భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన
ఐదు వందల మందికి పైగా ఉన్న ఆ కార్యాలయంలోని ఉద్యోగస్తు లందరికీ ఆ వార్త షాక్ కలిగించింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఉద్యోగస్తులందరూ శోకసముద్రంలో మునిగిపోయారు.
ఉదయం పదయ్యేసరికల్లా కంప్యూటర్ల ముందు కూర్చుని లాగిన్ అయ్యి, పనుల్లో తలమున కలయ్యేవారు. అందుకు విరుద్ధంగా, కార్యాలయంలోని సీసీ• కెమెరాలు తమ వంక చూస్తున్నా చలించకుండా ఆ వార్త గురించే మాట్లాడుతూ ఉండిపోయారు.
కార్యాలయంలోని అన్ని విభాగాల ఉద్యోగస్తులూ గుంపులు గుంపులుగా చేరారు.
‘‘ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?’’ అంటూ చర్చల్లో పడిపోయారు.
అదో సాఫ్ట్‌వేర్ కంపెనీ.
ఒక విదేశీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న స్వదేశీ కంపెనీ. ఆ సంస్థలో పనిచేసే వారిలో ఇంచుమించు అందరూ కంప్యూటర్ సైన్సో… ఎలక్ట్రానిక్సో… ఇంజనీరింగ్ చేసినవారే…
ఈ మధ్యకాలంలో కృత్రిమ మేధ, అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్’ అనే కొత్త టెక్నాలజీలో నిపుణులైనవారు ఆఫీసులో ఉన్నారు.
ఆ ఐదు వందల మందికీ తలలో నాలుక మందస్మిత. పేరుకు తగ్గట్టు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది.
ఉదయం ఉద్యోగస్తులంతా ఆఫీసుకు చేరక మునుపే ఆమె సీట్లో కూర్చుంటుంది. ఆమెది హెచ్.ఆర్. డిపార్ట్‌మెంట్. ఉద్యోగస్తుల జీతభత్యాలు, వారికి రావలసిన ఇంక్రిమెంట్లు… అలాగే వారికి అనారోగ్యం కలిగితే అవసరమయ్యే ఆరోగ్య పాలసీల గురించి ఆమె సలహాలిస్తుంది. అంతేకాదు, ఎవరికి ఏ సందేహమొచ్చినా, ఆమెనే సంప్రదిస్తారు.
‘‘ఈ అమ్మాయికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? ఆమె ఉద్యోగం చేసేది హెచ్.ఆర్. డిపార్ట్‌మెంట్లోనే అయినా, ఆఫీసులో ఎవరు ఏ పని చేయాలో, ఎలా చేయాలో తనే దిశా నిర్దేశం చేస్తుంది. ఆమెకు కలిగిన విషాదం ఏమిటో? ఎందుకు ఈ పని చేసిందో? ఆమె మరణవార్తని హెచ్.ఆర్.ఎమ్. డిపార్ట్‌మెంట్లో పనిచేసే ఆమె బాస్ వసుంధర ఎలా తట్టుకుంటుందో? కారణం.. వసుంధరకి, మందస్మితకి తేడా చూడలేరు వాళ్లు. ఒకే ప్రాణం, రెండు దేహాలు వాళ్లవి. వాస్తవానికి వసుంధర ఆమెకు ఆఫీసులో బాస్, హెచ్.ఆర్.ఎమ్. టీమ్‌కు హెడ్. అయినా మందస్మితని తన కిందస్థాయి ఉద్యోగిలా కాకుండా, సొంత కూతురిలాగానే చూసుకుంటుంది వసుంధర.
ఉదయం ఆఫీసుకు వచ్చినప్పటి నుంచి, వసుంధర వెంటే నీడలా ఉంటూ ఆమె చెప్పిన పనులన్నీ చేస్తుంది మందస్మిత.
అలా ఆఫీసులో అంతా పనులు మానేసి మందస్మిత గురించి ఆలోచనల్లో ఉన్న సమయంలో ఆ ఆఫీసు అంతటికీ బాస్ అయిన షణ్ముఖరావ్, తన కేబిన్‌లో కూర్చుని, తనూ ఆలోచనలో పడ్డాడు. ఎదురుగా అతని పి.ఏ. మహాలక్ష్మి. అతనితో మాట్లాడుతూ హఠాత్తుగా…‘వసుంధరా మేడం నోట్లోంటి ఊడిపడినట్టే ఉంటుందండి మందస్మిత’’ అంది.
