ప్రయాగ ఇప్పుడు మూడు నదుల సంగమం మాత్రమే కాదు, ఎన్నో సంస్కృతుల వారిని, సిద్ధాంతాల వారిని కూడా ఏకం చేయగలిగే శక్తి కలిగినదిగా కనిపిస్తున్నది. ముస్లిం, క్రైస్తవ దేశాల వారు, సుదూర దేశాల వారు కూడా ఈ మహోత్సవం పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అందుకే ఈ కుంభమేళా ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించబోతున్నదని చెబుతున్నారు. 73 దేశాల రాయబారులు తాము ప్రయాగలో పవిత్ర స్నానాలు ఆచరించాలని కోరుకుంటున్నామని వర్తమానం ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం యుద్ధంలో మునిగి ఉన్న రష్యా, ఉక్రెయిన్ రాయబారులు కూడా వీరిలో ఉన్నారు. ఈ విషయాన్ని మహాకుంభమేళా ప్రత్యేక అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. అమెరికా, బాంగ్లాదేశ్ రావాలని ఆసక్తితో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో జరుగుతున్న కుంభమేళా ఇప్పటికే ప్రపంచ వార్తగా మారుమోగుతున్నది. కుంభమేళ నిర్వహణ పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధాసక్తులు ఎన్నో దేశాల వారి ప్రశంసలకు నోచుకున్నాయి. జపాన్, జర్మనీ, అర్మేనియా, స్లొవేనియా, హంగేరి, బేలారస్, సెహెచల్స్, మంగోలియా, కజకస్తాన్, ఆస్ట్రియా, పెరు, గౌటెమాలా, మెక్సికో, అల్జీరియా, దక్షిణాఫ్రికా, ఎల్‌సాల్వెడార్, చెక్ రిపబ్లిక్, బల్గేరియా, జోర్డాన్, జమైకా, ఎరిత్రియా, ఫిన్లాండ్, టునీసియా, ఫ్రాన్స్, ఎస్తోనియా, బ్రెజిల్, సూరినామ్, జింబాబ్వే, మలేసియా, మాల్టా, భూటాన్, లెసోథో, స్లోవాకియా, న్యూజిలాండ్, కంబోడియా, కిర్ఘిస్తాన్, చిలీ, సైప్రస్, క్యూబా, నేపాల్, రొమేనియా, వెనుజులా, అంగోలా, గయానా, ఫిజీ, కొలంబియా, సిరియా, గినియా, మైన్మార్, సోమాలియా, ఇటలీ, బోట్స్‌వానా, పరాగ్వే, ఐస్‌ల్యాండ్, లాట్వియా, నెదర్లాండ్స్, కామెరున్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, థాయ్‌లాండ్, పోలండ్, బోలీవియా దేశాల రాయబారులు కుంభమేళాకు వస్తామని తెలియచేశారు. వీరంతా నావలలో వెళ్లి స్నానాలు చేసి బడే హనుమాన్, అక్షయవాత్ ఆలయాలను సందర్శిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇతర ప్రదర్శనలను కూడా తిలకిస్తారు. ‘సనాతన నర్తనం’ అనగానే, వినగానే మెదిలే పేరు ఆమెదే.
‘భారతీయ నృత్యఝరి’ని వేదికమీద ప్రత్యక్షం చేసిందీ ఆమే.
సంప్రదాయ విధానాల జీవనాడి కూచిపూడి
గురు సంప్రదాయ సముదాత్తం భరతనాట్యం
పదవేగ విన్యాస పతాక కథక్
ఆలయ ఆచార ఘనకీర్తి ఒడిస్సీ
తాండవ పద్ధతుల మాధురి మణిపురి
విశేష ఆహార్యాల ఘట్టం మోహినీ యాట్ఠం
నాలుగు యుగాల నృత్య రూపాంతర ప్రదర్శన.
సాంస్కృతికత, కళానిపుణత వెల్లివిరిసేలా చేసే ప్రాభవ వైభవం.
భరతుని నాట్యశాస్త్ర విస్తృతిని దేశ విదేశాల్లో ప్రత్యక్ష అనుభూతిగా నిలిపే ప్రవీణత.
