శాలివాహన 1946 శ్రీ క్రోధి పుష్య శద్ధ – 13 జనవరి 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
జనవరి 5, 2025 చరిత్రాత్మక దినం. లక్షలాదిగా తరలివచ్చిన హిందువులు, దాదాపు 150 మంది సాధుసంతులు ముక్త కంఠంతో హిందూ ఆలయాలను ప్రభుత్వ పిడికిలి నుంచి విడిపించాలని నినదించారు. ‘మన దీక్ష-దేవాలయ రక్ష’ అని గర్జించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన హైందవ శంఖారావం నిశ్చయంగా ఆ దీక్ష కోసం పడిన తొలి అడుగు. అందుకోసమే జరిగిన తొలి మహా సమ్మేళనం ఇదే. దేశమంతటా హిందూ దేవాలయాల నిర్వహణ హిందువులకే ఉండాలని శంఖారావం నిర్ద్వంద్వంగా ప్రకటించింది. ఈ మేరకు ఆమోదించినదే తొమ్మిది అంశాల ‘విజయవాడ డిక్లరేషన్’.
హిందూ దేవాలయాల మీద దాడుల గురించి చర్చించడం అంటే వేయేళ్ల విషాదాన్ని సమీక్షించుకోవడమే. మధ్య యుగాల ముస్లిం మతోన్మాదం నుంచి, స్వతంత్ర భారతంలోను హిందూ ధార్మిక సంస్థలు, ఆలయాలు దాడులకు, వివక్షకు గురికావడం ఇంకా పెద్ద విషాదం. కానీ హిందూత్వ భావన అజరామరమైనది. కాబట్టి దెబ్బ తిన్నా తిరిగి నిలబడడం దాని చరిత్రలో ఒక భాగమైంది. తొమ్మిది అంశాల ఆ ప్రకటన న్యాయబద్ధమైనది. రాజ్యాంగబద్ధమైనది. ఎన్నో సందర్భాలలో కోర్టులే ఇచ్చిన తీర్పుల మేరకు హిందూ దేవాలయాలలో ప్రభుత్వ జోక్యం తగ్గాలని, ఆలయ ఆచారాలలో అధికారుల ఆదేశాలు తగవని, గుడులపై, శోభాయాత్రలపై దాడులు ఆపాలని కోరడం న్యాయబద్ధం కాక మరేమిటి?
సెక్యులరిజం పేరుతో హిందూత్వ మీద వివక్ష ఒక వాస్తవం. హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల అజమాయిషీ పెరిగిన క్రమం, ఫలితంగా హిందూ ఆలయాలకు ఎదురైన అస్తిత్వ సమస్య ఇందుకు నిదర్శనం.19 శతాబ్దం ఆరంభం నుంచే హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల జోక్యం ఉంది. బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రావిన్స్‌లలో 1810-1817 మధ్య వచ్చిన చట్టాలతో ఈ ఆధునిక గ్రహణం మొదలయింది. ఆ చట్టాల ప్రకారం ప్రభుత్వం ఆలయాల పాలనలో చొరబడవచ్చు. అదెందుకూ అంటే, ఆలయాల ఆదాయం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికట. హిందువులు సాంస్కృతిక కేంద్రాలుగా, ఆధ్యాత్మిక నిలయాలుగా భావించే ఆలయాలలో నిధుల దుర్వినియోగాన్ని చూపించి దొడ్డి దోవన జోక్యం మొదలయింది. తరువాత హిందూ ధర్మ కేంద్రాలకు సెక్యులరిజం అంటించడానికి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1863 చట్టం చేసింది. అసలు హిందూ ధార్మిక సంస్థలలో సెక్యులరిజం ప్రశ్న ఎందుకు వస్తుంది. అవి స్వతహాగా మత సంస్థలు కదా! ఆ విధంగా ఆలయాలపై ధర్మకర్తలకు ఉన్న అదుపును ప్రభుత్వం కబ్జా చేసింది. ఆలయాల నిర్వహణలో సాధారణ పరిపాలనా నియమాలను అమలు చేసేందుకు చారిటబుల్ అండ్ రెలిజియస్ ట్రస్టస్ చట్టం (1920) తీసుకువచ్చారు. ఇంతకంటే క్రూరమైన చట్టం మద్రాస్ రెలిజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ (1925). దీనితో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ బోర్డ్ పుట్టుకొచ్చింది. దీనికి చట్టబద్ధ అధికారాలు కూడా ఇచ్చారు. ఆలయాల వ్యవహారాలలో చట్టాలూ, నియమాలూ రూపొందించే అధికారం దీనితో స్థానిక పాలనా యంత్రాంగాలకి వచ్చింది. అంటే కేంద్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు వేలు పెట్టవచ్చు. స్వతంత్రం వచ్చిన తరువాత భారత లా కమిషన్ సిఫారసులతో ఒక చట్టం తెచ్చారు. అది తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (టీఎన్ హెచ్‌ఆర్ అండ్ సీఈ) చట్టం 1951కు పదును పెట్టడమే. దీనితోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటుకు అవకాశం వచ్చింది. అదే సమయంలో బిహార్ హిందూ రెలిజియస్ •స్ట్ర్ చట్టం, 1950ను ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదించింది. అన్నీ గుడుల స్వతంత్ర ప్రతిపత్తిని హరించినవే.
