సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి పుష్య బహుళ షష్ఠి – 20 జనవరి 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


మానవత్వం గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడేవాళ్లు దేశంలో కోకొల్లలు. కానీ వీరి మాటల్లో మానవత్వపు పరిమళం, హక్కుల పోరులో నిజాయతీ ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ఉంటుందన్నది నిష్టుర సత్యం. ఎంపిక చేసుకున్న కొన్ని ఘోరాల మీదే వీరు స్పందిస్తారు. ఇందులో రాజకీయాలు ఉన్నాయి. పార్టీల పరిధుల సంకుచితత్వం ఉంది. కొన్ని పార్టీల ఎడల, కొన్ని విశ్వాసాల ఎడల వ్యతిరేకత వీరి నిరసనలకి మూలం. కేరళలో ఒక క్రీడాకారిణి మీద 62 మంది లైంగిక అత్యాచారాలకు పాల్పడితే ఆ వార్తకు ఎందుకు ప్రాధాన్యం రావడం లేదు? మిగిలిన క్రీడాకారులు ఎందుకు రోడ్లు ఎక్కడం లేదు? అది జరిగింది ‘ఎర్ర’ కేరళ కావడం వల్లనా? మరొక సంఘటన` ఈ విద్యా సంవత్సరానికి ఆఖరిరోజు కాబట్టి, కొంతమంది అమ్మాయిలు తమ చొక్కాల మీద వీడ్కోలు సందేశాలు రాసుకున్నారు. అందుకు ఓ ప్రైవేటు స్కూలు(ధన్‌బాద్‌) ప్రిన్సిపాల్‌ (మహిళ) విధించిన శిక్ష, చొక్కాలు తీసేసి, కేవలం బ్లేజర్లతోనే ఇళ్లకు పంపడం. ఇది జార్ఖండ్‌లో జాతర. ఆ మహిళా ప్రిన్సిపాల్‌ తన చర్యను నిస్సిగ్గుగా సమర్ధించుకున్నారు. ఆ రాతలతో పిల్లలు బయటకు వెళితే స్కూలు పరువు పోదా, అందుకే తీయించాను, తప్పేమిటి? అన్నారు.

ఇటీవలి ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుంటే హక్కుల పోరులోని డొల్లతనం బాగా అర్ధమవుతుంది. బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ రోజుల తరబడి ఢిల్లీ వీధులలో నిరసనలు హోరు వినిపించింది. ఆరోపణలను చేసిన మహిళా రెజ్లర్లను పోలీసులు తొలగించారు. ఇందుకు నిరసనగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న వినేశ్‌ పొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్రంగ్‌ పునియా, సంగీతా పోగాల్‌, సత్యవ్రత్‌ కడాయిన్‌ వంటివారు తమ పతకాలను గంగలోకి విసిరేసి నిరసనలో పాల్గొన్నారు.

నిరసన హక్కును సమర్ధించవలసిందే. లైంగిక హింసకు సంబంధించి బాలికలు, యువతులు చేసిన ఆరోపణల పట్ల తీవ్రంగా స్పందించవలసిందే. ఆ బుద్ధి అందరు బాధితుల పట్ల ఒకే విధంగా ఉండాలి. కానీ కేరళ క్రీడాకారిణి విషయంలో ఏదీ ఆ ఏకత్వం? ఏవీ ఆ హక్కుల గళాలు? నిజం దాచి కేరళ పరువును కాపాడాలని వీరు ఉద్దేశం కాబోలు. ఈ యువ క్రీడాకారిణి దళిత బాలిక. అయినా ఎవరి నోరు పెగలడం లేదంటే ‘ఎర్ర’ కేరళ మీద గౌరవమేనని అనుకోవాలి. మైనర్‌ బాలిక మీద జరిగిన లైంగిక అత్యాచారాల కేసుల చరిత్రలోనే ఇంత దారుణమైనది ఇంతవరకు లేదని అధికారులు చెబుతున్నారు. అయినా కమ్యూనిస్టులు మాట్లాడరు.

