అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌
శాలివాహన 1946 శ్రీ క్రోధి పుష్య బహుళ త్రయోదశి

27 ‌జనవరి 2025, సోమవారం

ఇక పార్లమెంట్‌లో కూర్చోవడం ఎందుకు? అడవులలోకో, అజ్ఞాతంలోకో వెళ్లవచ్చు కదా! ‘రాజ్యం’ (స్టేట్‌) ‌మీద పోరాటం చేయమని, చేస్తానని ప్రకటించిన వ్యక్తికి పార్లమెంట్‌లో మాట్లాడే అర్హత ఇంకా ఉంటుందా? రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మాట్లాడే నైతిక హక్కు మిగులుతుందా? కాంగ్రెస్‌లో అక్షరాలా మకుటం లేని మహారాజు, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ గురించే ఇదంతా. ఢిల్లీలో నిర్మించిన పార్టీ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్‌’‌ను ప్రారంభిస్తూ జనవరి 15న రాహుల్‌ ‌మాట్లాడిన మాటలు జాతిని నివ్వెరపరిచాయి. అందులోని ప్రతి మాట విషపూరితమే. ప్రతి భావం దేశ వ్యతిరేకమే.
‘రాజకీయ సంస్థలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతోనే మనం పోరాడుతున్నామని మీరు అనుకుంటే, ఇక్కడేం జరుగుతున్నదో మీకేమీ అర్ధం కానట్టే. ఈ దేశంలోని ప్రతి వ్యవస్థని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ‌క్రమించాయి. కాబట్టి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఇండియన్‌ ‌స్టేట్‌తో కూడా పోరాడుతున్నాం’ ఇదీ రాహుల్‌ ‌సందేశ సారం. తన పార్టీ తన పోరాటం దేనిమీదో అర్ధం కాలేదనే రాహుల్‌ ‌నమ్ముతున్నట్టు కనిపిస్తున్నది. కానీ వాస్తవం, కాంగ్రెస్‌ ‌వారంతా కనీసం రాజ్యం పట్ల గౌరవంతో ఉన్నారు. దాని నాయకుడే ఓకిజం, డీప్‌స్టేట్‌ ‌బంధంలో చిక్కుకున్నాడు. గాంధీ-నెహ్రూ కుటుంబీకుల సహజమైన ఆభిజాత్యం, అహంకారం రాహుల్‌ ‌ప్రతి మాటలోను గమనించవచ్చు. కేంద్ర కార్యాలయం మార్పుతో పార్టీలో రాబోతున్న మార్పు ఏమిటో రాహుల్‌ ‌చెప్పకనే చెప్పారు.
భారత రాజ్య వ్యవస్థనీ, భారతీయ జనతా పార్టీనీ వేర్వేరుగా చూడాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని ఒక వ్యక్తి ఇంటి పేరు చెప్పుకుని పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత హోదాలో చొరబడ్డాడు. బీజేపీని విమర్శించడం, దాని విధానాలను సిద్ధాంతాలను తూర్పార పట్టడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును ఉపయోగించుకుంటే తప్పు పట్టక్కరలేదు. కానీ ఇదేమిటి? భారత రాజ్య వ్యవస్థ మీద పోరాడాలంటూ పార్టీ కార్యాలయంలో ఆ వాగాడంబరం ఏమిటి? ‘రాజ్యం’ మీద పోరాటం ఎవరి ఊతపదం? ఒకప్పుడు నక్సలైట్లది. తరువాత, నగరాలలో ఉండి మావోయిస్టులకు వంతపాడే దొంగ మేధావులది.దేశంలోని ప్రతి వ్యవస్థని పెట్డుబడిదారులు కబ్జా చేశారన్న మాట కమ్యూనిస్టుల, ఆ తానులో ముక్కలు మావోయిస్టుల సొంతం. రాహుల్‌ ‌పెట్టుబడిదారులు మాట స్థానంలో బీజేపీ అని వాడారంతే. అంతేనా! ఇంతకు మించిన ప్రమాదకర ధోరణికి రాహుల్‌ ఒడిగడుతున్నారు. మతోన్మాద ముస్లింల వితండవాదం కూడా రాహుల్‌ ‌మాటలలో ఉంది. ఎర్రముఠా పెట్టుబడి దారులు అంటుంది. ముస్లిం మతోన్మాదులు ఈ దేశ వ్యవస్థలన్నీ అవిశ్వాసులు, ముస్లిమేతరులు చెరబట్టారని అంటారు. ఇప్పుడు ఎరుపు-ఆకుపచ్చ అక్రమబంధం ప్రపంచమంతటా పరిఢవిల్లుతున్నది కూడా. రాహుల్‌ ‌నాయకత్వంలోని కాంగ్రెస్‌ ‌కూడా అటే చూస్తున్నది కాబోలు!
