రెండూ ఇస్లామిక్ దేశాలే. ఇరు దేశాల్లోనూ ఉగ్రవాద తండాలున్నాయి. కానీ ఇప్పుడు పరస్పర శత్రుదేశాలుగా మారిపోయి పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదుల స్వర్గధామమైన పాకిస్తాన్ పోషించిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశానికి శత్రువులుగా మారారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత పాకిస్తాన్‌ను బేఖాతరు చేస్తున్నారు. ‘తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్’ (టీటీపీ) రూపంలో తెగబడటంతో, ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దాడులకు దిగింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తనను పట్టించుకోకుండా భారత్‌వైపు చూడటం పాకిస్తాన్‌కు మింగుడు పడటం లేదు.
పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. డిసెంబర్ 25వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ ఒక్కసారిగా వైమానిక దాడులకు దిగింది. తూర్పు పక్తికా ప్రావిన్స్‌లోని బార్మల్ జిల్లాలో నాలుగు గ్రామాలపై విరుచుకు పడింది. ఈ దాడుల్లో 46 మంది చనిపోయారు. ఇటీవల తమ దేశంపై తాలిబన్లు చేసిన పలు దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు దిగామని పాకిస్తాన్ భద్రతా అధికారులు ప్రకటించారు. వైమానిక దాడుల్లో టీటీపీకి చెందిన అగశ్రేణి ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. ఆ సంస్థకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆశ్రయమిస్తోందని ఆరోపించారు.
పక్తికా ప్రావిన్స్‌లో మిలిటెంట్లకు శిక్షణ అందిస్తున్న శిబిరాన్ని ధ్వంసం చేసి తిరుగుబాటు దారుల్ని హతమార్చే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని పాకిస్థాన్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. బీజింగ్ ఇన్‌ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ పోగ్రామ్ కింద కొనసాగుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రాజెక్ట్‌లలో పని చేసే చైనా జాతీయులపై దాడులు చేయడాన్ని ప్రస్తావించాయి.
పాకిస్తాన్ తమ భూభాగంపై జరిపిన దాడులను ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. తమపై చేసిన ఆరోపణ లను తప్పుపట్టింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. దాడికి పాల్పడ్డవారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చ రించింది.
ఇందుకు తగ్గట్లే 15వేల మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్ సరిహద్దును మొహరించారు. వీరంతా పాకిస్థాన్‌పై మెరుపు దాడి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాబుల్, కాందహార్, హెరాత్ నుంచి పాక్‌కు చెందిన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను కలిపే సరిహద్దు దగ్గర పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఆఫ్ఘన్ వెల్లడించింది. తాలిబన్లకు మద్దతు గల ఓ మీడియా సంస్థ.. ఈ దాడుల్లో 19 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని పేర్కొంది.
మిత్రులే శత్రువులయ్యారు
ఇరు దేశాల మధ్య దాడులు కొత్తేమీ కాదు.. తాలిబన్లకు పాకిస్తాన్ నాయకులు ఒకప్పుడు స్నేహితులు. ఇప్పుడు మాత్రం బద్ద శత్రువులు. ఒకప్పటి సన్నిహిత సంబంధాలు ఇప్పుడు ఏమాత్రం లేవు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీటీపీ పాకిస్తాన్‌కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కాబూల్‌లో మాదిరే ఇస్లామాబాద్‌లో కూడా ఇస్లామిక్ ఎమిరేట్‌ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ.
తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత టీటీపీ ఆఫ్ఘన్ గడ్డపై ఆశ్రయం పొందుతోందని పాకిస్తాన్ ఆరోపణ. దీనికి ఆఫ్ఘన్ తాలిబన్ పాలకుల మద్దతు ఉందని చెబుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సమర్పించినా, అటు వైపు నుంచి స్పందన లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని, తమ దేశంపై ఉగ్రదాడులకు పాల్పడ కుండా చూడాలని కోరింది. కాగా తమ దేశంలో టీటీపీతో సహా కొన్ని విదేశీ మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ అధికారులు అంగీకరిస్తున్నారు.