భావ, రాగ, తాళ సమన్విత భరిత థాటి, మేటి వ్యక్తీకరణ.రూప మేళవింపు, కథన పోహళింపులను గుదిగుచ్చి అందించే ఓర్పూ నేర్పూ. శిల్ప విలక్షణతకు ప్రతీకగా, అభినయ దక్షతకు గుర్తుగా వ్యవస్థాపన రీతి.
కదలికల రూపేణా ఆధ్యాత్మికతకు పట్టం కట్టే నిరుపమాన చాతురి.
రసభంగిమల, లయ విన్యాసాల క్రోడీకరణగా నిలిచే శాస్త్రీయతా పటిమ.
వీటన్నింటి ప్రాచుర్యాన్నీ జీవన సరళిగా మార్చుకుని, తాను నేర్చిన విద్య మొత్తాన్ని శిష్యులకు తేటతెల్లం చేయడమే పనిగా మలుచుకున్న తత్వరూపం.
ఈ అంశాలను ఎవరు ఎప్పుడు ప్రస్తావించినా వినమ్రతనే సమాధానంగా అందించడం నిర్మలా విశ్వేశ్వరరావు సహజ స్వభావం.
‘నాట్య శిరోమణి’ అనిపించుకుని ఫిబ్రవరి తొలి వారం నాటికి సరిగ్గా రెండు దశాబ్దాలు. నృత్య ప్రదర్శనలిచ్చిన విదేశాల సంఖ్య కూడా ఇరవైకి పైమాటే!
వేదకాలాలు ఎన్నో మనకు తెలుసు.
సనాతనత్వ ప్రాధాన్యమూ తరతరాలుగా విదితమే. మరి అటువంటప్పుడు – ఏది వేద ధర్మం? ఎటువంటిది సనాతన తత్వం? చిన్నప్పటి నుంచీ నిర్మలలో ఇవే ప్రశ్నలు. వేదాలు ఎంత ప్రాచీనాలో సనాతన ధర్మాలూ అంతే. వ్యక్తికీ సమాజానికీ అవే ఆవశ్యకాలు, ఎన్నటికీ, ఎప్పటికీ ప్రామాణికాలు అన్నదే బాల్యం నుంచీ తనలో స్థిరపడిపోయింది.
ఆమె తల్లిదండ్రుల పేర్లలో సీతారాములున్నారు. బడి వయసులో గురువు పేరులోనూ రాములవారే! చదువుతోపాటు కళలమీదా ఆసక్తి మొదటి నుంచీ ఉండేది నిర్మలకు, ఆ అభిరుచిని పెంచి పోషించినవారు ఎందరెందరో.
ఇంటి వాతావరణం, పాఠశాల విద్యాబుద్ధులు కాలక్రమంలో తనను మరింత ఉత్సాహపరిచాయి. ప్రత్యేకించి, భర్త విశ్వేశ్వరరావు అందిస్తూ వచ్చిన ప్రోత్సాహం ఆమె పయనాన్ని నిరవధికంగా ముందుకు తీసుకెళ్లింది.
సంగీత, సాహిత్యాది కళారూపాల సమాహారం నృత్యం కనుక తన చూపులన్నీ అటువైపే కేంద్రీకృతమయ్యాయి. పెళ్లి అయిన తర్వాతే విశ్వవిద్యాలయ చదువులను పూర్తి చేసుకున్నారు. ఆంధ్రా, కేంద్రీయ, తెలుగువర్సిటీలతో విస్తృత అనుబంధాలు కొనసాగాయి. ఇప్పటికీ సాగుతూ వస్తున్నాయి.
‘మీ తొలి ప్రదర్శన వేదికమీద ఎప్పుడు, ఏ వయసులో’ అని అడిగితే ‘పదేళ్ల లోపునే’ అని బదులిస్తారు నవ్వుతూ. ఆ వయసుల్లో మొదలైన కళారాధన పలు రూపాలు సంతరించుకుని, ఇప్పుడు యాభై ఐదేళ్ల ప్రాయానా నిత్యనూతనంగా వెల్లి విరుస్తుంటే అదీ ఆమె భాగ్య విశేషం.
