ప్రయాగరాజ్‌లో శుభప్రదమైన మాఘ పూర్ణిమను పురస్కరించుకొని కోట్లాదిగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేశారు. నాల్గవ అమృత స్నానానికి నిర్దేశించిన మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 గంటలకు మొదలైంది. మరుసటి రోజు అంటే 12 సాయంత్రం 7:22 గంటలకు సంపూర్ణమైంది. ఈ సందర్భంగా కుంభమేళాలో పాల్గొన్న భక్తులపై హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం 12వ తేదీ సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి మొత్తంగా 1 కోటి 90 లక్షల మంది భక్తులు స్నానం చేశారు. లక్షలాదిగా భక్తులు మాఘ పూర్ణిమ మొదలుకాకమునుపే ఆ శుభ ఘడియల కోసం ఎదురు చూస్తూ రాత్రంతా బారులుదీరారు. మహాకుంభమేళా అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఘాట్ల వద్ద ఎక్కువసేపు ఉండవద్దని, స్నానం చేసిన వెంటనే శిబిరాలకు వెళ్లిపోవాలని భక్తులకు మైకుల ద్వారా పదే పదే విజ్ఞప్తి చేసింది. 10 లక్షల మందికిపైగా కల్పవాసీలు వారి నెల రోజుల దీక్షను సంపూర్ణం చేస్తున్నట్టుగా తెల్లవారుజామునే స్నానం చేసి వారి శిబిరాలకు వెళ్లిపోయారు. కల్పవాసీల దీక్ష ఆధ్యాత్మిక సాధన, నిస్వార్థ సేవ, సామరస్యంతో ముడిపడి ఉంటుంది. దీక్ష చేపట్టినవారు కటిక నేల మీద నిద్రించాలి. వణికించే శీతాకాలం, చెమటలు పుట్టించే వేసవి కాలం ఈ రెండింటిని ఒకే విధంగా అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైతే కల్పవాస దీక్ష చేపడతారో వారికి జీవితంలో కష్ట నష్టాలను సహనంతో, అంకిత భావంతో ఎదుర్కొనే సామర్థ్యం బలపడుతుంది. జీవితంలో కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఒకే విధంగా వ్యవహరించే స్థితప్రజ్ఞతను అలవరుస్తుంది. కల్పవాస దీక్షా సమయంలో హఠ యోగ సాధనతో దేహం దారిలోకి వస్తుంది. మనస్సు అత్యంత సహంగా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమైపోతుంది. పుష్య పూర్ణిమ రోజున స్నానంతో మొదలయ్యే కల్పవాస దీక్ష మాఘ పూర్ణిమ రోజున స్నానంతో సంపూర్ణ మౌతుంది. కల్పవాసీలు హోమం, దానంతో పాటుగా పలు రకాల పూజలు చేసిన అనంతరం గంగా మాత ఆశీస్సులను కోరుతూ త్రివేణి సంగమంలో స్నానం చేశారు. తీర్థానికి రాజైన ప్రయాగరాజుకు భావోద్వేగపూరితంగా వీడ్కోలు చెబుతూ స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టారు. ఆధ్యాత్మికతకు ఆలవాలమైన భారత్‌లో కుంభమేళా ప్రయాగరాజ్, ఉజ్జయినీ, నాసిక్, హరిద్వార్‌లో వేర్వేరు కాలాల్లో జరుగుతుంది. కానీ కుంభమేళాను పురస్కరించుకొని భక్తులు కల్పవాస దీక్షను చేపట్టే ఏకైక ప్రాంతంగా ప్రయాగరాజ్ వాసికెక్కింది. అలా ఈసారి కల్పవాస దీక్ష చేపట్టినవారిలో ప్రతాప్‌గఢ్ నుంచి వచ్చిన రామ్ అచల్ మిశ్రా ఒకరు. ఆయన ఇప్పటిదాకా 18 సార్లు దీక్ష చేపట్టారు.
అదే విధంగా సాత్నా నుంచి వచ్చిన 76 ఏళ్ల శివనాథ్ గామరి వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ 23వ సారి దీక్ష చేపట్టారు. ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ వస్తానంటూ తీర్థానికి రాజైన ప్రయాగరాజ్‌కు వీడ్కోలు పలికారు.
- జాగృతి డెస్క్