డోనాల్ట్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేపడుతున్న చర్యల కారణంగా అంతర్జాతీయంగా, భారత ఆర్థికవ్యవస్థలో కొంతమేర అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రకటించిన విధంగానే ఇమ్మిగ్రేషన్, టారిఫ్‌ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. మరి వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. అన్నింటికంటే ముఖ్యమైంది డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనం పడటం! ఒకవేళ ఈ పరిస్థితుల్లో రూపాయిని కాపాడేందుకు ఆర్‌బీఐ ఏమైనా చర్యలు తీసుకుంటే ఎగుమతులపై ప్రభావం పడుతుంది. దీన్ని తట్టుకోవడానికి దేశీయంగా మరిన్ని ఉద్యోగాల సృష్టి, వినియోగాన్ని పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టక తప్పదు. డాలర్ బలపడటానికి ప్రధాన కారణం వివిధ దేశాల ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తామంటూ చేసిన ట్రంప్ హెచ్చరికలే. ఈ విధంగా టారిఫ్‌లు పెంచడం వల్ల అమెరికాకు దిగుమతులు తగ్గుతాయి. కరెంట్ ఖాతా లోటు, వాణిజ్య లోటు తగ్గుతుంది. ఫలితంగా వివిధ దేశాలకు అందుబాటులో ఉండే డాలర్లు తగ్గుతాయి. ఆ విధంగా డాలర్ బలోపేత మవుతుంది. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తు లను అమెరికాకు ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడటంతో, క్రమంగా తమ తయారీలను అమెరికాకు మారుస్తాయి. దీనివల్ల అమెరికాకు మరింత మూలధనం సమకూరుతుంది. ఈ విధంగా డాలరుపై సానుకూల ప్రభావం ఏర్పడి అమెరికా ఆర్థికవ్యవస్థ, డాలరు బలోపేతమవుతాయి. ఇదీ ట్రంప్ అనుసరించే వ్యూహం.
ఇక అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ సియాటిల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపేయడం తాజా పరిణామం. ఇది అందరూ ఊహించిందే. శతాబ్ద కాలంగా అమల్లో ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేసే విషయంలో ట్రంప్ అభిప్రాయం ఎట్లా ఉన్నా, అక్కడి వ్యవస్థలు దీన్ని అంగీకరించే పరిస్థితి లేదని అందరూ అనుకున్నదే. సహజంగానే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన డెమోక్రట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరేగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్ట నిబంధనలకు ఈ నిర్ణయం వ్యతిరేకమని వాదించాయి. దీంతో కింది న్యాయమూర్తి జాన్ కాఫ్నర్ ఈ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు చెప్పారు. ఇప్పటికే పలు పౌరసంఘాలు, 22 రాష్ట్రాలు ట్రంప్ పౌరసత్వ రద్దు నిర్ణయంపై పలు కోర్టుల్లో దావాలు వేశాయి. అయితే ట్రంప్ సహా మరే ఇతర యు.ఎస్. అధ్యక్షుడు ఈ రాజ్యాంగ హక్కును రద్దుచేయడం అంత సులభం కాదు. ఈ బిల్లుకు ఆమోదం లభించాలంటే దిగువ సభ (హౌజ్), ఎగువ సభ (సెనెట్)లో మూడిరట రెండు వంతుల మెజారిటీ రావాలి. తర్వాత మూడు వంతుల రాష్ట్రాల ఆమోదం పొందాలి. అప్పుడే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఇంత తతంగం ఉన్నందున ఈ చట్టం అమల్లోకి తేవడం అంత తేలికకాదని నిపుణుల అభిప్రాయం.
అక్రమ వలసలపై భారత్ మద్దతు
అక్రమ వలసదార్లపై ట్రంప్ ప్రభుత్వ వైఖరిని భారత్ సమర్థించింది. అమెరికాలో ఉంటున్న అక్రమ భారతీయ వలసదారుల్ని చట్టబద్ధంగా తిరిగి పంపిస్తే స్వీకరిస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటిం చారు. చట్టవిరుద్ధంగా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో చొరబడ్ద అక్రమ వలసదారుల్ని స్వీకరించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఫిబ్రవరిలో భేటీ ఉండే అవకాశాలున్నాయని రాయిటర్స్ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా వస్తువులపై సుంకాలు అధికంగా విధిస్తున్నా రని పదే పదే చెబుతున్న ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశముంది. సుంకాలు తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారని రాయిటర్స్ పేర్కొంది. మనకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2023`24 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 118 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.