పదీ పన్నెండేళ్ల వయస్సులోనే పురస్కృతులు సొంతం చేసుకున్న నిర్మలను పలు అవకాశాలు ఏరికోరి వరించాయి. పతకాలన్నింటినో తెచ్చిపెట్టి, బంగరు భవితకు మేటిబాటలు వేశాయి. గానసభలు, కళాభవన్‌లు, లలితకళల తోరణాలు, విజ్ఞాన వికాస కేంద్రాలు, ఇంకెన్నెన్నో వేదికలు సంభావించాయి.
ఆమెతో మాట్లాడుతుంటే, సంప్రదాయం, ఆధ్యాత్మికం, తరంగాలు, జావళీలు, పదాలు, పదవర్ణాలు, కీర్తనలు, శ్లోకాల వంటివెన్నెన్నో జాలువారు తుంటాయి. తిల్లానాలు, జతిస్వరాలు, అభినయ దర్పణాలు. నృత్య అంశాలనేకం వివరణాత్మకంగా వినవస్తుంటాయి.
గురువులను నిరంతరం గుర్తుచేసుకుంటూ ఉంటారామె. ‘నా నాట్య ప్రదర్శనలు, నేను నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు, నాకు లభించిన పురస్కారాలు, వచ్చి చేరిన బిరుదులు…. వీటన్నింటి నేపథ్యం గురుబోధనే’ అంటారు వినయ పూర్వకంగా. ప్రధానంగా కూచిపూడి గురూత్తములు రామమూర్తి, రామ లింగశాస్త్రి. ‘అక్కడి నుంచి నేర్చుకున్న ప్రమాణాలు, విలువలనే ఈనాటికీ అనుసరిస్తూ వస్తున్నాను. బోధించడంలో, అంతకుముందుగానే సమగ్ర అధ్యయనం చేయడంలో ఎంతో సంతోషాన్ని పొందు తున్నాను’ అని చెబుతారు.
భాగ్యనగరంలో ఉంటున్న నిర్మలా విశ్వేశ్వరరావు, భారతీయతను విశ్వవ్యాప్తం చేసేందుకు సాగిస్తున్న కృషికి- నాట్య ప్రభంజని, కళాకౌముది, విద్వన్మణి అంటూ శ్లాఘిస్తుంటారు.
నర్తన రంగాన సమ్మిళిత రూపాలు ఎన్ని లేవు…? అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు, అష్ట పదులు, శివస్తుతులు… ప్రస్ఫుటంగా విశదీకరించా లంటే – వివిధ పాత్ర పోషణలు. లక్ష్మి, పార్వతి, దుర్గ, సీత. రాధగా, ప్రకృతి మాతగా, శకుంతలగా, రాణిగా, మోహినిగా, ఆనంద తాండవం, శశిరేఖా పరిణయం, శ్రీరామకథాసారం, రామదాసు చరితం, దశావతారం, శ్రీకృష్ణ విలాసం, మరీ విభిన్న రీతిన విష్ణు రూపనర్తనం. ఇలా ప్రదర్శనాంశాలు అసంఖ్యాకం. ఏ రూపధారణ చేసినా – హావ భావ ప్రకటనలో, నృత్యదక్షతలో తనకు మాత్రమే సొంతమైన చక్కని పరిణితి ఆమెది.
తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ఉత్సవాల్లో మన సంస్కృతీ పతాకను చేతపట్టి నిలిచారామె. శ్రీలంక, సింగపూర్, దుబాయి, మలేసియా, టర్కీ- ఏ దేశానికి వెళ్లినా, ఎక్కడ ఏ కార్యక్రమాన్ని సమర్పించినా, ఆసాంతమూ భారతీయతే.
గంగాతరంగమై పొంగె నా హృదయమ్ము
అవధరింపుము ప్రభూ! అమృతాభిషేకమ్ము
మనసు అరవిందమై, మమత మకరందమై
విరిసినది నీ ముందు – వేగగొనుమీ విందు.
అందాల నటరాజ! అందుకో నా పూజ!
అనేలా ఆ సన్నివేశమే సాకారమయ్యేలా ఉంటుందా నాట్యప్రభ.
వాగ్గేయకార మహోత్సవ వేదికలైనా, యువకళా ప్రదర్శక ప్రాంగణాలైనా తనకు ఆరాధ్యనీయాలు. పలు రాష్ట్రాలలోని, ఇతర దేశాలలోని తెలుగు సంస్థలూ, సంఘాలు ఆహ్వానించిన సందర్భాలన్నింటి లోనూ సనాతన నర్తన సంప్రదాయానికీ పట్టాభిషేకం చేయడం ఆమె ఘనత.