పాక్ పెంచిన ఉగ్రసర్పం టీటీపీ
పామును పెంచి పోషిస్తే అది చివరకు తననే కాటేస్తుంది అని పాకిస్తాన్‌కు తెలిసొచ్చింది. తాను పోషించిన ఉగ్రవాదానికే ఇప్పుడది బలవుతోంది. గత కొన్నేళ్లుగా టీటీపీ పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తోంది. 1990 దశకంలో ఆఫ్ఘన్‌లోని రష్యన్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికాకు చెందిన సీఐఏ, పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ తాలిబన్లను సృష్టించాయి.అంతర్యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు షరియా చట్టాల ప్రకారం క్రూరమైన పాలన ఏర్పాటు చేశారు. 2001లో తమ దేశంపై ఉగ్రదాడికి దిగిన అల్‌ఖైదా అధినేత ఒసామాబిన్ లాడెన్‌కు ఆశ్రయమిచ్చిన ఆఫ్ఘన్‌పై దాడికి దిగిన అమెరికా తాలిబన్ల పాలనను అంతం చేసింది. ఆ తర్వాత 2021లో అమెరికా దళాల నిష్క్రమణ తర్వాత ఆఫ్ఘన్‌ను మరోసారి స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చడంలో వారికి పాకిస్తాన్ అండగా నిలిచింది. ఇందులో భాగంగా టీటీపీ సంస్థను సృష్టించారు. దీనికి అధినేత నూర్ వలీ మెహసూద్. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు కొలువుతీరిన తర్వాత ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి వారికి మార్గదర్శనం చేసి వచ్చారు. అయితే కొద్ది నెలలకే కథ అడ్డం తిరిగింది.
ఆఫ్ఘన్ తరహాలోనే తాము సాయుధ పోరాటం ద్వారా పాకిస్తాన్‌లో కూడా అధికారంలోకి రావాలని ప్రణాళికలు తయారు చేసుకుంది టీటీపీ. ఈ క్రమం లోనే పాకిస్తాన్ మీద దాడులకు తెర తీసింది. ఉగ్రవాదాన్ని సాధనంగా వాడుకుంటే దానితో వారికే ముప్పు పొంచి ఉందని పాకిస్థాన్‌ను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఐరాస వేదికగా చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమైంది. 1971లో భారత్ చేతిలో ఎదురైన అవమానం ఈ సారి తమ చేతిలో ఎదురవుతుందని గతంలో తాలిబన్లు పాకిస్తాన్‌ను హెచ్చరించారు. తాలిబాన్లను సృష్టించింది పాకిస్థానీ నేతలేనని, అమెరికాకు చెందిన సిఐఎ, తమ దేశానికి చెందిన ఐఎస్‌ఐ కలసి తాలిబన్‌లకు ఊపిరిపోశాయని అప్పట్లో పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న అసిఫ్ అలీ జర్దారీ అన్నారు. తమ దేశానికి అసలైన శత్రువులు తాలిబన్లని, భారత్ కాదని ఆయన తెలిపారు.
సరిహద్దు వివాదం
పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య సరిహద్దు వివాదం ఈనాటిది కాదు. అది పాకిస్తాన్ ఏర్పాటుతో వారసత్వంగా వచ్చింది. ఇరు దేశాల మధ్య 2,670 కిలోమీటర్ల పొడవు సరిహద్దు సమస్యగా మారి పోయింది. సరిహద్దులో దాదాపు వేయి అధికారిక చెక్‌పోస్టులు, క్రాస్ పాయింట్లు ఉన్నాయి. వాచ్‌టవర్లు, సీసీకెమెరాలు, డ్రోన్‌లతో నిఘా కొనసాగుతోంది. అయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌క్వా ప్రావిన్స్‌లోని పష్తూన్ ప్రాంతాలు తమ దేశానికే చెందినవిగా ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తోంది. ఇక్కడ టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతాన్ని కూడా తమదిగానే చెబుతోంది. ఈ పరిణామాలు పాకిస్థాన్ సార్వ భౌమత్వాన్నే సవాలు చేయడంతో ఇస్లామాబాద్ పాలకులకు, సైన్యానికి కునుకు పట్టడంలేదు.
ఆప్ఘన్‌లో తాలిబన్లు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత 2021 సెప్టెంబర్‌లో సరిహద్దులో కంచె వేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలకు టీటీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. సరిహద్దులోని పాకిస్తాన్ భద్రతా పోస్టులపై దాడికి దిగింది. దాడిలో ఒకరు మరణించగా.. 11 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా పాక్ దళాలు ఇద్దరు టీటీపీ ఉగ్రవాదులను హతమార్చాయి. అదే నెలలో కాబూల్‌లోని పాక్ ఎంబసీపై కూడా దాడి జరిగింది. అనంతరం టీటీపీ- పాక్ సైన్యానికి మధ్య పలు మార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి.