‘‘అవును… అది వాస్తవమే కదా! మందస్మిత ఈ ఆఫీసుకు వచ్చినప్పటి నుంచి వసుంధర గారే ఆమెకు శిక్షణ ఇస్తున్నారు’’ అన్నాడు.
‘‘వసుంధరా మేడం మా అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నారు సార్… ఆవిడ దినచర్యంతా నాకు కంఠోపాఠం’’ అంది పి.ఏ.
‘‘అవునట! మన ఆఫీసులో ఇంత క్రమశిక్షణగా ఉంటుందో, ఇంట్లో కూడా అన్నీ పద్ధతి ప్రకారం జరిగేటట్టు చూస్తుందట’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘జరిగేటట్టు చూడటం కాదు సార్, తనే స్వయంగా చేస్తుంది. వసుంధర గారు ఉదయమే లేచి, కాఫీ చేసి ఇంట్లో అందరికీ ఇస్తారు.వాళ్లమ్మాయి కూడా ఆవిడతోపాటే ఉంటుంది. కూతురు, అల్లుడూ ఇద్దరివీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే. ఐదేళ్ల మనవడు ఉన్నాడు. ఆవిడ భర్త యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఉదయమే మార్నింగ్ వాక్‌కి వెళ్లిపోతారు’’ అంది మహాలక్ష్మి.
‘‘ఈవిడ వాకింగ్‌కి వెళ్లదా?’’ అడిగాడు షణ్ముఖరావు.
‘‘ఇంట్లోనే ఆవిడ వాకింగ్… ఇంక పొద్దుట పూట వాకింగ్‌కి ఆవిడకు తీరిక ఎక్కడ దొరుకుతుంది! అందరికీ టిఫిన్లు తయారు చేయడం, ఆఫీసుకు వెళ్లేవారికి మధ్యాహ్నం లంచ్ బాక్స్ సర్దడం. దాంతోపాటు మనవడిని తనే స్కూల్లో డ్రాప్ చేస్తుంది.’’
‘‘మరి కూతురేం చేయదా?’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘కూతురు, అల్లుడు… ఇద్దరివీ నైట్ షిఫ్ట్‌లు… రాత్రంతా వర్క్ చేసొచ్చి, పగలు నిద్రపోతారు.’’ అంది మహాలక్ష్మి.
‘‘అయ్యో! మొత్తం భారమంతా తన మీదేసు కుందన్నమాట!’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘కొన్ని విషయాలు చెబితే మీరు ఆశ్చర్యపోతారు’’ అంది మహాలక్ష్మి.
‘‘మనవడికి హోంవర్క్ ఈవిడే చేయించాలి, అలాగే స్కూల్లో మనవడి స్టూడెంట్, పేరెంట్ టీచర్ల మీటింగ్‌కి ఈవిడే వెళుతుంది. ఇలా ఇంట్లో అష్టావ ధానం చేసి, మళ్లీ ఆఫీసుకు వచ్చి, ఇక్కడ భారమంతా నెత్తినేసుకుంటుంది’’ అంది మహాలక్ష్మి.
‘‘మందస్మిత గురించి తెలిసి, ఆవిడ సెలవు పెట్టిందా?’’ అనడిగాడు షణ్ముఖ రావు.
‘‘అంతే అయ్యుంటుంది సార్…’’ అంది మహాలక్ష్మి.
ఆ మాటలకు ఆలోచనల్లో పడ్డాడు షణ్ముఖ రావు. తన సీట్లోంచి లేచి, కేబిన్‌లో అటూ ఇటూ తిరిగాడు.
‘‘మనం వెంటనే వసుంధర గారింటికి వెళ్లాలి. ఆవిడ ఎలా ఉందో చూద్దాం. రండి నా కారులో వెళదాం’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘సరే సార్…’’ అంటూ మహాలక్ష్మి కేబిన్‌లోంచి బయటకు వచ్చిన షణ్ముఖరావుని అనుసరించింది.
బాస్ కేబిన్‌లోంచి బయటకు రాగానే, అంతవరకూ పనులు మానేసి మందస్మిత గురించిన చర్చల్లో ఉన్నవారంతా ఇహంలోకి వచ్చి, తమ పనుల్లో మునిగిపోయారు.