మనదేశంతో వివాదం
వర్ధమాన దేశాల ముసుగులో భారత్, చైనాలు వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నాయని మొద ట్నుంచీ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తర్వాతి కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేషియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్ ద్విచక్ర వాహనాలపై సుంకాలను తగ్గించాలని మన దేశంపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. చివరకు మనదేశం సుంకాలు తగ్గిస్తే, ఇది చాలదంటూ పేచీకి దిగారు. అంతేకాదు మన ఉక్కుపై 25%, అల్యూమినియం ఉత్పత్తులపై 10% అదనపు టారిఫ్ విధించడం ద్వారా ప్రతీకార వైఖరిని చూపారు. మనదేశం కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెంచింది. తర్వాత జీఎస్టీ నిబంధనలు భారత్‌కు వర్తింప జేయొద్దని ఏకంగా ప్రపంచ వాణిజ్యసంస్థలకు ట్రంప్ లేఖ రాశారు. ఇక బ్రిక్స్ దేశాలు డాలర్ రహిత వాణిజ్యం వైపు మొగ్గు చూపితే వందశాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. బ్రిక్స్‌లో మనదేశం కీలక భాగస్వామి. ఏదో విధంగా మనదేశాన్ని రష్యా, చైనాల నుంచి దూరం చేయాలన్నది ట్రంప్ ఉద్దేశం. అయితే ఈ విషయంలో ఆయన తెగేదాకా లాగే ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే అటువంటి చర్యలు అమెరికాకూ నష్టమే! ఉదాహరణకు 2019లో చైనా ఎగుమతులపౖౖె రూ.30 వేల కోట్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ రంగ ఉత్పత్తుల కొనుగోళ్లు ఆపేయాలని చైనా తన ప్రభుత్వ రంగ సంస్థలకు నిర్దేశించిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ట్రంప్ తన హెచ్చరికను ఉపసంహరించుకున్న తర్వాత కానీ పరిస్థితి కుదుడపడలేదు.
పనామా కాల్వ వివాదం
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్ పనామా కాల్వను బలవంతంగానైనా సరే స్వాధీనంలోకి తెచ్చుకుంటామంటూ చేసిన ప్రకటన భవిష్యత్ పరిణామాలపై ఆందోళన రేకెత్తించేదిగా ఉంది. 1977 నాటి ఒప్పందం ప్రకారం పనామాకు ఈ కాల్వను అమెరికా ఇచ్చివేసింది. ఇప్పుడు ఈ కాల్వ నియంత్రణ చైనా చేతుల్లోకి వెళ్లిందనేది ట్రంప్ ఆరోపణ. అసలు ఈ కాల్వను పనామాకు అప్పగించడమే మూర్ఖపు నిర్ణయమన్నది ఆయన అభిప్రాయం. అమెరికా నుంచి భారీఎత్తున ఫీజు వసూలు చేస్తున్నదంటూ ట్రంప్ చెప్పినా, ఆయన ప్రకటన వెనుక అసలు కారణం వేరే ఉంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశం దీని వెనుక ఉన్నదని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే డ్రాగన్ తన విస్తరణ కాంక్షను మరింత దృఢంగా అమలు చేసే ప్రమాదం లేకపోలేదు. తైవాన్ విషయంలో చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమే ఇప్పటివరకు అమెరికా అనుసరిస్తున్న విధానం. ఇప్పుడు పనామా విషయంలో ట్రంప్ ప్రకటన, చైనాను తన విస్తరణ కాంక్షను చట్టబద్ధంగా భావించే పరిస్థితిని తెచ్చిపెట్టింది. ట్రంప్ ప్రకటన వల్ల కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా పనామా కాల్వను స్వాధీనం చేసుకోవడం సముచిత మైనప్పుడు, రష్యా తనవిగా భావించే ఉక్రెయిన్‌లోని భాగాలను ఆక్రమించుకోవడం తప్పెలా అవుతుంది? ఇదే సమయంలో తైవాన్ తమదేశంలో భాగమని చైనా వాదిస్తోంది. అప్పుడు ఇదికూడా తప్పు కాదు. మనదేశానికి వస్తే పీఓకే మనదే అంటున్నాం. బలప్రయోగంతో దీన్ని స్వాధీనం చేసుకోవడం కూడా చట్టబద్ధమే అవుతుంది.