ఇప్పుడు పార్టీ కార్యాలయం ప్రారంభవేళ, దాదాపు తొలి ఉపన్యాసంలో అవే మాటలు వినిపించడం యాదృచ్ఛికం ఏమీ కాదు. కాంగ్రెస్‌ ‌పార్టీకి చాలా కాలం వెనక ఉండి నడిపించిన ఎర్ర సిద్ధాంతమే ఇప్పుడు బాహాటంగా బోర విరుచుకుని జాతి ముందు నిలబడింది. కాంగ్రెస్‌ ‌బుజ్జగింపుతో బలిసిన ముస్లిం మతోన్మాదం విన్యాసమూ అందుకే. రాహుల్‌ అర్బన్‌ ‌నక్సల్స్, ‌డీప్‌స్టేట్‌, ఓకిజానికి చెందిన వాళ్ల గుప్పెట్లో ఉన్నాడని ఇదంతా సుస్పష్టంగా వెల్లడించడం లేదా? రాజకీయ ప్రత్యర్థి, నిజానికి రాహుల్‌ ‌శత్రువుగా భావిస్తున్న రాజకీయ పక్షానికీ, భారత రాజ్య వ్యవస్థకీ మధ్య తేడాను గుర్తించలేని, అలాంటి విచక్షణ ఏదీ కానరాని రాహుల్‌ ఈ ‌దేశానికి జాతీయ స్థాయిలో విపక్ష నేత. అదే ఈ దేశ దౌర్భాగ్యం. రాహుల్‌ ‌నాయకత్వంలో కాంగ్రెస్‌ ఒక బాధ్యతాయుతమైన విపక్షం బాధ్యత నుంచి తప్పుకుని, భారత వ్యతిరేక శక్తులకు సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. ఈ దేశ స్వరాజ్యం కోసం సాగిన పోరాటంలో ముందున్న కాంగ్రెస్‌, ఇప్పుడు సార్వభౌమాధికారాన్ని నడి వీధిలోనే ఎద్దేవా చేసే స్థాయికి పతనమైంది. సిద్ధాంత భ్రష్ట కూడా అయింది.
రాజ్యాంగం ఆమోదించిన, అనుమతించిన అన్ని చర్యలను విమర్శించడం కాంగ్రెస్‌ ‌విధానంగా మారింది. పైగా అవన్నీ తొందరపాటు వ్యాఖ్యలో, ఆవేశ పూరితంగా చేసినవో కాదు. ఉద్దేశపూర్వకంగా పదే పదే చేస్తున్నవి. జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చే 370 అధికరణం తొలగింపు రాజ్యాంగ బద్ధం. దానిని శతాధిక వర్షాల పార్టీ వ్యతిరేకించింది. ఆ చర్యను సుప్రీంకోర్టు సమర్ధించినా కాంగ్రెస్‌ ‌పాతపాటను వదలలేదు. బాలాకోట్‌ ‌గగనతల దాడులను పరిహసించింది. వాస్తవాధిన రేఖ గురించి తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇవన్నీ భారత్‌ను బలహీనపరచే అవకాశం కోసం వేచి ఉన్న ఇరుగుపొరుగుకు ఉపయోగపడుతున్నవే. ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ఫలితాలను వెక్కిరించడం రివాజుగా మార్చుకున్న పార్టీ కాంగ్రెస్‌. ‌న్యాయ వ్యవస్థ సమగ్రతను ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలను బలోపేతం చేస్తున్న పార్టీ కూడా అదే.
రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలని, పోరాడుతున్నామని ఎవరు చెప్పినా క్షమార్హం కాదు. అది పూర్తిగా భారత్‌కు ద్రోహమే. దేశ వ్యతిరేకమే. అలా మాట్లాడడం ఈ దేశ నాగరికతను, సంస్కృతిని, భాషలను, మొత్తంగా వైవిధ్యాన్ని నిరాకరించడమే. దేశానికి ఒక గొప్ప పోరాటం ద్వారా, మహోన్నత త్యాగాల ద్వారా స్వాతంత్య్రం సిద్ధించింది. భారత్‌ ‌సార్వభౌమాధికార దేశమైంది. దానిపై రాహుల్‌ ‌వంటి అంగుష్టమాత్రులు పోరాడతామంటే జుగుప్సాకరంగా ఉంది. ఇలాంటి వ్యక్తి పార్లమెంటుకు అవసరమా? రాహుల్‌ ‘‌రాజ్యం’ వ్యాఖ్యల మీద ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. ఆ మాత్రానికే రాహుల్‌కు బుద్ధీజ్ఞానం వస్తుందని అనుకోలేం. ఇక అతడిని ప్రజలే నిలదీయాలి.

About Author

By editor

Twitter
YOUTUBE