ఎలాంటి మినహాయింపులు లేని హిందూ ఐక్య సంఘటనకు ఉద్దేశించినది విశ్వహిందూ పరిషత్. ఏ హిందువూ పతితుడు కాడు అన్న నినాదంతో మొదలైన ఈ ఆధునిక సంస్కరణోద్యమం చరిత్రాత్మమైనది. తెలుగు నేల మీద ఆ సంస్థకు శ్రీకారం చుట్టిన సందర్భంగా జాగృతి విలువైన సంపాదకీయం వెలువరించింది. ఆలయాల పవిత్రత, హిందూ దేవళాల విశిష్టత, దాతలు ఇచ్చిన మాన్యాల సద్వినియోగం గురించి సంపాద కీయం ప్రస్తావించింది. ప్రభుత్వ జోక్యంతో వచ్చిన మార్పులను నిరసించింది. ప్రలో భాలతో జరుగుతున్న మతాంతరీకరణలన్నీ ఆలయ వ్యవస్థ బలహీన పడిన ఫలితమేనని ఈ సంపాదకీయం భావించినట్టు కనిపిస్తుంది.
గోదావరి పుష్కర సమయంలో రాజమహేంద్ర వరంలో (17.9.67) వివిధ నగరాల ప్రతినిధుల, హిందూ సామాజిక కార్యకర్తల సమ్మేళనంలో విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ శివ శంకర్ ఆప్టే ఆంధప్రదేశమునకు పరిషత్ కార్య సమితిని ప్రకటించడంతో ఆంధ్రలో విశ్వహిందూ పరిషత్ శాఖ ఏర్పడింది. కార్యసమితిని ప్రకటింప బడగానే కంచి కామకోఠి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు సమ్మేళనానికి ప్రత్యేకంగా విచ్చేసి నూతన కార్యసమితిని, కార్యకర్తలను ఆశీర్వదించి వెళ్లారు. సాయంత్రం మహాసభలో స్వామివారు ప్రారం భోత్సవం చేసి శాఖను ఆశీర్వదించారు. ఆ సంద ర్భంలో జరిగిన వివిధ సమావేశాలలో కార్యకర్తలు కార్యవిస్తరణకు సంబంధించి, ప్రాంతంలో స్వీకరించ వలసిన కార్యకలాపాలను గురించి తమ అభిప్రా యాలు తెలియజేశారు. అదే సందర్భంలో ఎవరికి విశ్వహిందూ పరిషత్‌ను పరిచయం చేయాలన్నా ఉపకరించే ప్రత్యేక గ్రంథం స్వామి బోధనానంద పురిచే ఆవిష్కరింపబడ్డది.
సాయం సమయాలలో జరిగిన రెండు బహిరంగ సభలలోను-ప్రాంతానికి చెందిన ప్రముఖులు, సాధుసంతులు పరిషత్ శాఖను స్వాగతించారు. అత్యంతోపయోగకరమగు ప్రసంగాలు చేశారు. ప్రజలకు పరిషత్ ఆవశ్యకతను వివరించారు. ఇదంతా సువ్యవస్థితమైన శుభారంభం.
ఈ ప్రాతిపదిక కార్యకలాపాల మధ్య నూతన కార్యసమితి ప్రథమ సమావేశం జరిగింది. కార్య విస్తరణకు వ్యవస్థా నిర్మాణానికి, కార్యకర్తల నియామకానికి సంబంధించి ఆవశ్యకమగు నిర్ణయాలు అందు తీసుకొనబడ్డాయి. వానితోపాటు కార్యసమితి రెండు అతి ముఖ్య విషయాలపై తన దృష్టిని సారించింది.
ఒకటి : దేవాలయాలు, ధర్మదాయ సంస్థలకు సంబంధించినది. ఈ సంస్థలన్ని ధర్మబుద్ధి, దాన బుద్ధిగల దాతలచే ఏనాడో ఏర్పడ్డాయి. అందు కొన్ని నేటికీ మహోజ్వలంగా పనిచేస్తున్నా, మరికొన్ని అవి ప్రారంభింపబడిన నాటి లక్ష్యాలను కోల్పోయి ఉండడం కనిపిస్తున్నది. దాతలు ఏ ఏ ఉద్దేశాలతో ఆయా దానములు చేశారో, ఆ ఉద్దేశాలు మరుగున పడుతున్నాయి. ఏ ధర్మనిష్ఠను సమాజంలో నిలపడానికి ఆయా సంస్థలు వెలిశాయో ఆ ధర్మనిష్ఠకు తగిన ప్రాముఖ్యం ఇవ్వబడని స్థితిగతులలో కన్పిస్తున్నాయి. ఈ రంగంలోకి ప్రభుత్వం ప్రవేశించ డంతో వాటి నిర్వహణలో అనేకమైన మార్పులు వచ్చాయి. వస్తున్నాయి. చట్టాలు, అధికార యంత్రాం గపు ప్రాబల్యము పెరిగి – సహజంగా అవి నిర్వహించవలసిన విధుల స్వరూప స్వభావాలు దెబ్బతినజొచ్చాయి. సమాజానికి అవి అన్నీ స్ఫూర్తి కేంద్రాలుగాను, ధర్మప్రచారక సాధనాలుగాను, ఆస్తిక్యభావ వ్యాప్తికి, ఆస్తిక సాధనకు కేంద్రాలుగా మరల తీర్చిదిద్దబడవలసి ఉంది. దేశమంతా ఉన్న దేవాలయ, ధర్మదాయ సంస్థలు అలా రూపొందించ బడాలని కుంభమేళ సమ్మేళనాలలో విశ్వహిందూ పరిషత్ ఒక తీర్మానం ద్వారా ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను ప్రాంతంలోని అవసరాన్ని పురస్కరించు కొని-ప్రాంతసమితి ఈ విషయమై దృష్టిని సారించింది. పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, ఈ విషయమై జరుగదగు పని ఏమిటో సూచించ డానికిగాను కార్యసమితి ఒక ఉప సమితిని నియమించింది. ప్రాంత ప్రజల నుండి ఈ విషయమై అభిప్రాయాలను, సూచనలను సేకరించియు స్వయంగా పరిశీలించియు కార్యక్రమ నిర్ణయమునకు కృషి చేయవలెనని ఉప సమితి సంకల్పించింది. అత్యంతయోగ్యమైన కార్యమిది.