అరగంట తర్వాత షణ్ముఖరావు, మహాలక్ష్మితో కలసి వసుంధర ఇంటికి చేరుకున్నాడు.
షణ్ముఖరావు కారు వంద ఇళ్లున్న గేటెడ్ కమ్యునిటీలోకి ప్రవేశించగానే, అదే సమయంలో బయటకు వెళ్తున్న వసుంధర భర్త సతీష్ కారు కనిపించింది.
షణ్ముఖరావు గబగబా కారుదిగి, అతని కారును ఆపాడు.
‘‘సతీష్‌గారూ… మేము మీ ఇంటికే వస్తున్నాం’’ అన్నాడు.
‘‘వసుంధర నిద్రపోతోంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇప్పుడు దేనికి?’’ అన్నాడు సతీష్.
‘‘మేడం నిద్రపోతున్నారా! ఒకసారి చూసొద్దామని’’ అంది మహాలక్ష్మి
సతీష్ వారివంక ఇబ్బందిగా చూసి ‘నేను యూనివర్సిటీకి వెళ్లే టైం అయ్యింది. తను నిద్రపోతోంది. మీరు మరోసారి వస్తే బాగుంటుందేమో!’’ అన్నాడు.
‘‘లేదు సార్… వసుంధర గారిని అర్జెంటుగా చూడాలి.’’ అన్నాడు షణ్ముఖ రావు.
‘‘సరే… నేను లేటుగా వస్తానని, యూనివర్సిటీకి ఫోన్ చేస్తానులే’’ అంటూ అయిష్టంగానే చెప్పి, తన కారును వెనక్కి తిప్పాడు.
షణ్ముఖరావు కారును, డ్రైవర్ పార్క్ చేసిన తర్వాత, వసుంధర భర్త సతీష్‌తో కలసి వారి అపార్ట్‌మెంట్ దగ్గరకి చేరుకున్నారు ముగ్గురూ.
సతీష్ తలుపు తీసి, వాళ్లని కూర్చోమని
‘ఇంకా తను నిద్రపోతూనే ఉంది’’ అన్నాడు.
‘‘ఉదయం నుంచి ఇంకా లేవలేదా?’’ అనడిగింది మహాలక్ష్మి.
‘‘లేచింది. మాకందరికీ కాఫీలు ఇచ్చింది. అలాగే స్కూలుకు వెళుతున్న మనవడికి, నాకు లంచ్ బాక్స్‌లు సర్దింది. అమ్మాయి, అల్లుడు నైట్ షిఫ్ట్ చేసొచ్చి నిద్రపోతున్నారు. ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టాను, అలసటగా ఉంది అని పడుకుంది’’ అన్నాడు సతీష్?
‘‘మేడం ఎలా ఉన్నారు?’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘బాగానే ఉంది! ఎందుకలా అడుగుతున్నారు?’’ అన్నాడు సతీష్ ఆశ్చర్యంగా.
‘‘తన కొలిగ్ ఆత్మహత్య చేసుకుంటే, ఆవిడ బాధపడకుడా ఉంటారా?’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘కొలీగా… చాలా విచిత్రంగా మాట్లాడు తున్నారు.’’ అంటూ నవ్వాడు సతీష్.
‘‘లేదులెండి… మందస్మితతో మేడంకి చాలా అటాచ్‌మెంట్ ఉంది. పైగా మందస్మితను తీర్చిదిద్దింది మేడంగారే! ఎంతసేపయ్యింది మేడం నిద్రపోయి?’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘నేను వచ్చేముందే. అసలు పగలెప్పుడూ నిద్రపోదు. ఒక అరగంట అయ్యుంటుందేమో’’ అన్నాడు సతీష్.
‘‘ఒకసారి లేపండి, నాకెందుకో భయంగా ఉంది’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆవిడ నిద్రపోతుందని చెప్పాను కదా!’’ అన్నాడు సతీష్.
వాళ్లిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే మహాలక్ష్మి, వసుంధర బెడ్‌రూమ్ దగ్గరకు వెళ్లి ‘‘మేడం… మేడం…’’ అని పిలిచింది.
