నేను మహాత్మాగాంధీ లేదా బాపూజీ అని పిలుచుకునేది స్వయానా మా తాతగారినే. నాకు 19 ఏళ్లు వచ్చేవరకు నేను ఆయనతో ఉన్నాను. ఈ ఏడాదితో నాకు 96 ఏళ్లు వచ్చాయి. దాంతో ప్రధాని మోదీ, గాంధీజీ గురించి నా ఆలోచనలను వెంటనే కాగితం మీద పెట్టాలనే భావన నాకు కలిగింది. రానున్న తరాలు ఒక వయోజనురాలు, ఉభయుల గురించి బాగా తెలిసిన గాంధీజీ కుటుంబ సభ్యురాలి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకోవచ్చు.
నరేంద్రబాయ్ మోదీతో నా పరిచయం పెను సవాళ్లతో కూడిన ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. నరేంద్రబాయ్ అప్పట్లో ఓ చురుకైన, యువ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్. 1970ల్లో సాంఘిక దురభిమానం జాతి సామరస్యాన్ని చిన్నాభిన్నం చేయసాగింది. గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక రాజ్యసభ సభ్యురాలిగా పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న చొరబాట్ల కారణంగా సరిహద్దు జిల్లాల్లో చోటు చేసుకుంటున్న భౌగోళిక మార్పు గురించి ఆందోళన చెందుతుండే దానిని. అస్సాంలో అంతకుమించిన చొరబాట్లు చోటు చేసుకునేవి.
మా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరూ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ నరేంద్రభాయ్ అంత చిన్న వయసులో కూడా అలాంటి విషయాలను ఎంతలా పట్టించుకున్నదీ నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. ఆయన జాతీయ అంశాలకు ఎలాంటి తొట్రుపాటు లేకుండా కట్టుబడి ఉండేవారు. ఈ విషయంలో అప్పటి రాజకీయాలు ఆయన్ను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.
ఆయన ఆ రోజుల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగు నీరుతోపాటు, సహ కుటుంబాలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాల్లో గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అంకితమైపోయారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన అనంతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశమంతటా పరి శుభ్రత ఆవశ్యకతను వివరించారు. ఆయన ఆరంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచింది. దేశవ్యాప్తంగా మహిళలకు గౌరవాన్ని, భద్రతను అందించింది.
మా తాతగారు ప్రజా ఉద్యమం ఒక నిలకడైన సామాజిక మార్పునకు ప్రాతిపదికగా ఉంటుందని నమ్మేవారు. నరేంద్రభాయ్ అచంచలంగా దృష్టి పెట్టిన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంలో సబ్ కా అనే పదం, వికసిత్ భారత్ ఆ కోవకు చెందినవే. అవి కేవలం ఆయన్ను ఉర్రూతలూగించే పదాలు కావు. ఆయన్ను ముందుగా నడిపించే చోదక శక్తులు.
కొవిడ్ మహమ్మారి కాలంలో మానవత్వానికి పెద్దపీట వేస్తూ ఆయన నెరపిన నాయకత్వం మన సరిహద్దులతోనే ఆగిపోలేదు. దానిని యావత్ ప్రపంచం అనుసరించింది. ఆర్టికల్ 370 గురించి మాట్లాడాలంటేనే గొంతు పెగలని మనకు ఆ ఇబ్బంది లేకుండా ఆయన ఏటికి ఎదురీదారు. దేశానికి స్వరాజ్యం సిద్ధించిన వెంటనే పూర్తి చేయాల్సిన అజెండాను ఆయన ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సీఏఏ కూడా అందులోనిదే.
సనాతన ధర్మానికి ఆలవాలమై, ఘనత వహించిన ఈ నేలపై షిరిడీ సాయినాథుడు, రమణ మహర్షి లాంటి అనేకమంది గురువుల ఆధ్యాత్మిక శక్తి పుణ్యమాని రాజకీయ స్వేచ్ఛ సిద్ధించింది. దీనిని విస్తరింపజేయడంలో గాంధీజీ ఓ సాధనంగా మారారు. దశాబ్దాల తర్వాత నరేంద్రభాయ్ మనల్ని వలసవాద మనస్త్తత్వం నుంచి విముక్తం చేయడానికి ఓ సాధనంగా అవతరించారు. ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. ఇది రెండవ స్వరాజ్య పోరాటం.
మా తాతగారు ఎప్పుడూ కూడా ప్రపంచం నుంచి ఏ మార్పునైతే ఆశిస్తున్నావో అది నీ నుంచే రావాలి అంటుండేవారు. ఓ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ నుంచి భారత్ ప్రధాని దాకా నరేంద్రభాయ్ ప్రస్థానాన్ని చాలా దగ్గర నుంచి చూస్తున్న నేను మన ప్రియమైన భారతదేశంలో ఏ మార్పు కోసమైతే చాలా కాలంగా ఎదురుచూస్తున్నామో ఆ మార్పునకు ముమ్మూర్తులా ఆయన ఆవిర్భవించారని నిస్సందేహంగా చెప్పగలను.
బాపూజీ, నరేంద్రభాయ్ మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే సారూప్యత గురించి చెప్పాలంటే ఉభయుల ప్రజా జీవితాలూ కూడా సనాతన ధర్మపు ఆధ్యాత్మిక కేంద్రంలో వేళ్లూనుకొని ఉన్నాయి. ఇద్దరూ కూడా స్థితప్రజ్ఞులు. పుష్పగుచ్ఛాలనైనా ఇటుక రాళ్లనైనా ఒకే తీరుగా స్వీకరిస్తారు. ఏ మాత్రం చలించరు. అలాంటి ఓ వ్యక్తికి ఎప్పటికైనా సత్యం వెలుగులోకి వస్తుందని తెలుసు. అందుకని అది జరగడం కోసమని ఓపిగ్గా ఎదురుచూస్తుంటారు. ఇది రాజకీయ ప్రత్యర్థులు ఎడతెరిపిలేకుండా దుమ్మెత్తిపోస్తుంటే నరేంద్రభాయ్ అవలంబించే మౌనాన్ని వివరిస్తుంది. ఆయన్ను రాజర్షి అనడానికి ఇది ఓ సంకేతం.
మన పురాణేతిహాసాల ప్రకారం చూస్తే ఎప్పుడూ కూడా ధర్మ పునరుద్ధరణకు ముందు మథనం జరుగు తుంది. అందులో నుంచి మొదటగా హాలాహలాన్ని తలపించే చెడు పుట్టుకొస్తుంది. ఇలా పుట్టుకొచ్చిన దుష్టశక్తులు సత్యాన్ని వ్యతిరేకిస్తాయి. అవి రాజకీయ ప్రయోనాల కోసమని దేశ ప్రయోజనాలను సైతం పణంగా పెడతాయి. అలాంటి పరిస్థితుల్లో అధికారం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేకుండా, అవినీతి మకిలి అంటకుండా, పేదలు, జాతి ప్రయోనాలను అన్నిటికి మించిన అత్యున్నత స్థానంలో ఉంచే వ్యక్తిని ధర్మం ఎంచుకుంటుంది.
ఇదంతా ఎందుగ్గానీ ఎలాంటి జంకూ గొంకూ లేకుండా నేనోమాట చెబుతున్నాను. బాపూజీ కనుక నేడు మన మధ్య ఉండి ఉంటే నరేంద్రభాయ్‌కు అత్యంత గొప్ప మద్దతుదారుగా ఆయన మెలిగేవారు. ఎవరైతే తన పేరును అమాంతం స్వాహా చేశారో, ఎవరైతే ఆ పేరును దుర్వినియోగం చేయడమే జీవితాంతం పనిగా పెట్టుకొని వారి రాజకీయ ప్రయోజనాల కోసం మనల్ని విడదీస్తారో అలాంటి వారి గురించి హెచ్చరించే వారిలో బాపూజీ మొదటి వ్యక్తి అవుతారు.
మా తాతగారిని చిన్నచూపు చూసేవారు ఇప్పుడు జరుగుతున్నది చూసి విస్తుపోతుంటారు. అదే నరేంద్రభాయ్ గాంధీజీ ఆదర్శాలకు కొత్త ఊపిరి పోయడం. ఆయన వాటిని మిళితం చేసి నవభారత అభివృద్ధికి అజెండాను రూపొందించారు. దేశ విధానానికి చెందిన ఆదేశక సూత్రాలు దేశ విధానంగా మారిపోయాయి. ఆయన అలా చేయడం ద్వారా గాంధీజీ వారసత్వం నిరంతరాయంగా మన జాతి గుణగణాల్లో నరనరాన ఇంకిపోయేలా చూశారు.
నరేంద్రభాయ్ కూడా మా తాతగారి లాగానే ప్రజా జీవనంలో శల్యపరీక్షను చవిచూశారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పినట్టుగా ఏదెలాగున్నా నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి ఫలితాన్ని సత్యానికి విడిచిపెట్టు, అదే ఏదో ఒకనాటికి వెలుగు లోకి వస్తుంది. చరిత్ర దయతో బాపూజీ, నరేంద్ర భాయ్ ఉభయులపైన తుది తీర్పు ఇస్తుందనే నమ్మకం నాకుంది.
సుమిత్రా గాంధీ కులకర్ణి,
మహాత్మా గాంధీ మనవరాలు