ఇక రెండవది : హరిజన, గిరిజన తదితర వర్గములలో జరుగదగు కృషికి సంబంధించినది. కేంద్ర పరిషత్ ఈ విషయమై కూడా శ్రద్ధ వహించియున్నది. నేడు ప్రాంతంలో (దేశంలో కూడా) పలువురు హిందువులు – హిందూత్వము అందని స్థితిలో ఉన్నారు. నగరాలలో, గ్రామాలలో, దూరాన ఉన్న కొండలలో కోనలలో అలాంటి హిందువులు చాలామంది ఉన్నారు. అమాయక ; అజ్ఞానము, అసహాయత పేదరికముల మధ్య వారు జీవిస్తున్నారు. కాలగతిలో అట్టివారి విషయంలో ధార్మిక కార్యకలా పాలు సన్నగిల్లినవి. ధార్మికంగా వారి స్థితి న్యూనతమ స్థాయిలో ఉన్నది. ఈ స్థితిలో విదేశీ సహాయ సహకారాలతో విధర్మీయులు-వారిని ప్రలోభపెట్టిగాని, వత్తిళ్ల ద్వారాగాని – మతాంతరు లను చేయడం కూడా జరుగుతున్నది. ఆ ప్రజానీకాన్ని అలాగే వదలివేయడం సామాజికంగా అన్యాయం కావడమే గాక, ప్రమాదకరం కూడా. వారికి ధర్మప్రబోధం ఇవ్వాలి. వారికి మానవీయమైన సేవను కూడా చేయాలి. ప్రభుత్వం ద్వారాను, సమాజం ద్వారాను, ధర్మసంస్థల ద్వారాను జరుపదగు ఉపకారాలను జరిపించాలి. ప్రలోభము ద్వారా, వత్తిళ్ల ద్వారా జరుగు మతాంతరీకరణలు అనైతికములు. ఈ అనైతిక కార్యకలాపములకు గురియై మతాంతరులైనవారు తిరిగి మాతృ సమాజంలోకి చేరేందుకు ఆహ్వానము, అవకాశములు ఇవ్వాలి. ఈ విషయంలో కేంద్ర పరిషత్, వివిధ పీఠాధిపతులు తమ ఆసక్తిని ఆమోదాన్ని ప్రకటించారు. వీరందరిని ఎలా సేవించ గలగాలి? ఎలాంటి సహాయం చేయ వచ్చు? చేయించ వచ్చు. ఇత్యాది విషయాలపై తగు ఆలోచనలు చేసి కార్యసమితికి సలహానిచ్చేందుకుగాను మరొక ఉపసమితి ఏర్పడింది. ఈ విషయంలో కూడా ప్రజానీకపు సహకారము, అభిప్రాయములు, సూచనలను పరిషద్ కోరుతున్నది. ఇది కూడా అత్యంత యోగ్యము. ఆవశ్యకమునైన కార్యము.
ఇంతవరకు తగిన ప్రాముఖ్యమీయబడని విషయములివి. వీనిని ప్రాంత ప్రజల దృష్టికి, ఇతర సాధుసంతుల, పండితుల, ప్రముఖుల దృష్టికి తెచ్చి అందరి సహాయ సహకారములతో చేయగల్గినదంతా చేయగల్గుట పరిషత్ మీద చరిత్ర పెట్టిన కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణలో కార్యసమితి, కార్యకర్తలు సంపూర్ణ కృషి జరపగలరని, ఆ కృషికి అన్ని వర్గముల నుండి ఆవశ్యకమగు సహాయ సహకారములన్ని లభించగలవని ఆశిద్దాం. ఈ శ•భసమయంలో ఆంధ్రలో విశ్వహిందూ పరిషత్ శాఖకు స్వాగతం.
– 25.9.1967 జాగృతి
సంపాదకీయం