ప్రాంతీయతకు ప్రాముఖ్యతనిస్తూ ఇంకా ఇంకా ప్రదర్శనలిచ్చారు. శిష్యులతో చేయిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక పోటీల బహుమతి నిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు.
మెరుపుల, మైమరపుల రసావిష్కరణలో మేటి. సమయ సందర్భాల అనుసారంగా జానపద నృత్య పక్రియలోనూ ఆమె ధాటి.
గోదావరి ప్రాంతాన పుట్టి పెరిగిన నిర్మల నర్తన ‘నికేతనం’ ఎంతెంతో ప్రాచుర్యాన్ని అందుకుంది. ఆ సంస్థ నుంచీ అనేక వసంతాలుగా ఎందరెందరో శిక్షణ పొంది, పేరు ప్రఖ్యాతులను తమవిగా చేసుకున్నారు. తాను అధ్యయనం చేస్తూ మరెందరి చేతనో చదివింపచేస్తూ, ప్రదర్శనలిస్తూ కొత్తవారినీ ప్రవేశింపచేస్తూ, తీరికలేని పనుల్లో ఉంటారు నిర్మలామణి. ఆ నర్తన ఎంత ప్రతిభావంతమో, ఆమె మనోభావనా అంత నిర్దుష్టం.
– ఎంత నేర్చితే, నేర్పిస్తే అంతగా విస్తరిస్తుంది కళ.
– మానసిక ఆనందం, సామాజిక ప్రయోజనం – రెండూ ప్రధానమే.
నృత్య అంశం సత్యసనాతనం. బాల్యం నుంచే మొగ్గు తొడిగి పరిమళించాలి. ప్రదర్శన ఇస్తేనే నాట్యం సార్థకమవుతుంది. ఇంటా బయటా లభించే ఉత్సాహ ప్రోత్సాహాలే కళాకారిణిని సమున్నత స్థాయికి చేరుస్తాయి. సాధన, బోధన… పరస్పర ఆధారితాలు. మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నృత్యసుమంలో గుబాళింపు. ఆ పరిమళ విస్తరణలే దృఢసంస్కృతిని స్థాపిస్తాయి. ఈ రంగంలో ఎదగాలనుకొనేవారికి సహనమే శక్తి. సంసిద్ధతను పదిలపరచుకుంటూ, అవకాశాలను వినియోగం చేసుకుంటూ, ముందడుగు వేయాలి. నర్తకీమణులు, సాంస్కృతిక రాయబారులు కావాలి. సనాతన సంప్రదాయాలను కంటి రెప్పల్లా పరిరక్షించాలి.ఈ భావాలకు అనుగుణంగా కళారంగ ప్రస్థానం సాగిస్తున్నారు నృత్యకారిణి నిర్మల. అంతరంగం అక్షర రూపం ధరిస్తే ఏమంటుందో తెలుసా మరి.
నా మానసం నవ సరోవరంలా మారుతోంది
భావనం సహస్ర పత్ర కమలంలా తేలుతోంది
అనురాగం సుకుమార సుగంధంలా ప్రసరిస్తోంది
ఆనందం మధుర మకరందంగా ప్రవహిస్తోంది!
పొంగి పొరలిన లావణ్యం అలలా
నింగిలోని నక్షత్రాల పంక్తి మాలికలా
మనసు సరోవరం, భావం స్వచ్ఛ సమన్వితం. కూచిపూడి నాట్యకళారాణి శోభానాయుడును ఎంతగానో ఆరాధిస్తారు నిర్మలా విశ్వేశ్వరరావు. గురుదైవంగా భావించి, ఆ నృత్యరీతిని అనంతంగా ప్రేమిస్తుంటారు. శిక్షణనివ్వడంలోని నిబద్ధతను ఆదర్శంగా స్వీకరించి, తనూ అదే మార్గాన పయనిస్తున్నారు. ‘ప్రాచీన చరిత్ర, కళలు’ గురించి గట్టిపట్టు ఉన్న అలేఖ్యా పుంజాల నృత్య బోధకత్వాన్ని మార్గదర్శకంగా తీసుకున్నారు నిర్మల.