‘నేను మళ్లీ పోటీ చేస్తాను’ అని నాలుగేళ్ల క్రితం ఘంటాపథంగా చెప్పారు డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌. సందర్భం – జో బైడెన్‌ చేతిలో ఓడిన క్షణం. అన్నట్టే ఆయన పోటీ చేశారు. ట్రంప్‌ గెలవడానికి బైడెన్‌ అన్ని విధాలా సాయపడ్డారు కూడా. తన మతిమరుపుతో, అభ్యర్థిత్వం హఠాత్తుగా కమలా హ్యారిస్‌కు బదలీ చేయడం వంటి అంశాలు, ఇక విధానపరమైన నిర్ణయాలు ఉండనే ఉన్నాయి. బైడెన్‌ హయాం ముందు ట్రంప్‌ వెంటాడుతూ వస్తున్న వివాదాలు కూడా వెలవెలబోయాయి. జూన్‌ 6, 2024ను అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో చిరస్మరణీయం చేస్తూ ఆయన రెండోసారి నాలుగేళ్ల వ్యవధి తరువాత శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు. తన ప్రత్యర్థి కమలా హ్యారీస్‌ (డెమోక్రాటిక్‌ పార్టీ) మీద 295 ఎలక్టొరల్‌ ఓట్లతో ఘన విజయమే సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20, 2025న ఈ రిపబ్లికన్‌ పార్టీ నేత ప్రమాణ స్వీకారం చేస్తూనే సంచలనాలకు శ్రీకారం చుట్టారు. అమెరికా అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1861లో అబ్రహాం లింకన్‌ ప్రమాణం చేసిన బైబిల్‌ మీదనే ట్రంప్‌ కూడా ప్రమాణం చేసి, పదవీ స్వీకారం చేశారు. ఇంకా శ్వేతసౌధంలోకి వెళ్లకుండానే ట్రంప్‌ బైడెన్‌ నిర్ణయాలన్నింటిని ఒక్క కలం పోటుతో త్రోసిరాజన్నారు. ట్రంప్‌ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రమాణం చేశారు. ట్రంప్‌ తనదైన ధోరణిలో వాన్స్‌ భార్య ఉష ఉపాధ్యక్షురాలు అయి ఉంటే బాగుండేదని చెప్పడం కొసమెరుపు.

స్వర్ణయుగం మాటేమోగాని, సంచలనాలు మాత్రం ప్రపంచ మీడియాలో పతాక శీర్షికలుగా నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన హత్యాయత్నాలను కూడా ఆయన ఇప్పుడు తనకు అనుకూలంగా మలుచుకుంటూ వ్యాఖ్యానించారు. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా పునఃప్రతిష్ఠించడానికే తనను దేవుడు రక్షించాడని అన్నారు. అక్రమవలసదారులకు అమెరికాలో స్థానంలేదంటూ భారత్‌ వంటి మిత్రదేశానికి ఆనందం కలిగించారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటానని ప్రకటించి ప్రజాస్వామ్యప్రియులను, శాంతికాముకులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ హాజరయ్యారు. ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, హంగేరి ప్రధాని ఒర్బన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ కూడా అభినందనలు అందించారు.

అయితే అంతా అనుకున్నట్టే ట్రంప్‌ నిర్ణయాలు వెంటనే అమలయ్యే అవకాశాలకు అడ్డుకట్ట పడింది. ఆయన నిర్ణయాలను, ప్రధానంగా జన్మతః అమెరికా పౌరసత్వం నిర్ణయం మీద ట్రంప్‌ నిర్ణయం న్యాయ వ్యవస్థ చేతిలో పడిరది.

2021, జనవరిలో బైడెన్‌ గెలుపు సమాచారం వెలువడిన తరువాత కేపిటల్‌ భవనం మీద ట్రంప్‌ అనుచరులు వేసిన వీరంగం నిజానికి కొంత అపఖ్యాతిని తెచ్చింది. తరువాత ఆయన మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్‌ ఈ ఎన్నికలలో గెలిచి రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించారు. ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఇజ్రాయెల్‌`హమాస్‌ సంఘర్షణ; రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం, చైనా దూకుడు, ఐదో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవిస్తున్న తరుణంలో ట్రంప్‌ అధ్యక్షుడయ్యారు. ఎలాన్‌ మస్క్‌ వంటి దిగ్గజం అండదండలు కూడా ఈ ఎన్నికలలో ఆయన కలసి వచ్చాయి. ట్రంప్‌ ధోరణిలో తొలి నుంచి ప్రస్ఫుటంగా ఉన్నదే అక్రమ వలసల అడ్డుకట్ట వేసి తీరాలన్న ఆశయం. అలాగే సమానత్వం పేరుతో, హక్కుల పేరుతో ప్రజాస్వామిక ప్రభుత్వాలను చీకాకు పెట్టే డీప్‌స్టేట్‌ మీద, జార్జిసోరోస్‌ సంస్థల మీద, ఎల్‌జీబీటీక్యూ వంటి ధోరణుల మీద ఆయన ఉక్కుపాదం మోపడం ఖాయంగానే కనిపిస్తున్నది.

ట్రంప్‌ నిర్ణయాలన్నీ కాలపరీక్షకు నిలిచేవేనని ఇప్పుడే ఎవరూ చెప్పడం లేదు. కానీ ఆయన ప్రపంచాన్ని సంక్షోభం వైపు నెడుతున్న అక్రమ వలసల గురించి దృష్టి పెట్టడం ముదావహం. దీనితో ముస్లిం మతోన్మాదానికి అడ్డుకట్ట వేసే అవకాశం కూడా వస్తుంది. లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ ట్రంప్‌ గెలుపు, ఆయన ప్రయాణం ముందే ఊహించినట్టు భయాందోళనలు వ్యక్తం చేయడం చాలా విషయాలను వెల్లడిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అందుకు కారణం, ఆరోగ్య సంస్థ చైనా చేతులలోకి వెళ్లిందని ఆరోపించారు. అలాగే పనామా కాల్వ కూడా చైనా చేతిలోకి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

నిజానికి అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు, రాజకీయాలు ప్రపంచం మీద గట్టి ప్రభావాన్నే కలిగి ఉంటాయి. ఈ సంప్రదాయాన్ని ట్రంప్‌ కొనసాగించడం అత్యంత సహజం. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికకు అంత ప్రాధాన్యం.

About Author

By editor

Twitter
YOUTUBE