కేంద్రంలోని భారతీయ జనతా  పార్టీ నేతృత్వంలోని  ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధికి కృషిచేస్తోంది. 2025`26 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9 417 కోట్లు కేటాయించింది. 2009-14 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సగటు వార్షిక కేటాయింపు రూ.886 కోట్లతో పోలిస్తే, ఇది 11 రెట్లు అధికం. అలాగే దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌లో ఆమోదించి విభజన హామీని నెరవేర్చింది. రాష్ట్ర పరిధిలోని రైల్వేలైన్ల డబ్లింగ్‌, విద్యుదీకరణ, కొత్త రైళ్ల ఏర్పాటు, కొత్త లైన్ల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తూ రాష్ట్ర  అభివృద్ధికి చిత్తశుద్ధిని నిరూపించుకుంటోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌.. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనివల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్థి చెందుతాయి. కొత్త జోన్‌ వల్ల రైల్వే ఆపరేషన్లలో సమర్థత పెరుగుతుంది. విభజిత వాల్తేరు డివిజన్‌ను ఇకపై విశాఖ డివిజన్‌గా పరిగణిస్తారు. వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగం (410 కిలోమీటర్లు) విశాఖపట్నం డివిజన్‌గా దక్షిణ కోస్తా జోన్‌లో ఉంటుంది. వాల్తేరు డివిజన్‌లోని మిగతా భాగం (680 కి.మీ.)తో తూర్పు కోస్తా రైల్వేలో కొత్తగా రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పడు తుంది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానం ఈ నిర్ణయంతో నేరవేర్చినట్టయింది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

3 వేల కి.మీ.పరిధి

విశాఖ కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధి 3 వేల కిలోమీటర్లు ఉండొచ్చనేది అంచనా. ఇందుకు సంబంధించిన సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌)ను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు సమాచారం. కొత్త జోన్‌కు సంబంధించి మార్పులు చేర్పులతో తుది డీపీఆర్‌ రూపొందించాలని రైల్వే బోర్డు నుంచి జనవరి 10న ఆదేశాలు వచ్చాయి. ఆ తర్వాత మూడు వారాలకే ఆ కసరత్తు పూర్తి చేసి పంపారంటున్నారు. రైల్వే బోర్డు దానిని త్వరితగతిన ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత డివిజన్‌తో కూడిన జోన్‌ ఏర్పడినట్లు గెజిట్‌ విడుదలయ్యాక.. కొత్తది అమల్లోకి వచ్చినట్లవుతుంది. రైల్వే శాఖలో ఈ ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు సమాచారం. విశాఖ జోన్‌ పరిధిలో మొత్తం రైల్వే రూటు 3,062 కి. మీ., రన్నింగు ట్రాక్‌ (రైల్వే లైను) 5,037 కిలోమీటర్లు ఉండొచ్చనేది అంచనా.

ఉద్యోగులదే నిర్ణయం….

విశాఖ డివిజన్‌గా కొనసాగుతుండడంతో దాదాపు సగానికి పైగా ఉద్యోగులు స్థానికంగానే కొనసాగనున్నారు. రాయగడ డివిజన్‌ ఏర్పాటుతో వాల్తేరు డివిజన్‌లోని ఉద్యోగుల సర్దుబాటు కీలకంగా మారనుంది. ఉద్యోగులు ఎక్కడ పనిచేయదలచుకున్నది ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను వారికే ఇవ్వనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్ల నుంచి కొందరు విశాఖకు రానున్నారు. దక్షిణ కోస్తా జోన్‌కు జీఎంతోపాటు 170 మంది అధికారులు, మరో 1200 మంది కీలక ఉద్యోగులు అవసరం.లోకో షెడ్‌, డీజిల్‌ షెడ్లు, ఎలక్ట్రికల్‌, స్టేషన్‌ మాస్టర్లు, వ్యాగన్‌ మరమ్మతుల కేంద్రం, ఇతర విధుల్లో పాల్గొనే వారు జోన్‌లో 17 వేల మంది ఉంటారనేది అంచనా.