2021లో ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ అధికారులు టీటీపీతో శాంతి చర్చలు జరిపారు. ఆయన సైన్యంతో విభేదించి 2022 ఏప్రిల్‌లో పదవీచ్యుతుడై జైలు పాలయ్యారు. ఆయన హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాన్ని పాక్ సైన్యం తీవ్రంగా విమర్శించింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్ఘన్ జాతీయులపై చర్యలకు ఉపక్ర మించింది. సరైన పత్రాలు లేవనే సాకుతో 8 లక్షల మందిని తిప్పి పంపించేసింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌పై ఆంక్షలను కూడా విధిస్తోంది.
పరిణామాలను పరిశీలిస్తున్న భారత్
పాక్-ఆఫ్ఘన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఆఫ్ఘన్‌లో కర్జాయి, ఘనీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు భారత్ ఆ దేశంలో పలు అభివృద్ది కార్యక్రమాలను, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను చేపట్టింది. తాలిబన్లు మరోసారి అధికారంలోకి రావడంతో ఇవన్నీ నిలిచిపోయాయి. అయితే అక్కడి ఆహార కొరత దృష్ట్యా మానవతా దృక్పథంతో భారత్ సాయం కొనసాగిస్తోంది. తాలిబన్లు భారత్‌తో సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నారు.
గత ఏడాది కాలంలో భారత ప్రభుత్వం తాలిబన్లతో దౌత్యసంభాషణలను ప్రారంభించింది. ముంబైలోని ఆఫ్ఘన్ కాన్సులేట్ నుండి పని చేయడానికి ఒక తాలిబాన్ ప్రతినిధిని అనుమతిం చింది. తాము భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని తాలిబన్లు ఇప్పటికే హామీ ఇచ్చారు.
ఈ చర్యలు పాకిస్తాన్‌కు మింగుడుపడటం లేదు. కాబుల్ తమకు దూరమవుతోందని ఇస్లామాబాద్ పాలకులు కుతకుతలాడుతున్నారు. పాక్, ఆఫ్ఘన్‌లు భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న నేపథ్యంలో యుద్ధం తీవ్రమైతే శరణార్థులు, తీవ్రవాదుల వలస తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ మరింత జాగరూకతతో వ్యవహరిస్తోంది.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్
పాక్ పక్కలో బల్లాలు
బలూచ్, పష్తూన్ జాతుల ప్రజలు ఇటు పాకిస్తాన్‌లో, అటు ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఉన్నారు. వీరు ఇరువైపులా తిరుగుతుంటారు. వీరు కంచె ఏర్పాటును జాతీయతకు అవమానంగా భావిస్తు న్నారు. ముఖ్యంగా బలూచ్ జాతీయుల తిరుగుబాటు పాకిస్తాన్‌కు సమస్యగా మారిపోయింది. బలూచ్ ప్రజలు పాకిస్తాన్‌లో ని బలూచిస్తాన్‌లో అత్యధికంగా ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ఇరాన్‌లో కూడా ఈ జాతీయులు నివసిస్తారు. గతంలో స్వతంత్ర పాలనను నిర్వహించుకున్న బలూచ్‌లు పాకిస్తాన్ నుంచి వేరు పడాలని బలంగా కోరుకుంటున్నారు. పాకిస్తాన్‌లో దాదాపు 45 శాతం వరకు భూభాగంగా ఉన్న బలూచిస్తాన్ అపార ఖనిజ వనరులు, సహజ సంపదకు నిలయం. కీలకమై గ్వాదర్ ఓడ రేవు, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ఇక్కడే ఉన్నాయి.
పాక్ పాలకులు ఆది నుంచి ఇక్కడి వనరులను దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టించుకోలేదు. దీంతో స్వతంత్ర దేశాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ ప్రజలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్‌లను ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్‌పై పోరాడుతు న్నారు. వీరు ఆఫ్ఘన్ భూభాగం నుంచి కార్యకలా పాలను నిర్వహించడంతో వీరిని కట్టడి చేయడం అసాధ్యంగా మారిపోయింది. అటు పాకిస్తాన్‌లోని ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంక్వాలోని పర్వత ప్రాంతం వజీరిస్తాన్‌లోని పష్తూన్‌లు దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుటా ఎగరేశారు. పాక్ పాలకులపై పష్తూన్ తహఫ్పూజ్ మూవ్‌మెంట్ (పీటీఎం) పోరాడుతోంది. పష్తూన్ జాతీయులు అటు ఆఫ్ఘనిస్తాన్‌లోనూ ఉన్నారు. వారు ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో సమాంతర ప్రభుత్వం నడుపుతూ పాక్ పాలకుల కంటి మీద నిద్ర కూడా లేకుండా చేస్తున్నారు.