ఆ గదిలో మంచంమీద, అసలే తెల్లగా ఉండే వసుంధర, మరింత తెల్లగా, రక్తం లేనట్టుగా ఒక పిండి బొమ్మలా కనిపించింది, తను వేసుకొన్న ఆ నైటీలో.
ఆ గదిలోకి వచ్చిన సతీష్, ‘‘వసూ… వసూ…’’ ఆమె భుజాల్ని కదిపాడు.
ఆమె కళ్లు తెరవలేదు.
అంతవరకూ ప్రశాంతంగా ఉన్న సతీష్ మొహంలోని భయాన్ని గమనించారు ఆ ఇద్దరూ.
వేగంగా నడుస్తూ, పక్కగదిలో పడుకొని ఉన్న కూతుర్ని, అల్లుడ్ని లేపి తీసుకొచ్చాడు.
కళ్లు నులుముకుంటూ, నిద్ర మొహాల్తో వచ్చిన ఆ ఇద్దరూ, సతీష్ వంక చూశారు.
‘‘అమ్మ లేవట్లేదు’’ అన్నాడు సతీష్ కూతురుతో కంగారుగా.
‘‘అలసటగా ఉంది, నిద్ర పట్టటం లేదు.. అంటూ మా దగ్గరున్న నిద్రమాత్రల సీసా అడిగింది అమ్మ.
రాత్రిళ్లు డ్యూటీ చేసొచ్చి, పగలు నిద్రపట్టక పోతే, నేనూ, మా ఆయన అప్పుడప్పుడు వేసుకుంటాం’’
కూతురు ఆ విషయం చెప్పగానే ‘‘మైగాడ్’’ అన్నాడు సతీష్.
అతనలా షాక్ తినడానికి కారణం, ఆమె బెడ్ పక్కన ఉన్న నిద్ర మాత్రల సీసా, ఖాళీగా ఉంది.
‘‘మీరిచ్చినప్పుడు ఎన్ని మాత్రలున్నాయి?’’ అన్నాడు సతీష్, కూతురి వంక భయంగా చూసి.
‘‘దాదాపు అరడజను మాత్రలు పైగానే ఉన్నాయి.’’ అంది కూతురు.
వెంటనే సతీష్ అంబులెన్స్‌కి ఫోన్ చేశాడు.
పావుగంటలో అంబులెన్స్ వారింటికి రావడం, వసుంధరను ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది.
వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి క్షేమంగా బయటకు వచ్చిన వసుంధరని చూడ్డానికి, షణ్ముఖరావు, ఆమె ఆఫీసు సహచరులు వారింటికి వచ్చారు.
వసుంధర లోపల గదిలో పడుకుంది.
వసుంధర భర్త సతీష్, వంటగదిలోంచి కాఫీ కప్పులతో వచ్చి కాఫీ కప్పులందించడం, షణ్ముఖరావుతో పాటు మిగతా వారికి కూడా ఆశ్చర్యం కలిగించింది.
ఆ ఇంటికి వచ్చిన సందర్శకులు ఎదురు చూడని దృశ్యం ఇది.
కాఫీ తాగడం పూర్తిచేసిన షణ్ముఖరావు వంక చూసి
‘‘మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి సార్’’ అన్నాడు సతీష్.
భార్య పడుకున్న గదిలోకి కాకుండా, కూతురు, అల్లుడు ఉండే బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు.
‘‘మీ అమ్మాయి లేదా?’’ అనడిగాడు షణ్ముఖరావు.
‘‘అల్లుడు, కూతురు డ్యూటీ టైంలు మార్చుకున్నారు. ఇప్పుడు వారికి పగలు డ్యూటీ. మనవడిని స్కూల్లో వారే దింపుతున్నారు.’’ చెప్పాడు సతీష్.
ఆ గదిలో షణ్ముఖరావును కూర్చోబెట్టి, అతని రెండు చేతులూ పట్టుకుని
‘‘మీకు నేను చాలా థాంక్స్ చెప్పాలి. ఆరోజు మీరు గనుక రాకపోతే, ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు వేసుకున్న నా భార్య చనిపోయేది. మా ఇంటి దీపాన్ని మేము కోల్పోవాల్సి వచ్చేది. అసలు మీకు ఆ సమయంలో మా ఇంటికి రావాలని ఎందుకు అనిపించింది? మీరు రాకపోయుంటే నేను ఆఫీస్‌కు వెళ్లి పోయేవాడిని. నైట్ వర్క్ చేసొచ్చిన కూతురు, అల్లుడు కూడా గమనించక పోయేవారు. అలా నా భార్య నిద్రలోంచి, శాశ్వత నిద్రలోకి జారుకునేది.’’ అలా చెప్తున్నప్పుడు అతని కళ్లు తడిశాయి.