కేకే లైను రాయగడ పరిధిలోకి

గతంలో వాల్తేరు డివిజన్‌లో ఉన్న కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైనును కొత్త డీపీఆర్‌ తూర్పు కోస్తా జోన్‌లోని రాయగడ డివిజన్‌కు మార్చారు. 430 కి.మీ. ఈ లైను కొండవాలులో ఉంటుంది. ఈ మార్గంలో విస్తరణ పనులు చేపట్టడం కష్టసాధ్యం. అందుకే దాన్ని సాంకేతిక సమస్యగా తీసుకొని రాయగడ డివిజన్‌కు కేటాయించినట్లు తెలిసింది. ఈ మార్గంలో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వచ్చే 12 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దీన్ని రాయగడకు అప్పగించడంతో ఇక్కడి ఉద్యోగులు పలు అవసరాల కోసం రాయగడ వెళ్లాల్సి ఉంటుంది. డీపీఆర్‌లో కేకే లైను రాయగడకు అప్పగించినట్లు సూచించినా.. కొత్తవలస స్టేషన్‌ విశాఖ డివిజన్‌లోనే కొనసా గనుంది. విశాఖలోని జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి రెండు నెలల కిందట తూర్పు కోస్తా జోన్‌ టెండర్లు ఆహ్వానించగా, 15 మంది గుత్తేదారులు బిడ్లు దాఖలు చేశారు. ఈ నెలాఖరుకి వారి ఎంపిక పూర్తి చేయనున్నారు. ‘‘కొత్త కార్యాలయం అందుబాటులోకి వచ్చేసరికి రెండేళ్లకుపైగా సమయం పట్టవచ్చు. ఈలోగా జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ముందుగా ఇద్దరు, ముగ్గురు సీనియర్‌ అధికారులతో కూడిన కమిటీ విశాఖలో పర్యటించనుంది. వారి నిర్ణయం మేరకు తాత్కాలి కంగా ఏ హోదాలో ఎంతమంది అధికారులు అవసరమవుతారో నిర్ణయిస్తారు. వారి నియామకం తర్వాత కొత్త జోన్‌ను అమల్లోకి తెస్తారు.

ప్రాజెక్టులకు రూ. 9,417 కోట్లు

కేంద్ర బడ్జెట్‌ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు కేటాయించారు. 2009-14 మధ్యకాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సగటు వార్షిక కేటాయింపు రూ.886 కోట్లతో పోలిస్తే, ఇది 11 రెట్లు అధికం. కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం నెలకొన్నందున ప్రాజెక్టులన్నీ వేగంగా ముందుకు కదులుతున్నాయి. ‘ప్రస్తుతం ఏపీలో రూ.80,097 కోట్లతో 43 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం 5,560 కి.మీ.పొడవున పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు రూ.84,559 కోట్లు వెచ్చించబోతున్నారు. రూ.2,051 కోట్లతో 73 స్టేషన్లను పూర్తిస్థాయిలో నవీకరింరిస్తున్నారు. కొత్త రైళ్లు, రైల్వే లైన్లు, ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై రైల్వేశాఖ వెల్లడిరచిన కీలకాంశాలు…2014 నుంచి ఏపీలో 1,949 కి.మీ. మేర లైన్లను విద్యుదీకరణ చేసి, 100 శాతం పూర్తి చేశారు. పదేళ్లలో రాష్ట్రంలో 1,560 కి.మీ. మేర కొత్త రైల్వే ట్రాక్‌ నిర్మించారు. ఇది శ్రీలంకలో ఉన్న మొత్తం రైల్వే నెట్‌ వర్క్‌ కంటే ఎక్కువ. 2009-14మధ్యకాలంలో ఏటా సగటున 73 కి.మీ. మేర కొత్త ట్రాక్‌లు నిర్మించగా, 2014-25 మధ్య అది 142 కి.మీ.కు పెరిగింది. ఇదే సమయంలో విద్యుదీకరణ పనులు సగటున 37 కి.మీ. నుంచి 1778. మీ.కు పెరిగాయి. 2014 తర్వాత ఏపీలో 770 ఫ్లైఓవర్లు, అండర్‌ బ్రిడ్జిలు నిర్మించారు. 65 లిఫ్ట్లు, 34 ఎస్కలేటర్లు, 509 స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 15 జిల్లాల నుంచి 8 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. మాల్దా బెంగుళూరు మధ్య నడుస్తున్న ఒక అమృత్‌ భారత్‌ ఏపీలోని 9 జిల్లాల నుంచి సాగుతూ, 14 చోట్ల ఆగుతోంది. యూపీఏ హయాంలో కొన్ని ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయించేవారు. దాంతో ఎలాంటి ప్రయోజనమూ ఉండేది కాదు. ప్రస్తుతం తొలుత సర్వే చేసి, అందులో సాధ్యత్వం ఉందని తేలితేనే డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. అందులో ట్రాఫిక్‌ ఉంటుందని తేలితేనే ఆర్థిక,నీతి ఆయోగ్‌, వాణిజ్య శాఖల దృష్టికి తీసుకెళ్లి క్యాబినెట్‌ ముందు పెడుతున్నారు.

గతేడాది జులై నుంచి రూ.40వేల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇందులో ఏపీ రాజధాని అమరావతి లైన్‌ కూడా ఉంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల ప్రక్రియ ఏడాది పొడవునా సాగుతోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7వేల కి.మీ. మేర పాత ట్రాక్‌ను మార్చి కొత్తది వేయబోతున్నారు. మన రైల్వే నెట్‌వర్క్‌ వ్యాప్తంగా గంటకు 110 కి.మీ. వేగంతో రైళ్లను పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.