ఈ ధోరణిని హిందూ సమాజం ప్రతిఘటించకుండా ఉండడం ఎలా? ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఆలయాలకు విముక్తి కల్పించాలన్న పోరాటం ఇప్పటిది కూడా కాదు. దానికీ ఆరున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1959లో ఇందుకు సంబంధించి తొలి తీర్మానం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుడి ఆలయ నిర్వహణ హిందువులకు అప్పగించాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) 1959లోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ పోరాటంలో ఒక వెలుగురేఖ 2023లో మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ సరికాదన్న వాదన బలం పుంజుకుంటున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది.
ఈ పోరాటంలో కొన్ని విజయాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వాల వైఖరితో అవి మరుగున పడ్డాయి. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా, అనైతికతకు తావు లేనంతకాలం, ఆరోగ్య రక్షణకు సహకరిస్తున్నంత కాలం స్వతంత్రంగా నిర్వహించుకునే హక్కు ఆర్టికల్ 26(డి) మేరకు హిందూ ధార్మిక సంస్థలకు ఉంటుందని శిరూర్ వర్సెస్ ఎండోమెంట్స్ కమిషనర్ మద్రాస్ కేసు (1954)లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ సంస్థల పాలనను క్రమబద్ధీకరించే అధికారం మాత్రం ప్రభుత్వానికే దఖలు పరించింది. కొన్ని పరిధులు ఉన్నా రతీలాల్ ప్రాణ్‌చంద్ గాంధీ వర్సెస్ బొంబాయి రాష్ట్రం 1954 కేసులో విషయాలు కూడా కీలకమైనవి. మతాచారాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని దీని సారాంశం. అలాగే దేశంలో లౌకికత్వానికి సవాలు విసిరే కోర్టు నిర్ణయం పన్నాలాల్ బన్సీలాల్ పిట్టి వర్సెస్ ఆంధప్రదేశ్ కేసు (1996)లో జరిగిందనిపిస్తుంది. ఆలయాల నిర్వహణలో వంశ పారంపర్య హక్కులు ఉండవన్న చట్టాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. కానీ ఇదే చట్టాన్ని అన్ని మతాలకు వర్తింపచేయాలన్న వాదనను తోసిపుచ్చింది. ఇది వివక్ష ఎందుకు కాదు? 1977 నాటి స్టానిస్‌లస్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసులో ఆర్టికల్ 25 ప్రకారం మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉన్నా, అది మతాంతరీకరణలకు అనుమతించడం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక 1987 నాటి చల్లా కొండయ్య సిఫారసులు తెలుగు నాట ఆలయ వ్యవస్థపై శరాఘాతమే. ఇవన్నీ హిందూ ఆలయ వ్యవస్థను బలహీన పరిచినవే.
ఈ దుస్థితి నుంచి దేవాలయాలకు విముక్తి కల్పించాలన్న శంఖారావం డిక్లరేషన్‌ను అంతా ఆహ్వానించాలి.