భారత రాజ్యాంగ అమృతోత్సవం సందర్భంగా

‘‘భారత ప్రజలమైన మేం…’’ అంటూ భారత రాజ్యాంగం ఆరంభమవుతుంది. ఈ పదబంధం వెనుక లోతైన, గాఢమైన అర్ధం ఉంది. సాంస్కృతిక ఐక్యతకు తోడుగా సామాజిక, రాజకీయ ఐక్యతకు రాజ్యాంగం పునాది వేసిందని చెప్పడానికి ఈ మాటలే రుజువు. భారత స్వాతంత్య్ర సమరానికీ, భారత రాజ్యాంగ ఆవిర్భావానికీ అవినాభావ సంబంధం ఉంది. భారత స్వాతంత్య్ర పోరాటానికీ, రాజ్యాంగ నిర్మాణానికీ, భారత సాంస్కృతిక వారసత్వానికీ సంబంధం ఉంది. స్వాతంత్య్ర సమరం, భారత రాజ్యాంగ నిర్మాణం రెండూ సుదీర్ఘ ప్రయాణాలే. రాజ్యాంగం తొలి ప్రతి మీద మన పురాణ పురుషుల, చరిత్ర పురుషుల చిత్రాలను గీయించడం ద్వారా ఆ అంశాన్ని వెల్లడిరచారు రాజ్యాంగ నిర్మాతలు. స్వాతంత్య్ర పోరాటంలో, బ్రిటిష్‌ ఇండియా చట్టసభలలో పనిచేసిన వారే రాజ్యాంగ పరిషత్‌లోను సభ్యులుగా పనిచేశారు. ఎక్కువ మంది న్యాయ నిపుణులే కూడా. రాజ్యాంగ పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌, ముసాయిదా సంఘం అధ్యక్షులు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఉన్నత విద్యావంతులు. ముసాయిదా తయారీలో కీలకంగా వ్యవహరించిన బెనెగళ్‌ నరసింగరావు పత్రికా రచయిత, విద్యావంతుడు. రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బయ్‌ ఐదేళ్లు గడిచిన సందర్భంగా ఆ పరిణామాలను ఒకసారి స్మరించుకోవాలి.బ్రిటిష్‌ పార్లమెంట్‌లో భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన చట్టం కంటే చాలా ముందే రాజ్యాంగ నిర్మాణ యజ్ఞం మొదలయిందన్నది ఒక సత్యం.

రాజ్యాంగం అనే తాత్త్విక, రాజకీయ చింతనకు భారత్‌ పరిస్థితులు ఏనాటికీ అనుకూలం కావని మొదట చాలామంది విమర్శలు కురిపించారు. ప్రధానం ఇంగ్లండ్‌ మేధావులు, పాశ్చాత్య దేశాలు ఇందుకు వత్తాసు పలికాయి. బ్రిటన్‌ ప్రముఖుడు, ఒకనాటి ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ అయితే, భారతీయులకు స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం వంటి పదాలు కొరుకుడు పడనివేనని వ్యాఖ్యా నించాడు. కానీ మనకు షోడశ మహా జనపదాలు ఉండేవి. అవన్నీ తమ ప్రతినిధులను తామే ఎన్నుకుని పాలన సాగించేవి. ఈ సంగతి పాశ్చాత్య దేశాలకు తెలియదు. తెలిసినా తెలియనట్టే నటించాయి. భారత్‌ స్వాతంత్య్రం సాధించుకోవడం, రాజ్యాంగాన్ని నిర్మించుకుని, డెబ్బయ్‌ ఐదేళ్లు అప్రతిహతంగా పురోగమించడం ఇవాళ్టి వాస్తవ దృశ్యం. కాబట్టి ఈ చారిత్రక పరిణామాలు, సందర్భాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి.