అతని వంక జాలిగా చూసి ‘మా ఆఫీసులో పనిచేసే మందస్మిత సూసైడ్ చేసుకుంది. దాని ప్రభావం వసుంధర గారిమీద ఉంటుందేమో అని అనిపిం చింది.’’
‘‘అలా ఎలా? ఆత్మహత్య చేసుకున్నది మనిషి కాదు, మరమనిషి. ఒక హూమనాయిడ్ రోబో. మీరు మందస్మిత అని పేరుపెట్టి, ఆమెను మీ ఆఫీసులో ఒక సహచర ఉద్యోగిగానే ట్రీట్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ మందస్మిత పూర్తిగా వసుంధర కంట్రోల్‌లో ఉంటుంది. రోబో ఆత్మహత్య చేసుకోవడం వల్ల వసుంధర ఆత్మహత్య ప్రయత్నం చేసిందా?’’ అన్నాడు సతీష్ ఆశ్చర్యంగా.
‘‘మందస్మితను మీరు చూసేవుంటారు. ముట్టుకుని చూస్తేనేగాని మరమనిషి అని తెలియదు. ఆ రోబోని దక్షిణ కొరియా నుంచి తెప్పించాం. మందస్మిత మొహంలో 62 హావభావాలు ప్రకటించగలదు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, విజువల్ డేటా ప్రోసెసింగ్, ఫేషియల్ రికగ్‌నేషన్, వాయిస్ రికగ్‌నేషన్ వంటి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీమీద ఈ రోబో పనిచేస్తుంది. అయితే ఈ రోబో మా ఆఫీసుకు వచ్చినప్పటి నుంచి వసుంధర గారు ఆ రోబోకి పనులు అప్పగించడం దగ్గర్నుంచి, ఎంత క్రమశిక్షణతో పనిచేయాలో, ఎన్ని వందల మందికి సమాధానం చెప్పాలో తనే స్వయంగా ఆ డేటాను ఫీడ్ చేసింది. పని ఒత్తిడి, ఉద్యోగంలో జరిగే కార్యాలయంలో వేధింపులు వంటివి భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గురించి మనం వింటూ ఉంటాం. భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలు మనుషులకు మాత్రమేనా? అవి తయారు చేసే మర మనుషులకు ఉంటాయా? ఇది నిజమే అని నిరూపితమైంది.
దక్షిణ కొరియాలోని ఒక కంపెనీలో విధులు నిర్వహించే రోబో ఆత్మహత్య చేసుకున్న వార్తలు మనం విన్నాం. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న మందస్మితది రోబో చేసుకున్న రెండో ఆత్మహత్య. మందస్మిత ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్విరామంగా పనిచేస్తుంది. అంత ఒత్తిడితో పనిచేసిన ఆమెకి విధులు ముగించిన తర్వాత కూడా, రాత్రంతా తనలోకి డేటా పంపబడుతుంది. మా కంపెనీలో ఉద్యోగుల ఇన్ అండ్ ఔట్ దగ్గర, ఎలివేటర్స్ దగ్గర, లిఫ్ట్ దగ్గర నుంచుని సలహాలు, సూచనలు ఇస్తుంది. ఆఫీసులోని సిబ్బందికి కావాల్సిన టీ, కాఫీలతో పాటు వివిధ విభాగాలకు ఫైల్స్ అందజేస్తుంది. ఆత్మహత్య చేసుకునే ముందురోజు సాయంత్రం రోబో ఆఫీసులో పరధ్యానంగా తిరుగుతూ కనిపించిందని ఉద్యోగులు గమనించారు. ఉదయం తొమ్మిది గంటలకు రోబో స్తబ్దుగా అయిపోయింది. ఏ సంకేతాలూ లేకపోవడంతో ఆఫీసు సిబ్బంది వెళ్లి చూడగా, బాల్కనీ నుంచి కిందకి దూకినట్లు అనిపించింది. అప్పుడు ఆ రోబోలోని