రష్యా, చైనాలదీ తప్పు కాదు
సమస్య ఇక్కడితో ఆగలేదు, కెనడా, ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలోని గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటామని ట్రంప్ చేసిన ప్రకటనలను పరిశీలిస్తే, రష్యా, చైనాల భూఆక్రమణలకు ఆమోదం లభించినట్టే కాగలదు. ట్రంప్ ప్రకటనల్లో దేన్ని అమలు చేసినా, చైనా తక్షణమే తైవాన్‌ను కలిపేసు కోవడం ఖాయం. నిజానికి పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతూ పనామా కాల్వను అమెరికా తవ్వించింది. 1904`14 మధ్యకాలంలో జరిపిన ఈ కాల్వ పనుల్లో కొన్ని వేలమంది అమెరికా కార్మికులు మరణించారు. ఎట్టకేలకు కాల్వ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రయాణ దూరం చాలావరకు తగ్గడంతో ఈ కాల్వ గుండా వాణిజ్య ఓడల రాకపోకలు పెరిగాయి. వీటిల్లో 70 శాతం ఓడలు అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి ఈ కాల్వ పనామా అధీనంలో కొనసాగుతోంది. ఎప్పుడైనా భద్రతకు ప్రమాదం వాటిల్లుతున్నదని భావిస్తే అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ ఈ కాల్వ చైనా నియంత్రణలో ఉన్నదని చెబుతున్నారు. వాస్తవమేంటంటే హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాల్వలోని కరీబియన్, పసిఫిక్ ప్రవేశాల వద్ద నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. కాకపోతే 2017లో చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరిన మొట్టమొదటి దేశం పనామా! 2016లో చైనా ప్రభుత్వ సీఓఎస్‌సీవోకు చెందిన ఓడ తొలిసారిగా పనామా కాల్వలోకి ప్రవేశించింది. అదే ఏడాది చైనాకు చెందిన లాండ్ బ్రిడ్జ్ గ్రూపు మార్గరిటా దీవి లోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాల్వపై మరో రెండు వంతెనల నిర్మాణ కాంట్రాక్టును కూడా చైనా కంపెనీలే దక్కించు కున్నాయి. ఈ విధంగా క్రమంగా ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం, అమెరికా ఆగ్రహానికి ప్రధాన కారణం. తాను కష్టపడి నిర్మించిన కాల్వపై చైనా క్రమంగా తన పెత్తనాన్ని పెంచుకుంటూ పోవడం అమెరికాకు ఏమాత్రం మింగుడు పడనిది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పనామా కాల్వ కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ముందుకు తేవడం తాజా పరిణామం.
వాణిజ్యంపై ప్రభావం
సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిస్తున్న ట్రంప్ వీటి పర్యవసానం కలిగించే ప్రతికూల ఫలితాలను గుర్తించాలి. 1930లో అమెరికా టారిఫ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకు ప్రతిగా ఇతర దేశాలు కూడా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ రావడంతో, పెను సంక్షోభం ఏర్పడిరది. ఫలితంగా ప్రపంచ దేశాల జీడీపీ పడిపోయి, చివరకు హిట్లర్ ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి దారితీసింది. అధికారాన్ని చేపట్టిన తర్వాత గతంలో చెప్పినట్టుగానే ట్రంప్ మెక్సికో, కెనడా, చైనాల దిగుమతులపై దిగుమతి సుంకాలను పెంచేయడం ద్వారా అమెరికాను మరింత స్వీయ రక్షణ విధానాల్లోకి తీసుకెళ్లారు. ఈ కొత్త టారిఫ్ విధానాలవల్ల మెక్సికో, కెనడాలకు మాత్రమే కాదు అమెరికాకు కూడా నష్టమే! ఉదాహరణకు కార్ల తయారీ రంగానికి ఈ మూడు దేశాల్లో సరఫరా శృంఖలాలున్నాయి. ఈ టారిఫ్‌లవల్ల ఈ శృంఖలాలు పూర్తిగా దెబ్బతిని ఆటోమొబైల్ మార్కెట్ పూర్తిగా దెబ్బతినడం ఖాయం. రేట్లు విపరీతంగా పెరిగి, డిమాండ్ పడిపోవడమే ఇందుకు కారణం. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామాకు ఈ టారిఫ్‌ల భయం కూడా ఒక కారణమని చెబుతున్నారు. అయితే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అందుకు తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని జస్టిన్ ట్రూడో హెచ్చరించారు. దీనివల్ల నష్టపోయేది వినియోగదారులేనని ఆయన అన్నారు. కెనడానుంచి 34 రకాల అత్యవసర ఖనిజాలు, లోహాలను అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. ప్రతిరోజూ 270 కోట్ల డాలర్ల విలువైన వస్తువుల వాణిజ్యం ఇరుదేశాల మధ్య జరుగు తుంటుంది.
చైనాకు తలనొప్పి
ఇక టారిఫ్‌ల బారినపడే మరో దేశం చైనా. చవక ధరలకే వస్తువులను ఇతరదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రపంచ తయారీ కర్మాగారం చైనా వస్తువులు, పెంచిన టారిఫ్‌ల పుణ్యమాని ధరలు పెరిగి డిమాండ్ పడిపోవడం ఖాయం. 2024లో చైనా ప్రభుత్వ లక్ష్యాల మేరకే ప్రగతిని సాధించినప్పటికీ, అంతర్గత, బాహ్య ఒత్తిళ్లను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. కొనసాగుతున్న స్థిరాస్థి సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలకు తోడు చైనా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలు పెంచేస్తామన్న బెదిరింపులతో చైనా పాలకులకు దిక్కుతోచడం లేదు. నిపుణులు చైనా ప్రగతి స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నా, క్రమంగా పెరుగుతున్న అస్థిర పరిస్థితులు చైనా ప్రగతిపై నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో కొనుగోళ్లను పెంచుకుందామనుకున్నా, వినియోగదార్ల కొనుగోలు శక్తి బలహీనంగా ఉండటం పెద్ద అడ్డంకి. దీన్ని ఏవిధంగా ఎదుర్కోవాలన్నది చైనా ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు! ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యల కారణంగా ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2024 డిసెంబర్ నెలాఖరకు చైనా ప్రగతి 4.1%గా నమోదైంది. ఈ ఏడాది 4.5%కు చేరుకునే అవకాశాలు న్నాయని అంచనా. ఇక ట్రంప్ మొదటిసారి యు.ఎస్. అధ్యక్షుడైనప్పటి నుంచే చైనా దిగుమతులపై టారిఫ్‌లు పెంచడం మొదలైంది. అది బైడెన్ ప్రభుత్వ హయాంలో మరింత పెరిగి, ఇప్పుడు ట్రంప్`2 హయాంలో మరింత సంక్లిష్టతకు గురికానున్నాయి. ఈవిధంగా టారిఫ్‌లు పెంచడమంటే చైనా కంపెనీలను మరో దేశాన్ని చూసుకోమని పరోక్షంగా చెప్పడమే! అయితే గత మూడు నాలుగు దశాబ్దాల కాలంనుంచి చైనా క్రమంగా ఎదుగుతూ నేడు ప్రపంచ తయారీ కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడి కంపెనీలు ఉన్నఫళంగా అక్కడినుంచి మారే పరిస్థితి లేదు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో చైనాను పూర్తిగా పక్కనబెట్టడం సాధ్యం కాదు కూడా. అయితే ఈ సారి ప్రపంచ వాణిజ్య పోరులో ప్రధానపాత్ర విద్యుత్ వాహనాలదే అవుతుంది. ఎందుకంటే గత ఏడాది చైనా 10మిలియన్ల వాహనాలను అమ్ముకోగలిగింది. వీటిల్లో సింహభాగం అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలకే ఎగుమతి అయ్యాయి. ఇప్పుడీ దేశాలు టారిఫ్‌లు విధించడానికి ఉద్యుక్తమవడంతో చైనా ప్రపంచ వాణిజ్యసంస్థలో ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తోంది. ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌ల వల్ల ఈయూ దేశాలపై కూడా ప్రభావం చూపనుంది. సంప్రదాయికంగా జర్మనీ, ఫ్రాన్స్‌లు యూరప్ దేశాల ఆర్థిక ప్రగతికి ఇంజన్లుగా కొనసాగుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుం దేమో కానీ, యూరప్ దేశాల ఎగుమతులు దెబ్బతిని వాటి ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. ఇక కెనడా నుంచి దిగుమతులపై 25% టారిఫ్ పెంచడం, ఆ దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభానికి కారణమవుతోంది. ట్రంప్ బెదిరింపులను ఎదుర్కొనే విషయంలో విభేదాల నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్స్ రాజీనామా చేసారు. తర్వాతి పరిణామాల్లో జస్టిన్ ట్రూడోకు మద్దతు క్రమంగా పడిపోవడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించక తప్పలేదు. ఫలితంగా కెనడా రాజకీయాలు పెద్ద కుదుపునకు లోనయ్యాయని చెప్పక తప్పదు.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు?
రష్యా` ఉక్రెయిన్ యుద్ధానికి వందరోజుల్లోగా ముగింపు పలకాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించి ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షులు జెలన్‌స్కీపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. ప్రధానంగా తమ దేశ భూభాగాలను కోల్పోవడం, రష్యాకు అనుకూలంగా మినహాయిం పులు ఇవ్వాల్సివస్తే పరిస్థితేంటనేది జనన్‌స్కీని వెంటాడుతున్న సమస్య! ఉక్రెయిన్‌కు సంబంధించి తాను అమెరికా అధ్యక్షులు ట్రంప్‌తో చర్చించేందుకు సిద్ధమని రష్యా అధ్యక్షులు కూడా పుతిన్ కీలక వ్యాఖ్యలు చేయడం తాజా పరిణామం. రష్యా టెలివిజన్‌లో మాట్లాడుతూ అసలు 2020లో డోనాల్డ్ ట్రంప్ అధికారంలో వున్నట్లయితే అసలు ఉక్రెయిన్‌తో యుద్ధం వచ్చి ఉండేదేకాదన్నారు.ఈ సందర్భంగా ట్రంప్‌పై ప్రశంసల జల్లు కురిపించడమే కాదు, గత ఎన్నికల్లో ట్రంప్ విజయాన్ని ‘దొంగిలించి ఉండకపోతే’ ఉక్రెయిన్ సంక్షోభం వచ్చివుండేది కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, నాటి తన పరాజయం అక్రమ మంటూ ట్రంప్ చేస్తున్న వాదనకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. దావోస్ వేదికగా జరుగుతున్న వర్చువల్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ రష్యా`ఉక్రెయిన్ యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలుకుతానని చెప్పారు. సౌదీ అరేబియా, ఒపెక్ దేశాల కూటమి చమురు ధరలు తగ్గిస్తే యుద్ధం త్వరగా ముగిసిపోతుందన్నారు. అయితే చమురు ధరలకు, యుద్ధం అపడానికి సంబంధం లేదని రష్యా స్పష్టం చేసింది. అమెరికా`రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడుగా జోబైడెన్ ఉన్న కాలంలో పెద్ద మొత్తంలో ఆర్థిక, ఆయుధ సహకారం అందింది. ఇక మధ్య ప్రాచ్యం విషయానికి వస్తే ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి, హమాస్ గ్రూపులపై తన పలుకు బడిని ఉపయోగించి, ఎట్టకేలకు ఇజ్రాయెల్`పాలస్తీ నాల మధ్య ఒక అంగీకారం కుదిరేలా చేశారు. ముఖ్యంగా గాజాలో కాల్పుల విరమణకోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఒప్పించగలిగారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే రాబోయే కాలంలో వరల్డ్ ఆర్డర్ మారనున్నదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్