వేగంగా ప్రాజెక్టు పనులు

రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్‌ పనులు నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు. 56 కి.మీ. మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ.2,545 కోట్లు వ్యయమవుతుందని అంచనా. గతంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణలో జాప్యమయ్యేది. ప్రస్తుత ప్రభుత్వం వివిధ శాఖలతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ద్వారా సమన్వయ సమావేశాలు నిర్వహించి, సమస్యలను పరిష్కరిస్తున్నారు.

–      రైలు ప్రమాదాలు నివారించే కవచ్‌ వ్యవస్థను.. కర్నూలు- గుంతకల్లు మార్గంలోని 122 కి. మీ. మేర అందుబాటులోకి తెచ్చారు.

–     బల్హార్ష- విజయవాడ మార్గంలో ఏపీ పరిధిలో 36 కి. మీ., విజయవాడ- గూడూరు మధ్య 293 కి. మీ., నల్వార్‌- గుంతకల్లు- ఎర్రగుంట్ల- రేణిగుంట మార్గంలో 401 కి.మీ., విజయవాడ- దువ్వాడ మధ్య 330 కి. మీ. పరిధిలో కవచ్‌ ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

–       నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో 70 కి. మీ. ట్రాక్‌ నిర్మాణం పూర్తయ్యింది. కనిగిరి వరకు పూర్తయిన వెంటనే రైళ్లు నడపాలని భావిస్తున్నారు.

–     గుంటూరు- సికింద్రాబాద్‌ మధ్య డబ్లింగ్‌ పూర్తయితే వందేభారత్‌ సహా మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలుంటుంది.

–     కడప- బెంగళూరు మార్గం అలైన్‌మెంట్‌లో మార్పులేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించక పోవడం, భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదు.

ప్రధాన స్టేషన్లకు కొత్త కళ

–    విశాఖపట్నం స్టేషన్‌ అభివృద్ధి పనులను రూ.448 కోట్ల అంచనాలతో చేపట్టినా,గుత్తేదారు పనులను సరిగా చేయనందున టెండర్‌ రద్దుచేశారు. ఆ కాంట్రాక్టర్‌ హైకోర్టుకు వెళ్లగా, రైల్వేకు అనుకూలంగా తీర్పువచ్చింది. ఈ తీర్పు కాపీ అంది, న్యాయప్రక్రియ తర్వాత తిరిగి టెండర్లు పిలిచి, పనులు అప్పగిస్తారు.

–       నెల్లూరు స్టేషన్‌లో రూ.103 కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి.

–       తిరుపతి స్టేషన్‌లో రూ.312 కోట్లతో చేపట్టిన పనులూ వేగంగా జరుగుతున్నాయి. రాజ మహేంద్ర వరం రైల్వేస్టేషన్‌ అభివృద్ధికిరూ. 271.43 కోట్ల వ్యయ అంచనాలతో టెండర్లు సిద్ధం చేస్తున్నారు.

విజయవాడ డివిజన్‌లో రైళ్ల వేగం

విజయవాడ డివిజన్‌లో రైళ్ల వేగం మరింత పెరగబోతోంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఈ డివిజన్‌లో రైల్వే ట్రాక్‌లను వరుసగా అప్‌ గ్రేడ్‌ చేస్తూ వస్తున్న అధికారులు మరో మైలురాయిని అధిగమించారు. ఈ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకూ 1287.764 ట్రాక్‌ కిలోమీటర్లను అప్‌ గ్రేడ్‌ చేయడం ద్వారా వీటిపై రైళ్లను 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా చేశారు. డివిజన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్స్‌లో 58 శాతాన్ని అప్‌ గ్రేడ్‌ చేశారు. బ్రాంచ్‌ లైన్‌లో (నిడదవోలు-భీమవరం-నరసపూర్‌-గుడివాడ-మచిలీపట్నం, కాకినాడ పోర్ట్‌-సామల్‌కోట్‌ సెక్షన్‌లలో) 473.4 ట్రాక్‌ కిలోమీటర్‌లను 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా అప్‌ గ్రేడ్‌ చేశారు. ఈ లెక్కన చూస్తే విజయవాడ డివిజన్‌లో కనిష్ఠంగా 110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు అవకాశం లభించింది.

డివిజన్‌ పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు, శాశ్వత వేగ పరిమితులను తొలగించడం, వక్రరేఖల పునర్నిర్మాణం, కఠినమైన ట్రాక్‌ నిర్వహణ షెడ్యూల్‌లు, డివిజన్‌ చుట్టూ కదలికను పరిమితం చేసే మౌలిక సదుపాయాల అడ్డంకులను తొలగించడం వల్ల ఈ ఫీట్‌ సాధ్యమైనట్లు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో మొత్తం 1070.83 కి.మీ రూట్‌ కిమీ, 2228.35 ట్రాక్‌ కిమీ (ఆర్‌కెఎమ్‌ – ఒక మార్గంలో ట్రాక్‌ల సంఖ్య) ఉన్నాయి

– తురగా నాగభూషణం, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE