోంది.

బాంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. భారత పక్షపాతిగా ఉంటారని ప్రచారం జరుగుతున్న షేక్‌ ‌హసీనా పాలనలో కూడా దాడులు జరుగుతూనే ఉండేవి. అక్కడ పాలకులుగా ఎవరున్నా భారత్‌తో పొందే ప్రయోజనాలపైనే దృష్టి పెడతారు కానీ, హిందువుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోరు. బాంగ్లాదేశ్‌లో హిందువులపై, భారత్‌పై అక్కసు కనిపిస్తూనే ఉంటుంది. ‘‘మిమ్మల్ని మీరు మైనార్టీలుగా ఎందుకు అనుకుంటారు? ఐనా అసలు మైనార్టీ, మెజార్టీ అంటూ ఏమి ఉండదు. కులం, మతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాం’’ అని ఒకప్పుడు హసీనా అన్నారు. అదే నిజమైతే 1951లో బాంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా 2.2 కోట్లు కాగా ఇప్పుడు అది 1.3 కోట్లకు ఎందుకు పడిపోయిందో అక్కడి పాలకులే చెప్పాలి. గతంలో హసీనా మొసలి కన్నీరు కారుస్తూ చేసిన వ్యాఖ్యలనే మళ్లీ మహ్మద్‌ ‌యూనస్‌ ‌కూడా వల్లె వేశారు. దాడి జరిగిన ఢాకేశ్వరీ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘హక్కులు అందరికీ సమానం. మానవులంతా ఒకటే. మన హక్కులు ఒకటే. మన మధ్యభేధాలకు తావు లేదు. దయచేసి ఓపిక పట్టండి. సమస్యల పరిష్కారంలో విఫలమైతే విమర్శించండి. మతమేదైనా ప్రజాస్వామ్యంలో అందరం మనుషు లమే’’ అని ఇక్కడ మన సెక్యులరిస్టులు చెప్పినట్టే అక్కడ ఆయన కూడా గత ఆగస్టు నెలలో సెలవి చ్చారు. ఆయన అలా మాట్లాడి ఆరు నెలలు దాటినా బాంగ్లాదేశ్‌లో హిందువుల్లో అభద్రతాభావం ఇంకా ఎందుకు పోవడం లేదు? ఆయన తాత్కాలిక ప్రభుత్వ పాలనలో దాడులకు పాల్పడిన ఎందరిపై చర్యలు తీసుకున్నారో, బాధితులను ఏ మేరకు ఆదుకున్నారో ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌ ‌నివేదిక చూస్తేనే తెలుస్తోంది. పాకిస్తాన్‌ ‌చేతిలో కీలుబొమ్మగా మారిన యూనస్‌ ‌భారత్‌కు, అక్కడున్న హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టులో నీతి వాక్యాలు పలికిన యూనస్‌ ‌గత నవంబర్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ ‌కృష్ణదాస్‌తో సహా పలువురు ఇస్కాన్‌ ‌సభ్యులను దేశ ద్రోహుల కింద తప్పుడు కేసులతో అరెస్టు చేసినా మౌనం దాల్చారు. బాంగ్లాదేశ్‌ ‌సైన్యం భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడటం అక్కడి నేతల ద్వంద్వ నీతికి నిదర్శనం.

బాంగ్లాదేశ్‌ ‌మనపట్ల ఎంత కర్కశంగా ప్రవర్తిస్తున్నా ఇటీవల మన దేశ బడ్జెట్లో కూడా ఆ దేశానికి రూ.120 కోట్లు కేటాయించడం మన ఉదాసీనతకు నిదర్శనం.మేధావులు కానీ, మమతా బెనర్జీ కానీ ఇప్పుడు ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌ ‌నివేదికపై ఎలా స్పందిస్తారో చూడాలి. లౌకికవాదం ముసుగులో అక్కడి హిందువుల కోసం మాట్లాడితే ఇక్కడ ముస్లింలు ఎక్కడ నొచ్చుకుంటారో అని చూసీచూడనట్టు దాటవేత వైఖరినే ప్రదర్శిస్తారు మన సెక్యులర్‌ ‌మేధావులు, నేతలు. రాజకీయ కుట్రలో భాగంగా బాంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లలో మైనార్టీలు ప్రధానంగా హిందువులు బలిపశువులుగా మారా రనేది వాస్తవం. 17 కోట్లకు పైగా జనాభా ఉన్న బాంగ్లాదేశ్‌లో హిందువులు 8 శాతం. ఈ నేపథ్యంలో ఓహెచ్‌సీ హెచ్‌ఆర్‌ ‌వంటి నివేదికలపై అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరిగేలా చేసి, బాంగ్లా దేశ్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత భారత ప్రభుత్వంపై ఉంది.

– ‌శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE