ప్రాణం అనేది దీపం. దానిని వెలిగించడమే దైవత్వం. ప్రాణదానం అంటే అవయవదానం కూడా! కన్ను తెరిస్తే జననం, మూస్తే మరణం. ఈ మధ్యలోనిదే జీవితం. జీవితాన్ని శాశ్వతం చేసుకోవడం కొందరికే సొంతం. వారి అభిమతం ఇతరుల హితం! మానవత గుబాళించాలన్నా, దేవతత్వం ప్రత్యక్షం కావాలన్నా వారే. అలాంటి వనితామూర్తులెందరో! వారంతా మరణంలోనూ ప్రాణప్రదాతలు. ప్రాణదీపాల్ని వెలిగించిన ధన్యచరితులు. ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా ఫిబ్రవరిలోనే ఒకనాడు… దాదాపు పాతికేళ్ల యువ వాహన చోదకుడు ప్రమాదవశాత్తు పెద్ద భారీవాహనం టైర్ల కింద పడడంతో శరీరం రెండు ముక్కలుగా విడివడింది! శిరస్త్రాణంవల్ల తలఛిద్రం కాలేదు. తను బతికింది అతికొద్దిసేపే. ‘నా దేహంలో పనికొచ్చే అవయవాలన్నిటిని ప్రాణాప్రాయంలో ఉన్నవారికి దానంగా అందజేయండి’… అన్నది ఆతని చివరి కోరిక. ఇటువంటి సందర్భమే ఈ మధ్య మరొకటి. పాతికేళ్లలోపు వయసు గల అమ్మాయి… పేరు భూమిక. ఆంధప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాకు చెందిన ఆమె తెలంగాణ రాజధాని భాగ్యనగరిలో వైద్యురాలు. ఇతరుల ప్రాణాలను కాపాడటమే వృత్తిగా జీవించిన ఆమె ఒకరోజు తన వాహనం అదుపు తప్పి, ప్రమాదం పాలై చికిత్స పొందుతూ, తిరిగి రాని/ రాలేని లోకానికి తరలి వెళ్లింది. ‘అవయవ దానం అన్నిటికన్నా మిన్న’ అని ఆమె అమ్మానాన్నలకు, మిత్రులకీ చెప్తుండేది. ఆ ప్రకారమే… ఆమె గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల దానంతో ఐదుగురు పునర్జన్మ పొందారు.
ఒక దీపం ఎన్నో దీపాన్ని వెలిగిస్తుంది. ఒకరు చేసే అవయవదానం ఆర్తులకు ప్రాణప్రదానం అవుతుంది. అవయవమార్పిడి వైద్యవిధానం మన దేశంలో రూపురేఖలు సంతరించుకుని నాలుగు దశాబ్దాలు దాటింది. మనం ‘స్వస్థ సమాజం’ అంటుంటాం. ఆరోగ్యభారతం గురించి చదువుతాం, రాస్తాం, వింటాం, మాట్లాడుతాం.
‘కొన ఊపిరులకు ఊపిరులూదడం’ అంటాం కదా! అవయవదానం అంటే సరిగ్గా అదే. అందుకే ‘జీవన్‌దాన్’ సంస్థ కార్యకలాపాలు విస్తరిస్తూ వస్తోంది. ఆన్‌లైన్ వ్యవస్థతో అనేకానేక వైద్యశాలల అనుసంధానం. అందులో భాగంగా ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధిత ఆప్తుల సమ్మతితో ఆవయవ సమీకరణ జరుగుతోంది.
గతాన్ని పరిశీలిస్తే – శ్రీకాకుళంలోని సచివాలయ ప్రాంతంలో 23 ఏళ్ల అమ్మాయికి ఓనాడు రోడ్డు ప్రమాదంలో ‘బ్రెయిన్ డెడ్’అయింది. రైతు కుటుంబంలో పుట్టిందామె. చక్కగా చదివి, ప్రతిభతో పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించింది. రెవిన్యూ అధికారిగా బాధ్యతలు నిర్వహించింది. ప్రమాదవ శాత్తు తీవ్రగాయాలకు లోనై మరణించే తరుణం లోనూ మరో ఐదుగిరికి అవయవ దానశీలిగా వెలిగింది.
ఆ తల్లిదండ్రులకు ఇద్దరూ అమ్మాయిలే. పెద్దమ్మాయి మౌనిక- ఒకరోజు విధి నిర్వహణకు వెళ్తూ ప్రమాదం పాలైంది. బ్రెయిన్‌డెడ్ పరిస్థితి దాపురించింది. పుట్టెడు దుఃఖంలోనూ అమ్మా, నాన్నా ఆమె అవయవ దానానికి సమ్మతించారు. గుండె, మూత్రపిండాలు, కళ్లను సేకరించిన వైద్యనిపుణులు రోడ్డు, వాయు మార్గాల ద్వారా తరలించి అవసరార్థులకు అమర్చారు. ‘మా అమ్మాయి – చనిపోలేదు. బతికే ఉంది.’…ఇవి ఆ తల్లిదండ్రులు నోట వెలువడిన దుఃఖంతో కూడిన సంతృప్తికర మాటలు.
దేశ రాజధాని నగరంలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) చరిత్రలో చిరస్థాయిలో నిలిచిన సందర్భం ఒకటుంది. రోల్ అన్ ఆరేళ్ల బాలికపై దుర్మార్గులు కాల్పులు జరిపారు. ఒక తూటా ఆమె తలలోకి దూసుకెళ్లింది! బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. మెదడు పూర్తిగా దెబ్బతింది! బ్రెయిన్ డెడ్ (జీవచ్ఛవ) దుస్థితి.
ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి?
వైద్యులు ముందుకొచ్చారు. పాప కుటుంబికులతో మాట్లాడారు. అవయవ దానానికి ఒప్పించగలిగారు. సీనియర్ న్యూరో సర్జన్లు కీలక భూమిక వహించారు. ఫలితంగా- ఆ బాలిక గుండె కవాటం, లివర్, కిడ్నీలు, కార్నియాలు దానక్రియలోకి చేరాయి. అంత చిన్నపిల్ల – అవయవదాత చరిత్రలో ఇంకెవరు ఉంటారు?
‘ఆరేళ్ల నా కూతురు నాకు లేకుండాపోయింది. తిరిగి తీసుకురాలేం. కానీ అవయవాల్ని దానం చేయడంవల్ల… ఇతరుల్లో జీవించి ఉందని తండ్రిగా అనుకుంటాను’ హరానారాయణ్ అంటున్నప్పుడు ఆయన కళ్ల నుంచి నీళ్లు జలజలరాలాయి. ‘నువ్వు పోయి ఇంతమందిని బతికించావా అమ్మా’ అంటున్న ప్పుడూ ఆయనలో దైవత్వం ప్రతిఫలించింది.
ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపాన కబళిస్తాయో ఎవరికీ తెలియదు. రెప్పపాటులోనే మృత్యుకాట్లు కొన్ని. వైద్యశాలల్లో చికిత్సలు జరిగినా దక్కని ప్రాణాలు మరికొన్ని.
మూత్రపిండాలకు రక్తమార్పిడి చికిత్సలతో లక్షల మంది ఇప్పటికీ వైద్యశాలల్లో ఉంటున్నారు. సకాలంలో ఆదుకునే ప్రాణదాతలు బయట ఏ కొద్దిమందో! బాధితుల్లో వేలాది మందికి అత్యవసర చికిత్సలు, వైద్యం అంది తీరాల్సిన ఆగత్యమున్నా, అవయవమార్పిడి అనేది వందల్లోనే సాధ్యమవు తోంది.
జీవచ్ఛవ స్థితిలో ఉన్న కొందరి శరీర అవయవాల దానాన్ని వారి కుటుంబ సభ్యులు అనుమతించడం ప్రాణదాన పరిణామక్రమమే! అటువంటి దాతల సంఖ్య పెరుగుతున్నా, జరిగింది కొంతే, జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది. అవయవ, కణజాలదాతల కొరతవల్లనే ఏటా వేలమంది మరణిస్తున్నారు. అంతే సంఖ్యలో నరకయాతన అనుభవిస్తున్నారు.