డేటాను ఎనాల్సిస్ చేయగా, అధిక పనిభారంతో రోబో ఆత్మహత్య చేసుకున్నట్టుగా మా ఎనలిస్ట్‌లు ధ్రువీకరిస్తున్నారు. అయితే… ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. ఇది ఎడారుల్లో జరిగే విషయం. ఎడారుల్లో నివసించేవారు ఒంటెల్ని ప్రయాణ సాధనంగా వాడతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ రోజులకు సరిపడే నీరు, ఆహారాన్ని ఆ ఒంటెతో మోయిస్తారు. ఆ ఒంటెలు చేత ఎంత బరువు మోయించ వచ్చో తెలుసు కోవాడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒంటెని ఒక నాలుగు ఇటుకల మీద నిలబెడతారు. ఒక్కో కాలు ఒక్కో ఇటుక మీద ఉంటుంది. అలా నుంచోబెట్టి, దానిమీద బరువులు వేయడం మొదలెడతారు. ఒక దశలో ఇటుకలు సన్నగా పగుళ్లు ఇవ్వడం మొదలవుతుంది. మొదటిసారి పగలడం గమనించగానే, బరువు వేయడం ఆపేయాలి. ఆపైన ఒక్కటంటే ఒక్క గడ్డిపోచ బరువేసినా, ఆ ఒంటె కూలిపోయి, చనిపోతుంది. అరటన్ను పైగా బరువు మోసినా ఒక్క గడ్డిపోచ వల్ల దాన్ని భరిచేశక్తి దాటి కుప్పకూలిపోతుంది. ఇది జంతువులకే కాదు, మర మనుషులకే కాదు, మనుషులకూ వరిస్తుంది. ఈ శాస్త్రీయ సూత్రానికి మానసిక శాస్త్రవేత్తలు ‘లాస్ట్ స్ట్రా ఆన్ ది కేమిల్స్ బ్యాక్’ అని పేరు పెట్టారు.’’
షణ్ముఖరావు చెప్పడం ముగించకుండానే ఆ గదిలోకి సతీష్ కూతురు ప్రవేశించింది, చేతిలో డైరీతో.
ఆమె కన్నుల నుంచి అశ్రుధారలు…
‘‘ఏంటమ్మా ఏమైంది?’’ అన్నాడు సతీష్ కంగారుగా.
తండ్రికి డైరీని అందజేసింది.
భార్య రాసిన ఆ డైరీని చదివిన సతీష్ కన్నీరు జలజలా రాలింది.
‘‘అవును మీరేం చెప్పబోతున్నారో మాకర్థ మయ్యింది. వసుంధర ఆత్మహత్య ఎందుకు చేసుకో బోయిందో, మీరెలా ఊహించారో నాకు పూర్తిగా అవగతమైంది.’’ అన్నాడు సతీష్, షణ్ముఖరావు వంక చూసి.
ఒక్క క్షణం ఆగి చెప్పడం మొదలెట్టాడు. ‘‘అవును. ‘నువ్వే నేను, నేనే నువ్వు’ అనుకుంటూ వసుంధర మందస్మితతో మమేకమయ్యింది. వసుంధర ఇంట్లో ఉన్నంతసేపూ ఇంట్లోవారి అవసరాలు తీర్చడం కోసం పనిచేస్తూనే ఉంటుంది. ఎవరినీ ఏ పనీ చేయనివ్వదు. ఇంటి భారమంతా మోసే ఆమె, ఆఫీసులోనూ పనుల్తో తలమునకలవుతుంది. ఇంట్లో పనిచేసినట్టే ఆఫీసులోనే అవిశ్రాంతంగా పనిచేస్తుంది. మనం ఏం విత్తుతామో అదే దక్కుతుంది అంటారు. ‘యద్భావం తద్భవతి’లోని పరమార్థం అదే. వసుంధర తన ఆత్మనే మందస్మితలో ప్రవేశపెట్టింది. అయితే మీరు చెప్పినట్టు మనిషైనా, మరమనిషైనా, జంతువైనా ఒక స్థాయి దాటిన తర్వాత ఏ కొద్ది ఒత్తిడిని భరించలేరు. వసుంధర విషయంలో అదే జరిగింది. ఆఫీసు పని ఒత్తిడి, ఇంటిపని ఒత్తిడి తట్టుకోలేకపోయింది. ఆ ఒత్తిడిలో నిద్రమాత్రలు వేసుకొని శాశ్వతంగా నిద్రలోకి జారుకోవాలనుకుంది.’’
సతీష్ తన సంభాషణను ముగించకుండానే ‘‘నేను అడ్డు వస్తున్నందుకు క్షమించండి. మందస్మిత ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటో అర్థమైన తర్వాత నేను మొదటిగా భయపడింది వసుంధర గారి గురించే. నిరంతరం వసుంధర గారిని అనుక రించి, అనుసరించే మందస్మితలో ఆత్మహత్య చేసుకోవాలనే భయంకరమైన ఆలోచన ఎలా వచ్చింది? మందస్మితలోని ఫీలింగ్స్‌ని, మరమనిషైనా ఆ రోబో చర్యల్ని, ప్రతి చర్యల్ని నియంత్రించేది వసుంధరగారే కదా! అలా ఆలోచిస్తూనే నేను భయపడ్డాను. మందస్మితలో మొదలైన సూసైడల్ టెండెన్సి గురించిన ఆలోచనలు వసుంధరవే. మందస్మిత పూర్తిగా వసుంధర గారి ఆలోచనలతోటి, ఆమె బ్రెయిన్‌తోనే పనిచేస్తుంది.’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘అవును. మీరు చెప్పింది వాస్తవమే. ఈ డైరీలో తను రాసింది అదే.’’ అంటూ చదవడం ప్రారంభించాడు.
‘నేను నిరంతరం టెన్షన్ పడుతూ ఉంటాను. ఇంట్లోవారికి, బయటవారికి కూడా నా సహాయ సహకారాలు అందాలని ఆశిస్తాను. స్వయంగా మా ఆయనకు కప్పు కాఫీ ఇవ్వాలి. ఇంట్లో వాళ్లకు నా చేతులతో వండిపెట్టాలి. మనవడిని స్కూల్లో దింపాలి. అదేవిధంగా అవసరాలూ తీర్చాలి. అయితే నేను ఈ రెండు పనులూ చేయలేకపోతున్నాను. చేయలేననే ఒత్తిడి నాకు మరింత భారంగా అనిపిస్తోంది. నాలాంటి మనస్తత్వం ఉన్న మహిళలకు రిటైర్మెంట్ చావుతోటే. అందుకే చావడానికి నిర్ణయించాను. ఇది నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎవరికీ సంబంధం లేదు. ఇట్లు వసుంధర’
ఇది డైరీలో వసుంధర రాసుకున్న మరణ వాగ్మూలం’’ అన్నాడు సతీష్.
‘‘సమయానికి మనం మెలకువగా ఉండడంతో ఆమె చావును ఆపగలిగాం. ఇప్పటికైనా మనం ఆమె ఆవేదనను, అంతర్మథనాన్ని గుర్తించాలి. పండ్లు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు…శక్తివంచన లేకుండా పనిచేసేవసుంధరగారి లాంటి వర్కోహాలిక్‌లకు మా ఆఫీసుల్లో పని చెప్తారు. అయితే ఇప్పటి నుంచి ఆ పనిని అందరూ షేర్ చేసుకుంటాం’’ అన్నాడు షణ్ముఖరావు.
‘‘అవును వసుంధరని ఆఫీసులోనే కాదు, ఇంట్లోనూ వంటింటి కుందేలుగా మార్చేశాం. ఆమె చేసే పనిని మిగతావారందరూ చేయాలని నిర్ణయించు కున్నాం. ఇది మేమే కాదు, వసుంధరలాంటి గృహిణుల గంటల బతుకుల నుంచి వారిని విముక్తి చేయడానికి ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులందరూ తీసుకోవాల్సిన నిర్ణయం.’’ సతీష్ చెప్పడం ముగించాడు.
అంతలో ఆ గదిలోకి వచ్చిన వసుంధర అందరివంకా చూసి, చిన్నగా నవ్వి ‘మీరంతా కాఫీలు తాగారా?’’ అంది
‘‘మావి అయిపోయాయి…నీకోసం కాఫీ తీసుకొ స్తానుండు’’ అంటూ వంటగదిలోకి వెళ్తున్న భర్తవంక ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది వసుంధర.