తనను రెండేళ్లుగా కొందరు లైంగికంగా వేధించి, అత్యాచారాలకు పాల్పడ్డారని ఆ క్రీడాకారిణి స్వయంగా ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది. మైనర్‌గా ఉండగా 16వ ఏట ఆమె మీద ఈ దురాగతం మొదలుపెట్టారు. అంతా కలసి 62 మంది. ఇందులో శిక్షకులు, తోటి క్రీడాకారులు, సహపాఠులు కూడా ఉన్నారు. ఇంతవరకు 20 మందిని అరెస్టు చేశారు. అందులో 17 ఏళ్ల మైనర్‌ ఉన్నాడు. పథానథిట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఇందుకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. మరొక నలభయ్‌ మందిని కూడా గుర్తించారు కాని, వాళ్లు ఇంకా అరెస్టు కాలేదు. ఇంతమంది సమాచారం ఆ బాలిక తండ్రి ఫోనులోనే దొరకడం విశేషం. ఆ ఫోన్‌ ద్వారానే ఆ బాలిక వాళ్లందరితో మాట్లాడింది. అరెస్టయిన వాళ్లంతా 19-30 ఏళ్ల మధ్యవారే. ఈమె 13వ ఏటనే పొరుగున ఉన్న తండ్రి మిత్రుడి కొడుకు సుబిన్‌ చేతిలో అత్యాచారానికి గురైందని పథానంథిట్ట శిశు సంక్షేమ సంఘం చెబుతున్నది. పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో నీచత్వానికి కూడా ఒడిగట్టాడు. ఆ ఘనకార్యాన్ని ఫోన్‌లో చిత్రీకరించి, మిత్రులకు బట్వాడా చేశాడు. దానిని చూపించే పలువురు అతని మిత్రులు ఆ బాలికను లొంగదీసుకున్నారని తెలుస్తున్నది. ఈ కేసు అసాధారణంగా కనిపించడంతో శిశు సంక్షేమ సంఘం బాలికకు మానసిక శాస్త్రవేత్తలతో కౌన్సెలింగ్‌ ఇప్పించవలసి వచ్చింది. దీని మీద జాతీయ మహిళా సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తమకు మూడు రోజులలోగా నివేదిక ఇవ్వాలని కేరళ పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చింది.

బీజేపీని వ్యతిరేకించే పార్టీల అధీనంలో ఉన్న రాష్ట్రాలలో జరిగిన అత్యాచారాల గురించి ఉదారవాదులు, హక్కుల కార్యకర్తలు నోరు మెదపకపోవడం మానవత్వానికే చేటు అన్న సంగతి ఇప్పటికీ వారు గుర్తించడం లేదు. సైనికులు, పోలీసులు, ఇతర రక్షణ సిబ్బందిపై అత్యాచారాల ఆరోపణలు వచ్చినప్పుడు ఈ శక్తులన్నీ వీరంగం వేస్తాయి. కేరళ స్టోరీ అనే చలనచిత్రం గురించి అంత రచ్చ చేసిన కేరళ ప్రభుత్వం, సీపీఎం ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? వీళ్ల నిరసనలు అగ్రకులాలుగా చెప్పే వర్గాల నుంచి బాలికలు, యువతుల మీద జరిగిన అత్యాచారాలకు లాంఛనంగాను, బాధితులు మైనారిటీలు, బడుగువర్గాలు అయితే పెద్ద మోతాదులోను ఉంటాయని ఇప్పటికే విమర్శ ఉంది. పశ్చిమ బెంగాల్‌ ఆర్‌జీ కర్‌ ఆసుపత్రి కేసు, ఇప్పుడు ఈ యువ క్రీడాకారిణి ఉదంతం ఆ విమర్శకు కొత్త కోణాన్ని తగిలించాయి. బీజేపీయేతర రాష్ట్రాలలో జరిగే ఘాతుకాలు వీళ్లకు వినిపించవు, కనిపించవు. మీడియా ధోరణి కూడా ఇదే. తాము నోరు విప్పితే బీజేపీ బలపడుతుందని ఈ శక్తులన్నీ మూకుమ్మడిగా భావిస్తున్నాయి. మానవత్వానికి జరుగుతున్న చేటు గురించి పట్టడం లేదు. ఇంతకంటే నీచం మరేదైనా ఉందా? అక్కడ పశుప్రాయులు మానవత్వాన్ని అవమానిస్తున్నారు. మేధావులు మానవ హక్కులను వివక్షతో వికృతం చేస్తున్నారు. ఏ మహిళ, ఏ బాలిక, ఏ ప్రౌఢ ఎక్కడ దారుణ అవమానానికి గురైనా అది మన ఆడపడుచు మీద జరిగిన దాడిగా భావించాలే తప్ప, ఇలాంటి ధోరణి సరికాదు.

About Author

By editor

Twitter
YOUTUBE