ఒకదాత ఎనిమిది మంది ప్రాణాలను కాపాడే అవకాశముంది. జీవితాశను కోల్పోయినవారికి అదొక పునర్జన్మ.అవయవ దాతృత్వంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంత కృషి సాగిస్తున్నా ఆ అవగాహన ఆశించిన స్థాయి పల్లెలకు చేరడం లేదు! ప్రయోజనం కొంతవరకే ఉంటుంది. మరణభయం మనిషిని ప్రతినిమిషం చంపేస్తుంది! మరణం గురించిన అవగాహన మాత్రమే ఆ వ్యక్తిని జీవించేలా చేయగలుగుతుంది.
మరణ దశకు చేరినవారి నుంచి అవయవాలు తీసి అవసరమైన వారికి అమర్చే పూర్తిస్థాయి సాంకేతికత చాలా వైద్యశాలలకు లేదు. ఇదొక జీవితకాల సమస్య. దీనికితోడు చికిత్స నిపుణుల కొరత, కొన్నిసార్లు మధ్య దళారుల బెడద, వైద్య, వైద్యపత్రాల తారుమారు వంటి తీవ్రస్థాయి ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఇంతేకాకుండా….
1. అవయవదాతగా నేను ఎందుకు మారాలి?
2. అసలు బ్రెయిన్‌డెడ్ అనేది ఎవరు ఎలా నిర్ధారిస్తారు?
3. వైద్యుల మాటలనే పరిపూర్ణంగా నమ్మడమెలా?
4. మెడికో లీగల్ కేసుల మాటేమిటి?
ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు, సందేహాలు, అనుమానాల పరంప!
ఏవి ఏ విధంగా ఉన్నా, జీవనదానం వెల్లివిరు స్తూనే ఉంది. ఉంటోంది. అవయవదాన క్రియలో 2023లో మహిళల సంఖ్య ఎక్కువ. తుదిదశలో అవయవ వైఫల్యంతో వ్యథ చెందేవారికి నూతన జీవితాన్ని ప్రసాదించింది. దాతల్లో అధికులు స్త్రీలేనని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల నివేదికను బట్టి తెలుస్తోంది.
ఆజాదీకా అమృత మహోత్సవ్ (భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వైభవం) తరుణంలో అవయవదానం పక్రియను ‘ప్రజా ఉద్యమం’గా ప్రాచుర్యాన్ని తెచ్చారు. ఆ ప్రచార, ఆచరణ సందర్భాల్లో విరివిగా పాల్గొన్నదీ అతివలే! మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆ మధ్య ముఖ్య నిర్ణయం ప్రకటించింది. ‘సజీవ అవయవ దానానికి జీవిత భాగస్వామి అనుమతి తప్పనిసరిగా ఉండాలా’ అంటే ఉండనవసరం లేదని ప్రకటించింది. నాడు దాతగా ముందుకు వచ్చిన మహిళను భోపాల్ ఆస్పత్రి అధికార కమిటీ నివారించింది. ఆమె భర్త నుంచి అనుమతి పత్రం పొందాల్సిందేనని పట్టుబట్టింది (ఇంతకీ ఆమె తన కిడ్నీని దానం చేస్తానంది. తన సోదరుడికే). మానవ అవయవాల, కణజాలల్లో మార్పిడి చట్టాన్ని 1994లో రూపొందించారు. ఆ ప్రకారం చూస్తే జీవిత భాగస్వామి అనుమతి తప్పనిసరి అనే నిబంధన ఏదీ లేదన్న మాట. అయితే, సమయ సందర్భాలను అనుసరించి మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
సమస్తాన్నీ గుట్టలుగా కుమ్మరించినా, పోయిన ప్రాణం తిరిగి రాదు. మరి అవయవదానంలో ప్రాణం పోయగలిగిన శక్తి మనిషికే ఉంది. మహిళా దాతలు అధిక సంఖ్యలో ముందడుగు వేయడమే స్ఫూర్తిమంతం, మంత్రం. దాతలుగా పురుషులు, మహిళలు సమానులే. మహిళలే ఈ సామాజిక మానవీయ మహోద్యమానికి ముందు వరసన నిలవడం చారిత్రక సత్యం.
వనితాశక్తి అన్నది అందుకే! దాతృత్వం అంటే వారిదే!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్