రాజ్యాంగం అన్న ఆలోచన మొదట 1895లో వచ్చింది. ఆ సంవత్సరం సిద్ధం చేసిన భారత రాజ్యాంగ బిల్లు అందుకు సంబంధించినదే. దీనినే స్వరాజ్‌ బిల్‌ అని కూడా అంటారు. భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడిన పదేళ్లకు ఈ పరిణామం సంభవించింది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, 1885 జాతీయ కాంగ్రెస్‌ స్థాపన, అప్పటికే భారతీయులలో వచ్చిన సంస్కరణాభిలాష కలసి జాతీయవాదానికి పదును తెచ్చాయి. పాలనలో భారతీయులకు చోటు ఉండాలన్న స్వయం ప్రతిపత్తి నినాదం కూడా బలపడిరది. అలాంటి తరుణంలోనే దేశానికి రాజ్యాంగం కావాలన్న అభిప్రాయం వెల్లడైంది. ఇంతకీ భారత రాజ్యాంగ బిల్లు 1895 రూపకర్తలు ఎవరో తెలియదు. ఒక అనధికార రాజ్యాంగ నమూనాగా ప్రాముఖ్యం పొందిన ఈ బిల్లు రూపకర్త పేరు ఇతమిత్థంగా అయితే తెలియదు.  స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించిన బాలగంగా ధర తిలక్‌ కావచ్చునని అనీబిసెంట్‌ అంచనా. అవన్నీ ఉన్నా బ్రిటిష్‌ ఇండియా మనకు రాజ్యాంగం  ఇవ్వలేదు. రాజ్యాంగం, హక్కులు వంటి అంశాలలో బ్రిటిష్‌ ఇండియాది పెద్ద సాచివేత ధోరణి. 1925లో అనిబీసెంట్‌ ఆమె మిత్రులు, సైమన్‌ కమిషన్‌ వచ్చి వెళ్లిన తరువాత 1928లో మోతీలాల్‌, జవాహర్‌ లాల్‌, తేజ్‌బహదూర్‌ సప్రూ సంఘం రాజ్యాంగం అదించేందుకు ప్రయత్నించాయి.

కాబట్టి రాజ్యాంగ నిర్మాణం ఆలోచనకు 130 ఏళ్లు అని గమనించాలి.ఈస్టిండియా కంపెనీ ఏలుబడిలోనే 1773లో మొదటి రెగ్యులేషన్‌ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా రాజ్యాంగ రచనకు పరోక్షంగా పునాది ఏర్పడుతూ వచ్చింది. బ్రిటిష్‌ ఇండియాలో అనేక చట్టాలు వచ్చినప్పటికీ 1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు నేడు అమలులో ఉన్న రాజ్యాంగ నిర్మాణానికి ఆధారాలుగా కనిపిస్తాయి. రాజ్యాంగ బిల్లు తరువాత దాదాపు నలభయ్‌ ఏళ్లకు 1934లో ఎంఎన్‌ రాయ్‌ రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఈ ఆలోచనను 1940లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమోదించినప్పటికి  తరువాత ఆరు సంవత్సరాలకు మాత్రమే ఆ ఆలోచన కార్యరూపం దాల్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్‌ పార్లమెంట్‌ జూలై 18, 1947న చట్టం చేయడానికి చాలాముందే ఈ కీలక పరిణామం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్‌ మిషన్‌ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగ రచనకు ప్రయత్నం ఆరంభమయింది. ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌లో ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్‌ సభ్యులు కూడా ఉన్నారు. మొదట 389 మంది సభ్యులు పరిషత్‌లో ఉన్నారు. అఖండ భారత్‌ పరిధితో జరిగే రాజ్యాంగ రచనను ముస్లింలకు ప్రత్యేక దేశం కోరుకున్న ముస్లింలీగ్‌ వ్యతిరేకించింది. ఆ సంస్థ సభ్యులు పరిషత్‌ను బహిష్కరించారు. తరువాత దేశ విభజన జరిగింది. ఫలితంగా పరిషత్‌ సభ్యులు సంఖ్య 299కి తగ్గింది. వీరిలో 229 మంది బ్రిటిష్‌ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. 70 మంది స్వదేశీ సంస్థానాలు నియమించిన వారు ఉన్నారు. మొదట పరిషత్‌ తాత్కాలిక చైర్మన్‌గా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తరువాత డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా హరీంద్రకుమార్‌ ముఖర్జీ, రాజ్యాంగ వ్యవహారాల సలహాదారుగా బెనెగళ్‌ నరసింగ రావు ఎన్నికయ్యారు.

డిసెంబర్‌ 9,1946న పరిషత్‌ మొదటి సమావేశం జరిగింది. రెండేళ్ల 11 నెలల, 17 రోజులు పరిషత్‌ పని చేసింది. మొత్తం సమవేశాలు 11. ఇందుకు అయిన ఖర్చు రూ. 64 లక్షలు.22 అధ్యాయాలతో, 395 అధికరణలతో రాజ్యాంగం ఆవిర్భవించింది. జనవరి 24, 1950 జనగణ మనను జాతీయ గీతంగా స్వీకరించారు. జనవరి 26, 1950న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం వెనుక అక్షరాలా ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉంది.

దేశానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేయాలన్న ఆశయమే ఆ బిల్లు పేరును బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ పత్రాన్ని చట్ట పరిభాష శైలిలోనే 110 అధికరణాలతో తయారు చేశారు. వ్యక్తిగత హక్కులు అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆస్తి హక్కు, ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా రక్షణ, చట్టం ముందు సమానత్వం వంటివి అందులో ఉన్నాయి. ఆ బిల్లు ప్రభుత్వ రూపరేఖలు, అధికారాల విభజన గురించి కూడా ప్రతిపాదించింది. ఈ బిల్లు రూపురేఖల గురించి కొంత సమాచారం లభిస్తున్నా, నాటి రాజకీయ, సాంఘిక వర్గాలు దీనిని ఏ విధంగా స్వీకరించాయో తెలియదు. కానీ ఈ బిల్లు లోతైన అంశాలనే చర్చించిందని కానిస్టిట్యూషనల్‌ డెవలప్‌మెంట్స్‌ సిన్స్‌ ఇండిపెండెన్స్‌’ అన్న పుస్తకం కోసం ఎస్‌పీ సాథే రాసిన అధ్యాయం ‘ఫండమెంటల్‌ రైట్స్‌ అండ్‌ డైరెక్టివ్‌ ప్రిన్సిపుల్స్‌’ (ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు)లో ఆ వ్యాఖ్య కనిపిస్తుంది. ఆ బిల్లు భారత రాజ్యాంగ రచనకు అనధికారికంగా జరిగిన ప్రయత్నంగా కూడా ఆ పుస్తకమే వర్ణించింది. 1950లో మనం ఆమోదించుకున్న రాజ్యాంగంతో పాటు, కామన్వెల్త్‌ ఆఫ్‌ ఇండియా బిల్లు 1925, నెహ్రూ నివేదిక, 1928ల మీద కూడా ఆ బిల్లు ప్రభావం ఉందని నిపుణులు చెబుతారు.

భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడిన తరువాత, బ్రిటిష్‌ పార్లమెంట్‌ నిర్ణయం తరువాత భారత రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికల ద్వారా ఏర్పడిరది. డిసెంబర్‌ 13, 1946న పరిషత్‌ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు లాంఛనంగా ఉపక్రమించింది. పరిషత్‌ లక్ష్యాలను నిర్దేశించే తీర్మానాన్ని జవాహర్‌లాల్‌ నెహ్రూ ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రధాన ధ్యేయం భారత్‌ను సర్వసత్తాక స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించడం. జనవరి 22,1947న రాజ్యాంగ పరిషత్‌ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

మొదటి సమావేశం తరువాత రాజ్యాంగంలో ఏఏ అంశాలు ఉండాలో పరిశీలించడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేశారు.అవి: ముసాయిదా కమిటీ (బీఆర్‌ అంబేడ్కర్‌), కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ (జవాహర్‌లాల్‌), ప్రాంతీయ రాజ్యాంగం (సర్దార్‌ పటేల్‌). ఈ కమిటీలకు అప్పగించిన అంశాలు జటిలమైనవి కాబట్టి నాలుగు ఉప సంఘాలుగా విభజించారు. అవి: ప్రాథమిక హక్కుల ఉపకమిటీ (జేబీ కృపలానీ), మైనారిటీల ఉపకమిటీ (హరీంద్రకుమార్‌ ముఖర్జీ), ఈశాన్య గిరిజన సరిహద్దు ప్రాంతాలు (గోపీనాథ్‌ బార్డోలోయి), విధాన పరమైన సమితి నియామకాల కమిటీ (బాబూ రాజేంద్రప్రసాద్‌), రాష్ట్రాలతో చర్చల కమిటీ (నెహ్రూ), క్రీయాశీలక కమిటి (బాబూ రాజేంద్ర ప్రసాద్‌).ముసాయిదా సమితిలో అంబేడ్కర్‌, బీఎల్‌ మిట్టల్‌, ఎన్‌జీ అయ్యంగార్‌, ఏకే అయ్యర్‌, కేఎం మున్షి, మహమ్మద్‌ సాదుల్లా, ఎన్‌. మాధవ రావు, డీపీ ఖైతాన్‌, టీటీ కృష్ణమాచారి ఉన్నారు. దీని అధ్యక్షుడు అంబేడ్కర్‌.

ఈ సంఘాలన్నీ వాటి వాటి నివేదికలను 1947 ఏప్రిల్‌, ఆగస్ట్‌ నెలల మధ్య సమర్పించాయి. అన్ని అంశాల మీద ఆగస్ట్‌ 30, 1947న చర్చ ముగిసింది. ఈ సంఘాలు ఇచ్చిన నివేదికల, వాటిపై జరిగిన చర్చల సారాంశం అధారంగా రాజ్యాంగ పరిషత్‌ సలహాదారు బీఎన్‌ రావ్‌ ఒక ముసాయిదాను తయారు చేశారు. అక్టోబర్‌, 1947లో ఈ పని పూర్తి చేసి రాజ్యాంగ ముసాయిదా సంఘానికి సమర్పించారు. ఈ ముసాయిదా మీద ముసాయిదా సంఘం నెలల తరబడి చర్చించి,తుది ముసాయి దాను రూపొందించి, ఫిబ్రవరి 21,1948 నాటికి  రాజ్యాంగ పరిషత్‌ చైర్మన్‌కు సమర్పించింది.

పరిషత్‌ చైర్మన్‌కు అందించిన తరువాత తుది ముసాయిదాను అచ్చు వేయించి ప్రజలకు, మేధావులకు అందుబాటులో ఉంచారు. చాలా వ్యాఖ్యలు, విమర్శలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వీటన్నిటినీ కేంద్ర, ప్రాంత రాజ్యాంగ కమిటీలు పరిశీలించాయి. వీటి మీద 1948 అక్టోబర్‌ 23,24,27 తేదీలలో చర్చలు జరిపింది. తరువాత అక్టోబర్‌ 26, 1948న ముసాయిదాను మరొకసారి ముద్రించారు. ముసాయిదా మీద రెండోసారి కూడా అక్టోబర్‌ 17,1949 వరకు  చర్చ జరిగింది. ఈ దశలోనే రాజ్యాంగ సవరణకు చాలా సూచనలు వచ్చాయి. కానీ వాటిలో ఎక్కువ సవరణలను పరిషత్‌ తిరస్కరించింది. తీసుకున్న కొన్ని సూచనలు, సవరణల కోసం మళ్లీ చర్చలు జరిపారు. సవరించిన కొత్త రాజ్యాంగాన్ని నవంబర్‌ 3,1949న రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడికి అందించారు. అంతిమంగా నవంబర్‌ 14,1949న రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. తరువాత నవంబర్‌ 26, 1949న మూడోసారి కూడా చదివడం, దాని మీద చర్చలు పూర్తి చేశారు. అంతకు ముందే రాజ్యాంగ ఆమోదం కోసం డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పరిషత్‌ ఆమోదించింది. ఆమోదం పొందిన రాజ్యాంగం మీద జనవరి 24,1950న సభ్యులంతా సంతకాలు చేశారు. రెండు రోజుల తరువాత జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

గాంధీజీ హత్య, దేశంలో మత కల్లోలాల ఉద్రికత్త, పాకిస్తాన్‌ దాడి వంటి ఉత్పాతాల మధ్య రాజ్యాంగ రచన జరిగింది. అయినా ఎవరి పట్ల వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు మన రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగం ఎన్నో ఆటుపోట్లకు గురైంది. ఎక్కువ కాలం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ హయాంలోనే ఎక్కువ సవరణలు, నిజానికి కొన్ని ఉల్లంఘనలు జరిగాయి. అందుకు గొప్ప ఉదాహరణ అత్యవసర పరిస్థితి (1975) విధింపు. నేటి భారతంలో కొన్ని సంక్షోభాలు ఉన్నా, వాటిని అధిగమించి, పరస్పర గౌరవంతో, సర్దుబాటుతో భారత ప్రజానీకం పురోగమించగలగడం వెనుక  ఉన్న స్ఫూర్తి రాజ్యాంగమే.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE